‘పంచాయతీ’ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే పైచేయి | Victory to TRS itself | Sakshi
Sakshi News home page

‘పంచాయతీ’ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే పైచేయి

Published Sun, Dec 6 2015 3:21 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

‘పంచాయతీ’ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే పైచేయి - Sakshi

‘పంచాయతీ’ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే పైచేయి

♦ నల్లగొండలో తొమ్మిది పంచాయతీలకుగాను ఐదు కైవసం
♦ స్వతంత్రంగా ఒక్కటి, ఇతర పార్టీలతో కలసి మూడు గెల్చుకున్న కాంగ్రెస్
♦ రంగారెడ్డి జిల్లాలో రెండు సర్పంచ్ స్థానాలు టీఆర్‌ఎస్ వశం..
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ పైచేయి సాధించింది.  మూడు మండలాల్లో మొత్తం 9 స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఇందులో ఐదు స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. మానాయికుంట (మోత్కూరు), తాటికల్, చందుపట్ల, నెల్లిబండ, నోము (నకిరేకల్)లలో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఆలేరు మండలంలోని అమ్మనబోలు  స్థానాన్ని  కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా గెలుచుకుంది. నకిరేకల్ మండలంలో మాత్రం టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మిగిలిన ప్రతిపక్షాలన్నీ జట్టుకట్టి ప్రజాఫ్రంట్‌గా ఏర్పడ్డాయి.

ఇక్కడ మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరగగా.. మూడింటిలో ప్రజాఫ్రంట్, నాలుగు చోట్ల టీఆర్‌ఎస్ గెలుపొందాయి. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీ అయిన నకిరేకల్ స్థానాన్ని ప్రజాఫ్రంట్ కైవసం చేసుకుంది. ఇక్కడ బరిలో ఉన్న సోమ మంగమ్మ (టీఆర్‌ఎస్)పై ప్రజాఫ్రంట్ అభ్యర్థి పన్నాల రంగమ్మ 443 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కానీ, ఈ పంచాయతీలో మొత్తం 20 వార్డులుండగా.. 14 చోట్ల టీఆర్‌ఎస్, ఆరు చోట్ల ప్రజాఫ్రంట్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంమీద ప్రజాఫ్రంట్ ఏర్పాటు కొంతమేర ప్రభావం చూపినా.. ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ద్వారా అధికార టీఆర్‌ఎస్ ఊపిరి పీల్చుకున్నట్లయింది.

 రంగారెడ్డి జిల్లాలో..
 సాక్షి, రంగారెడ్డి : జిల్లాలో శనివారం ఓ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతోపాటు రెండు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. నవాబుపేట నుంచి జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవరెడ్డి జెడ్పీటీసీ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. నవాబుపేట జెడ్పీటీసీ స్థానానికి శనివారం జరిగిన ఓటింగ్‌లో 66.86 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏడు గ్రామాల్లో ఈవీఎంలు మోరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. జాబితాలో పేర్లు లేవని పలు గ్రామాల్లో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఈ స్థానం ఫలితాన్ని ఈ నెల 8న ప్రకటించనున్నారు. శంషాబాద్ ఎంపీటీసీ -2కు నిర్వహించిన ఓటింగ్‌లో 75.4 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఫలితం కూడా 8వ తేదీనే రానుంది.

 రెండు సర్పంచ్ స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం..
 వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీని తిరిగి టీఆర్ ఎస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన సుభాన్‌రెడ్డి.. సమీప ప్రత్యర్థి, అదే పార్టీ నుంచి రెబల్‌గా బరిలోకి దిగిన ప్రహ్లాద్‌రెడ్డిపై 117 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కందుకూరు మండల పరిధిలోని చిప్పలపల్లి సర్పంచ్‌గా టీఆర్‌ఎస్ మద్దతుదారు పొట్ట అరుణ విజయం సాధించారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థి కుంటి సువర్ణపై ఆమె 39 ఓట్ల తేడాతో గెలుపొందారు.
 
 జడ్చర్లలో మంత్రి లక్ష్మారెడ్డికి చుక్కెదురు
 కావేరమ్మపేటలో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి విజయం

 జడ్చర్ల: కావేరమ్మపేట(జడ్చర్ల) గ్రామ పంచాయతీ  ఎన్నికల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి చుక్కెదురైంది. శని వారం జరిగిన ఎన్నికలో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి కొంగళి జంగయ్య సమీప కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి బుక్క వెంకటేశం చేతిలో పరాజయా న్ని చవిచూడాల్సి వచ్చింది. మొత్తం 13,259 ఓట్లకు  9,325 ఓట్లు పోలయ్యాయి. వీటిలో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి బుక్క వెంకటేశంకు 2,107 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ మద్దతు అభ్యర్థి కొంగళి జంగయ్యకు 1,955 ఓట్లు వచ్చాయి. దీంతో బుక్క వెంకటేశం 152 ఓట్ల మెజార్టీతో విజ యం సాధించారు. ఇదే మండలంలో కోడ్గల్  పంచాయతీ లో 4వ వార్డుకు జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి రామస్వామి గౌడ్ టీఆర్‌ఎస్ మద్దతు అభ్యర్థి గణేష్‌గౌడ్‌పై 17 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కావేరమ్మపేటలో లక్ష్మారెడ్డి తమ అభ్యర్థి విజయానికి తీవ్ర కృషి చేశారు. 4 రోజులు జడ్చర్లలో మకాం వేసి ప్రచారాన్ని నిర్వహించారు. అయినా ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని ఆదరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement