ఈసీకి కరోనా వైరస్ సోకింది
- కరోనా వైరస్ రాష్ట్రానికి కాదు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ)కు సోకినట్టుంది.
- రాష్ట్రంలో నమోదైన ఒకే ఒక్క కేసును సాకుగా చూపి ఆరు వారాలపాటు ఎన్నికలను వాయిదా వేయడం అన్యాయం.
- ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన భాష, చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కరోనా వైరస్ లాంటిది ఏదో ఈసీకి సోకింది. అది చంద్రబాబు వైరస్సో, మరేదో అర్థం కావడం లేదు.
– మంత్రి పేర్ని నాని
వ్యవస్థలను మేనేజ్ చేయడం బాబుకు కొత్తేమీ కాదు
- టీడీపీకి కరోనా సోకింది. అందుకే ఎన్నికలను వాయిదా వేసేలా లాబీయింగ్ చేసింది.
- ఎన్నికలకు టీడీపీ మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. బీసీలకు మేము 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఆ పార్టీకి చెందిన వ్యక్తితో సుప్రీంకోర్టులో కేసు వేయించి వెంటనే తీర్పు రాకుండా ఆలస్యం చేసింది.
- వ్యవస్థలను మేనేజ్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం చంద్రబాబుకు కొత్తకాదు.
– ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
వాయిదాకు చంద్రబాబే కారణం
- స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేయడానికి చంద్రబాబే కారణం.
- ఈసీ నిర్ణయంతో రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయి.
- ఇన్నాళ్లూ చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవారు, ఇప్పుడు ఆయనకు ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ తోడయ్యారు.
- తక్షణమే చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
– మంత్రి శంకర్‌నారాయణ
తనకు ఉద్యోగ భిక్ష పెట్టిన చంద్రబాబు రుణాన్ని ఈసీ నిమ్మగడ్డ ఇలా ప్రజలకు అన్యాయం చేయడం ద్వారా తీర్చుకున్నారు.
– మంత్రి బొత్స
చంద్రబాబు రుణం తీర్చుకోవడానికే..
- ప్రజానాయకుడు సీఎం వైఎస్ జగన్ ముందు చంద్రబాబు కుప్పిగంతులు పనిచేయవు.
- ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు కుట్రలనే నమ్ముకున్నారు. ఇప్పుడవి సాగకపోయేసరికి రాజ్యాంగ వ్యవస్థలనూ భ్రష్టు పట్టిస్తున్నారు.
- చంద్రబాబు రుణం తీర్చుకోవడానికే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కరోనా ముసుగులో ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
– మంత్రి కురసాల కన్నబాబు
పైశాచిక ఆనందమే తప్ప ప్రజలకేమీ ఉపయోగం లేదు
- వాయిదా వేయడం వల్ల చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు పైశాచిక ఆనందం పొందడమే తప్ప ప్రజలకేమీ ఉపయోగం లేదు.
- శాసనసభ ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబు ముందుగానే పసిగట్టి ఉంటే ఏదొక సాకుతో వ్యవస్థలను మేనేజ్ చేసి ఆ ఎన్నికలనూ వాయిదా వేయించేవారు.
- ఈ ధోరణిని మేధావులు, రాజకీయ విశ్లేషకు లు ఖండించాలి.
– మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్
ఈసీ మంచి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోలేదు
- స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ (ఈసీ) తీసుకున్న నిర్ణయం మంచి ఆలోచనతో తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. దీనితోపాటు కలెక్టర్లు, ఎస్పీల బదిలీ చేయడం అభ్యంతరకరం.
- ఎన్నికల కోడ్ ఆరు వారాలపాటు కొనసాగితే ప్రజా సంక్షేమ పథకాల అమలు మాటేమిటి?
– వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
‘‘ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగానికి బద్ధుడై విధులు నిర్వర్తించాలి. ఆ స్థానంలో కూర్చున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ బాధ్యతారహితంగా వ్యవహరించడం దుర్మార్గం. ఏ రకమైన ప్రమాణాలు, పద్ధతులు పాటించకుండా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజ్యాంగేతర శక్తులు ఉన్నాయి. ఆయన ఆ శక్తుల ప్రలోభాలకు, ఒత్తిడికి లొంగి ఇలా చేసినట్లు కనిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే. కరోనా అనేది ఒక సాకు మాత్రమే. ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా అడ్డుకొనే అధికారం రమేష్‌కుమార్‌కు ఎవరిచ్చారు. ఏవైనా సంఘటనలు జరిగితే అక్కడివరకు చర్యలు తీసుకొని ఎన్నికలను కొనసాగించాలి. చర్యలు తీసుకున్నప్పుడు వాయిదా వేయాల్సిన అవసరం ఏముంది. చర్యలు తీసుకున్నారంటే ఎన్నికలు జరుగుతున్నట్లే కదా? రమేశ్‌కుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలి’’
– జస్టిస్ వి.ఈశ్వరయ్య, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
ప్రభుత్వం పని చేయడానికి వీల్లేదా?
‘‘స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి ఎలాంటి కారణమూ కనిపించడం లేదు. కరోనా వైరస్ ప్రభావం మన రాష్ట్రంలో లేదు. ఎన్నికల వాయిదాకు కేవలం అది సాకు మాత్రమే. ప్రభుత్వ విభాగాలతో మాట్లాడ కుండా, పరిస్థితిని మదింపు చేయకుండా, ఎలాంటి నివేదికలు లేకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మాట్లాడలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయానికి హేతుబద్ధత లేదు. ఆరు వారాలు వాయిదా అని ఎవరితో చర్చించి ఆ నిర్ణయానికి వచ్చారు? మొత్తం వ్యవస్థ ఆగిపోవాలా? ఎన్నికల నిర్వహణపై మళ్లీ నిర్ణయం తీసుకునేదాకా ప్రభుత్వం పని చేయడానికి వీల్లేదంటే ఎలా? సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవద్దనడం ఏమిటి? రాష్ట్రం పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఉండాలా?’’
– జస్టిస్ కాంతారావు, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ చైర్మన్
ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రానికి నష్టం
‘‘స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం రాజ్యాంగ ఉల్లంఘనే, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో సమావేశమై ఉండాల్సింది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఓ నిర్ణయానికి వస్తే సమంజసంగా ఉండేది. ఇలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. మార్చి 31వ తేదీ లోగా ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. అసలు కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలో ఏ మేరకు ఉందో పరిశీలించకుండా ఎన్నికలను వాయిదా వేయటం రాజ్యాంగబద్ధం కాదు’’
– జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తప్పుకోవాలి
‘‘ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేదు. కమిషనర్‌ది ఏకపక్ష నిర్ణయం. విచక్షణాధికారం పేరుతో ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. అధికార యంత్రాంగం నుంచి సహేతుక నివేదికలు తెప్పించుకుని.. సీనియర్ ఆధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ, అధికారులతో మాట్లాడకుండానే మాట్లాడినట్లు చెప్పి ఎన్నికలు వాయిదా వేయడం అన్యాయం, అక్రమం. తప్పుడు ప్రకటన చేసినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన పదవి నుంచి తప్పుకోవాలి’’
– చిత్తరవు నాగేశ్వరరావు, సీనియర్ న్యాయవాది
రాజ్యాంగ విరుద్ధం.. కోర్టు ధిక్కారం
‘‘స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఏ రాజకీయ పార్టీ నుంచి గానీ, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల నుంచి గానీ ఎలాంటి ఫిర్యాదు, విజ్ఞప్తి అందకుండానే కమిషనర్ తనంతట తానుగా ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలను నెలరోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇప్పుడు వాయిదా వేయడం అంటే హైకోర్టు తీర్పును ఉల్లంఘించడమే. హైకోర్టు అనుమతి లేకుండా వాయిదా వేయడం కోర్టు ధిక్కారమే’’
– ఎస్.ఎస్.ప్రసాద్, సీనియర్ అడ్వొకేట్
ఎన్నికలు వాయిదా వేస్తున్నామనడం సరికాదు..
- కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఎన్నికల సంఘం ప్రకటించడం సరికాదు.. అధికార పార్టీ ఏకగ్రీవాల పేరుతో ఫలితాలను అనుకూలంగా చేసుకుంటోంది.
- ఇంత వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలి
- కరోనా మహమ్మారి నివారణకు కేంద్ర పూర్తిస్థాయిలో నడుంబిగించింది.
– అమలాపురంలో మీడియాతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు
నామినేషన్ల ప్రక్రియను మళ్లీ మొదలెట్టాలి..
- ఎన్నికల ప్రక్రియ వాయిదాపడిన నేపథ్యంలో నామినేషన్ల నుంచి మళ్లీ మొదలుపెట్టాలి.
- స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కొమ్ముకాసే అధికారులపై కేంద్ర హోంమంత్రికి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేస్తా..
– జనసేన అధినేత పవన్‌కల్యాణ్
ఇది రాజకీయ కరోనా
- కరోనా వైరస్ సాకుతో ఎన్నికల్ని రద్దు చేసినా.. వాస్తవానికి ఇది రాజకీయ కరోనా. ఏకగ్రీవమైన స్థానాలను వదిలి మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం చెప్పడం సమంజసం కాదు.. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేయాలి.
– డాక్టర్ కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు
దురుద్దేశాలు ఆపాదించకూడదు
- ఈసీ విస్తృతాధికారాలు ఉపయోగించినప్పుడు దానికి దురుద్దేశాలు ఆపాదించకూడదు. మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.
– కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment