సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో సోమవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు ప్రక్రియ ముగియగానే సోమవారమే ఫలితాలను ప్రకటించనున్నారు. మొదటి దశలో మొత్తం 3,701 సర్పంచ్ స్థానాలకు 12,202 మంది, మొత్తం 28,976 వార్డు మెంబర్ స్థానాలకు 70,094 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
వాస్తవానికి ఈ విడతలో మొత్తం 4,479 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 769 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 39,822 వార్డుసభ్య స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో 10,654 వార్డు స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు కోర్టు కేసుల కారణంగా 9 పంచాయతీల్లో ఎన్నికలు జరగట్లేదు. తొలి విడత ఫలితాల ప్రకటన వెలువడిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో ఉప సర్పంచ్ ఎన్నిక జరగకపోతే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో మరుసటి రోజు ఆ ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఇప్పటికే స్పష్టం చేసింది.
ఎన్నికల ఏర్పాట్లు...
పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పటిష్ట బందోబస్తు కల్పిస్తోంది. మొత్తం 26 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. వివిధ రూపాల్లోని పోలింగ్ విధుల నిర్వహణ కోసం 1,48,033 మంది ఎన్నికల సిబ్బంది సేవలను ఉపయోగించుకుంటోంది. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఓటర్ స్లిప్పులను కూడా పంపిణీ చేసింది. ఓటింగ్ స్లిప్పులు అందని వారు టీ–పోల్ యాప్ ద్వారా స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఎస్‌ఈసీ కల్పించింది. ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో పరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లు పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నగదు, మద్యం పంపిణీపైనా ఎన్నికల అధికారులు నిఘా పెంచారు.
‘స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్’...
పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు కట్టుదిట్టమైన చర్యలతోపాటు అవసరమైన చోట్ల కఠిన ఆంక్షలు చేపట్టేందుకు వీలుగా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ‘స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్’ను నియమించేందుకు న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత జిల్లా కలెక్టర్ నిర్దేశించిన పరిధిలో ఆయా విభాగాల అధికారులు పనిచేసేలా ఈ ఉత్వర్తులు వర్తిస్తాయి. ఈ మేరకు ఆదివారం 26 జిల్లాల్లో ఆయా శాఖల అధికారులు వారికి నిర్దేశించిన పరిధిలో ‘స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్’గా విధులు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు.
ఉపసర్పంచ్ ఎన్నిక ఇలా..
సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలను సంబంధిత రిటర్నింగ్ అధికారి ప్రకటించిన వెంటనే సోమవారం ఎన్నికల నోటీస్‌లో పేర్కొన్న సమయం, స్థలంలో ఉపసర్పంచ్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. జిల్లా పంచాయతీ అధికారి మరో చోటును నిర్దేశిస్తే తప్ప గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఈ సమావేశం నిర్వహించాలి. ఉపసర్పంచ్ ఎన్నికను ఏదైనా కారణంతో నిర్వహించకపోతే, మరుసటిరోజు ఆ ఎన్నిక పూర్తి చేయాలి. ఈ ఎన్నిక నిర్వహణ కోసం నిర్వహించే సమావేశానికి రిటర్నింగ్ అధికారే అధ్యక్ష వహిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక ఫలితాలు ప్రకటించిన తర్వాత రిటర్నింగ్ అధికారి, గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుపై ఉపసర్పంచ్‌గా ఎన్నికైన వారి పేరును తెలియజేస్తూ నోటీస్‌ను ప్రకటిస్తారు. ఈ నోటీస్‌ను ఉపసర్పంచ్‌కు కూడా అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment