తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో సోమవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు ప్రక్రియ ముగియగానే సోమవారమే ఫలితాలను ప్రకటించనున్నారు. మొదటి దశలో మొత్తం 3,701 సర్పంచ్ స్థానాలకు 12,202 మంది, మొత్తం 28,976 వార్డు మెంబర్ స్థానాలకు 70,094 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.