సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 10న సంఘం సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు గుర్తింపు పొందిన 11, నమోదైన 31 రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 24న పూర్తి చేసింది. ఈ జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను రూపొందిస్తోంది.
మరో 4 రోజుల్లో ఈ ప్రక్రియ మొదలుకానుంది. జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాను వేరు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. గ్రామపంచాయతీల వారీగా రూపొందించిన ఓటర్ల జాబితాను ఆయా గ్రామ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. అనంతరం బీసీ ఓటర్ల సంఖ్యను ప్రభుత్వం లెక్కించనుంది. గ్రామపంచాయతీల వారీగా బీసీ ఓటర్ల లెక్కలు తేలేందుకు కనీసం వారం రోజులు పడుతుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. రిజర్వేషన్ల జాబితాను ఎన్నికల సంఘానికి అందజేస్తారు. అనంతరం ఎన్నికల సంఘం పోలింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల నిర్ధారణ ప్రక్రియ గరిష్టంగా నెలన్నరలోనే పూర్తి కానుంది. జూన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గ్రామపంచాయతీ ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగుస్తోంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించి, కొత్త ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
1.13 లక్షల బ్యాలెట్ బాక్సులు..
ఐదేళ్ల కింద ఉమ్మడి ఏపీలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెలంగాణలో 8,778 గ్రామ పంచాయతీలు, 88,682 వార్డులుండేవి. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం 12,741 గ్రామ పంచాయతీలు, 1,13,270 వార్డులున్నాయి. సర్పంచ్ ఎన్నిక లు పోలింగ్ బ్యాలెట్ బాక్సులతో జరగనున్నా యి. ఒకే బాక్సులో సర్పంచ్, వార్డు సభ్యుడి బ్యాలెట్ పత్రం వేయాల్సి ఉంటుంది. అనంతరం వాటిని వేరు చేసి లెక్కిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,13,270 బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే లక్ష బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసింది.
గ్రామ పంచాయతీ గణాంకాలు
మొత్తం గ్రామ పంచాయతీలు 12,741
100 శాతం ఎస్టీలున్న గ్రామ పంచాయతీలు 1,326
ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామ పంచాయతీలు 1,311
మైదాన ప్రాంతాల గ్రామ పంచాయతీలు 10,104
మొత్తం గ్రామ పంచాయతీ వార్డులు 1,13,270
పంచాయతీ పోరుకు సన్నద్ధం
Published Thu, Apr 5 2018 2:16 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment