
సాక్షి, అమరావతి: కరోనా వ్యాధి నియంత్రణ కోసమే ముందస్తు చర్యగా ‘స్థానిక’ ఎన్నికలను వాయిదా వేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు. తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలలో స్థానిక ఎన్నికలు వాయిదా వేశారని ఆయనన్నారు. గోవా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలను వాయిదా వేసే ఉద్దేశంతో ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేయాల్సినంత పరిస్థితుల్లేవని.. వాయిదాను ఉపసంహరించుకోవాలంటూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి మంగళవారం కమిషనర్ జవాబిచ్చారు. అందులో ఆయన ఏం ప్రస్తావించారంటే..
- ఆ మూడు రాష్ట్రాలలో ఎన్నికలను వాయిదా వేసిన మరుసటి రోజు నేను వాయిదా వేసి ఉంటే నాపై ఈ నిందలు వచ్చి ఉండేవి కావు. వీటికన్నా ఒకరోజు ముందు ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంతోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై అపవాదు వేశారు.
- కరోనా వైరస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్‌తో రాష్ట్ర పరిస్థితిని అధ్యయనం చేసి, ఇక్కడ ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లేవని.. ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ధృవీకరిస్తే, ‘స్థానిక’ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సమీక్షించుకోవడానికి సిద్ధం.
- వైద్య నిపుణులు అంచనా మేరకు మన దేశంలో కరోనా రెండో దశకు చేరుకుంది.
- 14వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి నా వంతు సహకారాన్ని నేను అందిస్తా.
- ఇక.. వైరస్ నివారణకు ప్రభుత్వ చర్యపట్ల ఆనందం వ్యక్తంచేస్తున్నా. సమర్థవంతమైన నాయకత్వంలో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖకు నా అభినందనలు.
- మార్చి 14న మనం రాష్ట్ర ఎన్నికల సంఘంలో కలిసినప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీతో మాట్లాడవలసిందిగా మీకు చెప్పాను. అంతకుముందు నేను వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీతో తరచూ మాట్లాడుతూనే ఉన్నాను. కానీ, దురదృష్టవశాత్తు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి సమాచారం పంపలేదు. అందువల్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై నిందారోపణలు మోపడం సహేతుకం కాదు.
- రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేరు ప్రతిష్టలను నిలుపవలసిన బాధ్యత నాపై ఉంది. ఎన్నికల వాయిదాపై నెలకొన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. దీనిని మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను.