ప్రతీకాత్మక చిత్రం
పంచాయతీ ఎన్నికల ముచ్చట్లు రాజకీయ వర్గాల్లో కాక పుట్టిస్తున్నాయి. ఈ ఎన్నికలు పూర్తిగా పార్టీ రహితమే అయినా, అన్నిపక్షాలు వీటిపైనే దృష్టి సారించాయి. ఇప్పటికే ఆశావహులు తమ తమ నాయకులను కలవడం, అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. అసలు ఏ పంచాయతీ ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో తెలియని పరిస్థితి ఉన్నా, నాయకుల అంచనాలు మరోలా ఉన్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్‌ను బట్టి ఈసారి ఆయా పంచాయతీలు ఏయే వర్గానికి రిజర్వ్ అయ్యే అవకాశం ఉందో అంచనా వేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా అధికార పార్టీలో ఆశావ హుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొత్త పం చాయతీ రాజ్ చట్టం ప్రకారం ఇప్పుడు ఖరారయ్యే రిజ ర్వేషన్లు పదేళ్ల వరకు అమల్లో ఉంటాయి. ఈ కారణంగానే ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది. గ్రామాల్లో తమకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకునేందుకు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలపైన ఒత్తిడి తీసుకొస్తున్నారని చెబుతున్నారు. టీఆర్‌ఎస్ నుంచే పంచా యతీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండేలా కనిపిస్తోంది. గ్రామాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలకు పంచా యతీ ఎన్నికల వాతావారణం మరింత వేడిపుట్టిస్తోంది. టీఆర్‌ఎస్‌కు సంస్థాగతంగా బలం లేకపోవడంతో గత ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచినవారు, ఆ తర్వాత పార్టీ మారిన నాయకుల్లో ఎక్కువమంది కాంగ్రెస్, టీడీపీకి చెందిన వారే ఉన్నారు.
ఈ రెండు పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, టికెట్ల కోసం మళ్లీ ఆ రెండు పార్టీలకు చెందిన నాయకుల నుంచే పోటీ ఎదురుకానుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులకు పెద్ద తలనొప్పిగా మారింది. గ్రూపు రాజకీయాలు అధికంగా ఉన్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లో ఎవరికీ సర్ది చెప్పలేని పరిస్థితి ఉందని, ఇది తమకు సమస్యగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఈ కారణంగానే ఇప్పట్లో ఎన్నికలు జరగకపోతేనే మంచిదని కూడా పేర్కొంటున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే పంచాయతీ ఎన్నికలకు తాము సిద్ధంగా లేమని పార్టీ అధినేతకు చెబుతున్నారని సమాచారం.
అధికారిక ఏర్పాట్లు పూర్తి !
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. నిర్వహణకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించిన పంచాయతీ శాఖ, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే స్టేజ్ వన్, స్టేజీ టు అధికారుల నియామకాన్ని కూడా పూర్తిచేసింది. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు డివిజన్ల వారీగా, పోలింగ్ కేంద్రాలను గుర్తించడంతోపాటు, ఎన్నికల్లో పాలుపంచుకునే సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు పంచా యతీ ఎన్నికలకు సంబంధించినంత వరకు కసరత్తు పూర్తయినట్లే. అయితే, ఎన్నికల్లో కీలకంగా భావించే రిజర్వేషన్లపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంపైన రాష్ట్ర స్థాయిలో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి.
ఏ ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. కాగా, ప్రధాన పార్టీలన్నీ రిజర్వేషన్ల ప్రకటన కోసమే ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ఓ వైపు ఎన్నికల సంఘం హడావుడి చేస్తోంది. కానీ, మరోవైపు ఏ వర్గం వారికి ఎంతమేర రిజర్వేషన్లు కేటాయించాలనే విషయంపైన ప్రభుత్వంనుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఫలితంగా కొద్ది రోజులుగా జిల్లా యంత్రాంగం అయోమయంలో పడింది. ఎన్నికల కసరత్తు పూర్తిచేసుకున్న యంత్రాం గం రిజర్వేషన్ల వ్యవహారం సస్పెన్స్‌లో పడటం చర్చనీయాంశంమైంది. రిజర్వేషన్లు తేలితే తప్ప ఎన్నికలకు ముందుడుగు వేయలేని పరిస్థితి ఉండటంతో ఏ క్షణమైన ప్రభుత్వ ప్రకటన రాకపోతుందా అని అధికారులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment