న్యూఢిల్లీ, సాక్షి: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో ఎన్నికల సంఘం తీరుపై వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటానికి దిగింది. అయితే వైఎస్సార్‌సీపీ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం జోక్యం చేసుకోలేమని చెప్పింది.
ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఇచ్చిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిటిషన్ వేశారు. రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. అందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ ఉంటే చాలని, అలాంటి పోస్టల్ బ్యాలెట్ ఆమోదించాలన్న ఏపీ సీఈవో మెమోను.. తదనంతరం ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని వైఎస్సార్‌సీపీ కోరింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసింది వైఎస్సార్‌సీపీ.
రేపే కౌంటింగ్ కావడంతో.. నేడు త్వరగా విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ తరఫు న్యాయవాది, సుప్రీం ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. అలాగే.. దేశం అంతటా ఎన్నికల సంఘం ప్రస్తుతం అమలు చేస్తున్న ఉన్న నియమ నిబంధనలే కొనసాగించాలని వాదించారు. కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ, ఈ తరుణంలో తాము ఈసీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.
హైకోర్టులో..
ఇక వైఎస్సార్‌సీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పోస్టల్‌బ్యాలెట్ ఈసీ మెమోపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అదే సమయంలో ఏపీ సీఈవో నిర్ణయాన్ని సమర్థించిన కేంద్ర ఎన్నికల సంఘం, మెమోలో కొంత పార్ట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెబుతూ డబుల్ గేమ్ ఆడింది. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ బలమైన వాదనలే వినిపించింది. రాత్రికి రాత్రే మెమో తేవాల్సిన అవసరం ఏముందని, దేశంలో ఎక్కడా లేని రూల్‌ను ఏపీలో తీసుకురావడంలో ఆంతర్యమేంటని వాదించింది.
కానీ, పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసి, ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకునేందుకు వైసీపీకి అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. దీంతో వైఎస్సార్‌సీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించడం అనివార్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment