‘కోడ్‌’ రద్దు! | Supreme Court Directs SEC to Remove Election Code | Sakshi
Sakshi News home page

‘కోడ్‌’ రద్దు!

Published Thu, Mar 19 2020 5:12 AM | Last Updated on Thu, Mar 19 2020 10:20 AM

Supreme Court Directs SEC to Remove Election Code - Sakshi

ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదు? మీకున్న అభ్యంతరం ఏంటి? సంప్రదించకుండానే ఎన్నికల వాయిదాపై నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఒకవేళ కోవిడ్‌ వల్ల ఎన్నికలు చాలా కాలం వాయిదా వేయాల్సి వస్తే అప్పటి వరకు ఎన్నికల కోడ్‌ను ఎలా అమల్లో పెడతారు? అది ఎలా సాధ్యం? పాలన ఏం కావాలి? దీంట్లో రాజకీయాలు ఉండకూడదు కానీ.. పరిస్థితి ఇంత వరకు ఎందుకు వచ్చింది?
– ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేసి తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల తేదీ నిర్ధారించాకే అమల్లోకి తేవాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఎన్నికల తేదీ నిర్ధారణకు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్థానిక సంస్థల ఎన్నికలను ఈనెల 15న అర్ధాంతరంగా వాయిదా వేయడాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది.

ఎస్‌ఈసీ నిర్ణయం ఏకపక్షం..
తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎ.ఎన్‌.ఎస్‌.నద్‌కర్నీ వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను వాయిదా వేసింది. ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. గతంలో ఇదే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎన్నికల కమిషన్‌ ఉల్లంఘించింది’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే జోక్యం చేసుకుంటూ ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదు? సంప్రదించడంలో మీకున్న అభ్యంతరమేంటి?.. సంప్రదించకుండానే నిర్ణయం ఎలా తీసుకుంటారు..’ అని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. 

నిర్ణయాల్లో రాజకీయ జోక్యం
అనంతరం నద్‌కర్నీ తిరిగి వాదనలు ప్రారంభిస్తూ ‘ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయంలో రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు ఎన్నికలు  వాయిదా వేస్తారు, ఇంకోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కొనసాగిస్తారు. ఈ రెండూ ఎలా చేయగలుగుతారు? ఒకవైపు ఎన్నికలు వాయిదా వేసి మరోవైపు ఆరు వారాల పాటు ఎన్నికల నియమావళిని అమలులో ఉంచడం ప్రభుత్వ పనితీరును కుంటుపరుస్తుంది. ఎన్నికల కమిషన్‌ నిర్ణయాల్లో రాజకీయం చోటు చేసుకుంది. పొలిటికల్‌ లైన్‌ ప్రకారం వెళ్లారని అర్థమవుతోంది. ఎన్నికలను వాయిదా వేయడానికి అనుసరించాల్సిన పద్ధతిలో వెళ్లలేదు. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైన సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం తీసుకోవడం సరికాదు..’ అని విన్నవించారు. 

సంప్రదింపులకు సిద్ధం..
ఈ సందర్భంగా జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే స్పందిస్తూ ‘వాళ్లను సంప్రదింపులు జరపనివ్వండి..’ అని వ్యాఖ్యానించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నాఫడే స్పందిస్తూ ‘సంప్రదింపులు జరపడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయలేదు. కేవలం వాయిదా వేశాం. అందువల్ల ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండాలని భావిస్తున్నాం. కోడ్‌ అమల్లో ఉంటే  నిష్పాక్షిక ఎన్నికలకు అవకాశం ఉన్నట్లు’ అని పేర్కొన్నారు.

మూడు నెలలు వాయిదా పడితే కోడ్‌ కొనసాగిస్తారా?
ఈ సందర్భంగా జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ జోక్యం చేసుకుంటూ ‘ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయంలోకి మేం వెళ్లదలచుకోవడం లేదు. కానీ నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదు? ఒకవేళ ఎన్నికలు మూడు నెలలు వాయిదా పడితే మూడు నెలలూ ప్రవర్తనా నియమావళిని అమలులో పెడతారా?’ అని ప్రశ్నించారు. దీనిపై శేఖర్‌ నాఫడే స్పందిస్తూ ‘ఇది ఎన్నికల సంఘం విధించిన నిబంధనే’ అని వివరించారు. ఈ సమయంలో జస్టిస్‌ బాబ్డే జోక్యం చేసుకుంటూ ‘తిరిగి ఎన్నికల తేదీ ప్రకటిస్తే దానికి ఎన్ని రోజుల ముందు నియమావళి అమల్లోకి రావాల్సి ఉంటుంది..?’ అని ప్రశ్నించారు. దీనికి నద్‌కర్నీ జవాబిస్తూ 15 రోజులు ఉంటుందని తెలిపారు. దీనిపై జస్టిస్‌ బాబ్డే స్పందిస్తూ ‘ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఇప్పుడు జోక్యం చేసుకోలేం.

ప్రాథమికంగా ఈ పిటిషన్‌కు విచారణార్హత ఉంది.. కానీ పిటిషన్‌లోని అంశాల్లో మెరిట్‌కు సంబంధించి ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా విచారించదలుచుకోవడం లేదు. ఎన్నికల నియమావళిని కొనసాగించడంపై పిటిషనర్‌ లేవనెత్తిన అంశం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం..’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో ఎన్నికల సంఘం తరపు న్యాయవాది శేఖర్‌ నాఫడే స్పందిస్తూ ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉపశమనం ఇస్తాం. ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు మాకు అభ్యంతరం లేదు. వారు ముందుకు వస్తే రేపే చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. 

అదెలా సాధ్యం?.. పాలన ఏం కావాలి?
ఈ సందర్భంగా జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ మరోసారి జోక్యం చేసుకుంటూ ‘ఒకవేళ కోవిడ్‌ కారణంగా ఎన్నికలను చాలాకాలం వాయిదా వేస్తే అప్పటివరకూ నియమావళిని అమల్లో పెడతారా? అదెలా సాధ్యం? పాలన ఏం కావాలి..?’ అని ప్రశ్నించారు. దీనిపై  ఎన్నికల కమిషన్‌ తరపు న్యాయవాది స్పందిస్తూ గతంలో ఓ సందర్భంలో పార్లమెంట్‌  ఎన్నికలను నాలుగు నెలలు నిర్వహించాల్సి వస్తే నాలుగు నెలల పాటు కోడ్‌ అమల్లో ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ తరపున న్యాయవాది నద్‌కర్నీ జోక్యం చేసుకుంటూ ‘ప్రభుత్వం, పాలన స్తంభించి పోవాలా? ఇందులో రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలను ఎన్నికల కమిషనర్‌ తెలుసుకోలేదు.

రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి కొనసాగిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వీటిని రాజకీయ ఉద్దేశంతో అడ్డుకుంటున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే.. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కేవియట్‌ దాఖలు చేశారు.. కోడ్‌ ఉండడం సమర్థనీయం కాదు..’ అని నివేదించారు. దీనికి శేఖర్‌ నాఫడే స్పందిస్తూ ‘వాళ్లకు కావాల్సింది ఎన్నికల నియమావళిని సడలించడం. మా చర్యలో రాజకీయ కోణమేదీ లేదు..’ అని తెలిపారు. దీనిపై జస్టిస్‌ బాబ్డే స్పందిస్తూ ‘తప్పకుండా రాజకీయాలు ఉండకూడదు.. కానీ పరిస్థితి ఇంతవరకు ఎందుకొచ్చింది?’ అని ప్రశ్నించారు.
 
రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి..
ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ‘ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నందున తదుపరి ఎన్నికల తేదీ నిర్ణయించడానికి ముందు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎన్నికల తేదీ కంటే నాలుగు వారాలు ముందుగా తిరిగి అమల్లోకి తేవాలి. కోడ్‌ను తిరిగి అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుత అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలిగించరాదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకున్న పక్షంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ముందస్తు అనుమతితో చేపట్టాలి. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ పరిస్థితుల్లోనూ అడ్డుకోరాదు...’ అని ఉత్తర్వులు జారీ చేస్తూ పిటిషన్‌ను పరిష్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున నద్‌కర్నీతో పాటు అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్, సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్, న్యాయవాదులు జీఎన్‌రెడ్డి, మహ్‌ఫూజ్‌ నజ్కీ, పోలంకి గౌతమ్, విజయభాస్కర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు.

వాయిదాపడ్డ దశ నుంచే ఎన్నికలు పునఃప్రారంభం
– మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పనిలేదు
‘‘సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు ఏ దశలో వాయిదా పడ్డాయో తిరిగి ఆ దశ నుంచే ఎన్నికలను పునఃప్రారంభించాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రధాన సారాంశం కూడా ఇదే. ఎన్నికలను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన అవసరం లేదు. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఎన్నికలు ఎక్కడైతే ఆగిపోయాయో అక్కడి నుంచే ఎన్నికలు ప్రారంభమవుతాయని స్పష్టంగా ఉంది’’ 
– ఎస్‌.శ్రీరామ్, అడ్వొకేట్‌ జనరల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement