పోస్టల్ బ్యాలెట్ ఆమోదంపై గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు
దేశవ్యాప్తంగా అవే అమలు కూడా..
కానీ, డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ అధికారి స్టాంప్ లేకపోయినా.. సంతకం ఉంటే చాలు ఆమోదించాలని టీడీపీ విజ్ఞప్తి
ఆ మేరకు సడలింపు ఇస్తూ ఈనెల 25న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు
అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంపై అనుమానం వస్తే ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి వద్ద సంతకంతో సరిపోల్చుకోవాలని ఆదేశాలు
ఇది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో వివాదాలకు దారితీస్తుందంటున్న రాజకీయ పక్షాలు.. శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తుందంటూ ఆందోళన
రాష్ట్ర ఎన్నికల సంఘం మరీ ఇంత ‘పచ్చ’పాతంపై విస్మయం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక నిబంధనావళి రూపొందించిందంటే అది దేశవ్యాప్తంగా అమలు జరగాలి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన అంటూ ఏమీ ఉండదు. అలాగే, గత ఎన్నికల్లో లేని నిబంధన.. అదే విధంగా దేశంలో ఎక్కడాలేని నియమం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అమలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సడలింపులు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఎందుకంటే.. ఈ సడలింపులు టీడీపీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందని స్పష్టంగా తెలిసిపోతోంది కాబట్టి. గత ఎన్నికల్లో లేని సడలింపుల్ని.. పైగా ఇంకెక్కడా లేని మినహాయింపులను ఇక్కడే అమలుచేయడం.. అది కూడా టీడీపీ చెప్పింది చెప్పినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం తలూపుతూ చేయడం చూస్తుంటే.. రాష్ట్రంలో ఎన్నికల సంఘం.. టీడీపీ సంఘంలా వ్యవహరిస్తోందని కాక ఇంకేమనాలి?
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు భిన్నంగా..
నిజానికి.. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు.
అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు.. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకునేలా సడలింపు ఇవ్వడంపై రాజకీయ పక్షాలు నివ్వెరపోతున్నాయి. ఎన్నికల సంఘం పచ్చపాతం మరోసారి బహిర్గతమైందని విమర్శిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సందర్భంగా ఇది వివాదాలకు దారితీస్తుందని.. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
మరీ ఇంత ‘పచ్చ’పాతమా?..
పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంతమంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనాకు టీడీపీ నుంచి పలు విజ్ఞాపనలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఆయన.. 2023, జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను ఉటంకిస్తూ ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు.
వాటి ప్రకారం.. డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ నిబంధన దేశవ్యాప్తంగా అమలవుతోంది. కానీ.. అటెస్టింగ్ ఆఫీసర్ స్టాంప్ లేకపోయినా.. పేరు, డిజిగ్నేషన్ వివరాలను చేతితో రాయకపోయినా.. సంతకం ఉంటే చాలు.. దానిపై ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ సడలింపు ఇవ్వడం గమనార్హం.
పోస్టల్ బ్యాలెట్ ఆమోదానికి ఇతర నిబంధనలివీ..
⇒ పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ ఆఫీసరుగానీ లేదా ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్‌ఛార్జి సంతకం తప్పనిసరిగా ఉండాలి.
⇒ బ్యాలెట్ పేపర్ వెనుక సంతకం విషయంలో ఏమైనా సందేహాలొస్తే సీరియల్ నెంబర్ ప్రకారం కౌంటర్ ఫైల్‌ను పరిశీలించి అది నిజమైన బ్యాలెట్ అవునా కాదా అని నిర్థారించుకోవాలి. ఒకవేళ సందేహం ఉంటే వాటిని తిరస్కరించాలి.
⇒ ఓటరు కవర్–బీ మీద సంతకంలేదన్న కారణంతో కూడా ఓటును తిరస్కరించకూడదు. డిక్లరేషన్ ఫాం–13ఏ ప్రకారం ఓటరును గుర్తించవచ్చు. ఇవికాక.. బ్యాలెట్ పేపర్ ఉండే ఇన్నర్ కవర్ ఫారం–13బీని తెరవకుండానే ఈ సమయాల్లో ఓటును తిరస్కరించవచ్చు.
⇒ కవర్–బీని తెరవగానే, ఓటరు డిక్లరేషన్ ఫారం లేకపోతే, డిక్లరేషన్ ఫారంపై గెజిటెడ్ లేదా అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా, ఫారం–13ఏ, ఫారం–13బీలో బ్యాలెట్ సీరియల్ నెంబర్లు వేర్వేరుగా ఉంటే బ్యాలెట్ పేపర్ తెరవకుండానే తిరస్కరించొచ్చు.
⇒ ఈ విధానం అంతా పూర్తయి బ్యాలెట్ పేపరు తెరిచిన తర్వాత.. ఎవరికీ ఓటు వేయకపోయినా.. ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటువేసినా.. అనుమానాస్పద బ్యాలెట్ పేపరుగా గుర్తించినా.. బ్యాలెట్ పేపరు చిరిగిపోయినా.. అది నిజమైన బ్యాలెట్ అని నిర్థారించడానికి అవకాశంలేని సమయంలో.. రిటర్నింగ్ ఆఫీసరు ఇచ్చిన కవర్–బీ లేకపోయినా.. ఓటరు ఎవరో గుర్తించే విధంగా ఏమైనా గుర్తులు, లేక రాతలున్న సందర్భాల్లో తిరస్కరింవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment