ఎమ్మెల్యే కడియం శ్రీహరి పదవికి పొంచి ఉన్న ముప్పు
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత.. నాలుగు వారాల గడువు
చర్చనీయాంశంగా మారిన హైకోర్టు తీర్పు
‘స్టేషన్‌ఘన్‌పూర్’కు ఉప ఎన్నిక అనివార్యమేనా..?
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల్లో ఉత్కంఠ
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పదవికి అనర్హత ముప్పు పొంచి ఉందా..? ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుతో ఉమ్మడి జిల్లాలో ఇదే చర్చ నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది.
అంతటా ‘అనర్హత’పైనే చర్చ..
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌లో గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మరో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
చివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని సోమవారం హైకోర్టు ఆదేశించించడం కలకలం రేపింది. దీంతో స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ పొందడం మొదలు గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం... తాజాగా హైకోర్టు తీర్పు వెలువడే వరకు పలుమార్లు కడియం శ్రీహరి పతాక శీరి్షకలకెక్కారు. హైకోర్టు తీర్పు మేరకు కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడే అవకాశమే ఎక్కువుందన్న చర్చ ఒక పక్కన.. స్పీకర్ కార్యాలయం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ మరో పక్కన జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా? అన్న ఉత్కంఠ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.
విమర్శలు, ప్రతి విమర్శలు.. ఎవరి ధీమా వారిదే...
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటుకు సంబంధించిన అంశంపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు స్పందించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డా.టి.రాజయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు ఎవరికీ వారుగా తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు.
వెంటనే చర్య తీసుకోవాలి..
బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్న. నాలుగు వారాల్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్పీకర్ అనర్హత వేటు వేయాలి.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి
డివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్తాం
నాకు కోర్టుపైన నమ్మకం వుంది.. డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్తాం. పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సంబరాలు జరుపుకుంటున్న బీఆర్‌ఎస్ నేతలే పార్టీ ఫిరాయింపులకు మూల కారకులు. 2014 నుంచి 2023 మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది.
– కడియం శ్రీహరి, ఎమ్మెల్యే
నిబద్ధత ఉంటే శ్రీహరి రాజీనామా చేసి గెలవాలి..
బీఆర్‌ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి నిబద్ధత ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలి. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా స్పీకర్ వ్యవహరించాలి. కడియం శ్రీహరి, కావ్యలు నియోజకవర్గానికి ఎంత చేసిన తక్కువే. నియోజకవర్గ ప్రజలకు వారు రుణపడి ఉండాలి.
– డా.టి.రాజయ్య, మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment