కృష్ణా, సాక్షి: కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ ఎన్నికల సంఘాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒత్తిడికి లొంగిపోయి పని చేస్తున్నాయన్నారు ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఎన్నికల సంఘం డబుల్ గేమ్‌పై, న్యాయస్థానాల్లో తాజా పరిణామాలపైనా ఆయన స్పందించారు.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా నిబంధనలను మీరారు. స్టాంప్ వేయకపోయినా.. డిజిగ్నేషన్ లేకపయినా ఫర్వాలేదని మెమో జారీ చేశారు. చట్టాన్ని మీరి మరి రూల్స్ తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు.
.. అందుకే మేం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశాం. దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. తాను ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు సీఈవో ఎంకే మీనా కోర్టుకు తెలిపారు. మెమో వెనక్కి అంటే.. ఆయన తప్పు చేసినట్లే కదా. ఆ మెమోను ఈసీ సమర్థించడం అన్యాయం. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన వెసులుబాటుపై కోర్టులో పోరాడుతున్నాం. కచ్ఛితంగా న్యాయం గెలిచి తీరుతుంది. చంద్రబాబు, బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా న్యాయస్థానంలో గెలుపు ధర్మానిదే..
.. బీజేపీ ఒత్తిడికి లొంగిపోయే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్నికల సంఘాలు పని చేస్తున్నాయి. ఈ సంగతి ఎప్పటి నుంచో చెబుతున్నాం. టీడీపీ తప్పులపై ఆధారాలతో సహా మేం ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్‌లలో వార్తలు వస్తే చాలూ.. వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. టీడీపీపై పొరపాటున కేసులు పెడితే ఆ జిల్లా కలెక్టర్లను, ఆర్వోలను బెదిరిస్తున్నారు.
.. వైఎస్సార్‌సీపీపై సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారు. టీడీపీ, బీజేపీలపై కేసులు పెట్టొద్దనే సంకేతాలిస్తున్నారు అని ఆరోపించారాయన.
Comments
Please login to add a commentAdd a comment