కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
పోస్టల్ బ్యాలెట్ నిబంధనల మినహాయింపులపై ఆక్షేపణ
ఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సడలింపులు
అటెస్టింగ్ అధికారుల స్పెసిమన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధం
ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీస్తుందంటూ ఆందోళన
సడలింపు ఉత్తర్వులను తక్షణమే సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాలని వినతి
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను ఏపీలో సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా ఈనెల 25న జారీచేసిన ఉత్తర్వులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నిబంధనలకు విరుద్ధమని గుర్తుచేసింది. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఓట్ల తిరస్కరణకు కారణమవుతుందని.. పైగా తీవ్ర వివాదాలకు సైతం దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు ఎస్. నిరంజన్‌రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా నిబంధనలను సడలిస్తూ జారీచేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా ఒకలా.. రాష్ట్రంలో మరోలా..
నిజానికి.. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు.
నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నిర్దేశించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు (స్పెసిమెన్) సేకరించి.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు.. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకం (స్పెసిమెన్)తో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకునేలా సడలింపు ఇచ్చారు.
గోప్యతకు.. శాంతిభద్రతలకు విఘాతం..
ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో స్పెసిమెన్ సంతకంపై రాజకీయ పక్షాల ఏజెంట్ల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఇది చినికిచినికి పెను వివాదంగా మారి శాంతిభద్రతల సమస్యగా పరిణమించే ప్రమాదం ఉంది. ఈ నిబంధనలవల్ల ఓటు గోప్యత ఉండదని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో టీడీపీ నేతలు విజ్ఞప్తి చేయగానే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా ఉత్తర్వులు జారీచేయడంపై నివ్వెరపోతున్నారు.
నిబంధనల సడలింపుపై న్యాయపోరాటం..
ఇదిలా ఉంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా జారీచేసిన ఉత్తర్వులపై దుమారం రేగుతోంది. వాటిని సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సముచిత నిర్ణయం తీసుకోని పక్షంలో.. మీనా సడలింపు ఉత్తర్వులపై న్యాయపోరాటం చేసేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment