సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీపై బీజేపీ నాయకులు, శ్రేణుల్లో కొంత నిరాసక్తత నెలకొంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దెబ్బతినడం వల్ల కలిగిన నైరాశ్యం ఇంకా కార్యకర్తలను వీడలేదు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపుతున్న పరిస్థితుల్లేవు. జిల్లాల్లో పార్టీకి పట్టున్నస్థానాలు, మండల స్థాయి ముఖ్య నాయకులు పోటీ చేస్తున్న స్థానాలపైనే రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు ఎక్కువగా దృష్టి పెడుతున్న సందర్భాలున్నాయి. శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుచుకున్న నియోజకవర్గాల్లో ఆధిపత్య రాజకీయాల కారణంగా ఆయా గ్రామాల్లో పోటీకి కిందిస్థాయి నాయకులు జంకుతున్న సందర్భాలున్నాయని బీజేపీ నాయకులే అంగీకరిస్తున్నారు.
వ్యయప్రయాసలకు ఓర్చి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకున్నా, వారు పార్టీలో కొనసాగే అవకాశాలు తక్కువేనని గత అనుభవాలతో స్పష్టమైందని ఒక నాయకుడు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటే గెలవడం అది కూడా హైదరాబాద్ నగర పరిధిలోనిది కావడం, గ్రామీణ నేపథ్యమున్న నియోజకవర్గాల్లో గెలవకపోయినా గౌరవప్రదమైన సీట్లు కూడా పార్టీ అభ్యర్థులకు రాకపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా లెక్కకు మించిన జిల్లాల్లోనిç పలు పంచాయతీల్లో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థులు, ఆ పార్టీ గ్రూపుల మధ్యే పోటీ తీవ్రంగా ఉండడంతో అలాంటి చోట్ల పోటీ వల్ల ఏమాత్రం ప్రయోజనంలేదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో ఏకగ్రీవాల కోసం పట్టు పెరగడం, పోటీ నుంచి వైదొలగాలంటూ ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో పార్టీ పక్షాన మద్దతుదారులు నిలబడే పరిస్థితులు లేవంటున్నారు.
నేతల తర్జనభర్జన...
పంచాయతీ ఎన్నికలు పార్టీరహితం కావడంతో రాజకీయపార్టీలకు సంబంధంలేదనే అభిప్రాయంతో ఉన్నా కిందిస్థాయిలో కార్యకర్తలను నిలుపుకునేందుకు, ప్రజల మద్దతును కూడగట్టేందుకు వచ్చిన అవకాశాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఏవిధంగా ఉపయోగించుకోవాలనే మీమాంసలో బీజేపీ ముఖ్య నాయకులున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే పంచాయతీ ఎన్నికలు రావడంతో జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో నాయకులు డబ్బు, ఇతర వనరుల వినియోగానికి వెనకాడుతున్నట్టుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు ముగిశాక కొంత వ్యవధిలోనే లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీల్లో పోటీకి పార్టీ మద్దతుదారులు వెనకడుగు వేస్తుండగా, ఈ ఎన్నికల వల్ల తమకు రాజకీయంగా పెద్దగా ప్రయోజనం చేకూరదనే భావనతో కొందరు రాష్ట్ర, జిల్లా నాయకులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment