Gram Panchayat election
-
త్వరలో పంచాయతీ పోరు
సాక్షి, అమరావతి: వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. గతంలో ఎన్నికలు జరిగిన 12,918 గ్రామ పంచాయతీలతో పాటు ఇటీవల కొత్తగా గ్రామ పంచాయతీలుగా మార్చిన 142 తండాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు శుక్రవారం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దశలుగా నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. మొదటి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, రెండో దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆఖరి దశగా మున్సిపల్, నగర పాలక ఎన్నికలు నిర్వహించనున్నట్టు వివరించారు. గ్రామ పంచాయతీలను çపక్కనే ఉండే మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలలో కలిపేదానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వద్దకు ఓ రెండు మూడు ప్రతిపాదనలే వచ్చాయని, ఎన్నికల షెడ్యూల్ లోపు వచ్చే వాటిని పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. 50 శాతం రిజర్వేషన్లపై కొత్త సర్కార్ నిర్ణయమే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 శాతం మేర రిజర్వేషన్లు అమలు చేశామని రమేష్ కుమార్ తెలిపారు. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం పరిధి దాటొద్దంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన నిధులు, చేయాల్సిన విధులతో పాటు సజావుగా ఎన్నికలు పూర్తిచేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్ష సమావేశంలో చర్చించినట్టు ఆయన వివరించారు. బ్యాలెట్ విధానంలో పంచాయతీ ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద 9 వేల ఈవీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవి సరిపోవని రమేష్‌కుమార్ చెప్పారు. అందువల్ల బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను ఈవీఎంల్లో చేపడతామని అన్నారు. ఈ ఏడాది జనవరి 11వ తేదీ నాటికి 18 ఏళ్ల వయస్సు దాటిన వారితో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సిద్ధం చేసిందని.. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఆ జాబితా ఆధారంగానే నిర్వహిస్తామని వివరించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఏవీ సత్య రమేష్ పాల్గొన్నారు. -
నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు
-
‘పంచాయతీ’ పోరు షురూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో సోమవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు ప్రక్రియ ముగియగానే సోమవారమే ఫలితాలను ప్రకటించనున్నారు. మొదటి దశలో మొత్తం 3,701 సర్పంచ్ స్థానాలకు 12,202 మంది, మొత్తం 28,976 వార్డు మెంబర్ స్థానాలకు 70,094 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వాస్తవానికి ఈ విడతలో మొత్తం 4,479 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 769 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 39,822 వార్డుసభ్య స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో 10,654 వార్డు స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు కోర్టు కేసుల కారణంగా 9 పంచాయతీల్లో ఎన్నికలు జరగట్లేదు. తొలి విడత ఫలితాల ప్రకటన వెలువడిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో ఉప సర్పంచ్ ఎన్నిక జరగకపోతే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో మరుసటి రోజు ఆ ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఇప్పటికే స్పష్టం చేసింది. ఎన్నికల ఏర్పాట్లు... పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పటిష్ట బందోబస్తు కల్పిస్తోంది. మొత్తం 26 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. వివిధ రూపాల్లోని పోలింగ్ విధుల నిర్వహణ కోసం 1,48,033 మంది ఎన్నికల సిబ్బంది సేవలను ఉపయోగించుకుంటోంది. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఓటర్ స్లిప్పులను కూడా పంపిణీ చేసింది. ఓటింగ్ స్లిప్పులు అందని వారు టీ–పోల్ యాప్ ద్వారా స్లిప్పులను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఎస్ఈసీ కల్పించింది. ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో పరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లు పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నగదు, మద్యం పంపిణీపైనా ఎన్నికల అధికారులు నిఘా పెంచారు. ‘స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్’... పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు కట్టుదిట్టమైన చర్యలతోపాటు అవసరమైన చోట్ల కఠిన ఆంక్షలు చేపట్టేందుకు వీలుగా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ‘స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్’ను నియమించేందుకు న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత జిల్లా కలెక్టర్ నిర్దేశించిన పరిధిలో ఆయా విభాగాల అధికారులు పనిచేసేలా ఈ ఉత్వర్తులు వర్తిస్తాయి. ఈ మేరకు ఆదివారం 26 జిల్లాల్లో ఆయా శాఖల అధికారులు వారికి నిర్దేశించిన పరిధిలో ‘స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్’గా విధులు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఉపసర్పంచ్ ఎన్నిక ఇలా.. సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలను సంబంధిత రిటర్నింగ్ అధికారి ప్రకటించిన వెంటనే సోమవారం ఎన్నికల నోటీస్‌లో పేర్కొన్న సమయం, స్థలంలో ఉపసర్పంచ్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. జిల్లా పంచాయతీ అధికారి మరో చోటును నిర్దేశిస్తే తప్ప గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఈ సమావేశం నిర్వహించాలి. ఉపసర్పంచ్ ఎన్నికను ఏదైనా కారణంతో నిర్వహించకపోతే, మరుసటిరోజు ఆ ఎన్నిక పూర్తి చేయాలి. ఈ ఎన్నిక నిర్వహణ కోసం నిర్వహించే సమావేశానికి రిటర్నింగ్ అధికారే అధ్యక్ష వహిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక ఫలితాలు ప్రకటించిన తర్వాత రిటర్నింగ్ అధికారి, గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుపై ఉపసర్పంచ్‌గా ఎన్నికైన వారి పేరును తెలియజేస్తూ నోటీస్‌ను ప్రకటిస్తారు. ఈ నోటీస్‌ను ఉపసర్పంచ్‌కు కూడా అందజేస్తారు. -
బీజేపీ పంచాయతీ పోరు నామమాత్రమే!
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీపై బీజేపీ నాయకులు, శ్రేణుల్లో కొంత నిరాసక్తత నెలకొంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దెబ్బతినడం వల్ల కలిగిన నైరాశ్యం ఇంకా కార్యకర్తలను వీడలేదు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపుతున్న పరిస్థితుల్లేవు. జిల్లాల్లో పార్టీకి పట్టున్నస్థానాలు, మండల స్థాయి ముఖ్య నాయకులు పోటీ చేస్తున్న స్థానాలపైనే రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు ఎక్కువగా దృష్టి పెడుతున్న సందర్భాలున్నాయి. శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుచుకున్న నియోజకవర్గాల్లో ఆధిపత్య రాజకీయాల కారణంగా ఆయా గ్రామాల్లో పోటీకి కిందిస్థాయి నాయకులు జంకుతున్న సందర్భాలున్నాయని బీజేపీ నాయకులే అంగీకరిస్తున్నారు. వ్యయప్రయాసలకు ఓర్చి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకున్నా, వారు పార్టీలో కొనసాగే అవకాశాలు తక్కువేనని గత అనుభవాలతో స్పష్టమైందని ఒక నాయకుడు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటే గెలవడం అది కూడా హైదరాబాద్ నగర పరిధిలోనిది కావడం, గ్రామీణ నేపథ్యమున్న నియోజకవర్గాల్లో గెలవకపోయినా గౌరవప్రదమైన సీట్లు కూడా పార్టీ అభ్యర్థులకు రాకపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా లెక్కకు మించిన జిల్లాల్లోనిç పలు పంచాయతీల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు, ఆ పార్టీ గ్రూపుల మధ్యే పోటీ తీవ్రంగా ఉండడంతో అలాంటి చోట్ల పోటీ వల్ల ఏమాత్రం ప్రయోజనంలేదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో ఏకగ్రీవాల కోసం పట్టు పెరగడం, పోటీ నుంచి వైదొలగాలంటూ ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో పార్టీ పక్షాన మద్దతుదారులు నిలబడే పరిస్థితులు లేవంటున్నారు. నేతల తర్జనభర్జన... పంచాయతీ ఎన్నికలు పార్టీరహితం కావడంతో రాజకీయపార్టీలకు సంబంధంలేదనే అభిప్రాయంతో ఉన్నా కిందిస్థాయిలో కార్యకర్తలను నిలుపుకునేందుకు, ప్రజల మద్దతును కూడగట్టేందుకు వచ్చిన అవకాశాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఏవిధంగా ఉపయోగించుకోవాలనే మీమాంసలో బీజేపీ ముఖ్య నాయకులున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే పంచాయతీ ఎన్నికలు రావడంతో జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో నాయకులు డబ్బు, ఇతర వనరుల వినియోగానికి వెనకాడుతున్నట్టుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు ముగిశాక కొంత వ్యవధిలోనే లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీల్లో పోటీకి పార్టీ మద్దతుదారులు వెనకడుగు వేస్తుండగా, ఈ ఎన్నికల వల్ల తమకు రాజకీయంగా పెద్దగా ప్రయోజనం చేకూరదనే భావనతో కొందరు రాష్ట్ర, జిల్లా నాయకులున్నారు. -
తొలివిడత సర్పంచ్ అభ్యర్థులు 23,229 మంది
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 4,468 సర్పంచ్ పదవులకు 23,229 మంది అభ్యర్థులు, 39,822 వార్డు స్థానాలకు 93,501 మంది బరిలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) తెలిపింది. ఈ మేరకు సర్పంచ్, వార్డుసభ్యుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు వెల్లడించింది. తొలిదశ ఎన్నికల్లో 4,479 పంచాయతీల్లో ఎన్నికల నోటీసులు జారీచేయగా, వివిధ జిల్లాల్లోని 11 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదని పేర్కొంది. 39,822 వార్డుమెంబర్ స్థానాలకు ఎన్నికల నోటీసులు జారీ చేయగా, 206 వార్డుమెంబర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపింది. నేడు మూడు జిల్లాల్లో నాగిరెడ్డి పర్యటన రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) కమిషనర్ వి.నాగిరెడ్డి శనివారం సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట చేరుకుని ఉదయం 10–11 గంటల మధ్యలో అక్కడ గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు, సిద్దిపేట పోలీస్ కమిషనర్‌తో నాగిరెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత 11.45 నుంచి 12.30 గంటల వరకు సిరిసిల్లలో ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీతో కలసి పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను ఆయన సమీక్షిస్తారు. మధ్యాహ్నం 1.15 నుంచి 4 గంటల వరకు జగిత్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు ఆ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులు, ఎస్పీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఎన్నికల సిబ్బందికి నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. -
వేగంగా ‘పంచాయతీ’ రిజర్వేషన్ల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు కసరత్తు ఊపందుకుంది. ఈ నెల 27లోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా అందించాల్సి ఉండటంతో ఈ ప్రక్రియలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. రెండు మూడ్రోజుల్లోపే ఈ రిజర్వేషన్లకు తుదిరూపు ఇవ్వవచ్చునని తెలుస్తోంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలన్న కోర్టు నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపునకు చర్యలు ముమ్మరం చేశారు. 50 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్టు ప్రభుత్వం రిజర్వేషన్ల ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల ఖరారు అధికారులకు కత్తి మీద సాముగా మారింది. 2013లో ఉమ్మడి ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 60.55% (బీసీలకు 34%) అమలయ్యాయి. ఇప్పు డు 50 శాతానికి ఈ రిజర్వేషన్లను పరిమితం చే యాల్సి ఉండటంతో ప్రస్తుతం సవరణలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తేల్చాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో బీసీలకు 24% మించకుండా రిజర్వేషన్లు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. అప్పుడు మిగతా 26 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ లకు పంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రంæ ఏర్పడ్డాక తొలిసారిగా రిజర్వేషన్లకు సంబంధించి ఈ పంచాయతీ ఎన్నికల్లో కొత్త రొటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. జనాభా మేరకు రిజర్వేషన్లు.. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. వాటిలో 17 పంచాయతీల కాలపరిమితి మరో ఏడాది పాటు ఉండటంతో ప్రస్తుతం 12,734 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొత్తం 12,751 పంచాయతీలకు కోటా నిర్ణయించి తదనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే సర్పంచ్ పదవుల శాతాన్ని తేల్చనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ ల జనాభాను లెక్కించాల్సి ఉంటుంది. ముఖ్యం గా గ్రామీణ ప్రాంతా ల్లో నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారనే లెక్కలు తీశాకే రాష్ట్ర స్థాయి జనాభా కోటాకు అనుగుణంగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఏ జిల్లాలో ఎవరెవరు ఎంత మంది ఉన్నారనే లెక్కల ప్రకారం జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. బీసీ వర్గాల రిజర్వేషన్లను మాత్రం ఓటర్ల జాబితాలో మండలం, గ్రామం వారీగా ఎంత మంది బీసీ ఓటర్లు, వారి ఓట్ల శాతాన్ని బట్టి రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని 1,308 గ్రామ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు చేయడం తప్పనిసరి. అలాగే వంద శాతం ఎస్టీ వర్గం వారున్న 1,326 గ్రామ పంచాయతీలను ఈ వర్గం వారికే కేటాయిస్తారు. ఇవికాకుండా మైదాన ప్రాంతం గ్రామ పంచాయతీల్లోని మొత్తం జనాభా ఆధారంగా ఆ కేటగిరీకి రిజర్వేషన్ ఉంటుంది. అయితే రిజర్వేషన్ల జాబితా అందగానే ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మూడు విడతల్లో ఎన్నికలు! మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఒక్కో విడతకు మధ్యలో రెండు మూడ్రోజుల విరామం ఇచ్చి విడివిడిగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నట్టు సమాచారం. జిల్లాల్లో స్థానికంగానే ఈ ఎన్నికల నోటిఫికేషన్లను జారీ చేస్తారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 10 లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. -
పాలనకు ఆఖరి రోజు
ఒంగోలు టూటౌన్ (ప్రకాశం): గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు నేటితో పూర్తి కానుంది. ఆగస్టు 1వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో నూతల పాలకవర్గాలు పదవీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ, దీనిపై ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో సర్పంచులలో ఆందోళన నెలకొంది. ఇక ఎన్నికలు లేవని తేల్చుకున్న సర్పంచులు కనీసం పర్సన్ ఇన్‌చార్జులుగానైనా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు సోమవారం (జూలై 30వ తేదీ)న తమ తీర్పును వెలువరించింది. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించలేకపోయిన సందర్భంగా పర్సన్ ఇన్చార్జులుగా సర్పంచులను నియమించడంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి తెలిపారు. కాని ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో స్థానిక సంస్థలలో ఉత్కంఠ నెలకొంది. అన్నీ ఉన్నా కాలయాపన జిల్లాలో 56 మండలాలు ఉండగా కందుకూరు, మార్కాపురం, ఒంగోలు డివిజన్లుగా ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 1028 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 10,396 వార్డులు ఉన్నాయి. వీటికి సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావాల్సి ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటుంది. ఇటీవల జిల్లాలోని గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా ప్రచురణకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన సర్క్యులర్ కూడా జారీ చేసి గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు చర్యలు తీసుకుంది. వార్డుల వారీగా ఫొటోలతో ఉన్న ఓటర్ల జాబితాను ప్రచురించారు. మొత్తం జిల్లాలో 10,00,365 పురుషులు, స్త్రీలు 10,00,741 స్త్రీల ఓటర్లు ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారుల తేల్చారు. కందుకూరు డివిజన్లో అత్యధిక ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరితో పాటు థర్డ్ జండర్ ఓటర్లు మరో 59 వరకు ఉన్నాయి. ఒంగోలు డివిజన్లో పురుష ఓటర్లు 3,84,041 మంది ఉండగా మహిళా ఓటర్లు 3,95,243 మంది ఉన్నారు. థర్డ్ జండర్ ఓటర్లు 30 మంది ఉన్నారు. కందుకూరు డివిజన్లో 8,13,500 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళా ఓటర్లు 4,02,325 మంది మహిళా ఓటర్లు ఉన్నా రు. దర్డ్ జండర్ ఓటర్లు 29 మంది ఉన్నారు. మార్కాపురం డివిజన్లో పురుష ఓటర్లు 2,05,554 మంది ఉండగా మహిళా ఓటర్లు 2,02,797 మంది ఉన్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేశారు. రెండు నెలల క్రితం కర్ణాటక నుంచి బ్యాలెట్ బాక్స్‌లు జిల్లాకు తెప్పించడం జరిగింది. అన్ని సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసింది. చివరకు నేడొక్క రోజే గడువు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం కోసం స్థానిక సంస్థల ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. ఓటమి భయంతోనే.. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవడం జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయంతోనే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను వాయిదా వేసుకుందని పలువురు సర్పంచులు విమర్శిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న భయంతోనే వెనకడుగు వేసిందని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలు అవంభిస్తే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. అయినా ఇప్పటికైనా ప్రభుత్వం ప్రస్తుతం పాలకవర్గానే పర్సన్ ఇన్చార్జులుగా కొనసాగించి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. -
పల్లె..రాజకీయం
పంచాయతీ ఎన్నికల ముచ్చట్లు రాజకీయ వర్గాల్లో కాక పుట్టిస్తున్నాయి. ఈ ఎన్నికలు పూర్తిగా పార్టీ రహితమే అయినా, అన్నిపక్షాలు వీటిపైనే దృష్టి సారించాయి. ఇప్పటికే ఆశావహులు తమ తమ నాయకులను కలవడం, అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. అసలు ఏ పంచాయతీ ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో తెలియని పరిస్థితి ఉన్నా, నాయకుల అంచనాలు మరోలా ఉన్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్‌ను బట్టి ఈసారి ఆయా పంచాయతీలు ఏయే వర్గానికి రిజర్వ్ అయ్యే అవకాశం ఉందో అంచనా వేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా అధికార పార్టీలో ఆశావ హుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొత్త పం చాయతీ రాజ్ చట్టం ప్రకారం ఇప్పుడు ఖరారయ్యే రిజ ర్వేషన్లు పదేళ్ల వరకు అమల్లో ఉంటాయి. ఈ కారణంగానే ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. గ్రామాల్లో తమకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకునేందుకు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలపైన ఒత్తిడి తీసుకొస్తున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచే పంచా యతీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండేలా కనిపిస్తోంది. గ్రామాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలకు పంచా యతీ ఎన్నికల వాతావారణం మరింత వేడిపుట్టిస్తోంది. టీఆర్ఎస్కు సంస్థాగతంగా బలం లేకపోవడంతో గత ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచినవారు, ఆ తర్వాత పార్టీ మారిన నాయకుల్లో ఎక్కువమంది కాంగ్రెస్, టీడీపీకి చెందిన వారే ఉన్నారు. ఈ రెండు పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, టికెట్ల కోసం మళ్లీ ఆ రెండు పార్టీలకు చెందిన నాయకుల నుంచే పోటీ ఎదురుకానుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులకు పెద్ద తలనొప్పిగా మారింది. గ్రూపు రాజకీయాలు అధికంగా ఉన్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లో ఎవరికీ సర్ది చెప్పలేని పరిస్థితి ఉందని, ఇది తమకు సమస్యగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఈ కారణంగానే ఇప్పట్లో ఎన్నికలు జరగకపోతేనే మంచిదని కూడా పేర్కొంటున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే పంచాయతీ ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని పార్టీ అధినేతకు చెబుతున్నారని సమాచారం. అధికారిక ఏర్పాట్లు పూర్తి ! జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. నిర్వహణకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించిన పంచాయతీ శాఖ, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే స్టేజ్ వన్, స్టేజీ టు అధికారుల నియామకాన్ని కూడా పూర్తిచేసింది. