ఓటర్ల జాబితా వార్డుల విభజనపై నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు (ఫైల్)
సాక్షి, నల్లగొండ : మున్సిపాలిటీల్లో జరిగిన వార్డుల పునర్విభజనపై రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. మున్సిపల్ నిబంధనలను పాటించకుండా అధికారులు ఇష్టానుసారంగా వార్డులను పునర్విభజించారని విమర్శిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీల్లో గతంలో ఉన్నవార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త వార్డులను ఏర్పాటు చేయడానికి పాత వార్డులను పునర్విభజన చేయక తప్పలేదు. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో అధికార టీఆర్‌ఎస్ నాయకులకు మేలు జరిగేలా వార్డులను విభజించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని కోసం కనీసం వార్డుల సరిహద్దులు తేల్చకుండానే, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారని పేర్కొంటున్నారు.
నల్లగొండ మున్సిపాలిటీలో గతం కన్నా ఓటర్లసంఖ్య తగ్గించి చూపారని, దీంతో పెద్ద సంఖ్యలోనే ఓట్లు గల్లంతు అయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం1.60 లక్షల జనాభా ఉండింది. మున్సిపాలిటీలో నల్ల గొండ శివారు పంచాయతీలను విలీనం చేశారు. అంటే ఆ పంచాయతీల జనాభాను కలిపితే మున్సిపాలిటీ జనాభా పెరగాలి. కానీ, పెరిగినట్లు లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక, గతంలో పట్టణంలో 45వేల మందిదాకా ఓసీలు ఉంటే.. వారి సంఖ్య 27వేలకు తగ్గిపోయిందని, ఇదెలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. భర్త ఓసీగా ఉంటే.. భార్యను బీసీ వర్గంలో కలిపారని, ఎస్సీలను బీసీలుగా చూపించారని, పెద్ద సంఖ్యలో ఇలా కులాలు, వర్గాలు మారిపోయాయని అంటున్నారు. మొత్తంగా జిల్లాలోని మున్సి పాలిటీల్లో వార్డుల విభజన, ఓటర్ల జాబితాల తయారీలో ఎన్నో చమత్కారాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు.
సరిహద్దు దాటిన ఓటర్లు
నల్లగొండ మున్సిపాలిటీ వార్డుల పునర్విభజనపై విమర్శలు ఉన్నాయి. ఓటర్ల జాబితాను సరిగా రూపొందించక పోవడంతో ఓటర్ల వివరాలకు పొంతనలే కుండా పోయింది. మున్సిపల్ యంత్రాంగం చేపట్టిన పునర్విభజన ప్రక్రియ వార్డు మ్యాపు, సరిహద్దులు, ఓటర్లకు మధ్య ఎక్కడా సామ్యమే లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరుగా రెండు, మూడు వార్డుల పరిధిలోకి చేరిపోయాయి. భార్యా భర్తలు, పిల్లల ఓట్లు చెల్లా చెదరయ్యాయి. ఉదాహరణకు 9వ వార్డులో భర్తల ఓట్లుంటే, 13వ వార్డులో భార్యల ఓట్లు చేరాయి. 39వ వార్డులో నివాసం ఉన్న వారివి దాదాపు 80 ఓట్ల వరకు 40వ వార్డులోకి వెళ్లిపోయాయి.
9వ వార్డులో నివాసం ఉంటున్న వారికి చెందిన 245 ఓట్లను 8వ వార్డులోకి చేర్చారు. 4వ వార్డులో నివాసం ఉంటే 2వ వార్డులోకి 110 ఓట్లు వచ్చి చేరాయి. 43వ వార్డు నుంచి 42వ వార్డులోకి 242 ఓట్లను మార్చారు. 9 వార్డులో ఉండాల్సిన 197 ఓట్లు 6వ వార్డులో పరిధిలోకి మార్చారు. కొన్ని కాలనీలను పార్ట్‌లుగా విభజించి రెండు, మూడు వార్డులోకి చేర్చడంతో ఈ సమస్యలు వచ్చినట్లు చెబుతున్నారు. పోలింగ్ బూత్‌లను, ఓటర్ల సంఖ్యను చూసుకొని నిబంధనల ప్రకారమే చేర్చినట్లు వార్డులను ఖరారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. 42వ వార్డు రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా కాలనీలు ఉండడంతో ఇబ్బందులు తప్పేలా లేవు. అదే విధంగా దేవరకొండ రోడ్డులోని 24వ వార్డు సైతం ప్ర«ధాన రహాదారికి ఇరు వైపుల ఉన్న కాలనీలతో వార్డు ఏర్పాటు చేశారు.
అస్తవ్యస్తంగా వార్డుల పునర్విభజన
మిర్యాలగూడ మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా చేశారు. పట్టణ మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా వార్డులను విభజించారు. గతంలో 36 వార్డులు ఉన్న మున్సిపాలిటీనీ 14 వార్డులను పెంచి 48 వార్డులు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్లుగా వార్డుల పునర్విభజన చేపట్టారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. వార్డుల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం 54 ఫిర్యాదులు రాగా కేవలం 14 ఫిర్యాదులు మాత్రమే సక్రమంగా ఉన్నాయని వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేయడం వల్ల శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు కమిషనర్ సత్యబాబు సెలవుపై వెళ్లారు.
ఇదీ... కథ
మిర్యాలగూడ పట్టణంలోని 1వ వార్డులో ఉన్న చైతన్య నగర్‌లో రెండు అపార్ట్‌మెంట్‌లతో పాటు మొత్తం 300 ఓట్లను నల్లగొండ రోడ్డుకు అవతలివైపున ఉన్న 48వ వార్డు (రామచంద్రగూడెం)లో కలిపారు. తాళ్లగడ్డలో ఉన్న 2వ వార్డు పక్కనే 3వ వార్డు కాకుండా 8వ వార్డుకు సంబంధించిన ఓట్లు కలిపారు. బంగారుగడ్డలోని 44వ వార్డుకు సంబంధించిన ఓట్లను గెజిట్‌లో ప్రకటించిన డోర్‌నంబర్లకు చెందినవి కాకుండా సుమారుగా 450 ఓట్లను 48వ వార్డు (ఏడుకోట్లతండా)లో కలిపారు.
ఈదులగూడెంలో ఉన్న 9వ వార్డులోని ఓట్లను పక్కనే ఉన్న కాలనీతో 440 ఓట్లను ఈదులగూడెంలోని కొంత భాగాన్ని 18వ వార్డుగా చేశారు. గాంధీనగర్‌లోని సుమారు 300 ఓట్లను పక్కన ఉన్న వార్డులోకి కాకుండా 18వ వార్డు (తాళ్లగడ్డ) లో కలిపారు. గతంలో 24వ వార్డుగా ఉన్న అశోక్‌నగర్ ప్రాంతాన్ని నాలుగు భాగాలుగా చేసి నాలుగు వార్డులలో కలపడం వల్ల పాత వార్డు లేకుండా పోయింది. రెడ్డికాలనీ నాలుగు భాగాలుగా చేసి నాలుగు వార్డులుగా విభజించారు. బాపూజీనగర్ కాలనీకి సంబంధించిన ఓట్లను ఇందిరమ్మ కాలనీకి సమీపంలో ఉన్నట్లుగా కలిపారు. 48వ వార్డుగా ఉన్న రామచంద్రగూడెంలో బాగ్యనగర్ కాలనీ ఓట్లు కలిపారు.
తప్పుల తడకగా ఓటర్ల జాబితా
నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా మారింది. ఒకే కుటుంబంలోని వారి ఓట్లు వేర్వేగా ఉండడం, భర్త ఓటు ఒక వార్డులో ఉంటే భార్య ఓటు మరో వార్డులో ఉండడం, వారి పిల్లల ఓట్లు ఇంకో వార్డులో నమోదై ఉండడంతో పాటు ఒకే వ్యక్తికి రెండు, మూడు ఓట్లు కలిగి ఉండడం వంటి చమత్కారాలు చోటు చేసుకున్నాయి. తప్పుల తడకకగా రూపొందిçస్తున్న జాబితా కారణంగా ఓటు హక్కుకు దూరమవుతున్న వారు అనేక మంది ఉన్నారు.
హాలియా మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా వార్డును విభజించారు. 9 వార్డులు ఉన్న మున్సిపాలిటీని 12 వార్డులు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్లుగా వార్డులను పునర్విభజన చేశారని, ఓటర్ల ముసాయిదా జాబితా తప్పుల తడకగా ఉందని కాంగ్రెస్ నాయకులు హాలియా మున్సిపాలిటీ కమీషనర్ సమ్మద్‌కి వినతి ప్రతం అందజేశారు. హాలియాలోని రెడ్డికాలనీని 5వ వార్డుగా విభజించారు. ఈ వార్డులోని 250 ఓట్లను 7వ వార్డులో కలిపారు. సాయిప్రతాప్‌నగర్‌ను 3వ వార్డుగా విభజించారు.
ఈ వార్డులోని 21 ఓట్లు 4వ వార్డు అయిన వీరయ్యనగర్, అంగడిబజార్‌లోకి కలిపారు. సాయి ప్రతాప్‌నగర్ 3వ వార్డులో ఉన్న వివిధ కుటుంబాలకు చెందిన 150 ఓట్లను వేర్వేరుగా 2వ వార్డులోని ఇబ్రహీంపేట, అలీనగర్‌లోకి కలిపారు. గోడుమడక బజారు, శాంతినగర్, గంగారెడ్డి నగర్ కలుపుతూ 9వ వార్డుగా విభజించారు. ఈ వార్డులో ఉన్న 70 ఓట్లను పక్కనే ఉన్న 7వ వార్డు వీరబ్రహేంద్రనగర్‌లోకి కలిపారు. నందికొండ (నాగార్జున సాగర్) మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న టీజీ జెన్‌కో, భాగ్యనగర్ కాలనీ, ఇ–1 టైప్, ఇ టైప్, బీ11టైప్, పీ టైప్‌ను కలుపుతూ 11వ వార్డుగా విభజించారు. మున్సి పాలిటీకి సంబంధం లేనటువంటి 50 ఓట్లను ఈ వార్డులోకి చేర్చారు. 11వార్డులోని జెన్‌కోకి సంబందించిన ఓట్లను 10వ వార్డులోకి చేర్చారు.
ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు
దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఉన్న 20 వార్డులే ప్రస్తుతం ఉన్నాయి. ఒక్కో వార్డుకి 1050 నుంచి 1150లకుపైగా ఓట్లను విభజిస్తూ వార్డుల వారీగా జాబితాను ప్రకటించారు. గతంలో ఆయా వార్డుల్లో కుటుంబ సభ్యులందరి ఓట్లు నమోదు కాగా, ఇటీవల అధికారులు వెలువరించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో ఓట్ల బదలాయింపు జరిగింది. మరికొన్ని వార్డుల్లో మరణించిన వారి ఓట్లు నమోదు కాగా, ఇంకొన్ని వార్డుల్లో ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు నమోదై ఉన్నాయి.
గతంలో అధికారులు ఇంటి నంబర్ల ఆధారంగా చేపట్టిన ఓటర్ల గణన పారదర్శకంగా లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆయా వార్డుల్లో అధికార పార్టీకి చెందిన వారికి అనుకూలంగా ఉన్న ఓటర్లను నమోదు చేయించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఒక్కో వార్డులో 10 నుంచి 20కి మందికిపైగా ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు నమోదవుతుండడంతో వివిధ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి అభ్యంతరాన్ని పరిశీలిస్తాం
ఓటరు జాబితాపై వచ్చిన ఫిర్యాదులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు లేవనెత్తిన ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ప్రతి అభ్యంతరంపై ఇంటింటికి వెళ్లి పరిశీలించి పారదర్శకంగా చేస్తాం. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఓటర్ల జాబితా ఫైనల్ చేస్తాం. ఓటర్లు సామాజిక వర్గం గురించి తప్పుడు సామాచారం ఇచ్చినా.. దానిని విచారించి సరిచేస్తాం.
– దేవ్‌సింగ్, మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment