సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఈనెల 15న జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ఎన్నికలు వాయిదా వేయాలని కిషన్ సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని పిటిషన్‌లో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఇ, 243 యు నిర్దేశించిన ప్రకారం స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినందున ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ప్రతివాది దీన్ని గౌరవించలేదని నివేదించింది. మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తికాని పక్షంలో 14వ ఆర్థిక సంఘం నిధులకు కాలం చెల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రోజువారీ పాలనతోపాటు కోవిడ్–19 వ్యాప్తిని నిరోధించడంలో స్థానిక సంస్థల పాత్ర అత్యంత కీలకమని పిటిషన్‌లో తెలిపింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ అంశాలను ప్రస్తావిస్తూ పిటిషన్‌ను అత్యవసరంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది జి.ఎన్.రెడ్డి అభ్యర్థించారు. దీన్ని విచారణ జాబితాలో చేర్చాలని ధర్మాసనం రిజిస్ట్రీకి సూచించింది.
పిటిషన్‌లో ముఖ్యాంశాలు..
- స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జీవో 176 జారీతో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అయితే రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ కొందరు ఈ జీవోను సవాలు చేయడంతో స్టే వచ్చింది. తదుపరి మార్చి 2న హైకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లను సవరిస్తూ జీవో 560 జారీ అయింది.
- మార్చి 7, 9వ తేదీల్లో మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, పురపాలక సంఘాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లు జారీచేసింది. నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయింది. అయితే అకస్మాత్తుగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చి 15న ఓ లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. సీనియర్ వైద్యాధికారుల నుంచి ఇన్‌పుట్స్ తీసుకుని నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎన్నికల కమిషన్ చెబుతోంది. కానీ వాస్తవానికి అలా జరగలేదు.
- రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి ప్రాతిపదిక లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడమే కాకుండా 2006లో కిషన్‌సింగ్ తోమర్ వర్సెస్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన మీదట మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపివేయవచ్చని ఆ తీర్పులో సుప్రీం పేర్కొంది.
- ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత కేవలం అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే, అది కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తరువాతే ప్రక్రియను నిలిపివేయవచ్చని సుప్రీం కోర్టు ఆ కేసులో స్పష్టం చేసింది. ప్రతివాది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్చ జరపకుండానే నోటిఫికేషన్ జారీ చేసింది.
- రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్–19కు సంబంధించి ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. ఇటలీ నుంచి వచ్చిన విద్యార్థిని పాజిటివ్‌గా గుర్తించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంది.
- దురదృష్టవశాత్తూ కోవిడ్–19 విస్తరిస్తే దాన్ని నియంత్రించడంలో స్థానిక సంస్థల పాత్ర అత్యంత కీలకం. స్థానిక సంస్థలు ఉనికిలో లేని పక్షంలో కోవిడ్–19 నియంత్రణ అసాధ్యం.
- క్షేత్రస్థాయిలో పాలన అందించడంలో స్థానిక సంస్థలు తప్పనిసరిగా అవశ్యమన్న వాస్తవాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తించలేదు. ఒకవేళ కోవిడ్–19 విస్తరించి ప్రమాదకరంగా మారితే నియంత్రించడంలో స్థానిక సంస్థలు ఒక సాధనంగా ఉంటాయన్న విషయాన్ని ఎన్నికల కమిషన్ గుర్తించలేదు.
- ప్రతివాది ఏ ఉద్దేశంతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేసిందో ఆ లక్ష్యాన్ని ఈ నోటిఫికేషన్ నెరవేర్చకపోవడమే కాకుండా దానికి వ్యతిరేకంగా పని చేస్తుంది.
- ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడంతో పాటు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. కోవిడ్–19ని సమర్థవంతంగా నియంత్రించడంలో ఇది ఆటంక పరుస్తుంది. ఎన్నికలు వాయిదా వేసిన కాలానికి కూడా ప్రవర్తనా నియమావళిని కొనసాగిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ విధి నిర్వహణపై ప్రభావం చూపుతుంది.
- ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన రోజే ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు అంటూ సీనియర్ అధికారులను కమిషన్ బదిలీ చేసింది.
- ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్చి 15నే కోరినప్పటికీ ప్రతివాది పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం సమర్థనీయం కాదు. అందుకే ఈ నోటిఫికేషన్‌ను పక్కనపెట్టాలి.
- నిర్దిష్ట కాల వ్యవధిలో స్థానిక ఎన్నికల నిర్వహణ అవశ్యమని గుర్తించిన హైకోర్టు సంబంధిత వ్యాజ్యాలను త్వరితగతిన పరిష్కరించింది. మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియని పక్షంలో 14వ ఆర్థిక సంఘం గ్రాంట్లకు కాలం చెల్లుతుంది. ఈ అంశాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియ నిలిపివేతకు ముందు ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు.
Comments
Please login to add a commentAdd a comment