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు డివిజన్ల వారీగా, పోలింగ్ కేంద్రాలను గుర్తించడంతోపాటు, ఎన్నికల్లో పాలుపంచుకునే సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు పంచా యతీ ఎన్నికలకు సంబంధించినంత వరకు కసరత్తు పూర్తయినట్లే. అయితే, ఎన్నికల్లో కీలకంగా భావించే రిజర్వేషన్లపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంపైన రాష్ట్ర స్థాయిలో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ఏ ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. కాగా, ప్రధాన పార్టీలన్నీ రిజర్వేషన్ల ప్రకటన కోసమే ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ఓ వైపు ఎన్నికల సంఘం హడావుడి చేస్తోంది. కానీ, మరోవైపు ఏ వర్గం వారికి ఎంతమేర రిజర్వేషన్లు కేటాయించాలనే విషయంపైన ప్రభుత్వంనుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఫలితంగా కొద్ది రోజులుగా జిల్లా యంత్రాంగం అయోమయంలో పడింది. ఎన్నికల కసరత్తు పూర్తిచేసుకున్న యంత్రాం గం రిజర్వేషన్ల వ్యవహారం సస్పెన్స్‌లో పడటం చర్చనీయాంశంమైంది. రిజర్వేషన్లు తేలితే తప్ప ఎన్నికలకు ముందుడుగు వేయలేని పరిస్థితి ఉండటంతో ఏ క్షణమైన ప్రభుత్వ ప్రకటన రాకపోతుందా అని అధికారులు ఎదురుచూస్తున్నారు. -
కోహ్లిని తీసుకొస్తామని మోసం చేశారు..
సాక్షి, ముంబై : మాటలతో మభ్యపెట్టడం.. ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం.. వాటిని విస్మరించడం.. రాజకీయ నాయకులకు పరిపాటిగా మారింది. అయితే మహారాష్ట్రలోని షిరూర్ పరిధిలోని రామలింగ గ్రామసర్పంచ్‌గా పోటీ చేస్తున్న విఠల్ గణపత్ గవాటే కూడా ఇందుకు మినహాయింపు కాదని నిరూపించుకున్నారు. ప్రచారంలో భాగంగా ఏకంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని గ్రామానికి తీసుకొస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అంతే ఇక కోహ్లిని చూడటం కోసం, అతనితో ఫొటోలు దిగడం కోసం సెల్ఫీ స్టిక్కులతో సహా భారీ సంఖ్యలో జనాలు పోగయ్యారు. తీరా ర్యాలీకి వచ్చాక కోహ్లి కాకుండా.. కోహ్లిలా మరో యువకుడిని చూసి నిట్టూర్చడం వారి వంతైంది. కోహ్లిని తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ర్యాలీకి విరాట్ కోహ్లి వస్తున్నాడంటూ ప్రచారం చేశారు. కానీ విరాట్‌లా కనిపించే మరో వ్యక్తిని తీసుకొచ్చి ప్రజలను మోసం చేశారు. నిజానికి ఇదేగా జరిగేది’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘తన పేరును వాడుకుని ఓట్లను పొందాలనుకుంటున్నారని కోహ్లికి తెలిసి ఉండకపోవచ్చు’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘కనీసం అభ్యర్థి అయినా నిజమైన వారేనా.. లేదా ఆయన కూడా డమ్మీనేనా’ అంటూ మరో నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. So this actually happened. They put up an election rally ad saying Virat Kohli is going to campaign for us and they actually fooled public by bringing a lookalike of Virat Kohli 😂😂😂😂😂 pic.twitter.com/Xl9GvAVi2W — Alexis Rooney (@TheChaoticNinja) May 25, 2018 .@imVkohli hits the campaign trail in injury time! 😂😂 https://t.co/DoInqvNkyq — Bhuvan Bagga (@Bhuvanbagga) May 26, 2018 So this actually happened. They put up an election rally ad saying Virat Kohli is going to campaign for us and they actually fooled public by bringing a lookalike of Virat Kohli 😂😂😂😂😂 pic.twitter.com/Xl9GvAVi2W — Alexis Rooney (@TheChaoticNinja) May 25, 2018 -
నామినేషన్లలో తప్పుడు వివరాలిస్తే శిక్ష
సాక్షి, హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో తప్పుడు వివరాలు పేర్కొన్న వారు శిక్షార్హులని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. తప్పుడు వివరాలు నమోదు చేసిన వారిపై భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 177 ప్రకారం చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందని తెలిపింది. నామినేషన్ దాఖలుతోపాటు పోటీ చేసే వారిపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించాలని, నామినేషన్ పత్రాలపై అభ్యర్థి కాకుండా మరో ఇద్దరు సాక్షులుగా సంతకాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. పంచాయతీ ఎన్నికల నిబంధనల అమలులో రాష్ట్ర ఎన్నికల సంఘం వేగం పెంచింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని అంశాలకు అనుగుణంగా నిబంధనల రూపంలో ప్రతి రోజు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. పోలింగ్ ప్రక్రియలో అమలు చేసే నిబంధనలను పేర్కొంటూ తాజాగా మరికొన్ని నిబంధనలను విడుదల చేసింది. మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. పంచాయతీ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారులుగా.. ఆయా జిల్లాల కలెక్టర్లు వ్యవహరించనున్నారు. ప్రభుత్వ సాయుధ సిబ్బంది రక్షణలో ఉండే ప్రజాప్రతినిధులు పోలింగ్ ఏజెంట్లుగా ఉండటానికి వీలులేదు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రంలో కి వచ్చే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల భద్రతా సిబ్బంది పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే ఉండాలి. ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగులుగా నిర్ధారించే గుర్తింపు కార్డు వంటి 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. -
పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ హవా
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు తృణమూల్ కాంగ్రెస్ 110 పంచాయతీలను గెలుచుకోగా.. 1200 స్థానాలకు పైగా అధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 4 స్థానాలు గెలుచుకుని, 81 స్థానాల్లో ముందంజలో ఉంది. సీపీఐ(ఎం) 3 స్థానాలు గెలుచుకుని 58 స్థానాల్లో అధిక్యంలో ఉంది. కాగా గొడవలు, గందరగోళం మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. సోమవారం జరిగిన ఎన్నికలు చాలా చోట్ల ఘర్షణ వాతావరణంలోనే జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్న ఘర్షణలపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై తీవ్రంగా మండిపడ్డారు. 2019 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలైనందున అన్ని పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. -
ఓటు.. కుటుంబమంతా ఒకే చోటు!
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలో కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఇప్పటివరకు కుటుంబంలోని సభ్యుల ఓట్లు వివిధ వార్డుల్లో ఉండగా.. తాజాగా కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే వార్డులో ఉండేలా మార్పులు చేశారు. జాబితా ముసాయిదా రూపకల్పన సమయంలోనే కుటుంబంలోని ఓటర్లను వరుసగా నమోదు చేశారు. పంచాయతీలోని మొత్తం ఓటర్లు, ఒక్కో వార్డులోని ఓటర్ల సంఖ్యను ముందే లెక్కేసి.. అందుకు అనుగుణంగా మార్పులు చేశారు. వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఏప్రిల్ 30న అన్ని పంచాయతీల్లో, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. మే 8 వరకు అభ్యంతరాలు స్వీకరించి ప్రస్తుతం వీటిని పరిష్కరిస్తున్నారు. అన్నీ పూర్తి చేసి మే 17న తుది జాబితా వెల్లడించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. జిల్లా పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో రూపొందించిన ఈ జాబితాను గ్రామాల వారీగా ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. పంచాయతీల్లోని 3 ప్రధాన ప్రదేశాల్లో, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని నోటీసు బోర్డుల్లో జాబితాను ప్రదర్శించనున్నారు. అనంతరం ప్రభుత్వం బీసీ ఓటర్లను లెక్కించి, పంచాయతీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. రిజర్వేషన్ల వివరాలు అందిన తర్వాత ఎన్నికల సంఘం పోలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తుంది. 1.13 లక్షల బూత్‌లు ఉమ్మడి ఏపీలో ఐదేళ్ల క్రితం పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెలంగాణలో 8,778 పంచాయతీలు.. 88,682 వార్డులు ఉండేవి. కొత్త పంచాయతీరాజ్ చట్టంతో వీటి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 12,751 పంచాయతీలు.. 1,13,380 వార్డులున్నాయి. బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ జరిగే సర్పంచ్ ఎన్నికకు ఒక్కో వార్డుకు ఒక బ్యాలెట్ బాక్సు అవసరం. ఒకే బాక్సులో సర్పంచ్, వార్డు సభ్యుడి ఎన్నికల బ్యాలెట్ పత్రాలు వేసి లెక్కింపు సమయంలో వేరు చేసి లెక్కిస్తారు. పెరిగిన వార్డుల సంఖ్యకు అనుగుణంగా కర్ణాటక, తమిళనాడు నుంచి బ్యాలెట్ బాక్సులు సమకూర్చారు. -
పంచాయతీ పోరుకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 10న సంఘం సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు గుర్తింపు పొందిన 11, నమోదైన 31 రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 24న పూర్తి చేసింది. ఈ జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను రూపొందిస్తోంది. మరో 4 రోజుల్లో ఈ ప్రక్రియ మొదలుకానుంది. జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాను వేరు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. గ్రామపంచాయతీల వారీగా రూపొందించిన ఓటర్ల జాబితాను ఆయా గ్రామ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. అనంతరం బీసీ ఓటర్ల సంఖ్యను ప్రభుత్వం లెక్కించనుంది. గ్రామపంచాయతీల వారీగా బీసీ ఓటర్ల లెక్కలు తేలేందుకు కనీసం వారం రోజులు పడుతుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. రిజర్వేషన్ల జాబితాను ఎన్నికల సంఘానికి అందజేస్తారు. అనంతరం ఎన్నికల సంఘం పోలింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల నిర్ధారణ ప్రక్రియ గరిష్టంగా నెలన్నరలోనే పూర్తి కానుంది. జూన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గ్రామపంచాయతీ ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై 31తో ముగుస్తోంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించి, కొత్త ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1.13 లక్షల బ్యాలెట్ బాక్సులు.. ఐదేళ్ల కింద ఉమ్మడి ఏపీలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెలంగాణలో 8,778 గ్రామ పంచాయతీలు, 88,682 వార్డులుండేవి. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం 12,741 గ్రామ పంచాయతీలు, 1,13,270 వార్డులున్నాయి. సర్పంచ్ ఎన్నిక లు పోలింగ్ బ్యాలెట్ బాక్సులతో జరగనున్నా యి. ఒకే బాక్సులో సర్పంచ్, వార్డు సభ్యుడి బ్యాలెట్ పత్రం వేయాల్సి ఉంటుంది. అనంతరం వాటిని వేరు చేసి లెక్కిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,13,270 బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే లక్ష బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీ గణాంకాలు మొత్తం గ్రామ పంచాయతీలు 12,741 100 శాతం ఎస్టీలున్న గ్రామ పంచాయతీలు 1,326 ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామ పంచాయతీలు 1,311 మైదాన ప్రాంతాల గ్రామ పంచాయతీలు 10,104 మొత్తం గ్రామ పంచాయతీ వార్డులు 1,13,270 -
దారుణం : ఓటు వేయలేదని గ్యాంగ్‌రేప్.. హత్య
రాంచీ : జార్ఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల్లో తన భార్యకు మద్ధతు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఒక కుటుంబంపై పగ పెంచుకుని దాష్టీకానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబంలోని 13 ఏళ్ల బాలికపై సాముహిక అత్యాచారానికి పాల్పడి.. కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే... పాకూరు జిల్లా లిట్టిపారా గ్రామ పంచాయితీలో ‘ముఖియా’ పదవి కోసం కొన్నాళ్ల క్రితం ఎన్నికలు జరిగాయి. ప్రేమ్‌లాల్ హంసద అనే వ్యక్తి భార్య ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు ఓటు వేయలేదు. దీంతో వారి మూలంగానే తన భార్య ఓడిపోయిందన్న కోపంతో ప్రేమ్‌లాల్ రగిలిపోయాడు. జనవరి 8న బహిర్భూమికని వెళ్లిన బాలికను తన సోదరుల సహకారంతో అపహరించాడు. ఆపై వారంతా కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ప్రాణాలు తీశారు. చివరకు బాలిక మృత దేహాన్ని సమీపంలోని బ్లెవాన్ అటవీ ప్రాంతంలో పడేశారు. బాలిక కనిపించకుండా పోయే సరికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిచ్చిన సమాచారం మేరకు బాలిక శవాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆపై నిందితులపై తల్లిదండ్రుల ఫిర్యాదు చేయటంతో వారిని అరెస్ట్ చేశారు. తీవ్ర విమర్శలు... నిందితులు రాజకీయంగా కాస్త పలుకుబడి ఉన్నవారు కావటంతో తొలుత కేసు నమోదు చేసుకునేందుకు పోలీసులు తటపటాయించారు. అయితే ప్రతిపక్షాల ఆందోళన, తల్లిదండ్రుల నిరసన ప్రదర్శనతో పోలీసులపై విమర్శలు గుప్పించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి.. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఎలాంటి తమపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని.. సాక్ష్యాలు సేకరించటంలో జాప్యం మూలంగానే అరెస్ట్ ఆలస్యం అయ్యిందని పాకూరు జిల్లా ఎస్పీ శైలేంద్ర బర్న్వాల్ వెల్లడించటం విశేషం. నిందితులు ప్రేమ్‌లాల్, శ్యామూల్, కథి, శిశు హందలు నేరాన్ని ఒప్పుకోవటంతో వారిని రిమాండ్‌కు తరలించినట్లు వారు వివరించారు. -
‘పంచాయతీ’ ఎన్నికల్లో టీఆర్ఎస్దే పైచేయి
♦ నల్లగొండలో తొమ్మిది పంచాయతీలకుగాను ఐదు కైవసం ♦ స్వతంత్రంగా ఒక్కటి, ఇతర పార్టీలతో కలసి మూడు గెల్చుకున్న కాంగ్రెస్ ♦ రంగారెడ్డి జిల్లాలో రెండు సర్పంచ్ స్థానాలు టీఆర్ఎస్ వశం.. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించింది. మూడు మండలాల్లో మొత్తం 9 స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఇందులో ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మానాయికుంట (మోత్కూరు), తాటికల్, చందుపట్ల, నెల్లిబండ, నోము (నకిరేకల్)లలో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఆలేరు మండలంలోని అమ్మనబోలు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా గెలుచుకుంది. నకిరేకల్ మండలంలో మాత్రం టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మిగిలిన ప్రతిపక్షాలన్నీ జట్టుకట్టి ప్రజాఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. ఇక్కడ మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరగగా.. మూడింటిలో ప్రజాఫ్రంట్, నాలుగు చోట్ల టీఆర్ఎస్ గెలుపొందాయి. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీ అయిన నకిరేకల్ స్థానాన్ని ప్రజాఫ్రంట్ కైవసం చేసుకుంది. ఇక్కడ బరిలో ఉన్న సోమ మంగమ్మ (టీఆర్ఎస్)పై ప్రజాఫ్రంట్ అభ్యర్థి పన్నాల రంగమ్మ 443 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కానీ, ఈ పంచాయతీలో మొత్తం 20 వార్డులుండగా.. 14 చోట్ల టీఆర్ఎస్, ఆరు చోట్ల ప్రజాఫ్రంట్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంమీద ప్రజాఫ్రంట్ ఏర్పాటు కొంతమేర ప్రభావం చూపినా.. ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ద్వారా అధికార టీఆర్ఎస్ ఊపిరి పీల్చుకున్నట్లయింది. రంగారెడ్డి జిల్లాలో.. సాక్షి, రంగారెడ్డి : జిల్లాలో శనివారం ఓ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతోపాటు రెండు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. నవాబుపేట నుంచి జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవరెడ్డి జెడ్పీటీసీ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. నవాబుపేట జెడ్పీటీసీ స్థానానికి శనివారం జరిగిన ఓటింగ్‌లో 66.86 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏడు గ్రామాల్లో ఈవీఎంలు మోరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. జాబితాలో పేర్లు లేవని పలు గ్రామాల్లో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఈ స్థానం ఫలితాన్ని ఈ నెల 8న ప్రకటించనున్నారు. శంషాబాద్ ఎంపీటీసీ -2కు నిర్వహించిన ఓటింగ్‌లో 75.4 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఫలితం కూడా 8వ తేదీనే రానుంది. రెండు సర్పంచ్ స్థానాలు టీఆర్ఎస్ కైవసం.. వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీని తిరిగి టీఆర్ ఎస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన సుభాన్‌రెడ్డి.. సమీప ప్రత్యర్థి, అదే పార్టీ నుంచి రెబల్‌గా బరిలోకి దిగిన ప్రహ్లాద్‌రెడ్డిపై 117 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కందుకూరు మండల పరిధిలోని చిప్పలపల్లి సర్పంచ్‌గా టీఆర్ఎస్ మద్దతుదారు పొట్ట అరుణ విజయం సాధించారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థి కుంటి సువర్ణపై ఆమె 39 ఓట్ల తేడాతో గెలుపొందారు. జడ్చర్లలో మంత్రి లక్ష్మారెడ్డికి చుక్కెదురు కావేరమ్మపేటలో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి విజయం జడ్చర్ల: కావేరమ్మపేట(జడ్చర్ల) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి చుక్కెదురైంది. శని వారం జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కొంగళి జంగయ్య సమీప కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి బుక్క వెంకటేశం చేతిలో పరాజయా న్ని చవిచూడాల్సి వచ్చింది. మొత్తం 13,259 ఓట్లకు 9,325 ఓట్లు పోలయ్యాయి. వీటిలో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి బుక్క వెంకటేశంకు 2,107 ఓట్లు రాగా, టీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి కొంగళి జంగయ్యకు 1,955 ఓట్లు వచ్చాయి. దీంతో బుక్క వెంకటేశం 152 ఓట్ల మెజార్టీతో విజ యం సాధించారు. ఇదే మండలంలో కోడ్గల్ పంచాయతీ లో 4వ వార్డుకు జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి రామస్వామి గౌడ్ టీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి గణేష్గౌడ్పై 17 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కావేరమ్మపేటలో లక్ష్మారెడ్డి తమ అభ్యర్థి విజయానికి తీవ్ర కృషి చేశారు. 4 రోజులు జడ్చర్లలో మకాం వేసి ప్రచారాన్ని నిర్వహించారు. అయినా ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని ఆదరించారు.