
గత సర్కారులో మద్యం విధానంపై పచ్చ కుట్ర
కుట్రపూరిత ఫిర్యాదు మేరకే బరితెగించి సిట్ వేధింపులు
ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లు ప్రస్తావించకుండానే దర్యాప్తు
తద్వారా ఎవరినైనా నిందితులుగా చేర్చే కుతంత్రం
అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే ఇరికిస్తామని బెదిరింపులు
ఆపై వారినే నిందితులుగా చేర్చేలా పన్నాగం
ఈ కేసులో ఎవరెవరిని ఏ విధంగా ఇరికించాలి?
కనికట్టు చేసి జనాన్ని ఎలా నమ్మించాలి?
జరగని నేరాన్ని జరిగినట్లు ఏ విధంగా చూపించాలి?
ఈ మేరకు టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి స్క్రిప్ట్
ఫిర్యాదే ఓ కుట్ర.. నివేదికే బూటకం.. కేసే అక్రమం.. ఎఫ్‌ఐఆర్ కుయుక్తి.. వెరసి దర్యాప్తు పేరుతో వేధింపులు.. అబద్ధపు వాంగ్మూలాలే ఆధారం.. ఇదీ రాష్ట్రంలో సీఐడీ, సిట్ పేరిట అరాచకం. చంద్రబాబు ప్రభుత్వ కుట్రకు తార్కాణం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు పేరుతో సాగిస్తున్న రెడ్‌బుక్ కుతంత్రం. ఇందులో భాగంగా కూటమి సర్కారు సిట్ పేరిట ఓ అరాచక వ్యవస్థను సృష్టించి, సాగిస్తున్న వేధింపులు వెర్రి తలలు వేస్తున్నాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ముఠా.. అధికారంలోకి వచ్చాక ఒక్క ఆరోపణను నిరూపించలేక చేతులెత్తేసింది. దాంతో తిమ్మిని బమ్మి చేసైనా సరే వేధించాలని లక్ష్యంగా పెట్టుకుని మద్యం విధానంపై అక్రమ కేసుతో రంగంలోకి దిగింది. ఫిర్యాదు మొదలు దర్యాప్తు వరకు సాగుతున్న కుతంత్రం విస్తుగొలుపుతోంది. - సాక్షి, అమరావతి
కుట్రపూరితంగా ఫిర్యాదు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు కోసం కూటమి ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో పావులు కదిపారు. అందుకోసం కుట్రపూరితంగా ఎవరికీ అనుమానం కలగని రీతిలో వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ అనే ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను తెరపైకి తెచ్చారు. మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ.. విచారణ చేయాలని వారిద్దరూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనాకు గత ఏడాది సెప్టెంబరు 9న ఫిర్యాదు చేశారు.
వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగిందని భావిస్తే పోలీసు, ఏసీబీ, సీఐడీ తదితర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలి. లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అంతేగానీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయరు. అయితే ఈ ఇద్దరూ అటు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయలేదు.
ఇటు న్యాయస్థానాన్నీ ఆశ్రయించ లేదు. ఎందుకంటే వీరి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి. వీరిద్దరి నుంచి ఫిర్యాదు అందుకున్న ముఖేశ్ కుమార్ మీనా.. ప్రభుత్వ పెద్దల కుట్రను కొనసాగిస్తూ తర్వాత అంకానికి తెరతీశారు. ఆయన ఆ ఫిర్యాదు కాపీని ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీకి పంపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
రూ.4 వేల కోట్ల కట్టు కథ
మద్యం కొనుగోళ్లు, ఇతర రికార్డులన్నీ బెవరేజస్ కార్పొరేషన్ కార్యాలయంలోనే ఉంటాయి. ఏయే తేదీల్లో ఏయే డిస్టిలరీలకు ఎంత విలువైన ఆర్డర్లు ఇచ్చారన్న వివరాలు వారి వద్దే ఉంటాయన్నది బహిరంగ రహస్యం. మద్యం విధానంలో అక్రమాలకు పాల్పడితే ఇవిగో అని చూపించవచ్చు. ఇక్కడ ఎలాంటి స్కామ్ జరగలేదు కాబట్టి బెవరేజస్ కార్పొరేషన్ ఎలాంటి ఆధారాలు చూపించ లేదు.
అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా కేవలం తొమ్మిది రోజుల్లోనే అవినీతి కట్టుకథను సృష్టించారు. ఏకంగా రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్టు నివేదిక ఇచ్చేశారు. అంటే ఎక్సైజ్ శాఖే తూతూ మంత్రపు విచారణతో రూ.4 వేల కోట్ల అక్రమాలంటూ చంద్రబాబు కుట్రను వండి వర్చేసింది. అంతా అనుకున్నట్టు కుట్ర కథను నడిపించిన తర్వాత, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేశారు.
ఎఫ్‌ఐఆర్ సాక్షిగా అక్రమ కేసు
ఇక ప్రభుత్వ పెద్దల కుట్రకు పదును పెట్టడం తమ వంతు అని సీఐడీ రంగంలోకి దిగింది. పక్కా పన్నాగంతో బెవరేజస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమ కేసు నమోదు చేసేసింది. నిందితులు ఎవరో కూడా పేర్కొనకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
అంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే నాటికి అందులోని ఏడో కాలమ్‌లో నిందితులను చూపించలేదు. నిందితులు ఎవరో తెలీదని కూడా వెల్లడించింది. అంటే ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లను చెబితే వారందరినీ నిందితులుగా చూపించేందుకు కుట్ర పూరితంగా వ్యవహరించింది.

ఎవరు ఎవర్ని మోసం చేశారన్న కనీస సమాచారం కూడా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన లేదు. పైగా ఐపీసీ సెక్షన్ 420ని చేరుస్తూ కేసు నమోదు చేయడం విడ్డూరం. అసలు కుట్ర ఏమిటన్నది పేర్కొనకుండా, అవినీతి ఏమిటన్నది చూపకుండా ఐపీసీ సెక్షన్లు 409, 120 బి కింద అభియోగాలు నమోదు చేసింది. తద్వారా బెవరేజస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరిపైనా అక్రమ కేసు నమోదు చేసేందుకు ముందస్తు ఎత్తుగడ వేసింది.
ఎఫ్‌ఐఆర్‌లోని తొమ్మిదో కాలమ్‌లో పేర్కొనాల్సిన ఆ కేసులో అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా వెల్లడించ లేదు. అవసరమైతే ప్రత్యేకంగా నివేదిస్తామని చెప్పడం గమనార్హం. అవసరమైతే.. అన్నది ఏమిటో సీఐడీ ఉన్నతాధికారులకే తెలియాలి. ఒక కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు అక్రమాలకు సంబంధించిన అంశాలు అన్నీ అవసరమైనవే కదా.. అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే నాటికి సీఐడీ వద్ద కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్నది సుస్పష్టం.
దీన్నిబట్టి బెవరేజస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక పూర్తిగా కట్టుకథేనని స్పష్టమవుతోంది. అందుకే అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించ లేకపోయారు. కానీ ఎఫ్‌ఐఆర్‌లోని పదో కాలమ్‌లో ఈ వ్యవహారంలో ఏకంగా రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ అవినీతి జరిగినట్టుగా పేర్కొనడం విడ్డూరం.
నిందితులు తెలీదు.. ఆ కేసుకు సంబంధించిన ఆస్తుల వివరాలు లేవు.. కానీ రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్టు మాత్రం కథ అల్లేశారు. ఈ లెక్కన ఎంతటి నిరాధార ఆరోపణలో.. ఎంతటి అక్రమ కేసో అన్నది తేటతెల్లమవుతోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
కట్టు కథకు తగ్గట్టు వాంగ్మూలాలు
ఈ కేసు దర్యాప్తు పేరిట వేధింపులు, అరాచకాల కుట్రకు బరితెగించేందుకు సీఐడీ సరిపోదని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేరుతో అరచకానికి తెగించింది. ఎలాంటి ఆధారాలు లేని కేసులో అబద్ధపు ఆధారాలు సృష్టించేందుకు సిట్ రెండు నెలలుగా పాల్పడుతున్న వేధింపులే ఇందుకు నిదర్శనం. దర్యాప్తు పేరిట బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులను తీవ్ర స్థాయిలో వేధిస్తోంది.
ఆ కేసులో సాక్షుల పేరిట వారిని విచారిస్తూ కనికట్టు చేస్తోంది. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరిస్తోంది. శారీరకంగా, మానసికంగా హింసిస్తోంది. సిట్ వేధింపులు తట్టుకోలేక ఉద్యోగులు ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలాలను తమ అక్రమ కేసుకు ఆధారంగా చేసుకుంటోంది.
ఈ క్రమంలో బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు తాము సాక్షులుగా భావిస్తూ సిట్ నుంచి తప్పించుకునేందుకు అబద్ధపు వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఓసారి వాంగ్మూలాల నమోదు పూర్తయిన తర్వాతే వారినే ఈ కేసులో నిందితులుగా చేర్చాలన్నది సిట్ పన్నాగం.
ఈ కేసులో ఎవరెవరిని ఏ విధంగా ఇరికించాలి.. కనికట్టు చేసి జనాన్ని ఎలా నమ్మించాలి.. జరగని నేరాన్ని జరిగినట్లు ఏ విధంగా చూపించాలన్నది టీడీపీ ప్రధాన కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టు మేరకు జరుగుతోంది.
అవే డిస్టిలరీలు.. పెరిగిన ఆదాయం.. ఇంకెక్కడ అవినీతి?
వాస్తవానికి డిస్టిలరీల ముసుగులో దందా సాగించింది చంద్రబాబే. మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన మద్యం డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి, నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా, వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది.
మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. (వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు) 2014 నవంబర్‌లో జీఓ నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ (ఎక్సైజ్) డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇక అప్పటి వరకు ఊరూ పేరూ తెలియని బ్రాండ్ల మద్యం అమ్మకాలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది.
డిస్టిలరీలతో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి దోపిడీకి తెర తీసింది. 2015–2019 మధ్య ఇలా నాలుగైదు కంపెనీలకు లబ్ధి చేకూరింది. వీరి నుంచే 70 శాతం కొనుగోళ్లు చేశారు. ఈ నేపథ్యంలో 2019–24 మధ్య కొత్తగా ఒక్క డిస్టిలరీ కూడా రాలేదు. పైగా మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఈ లెక్కన అవినీతికి తావెక్కడ? అంతా చంద్రబాబు అండ్ కో కట్టుకథే.
Comments
Please login to add a commentAdd a comment