ఎన్నికొచ్చిన ప్రతిసారీ తప్పని నమోదు
పట్టభద్రుల ఎమెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్
సెప్టెంబర్ 30 నుంచి కొత్త ఓటర్ల నమోదు
శాశ్వత జాబితా రూపకల్పనకు డిమాండ్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తంతు ప్రహసనంలా మారింది. ఈ జాబితాలో పేరు ఉండాలంటే ప్రతిసారి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని చెబుతుండడం అందరికీ ఇబ్బంది అవుతోంది.
వచ్చే ఏడాది మార్చి నెలలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజాగా షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, గతంలో ఓటుహక్కు వినియోగించుకున్న పట్టభద్రుల జాబితా లేదని, మళ్లీ కొత్తగా నమోదుకు చర్యలు చేపట్టింది.
కొరిటెపాడు(గుంటూరు): ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అర్హులైన పట్టభద్రులంతా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తమ ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికలు జరిగే ప్రతిసారీ ఇలా ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే ఎలా అంటూ ఓటర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోయినా.. పట్టభద్రులైతే చాలు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్సీకి పోటీ చేసే అభ్యర్థికి తొలి, ద్వితీయ, తృతీయ ప్రాధాన్య ఓట్ల ద్వారా కనీసం 50 శాతంపై అనుకూలంగా పడితేనే విజయం వరిస్తుంది.
3 లక్షలు దాటే అవకాశం
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 2019 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,48,799 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో కేవలం 1,14,325 (45.79 శాతం) మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మార్చి 2025లో జరిగే పట్టభద్రుల ఎన్నికలకు సుమారు 3 లక్షల మందికిపైగా నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
నమోదు నిబంధనలు ఇవీ..
» ఈ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు మళ్లీ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి.
» ఫాం 18 వినియోగించుకుని దరఖాస్తు అందించాలి.
» సెపె్టంబర్ 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో నమోదుకు అవకాశం ఉంది.
» ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు నేరుగా ఇంటి చిరునామాకు వచ్చి ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.
» ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి పరిశీలనా ఉండదు.
» ఫాం 18లో వివరాలను తొలుత పూరించాలి. ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ నకలు, నివాస ధ్రువపత్రం సెట్‌గా చేసి మండల తహసీల్దార్, గ్రామ సచివాలయం, మీ సేవా కేంద్రాల్లో అందించవచ్చు.
హక్కులను హరించినట్టే..
పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ ఓటు నమోదు చేయించుకోమనడం సరికాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడమంటే ప్రజల హక్కులను హరించినట్లే. గతంలో పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసిన వారిని కొత్తగా నమోదు నుంచి మినహాయించాలి. – తూము వెంకటేశ్వరరెడ్డి, బీకాం, గుంటూరు
పునరాలోచన అవసరం
పట్టభద్రుల ఓటు నమోదును గ్రామ సచివాలయాల్లో చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటు నమోదు పట్టభద్రులను అనుమానించడమేనని భావిస్తున్నాం. దీనిపై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలి.
– ఎం.నరేంద్రరెడ్డి, బీఏ, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment