అధికారులతో చర్చిస్తున్న రమేష్ కుమార్
సాక్షి, అమరావతి: వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. గతంలో ఎన్నికలు జరిగిన 12,918 గ్రామ పంచాయతీలతో పాటు ఇటీవల కొత్తగా గ్రామ పంచాయతీలుగా మార్చిన 142 తండాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు శుక్రవారం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దశలుగా నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. మొదటి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, రెండో దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆఖరి దశగా మున్సిపల్, నగర పాలక ఎన్నికలు నిర్వహించనున్నట్టు వివరించారు. గ్రామ పంచాయతీలను çపక్కనే ఉండే మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలలో కలిపేదానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వద్దకు ఓ రెండు మూడు ప్రతిపాదనలే వచ్చాయని, ఎన్నికల షెడ్యూల్ లోపు వచ్చే వాటిని పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
50 శాతం రిజర్వేషన్లపై కొత్త సర్కార్ నిర్ణయమే
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 శాతం మేర రిజర్వేషన్లు అమలు చేశామని రమేష్ కుమార్ తెలిపారు. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం పరిధి దాటొద్దంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన నిధులు, చేయాల్సిన విధులతో పాటు సజావుగా ఎన్నికలు పూర్తిచేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్ష సమావేశంలో చర్చించినట్టు ఆయన వివరించారు.
బ్యాలెట్ విధానంలో పంచాయతీ ఎన్నికలు..
రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద 9 వేల ఈవీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవి సరిపోవని రమేష్‌కుమార్ చెప్పారు. అందువల్ల బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను ఈవీఎంల్లో చేపడతామని అన్నారు. ఈ ఏడాది జనవరి 11వ తేదీ నాటికి 18 ఏళ్ల వయస్సు దాటిన వారితో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సిద్ధం చేసిందని.. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఆ జాబితా ఆధారంగానే నిర్వహిస్తామని వివరించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఏవీ సత్య రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment