ఇప్పుడాగితే ముందింకా సంక్లిష్టం.. | Experts Clarification On Election Management of Local Bodies In AP | Sakshi
Sakshi News home page

సమయమిదే!

Published Wed, Mar 18 2020 3:19 AM | Last Updated on Wed, Mar 18 2020 4:15 AM

Experts Clarification On Election Management of Local Bodies In AP - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ రాష్ట్రంలో మొదటి దశలోనే ఉన్నందున ఇప్పటికిప్పుడు ఆరోగ్య అత్యయిక పరిస్థితి విధించాల్సిన అవసరం లేదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ దశలో బెంబేలు పడాల్సిన అవసరం లేదంటోంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి నెలాఖరులోగా ముగించవచ్చని అటు వైద్య రంగ నిపుణులు, ఇటు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. నెల రోజుల తర్వాత కరోనా వైరస్‌ అదుపులోకి రాని పక్షంలో దేశంలో మూడో దశకు, రాష్ట్రంలో రెండో దశకు చేరుకుంటుందని కూడా ఐసీఎంఆర్‌ అంచనా వేసింది. అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చెప్పిన ప్రకారం ఆరు వారాల తర్వాత రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకమే అని పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఎన్నికల కోడ్‌ నెలల తరబడి కొనసాగి రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే కరోనా తీవ్రంగా ఉన్న ఫ్రాన్స్‌లోనూ, రెండవ దశలో ఉన్న  గోవాలోనూ స్థానిక సంస్థల ఎన్నికలను యథా ప్రకారం కొనసాగిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సైతం అభినందించిన విషయం తెలిసిందే. అందువల్ల స్థానిక ఎన్నికలు పూర్తి చేసేందుకు ఇదే సరైన తరుణమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

ఇప్పుడైతే ఏ ఇబ్బందీ ఉండదు
- కరోనా వైరస్‌ నాలుగు దశల్లో విస్తరిస్తుంది. ఐసీఎంఆర్‌ నివేదిక ప్రకారం మన దేశంలో రెండో దశలో ఉండగా, మన రాష్ట్రంలో మాత్రం మొదటి దశలోనే ఉంది. 
- ఈ దశలో కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. 
- కాబట్టి అలాంటి వారిని గుర్తించి తగిన జాగ్రత్తలతో వైద్యం అందిస్తే సరిపోతుంది. 
- రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 
- ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కరోనా తీవ్రత బాగా తక్కువగా ఉంది. 
- ఈ దశలో ప్రజలకు అవగాహన కల్పిస్తే చాలు. బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితి లేదన్నది స్పష్టమవుతోంది.
- మన రాష్ట్రానికి నేరుగా విదేశాల నుంచి విమాన సర్వీసులు లేవు. 
- హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లోనే విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌లకు తరలిస్తున్నారు. 
- ఈ పరిస్థితిలో ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఈ నెలాఖరులోగానే ముగిసిపోతుంది. 
- అందువల్ల కరోనా వైరస్‌ పెద్దగా ప్రభావం చూపని మొదటి దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని నిపుణులు, పరిశీలకులు సూచిస్తున్నారు. 
ఆ పరిస్థితే వస్తే స్థానిక సంస్థల పాత్ర కీలకం
- ఏపీ, గోవాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే సగం పూర్తయ్యింది. దాంతో గోవాలో ముందు నిర్ణయించిన విధంగా పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. 
- కానీ మన రాష్ట్రంలో మాత్రం నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేయడాన్ని పరిశీలకులు తప్పుబడుతున్నారు. 
- ముందు నిర్ణయించిన విధంగా మార్చిలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నారు. 
- దురదృష్టవశాత్తు కరోనా వైరస్‌ విస్తరిస్తే వార్డు సభ్యుడు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్ల వరకు ఆయా ప్రాంతాలపై దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. 
- రాష్ట్ర రాజధాని నుంచి గ్రామ స్థాయి వరకు ఉండే ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు సమర్థవంతంగా కార్యాచరణను రూపొందించి అమలు చేయడానికి వెసులుబాటు ఉంటుంది. 
- రూ.5,100 కోట్ల నిధులు కూడా అందుబాటులోకి రావడంతో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించవచ్చు.

ప్రక్రియ మొదలు కాలేదు కాబట్టే బెంగాల్‌లో వాయిదా
- పశ్చిమ బెంగాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశాన్ని చూపుతూ టీడీపీ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. 
- ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు.
- ఏప్రిల్‌ 15 నుంచి 26 మధ్య ఎన్నికలు నిర్వహించాలని మమతా బెనర్జీ ప్రభుత్వం భావించింది. 
- అప్పటికి కరోనా వైరస్‌ మూడో దశకు చేరుకునే అవకాశం ఉందని ఐసీఎంఆర్‌ నివేదిక వెల్లడించడంతో  ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించింది. 

మనం తొలి దశలో ఉన్నాం
ఇటలీ నుంచి నేరుగా వచ్చిన ఓ యువకుడికి మాత్రమే కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇప్పుడు అతను కూడా పూర్తిగా కోలుకున్నాడు. కమ్యూనిటీ ట్రాన్స్‌మీట్‌ కేసులు.. అంటే విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా స్థానికులకు వైరస్‌ సోకిన కేసులు రాష్ట్రంలో అసలే లేవు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. దీనిని బట్టి కరోనా వైరస్‌ విషయంలో మన రాష్ట్రం మొదటి దశలోనే ఉందని స్పష్టమవుతోంది.    
– డాక్టర్‌ నీలిమ, మైక్రో బయాలజిస్ట్, వైద్య విద్యా శాఖ

దీర్ఘకాలం ఎన్నికల కోడ్‌తో అభివృద్ధికి విఘాతం
- మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయలేకపోతే ఆ తర్వాత ఎప్పుడు నిర్వహించగలమన్న ప్రశ్నకు సమాధానం లేదు. 
ఎన్నికల ప్రక్రియ నిరవధికంగా నిలిచిపోయే పరిస్థితి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 
- ఇప్పటికే నెల రోజులుగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ చెప్పిన దాని ప్రకారం కనీసం మరో ఆరు వారాల పాటు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుంది.
- ఆ తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించలేకపోతే ఎన్నికల కోడ్‌ కొనసాగాల్సిందేనా అని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
- అంటే నెలల తరబడి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. 
- 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల అధికారంలో కొన్ని నెలలపాటు కోడ్‌ పేరుతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేస్తున్నారు. 

ఫ్రాన్స్, గోవాలోనూ యథాతథంగా ఎన్నికలు 
ప్రాన్స్‌లో 171 మంది చనిపోయి.. కరోనా వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తుండటాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. 
- మన దేశంలో కరోనా రెండవ దశలో ఉన్న గోవాలో కూడా ముందుగా నిర్ణయించిన ప్రకారం మార్చి 23న స్థానిక సంస్థల పోలింగ్‌ నిర్వహించనున్నారు. వాస్తవంగా ఈ ప్రాంతానికి ఎక్కువగా విదేశీయుల తాకిడి ఎక్కువ. అయినప్పటికీ ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే ఎన్నికలు జరుగుతుండటం గమనార్హం. 
ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ శ్రీవాస్తవ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 
- భారీ సంఖ్యలో మాస్కులు, శానిటైజర్లు, థర్మల్‌ స్కానర్లు మొదలైనవి పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 
- స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రం షెడ్యూల్‌ ప్రకారం కొనసాగిస్తున్నారు. 

నెల తర్వాతే సంక్లిష్టం..
- ఐసీఎంఆర్‌ నివేదిక ప్రకారం నెల రోజుల తర్వాత దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత బాగా పెరుగుతుంది. 
- ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ చెప్పిన మేరకు 6 వారాల తర్వాత పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.
- దురదృష్టవశాత్తూ.. అదుపులోకి రాకపోతే దేశమంతటా వైరస్‌ మూడో దశకు.. మన రాష్ట్రంలో రెండో దశకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. 
- మరోవైపు విదేశాల్లో ఉన్న భారతీయులను అక్కడి ప్రభుత్వాలు వెనక్కి పంపుతాయి. దాంతో వైరస్‌ ఎక్కువగా వ్యాపించవచ్చని ఆందోళన చెందుతున్నారు.
ఆ పరిస్థితుల్లో సాధారణ కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. అప్పుడు మన రాష్ట్రంతోపాటు భారత దేశమంతటా ఓ విధమైన ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. 
- అప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం దాదాపు అసాధ్యంగా మారుతుందని వైద్య నిపుణులతోపాటు  రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాత నెల రోజులకు కూడా రాష్ట్రంలో పరిస్థితి ఎన్నికల నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా ఉండదంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement