
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు కరోనా వైరస్‌ను కారణంగా చూపించడం కేవలం ఓ సాకు మాత్రమేనని స్పష్టమైంది. ఎందుకంటే మన రాష్ట్రం కంటే విదేశీయులు, పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉండే గోవాలో స్థానిక సంస్థల ఎన్నికలను ముందుగా నిర్ణయించిన విధంగా మార్చి 22నే నిర్వహించనున్నారు. దీంతో మన రాష్ట్రంలో కేవలం చంద్రబాబు ప్రభావానికి లోనై ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేసిందనేది స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు తేల్చిచెబుతున్నారు. గోవాలోని రెండు జిల్లాలు ఉత్తర గోవా, దక్షిణ గోవాల్లోని 50 జిల్లా పంచాయతీలు (మన దగ్గర మండలాల వంటి వ్యవస్థ)కు ఎన్నికల ప్రక్రియను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి చివరి వారంలో చేపట్టింది. మార్చి 7తో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
దాదాపు 9 లక్షల మంది ఓటర్లు
ఉత్తర గోవా జిల్లాలో 4.80 లక్షల మంది, దక్షిణ గోవాలో 4.11 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అక్కడ కూడా బ్యాలెట్ విధానంలోనే పోలింగ్ నిర్వహించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా వైరస్ కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా పరిస్థితిని అంచనా వేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భావించింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను యధావిధిగా కొనసాగిస్తామని గోవా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్కే శ్రీవాస్తవ ప్రకటించారు. మరి అదే రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో మార్చి చివరి వారంలో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమ్మతించకపోవడం విడ్డూరంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేవలం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment