ఇది ఈసీ వివక్షే | The manner of the Election Commission during the counting is questionable | Sakshi
Sakshi News home page

ఇది ఈసీ వివక్షే

Published Sat, Jun 1 2024 4:55 AM | Last Updated on Sat, Jun 1 2024 1:02 PM

The manner of the Election Commission during the counting is questionable

పేరు, హోదా వివరాలు, సీలు లేకపోతే పోస్టల్‌ బ్యాలెట్‌ ఎలా చెల్లుతుంది?

ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన తాజా ఉత్తర్వులు విస్మయకరం, అన్యాయం

హైకోర్టుకు నివేదించిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ సింఘ్వీ, వీరారెడ్డి

దేశంలో ఎక్కడా లేని ఉత్తర్వులు ఒక్క ఏపీలోనే అమలు 

ఎన్నికలసంఘం పరిధి దాటి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది

చట్టబద్ధ నిబంధనలను మెమోలు, సర్క్యులర్, లేఖల ద్వారా మార్చలేరు.. వాటిని పార్లమెంట్‌ మాత్రమే మార్చగలదు

ఎప్పుడో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే ఇప్పుడు ఉత్తర్వులివ్వడం ఏమిటి?

కౌంటింగ్‌ వేళ ఎన్నికల కమిషన్‌ తీరు సందేహాస్పదం 

ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం.. అలాంటిది 5.39 లక్షల ఓట్ల విషయంలో బాధ్యతారాహిత్యం

మా ఆందోళన, ఫిర్యాదును సీఈసీ పట్టించుకోలేదు

నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ ఉంటే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు.. ఎన్నికల సంఘం జారీ చేసిన 
తాజా ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నపం

ఫలితాలపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్‌ వేసుకోవాలన్న ఎన్నికల సంఘం సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌

ముగిసిన వాదనలు.. నేటి సాయంత్రం 6 గంటలకు తీర్పు

సాక్షి, అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫాంపై అటెస్టింగ్‌ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా ఆ పోస్టల్‌ బ్యాలెట్‌లను ఆమోదించాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయ­స్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. 

శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఆ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్‌ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా హౌస్‌ మోషన్‌ రూపంలో విచారణ జరపాలని కోరుతూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్‌ చంద్రశేఖర్‌ హైకోర్టు రిజిస్ట్రీని కోరారు. దీంతో రిజిస్ట్రీ ఈ కేసు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు ఉంచింది. దానిని పరిశీలించిన ఆయన హౌస్‌ మోషన్‌ రూపంలో అత్యవసర విచారణకు అనుమతి మంజూరు చేశారు. దీంతో జస్టిస్‌ కిరణ్మయి, జస్టిస్‌ విజయ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

దేశ వ్యాప్తంగా కాకుండా ఏపీలో మాత్రమే అమలు చేస్తారా?
వైఎస్సార్‌సీపీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి, న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ వాదనలు వినిపించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫాంపై అటెస్టింగ్‌ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా కూడా ఆ పోస్టల్‌ బ్యాలెట్‌లను ఆమోదించాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు వివక్షాపూరితమని సింఘ్వీ తెలిపారు. 

ఈ ఉత్తర్వులు చాలా కొత్తగా ఉన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులను దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు దేశం మొత్తానికి వర్తిస్తాయని, కానీ విస్మయకరంగా తాజా ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తింప చేస్తోందని వివరించారు. ఇంత కన్నా అన్యాయం ఏమీ ఉండదన్నారు. 

తాజా ఉత్తర్వులు ఎన్నికల కమిషన్‌ స్వీయ నిబంధనలకు విరుద్ధమన్నారు. లేఖలు, సర్కులర్లు, మెమోల ద్వారా చట్టబద్ధ నిబంధనలను మార్చలేరన్నారు. అది పార్లమెంట్‌ పని అని తెలిపారు. పార్లమెంట్‌లో ఎలాంటి సవరణ చేయకుండా తాజా ఉత్తర్వులు తీసుకురావడానికి వీల్లేదని, అందువల్ల అవి ఎంత మాత్రం చెల్లుబాటు కావని ఆయన స్పష్టం చేశారు.

కౌంటింగ్‌కు నాలుగు రోజుల ముందు ఎందుకిలా?
రాష్ట్రంలో 5.39 లక్షల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోల్‌ అయ్యాయని, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఇవి సరిపోతాయని సింఘ్వీ అన్నారు. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో రూల్స్‌ 27ఎఫ్, 54ఏ, 13 ఏ లకు విరుద్ధంగా ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు అమల్లోకి తెచ్చిందన్నారు. అటెస్టేటింగ్‌ అధికారి పేరు, హోదా వివరాలు లేకుండా ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ను ఎవరో ధృవీకరించారో తెలియదని, దీని వల్ల అక్రమాలకు ఆస్కారం ఉంటుందన్నారు. 

అసలు పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫాంపై ఎవరైనా సంతకం చేయవచ్చన్నారు. తప్పుడు, నకిలీ ఓట్లను కూడా ఆమోదించేందుకు తాజా ఉత్తర్వులు అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు. ఎప్పుడో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయితే, ఇప్పుడు కౌంటింగ్‌కు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ తాజా ఉత్తర్వుల వల్ల నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్‌ తీరు సందేహాస్పదంగా ఉందని తెలిపారు. 

ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్‌ ఇలాంటి ఉత్తర్వుల ద్వారా నిష్పాక్షికతకు అర్థం లేకుండా చేస్తోందన్నారు. ఏకపక్షంగా జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరం ఉంటేనే ఎన్నికల పిటిషన్‌ (ఈపీ) దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదని, అందువల్ల తమ వ్యాజ్యానికి విచారణార్హత ఉందని వివరించారు.

పరిధి దాటి వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం
సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమేనన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘామే చెబుతోందని, అలాంటిది 5.39 లక్షల ఓట్ల విషయంలో మాత్రం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో తమ ఆందోళనను గానీ, తామిచ్చిన వినతి పత్రాన్ని గానీ ఎన్నికల సంఘం కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. 

తాము హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన తర్వాత హడావుడిగా తాజా ఉత్తర్వులిచ్చిందన్నారు. అతి కొద్ది రోజుల్లో కౌంటింగ్‌ జరగబోతుండగా, ఇప్పటికిప్పుడు ఈ ఉత్తర్వులను తీసుకు రావాల్సిన అవసరం ఏముందో ఎన్నికల సంఘం చెప్పడం లేదన్నారు. ఎన్నికల సంఘం చర్యల్లో నిజాయితీ ఉండి ఉంటే, ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చి ఉండేదని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల వివాదంపై ఎన్నికల పిటిషన్లు వేయాలంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో దాఖలు చేయాల్సి ఉంటుందని, ఇది ఆచరణ సాధ్యం కాదన్నారు. 

ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తన పరిధి దాటి వ్యవహరించిందని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, బ్యాలెట్‌ ఫాంపై పేరు, హోదా వివరాలు, సీలు లేకుంటే ఆ ఓటును తిరస్కరించాల్సిందేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ సాగుతున్నప్పుడు అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని వీరారెడ్డి తెలిపారు.

తాజా ఉత్తర్వులు ఆ ఉద్యోగులకే వర్తింపు
కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకే తమ తాజా ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద అటెస్టేటింగ్‌ అధికారిని సంబంధిత రిటర్నింగ్‌ అధికారే నియమిస్తారని.. అందువల్ల డిక్లరేషన్‌ ఫాంపై ఆ అధికారి సంతకం ఉంటే చాలని చెప్పారు. పేరు, హోదా వివరాలు, సీలు ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. 

ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను మొత్తం నిబంధనలకు అనుగుణంగా వీడియోగ్రఫీ చేశారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్‌ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియను సవాలు చేయడానికి వీల్లేదని, ఒకవేళ పిటిషన్లు దాఖలు చేసినా అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్‌ పరోక్షంగా ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుతున్నారని, అందువల్ల వారు ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాల వ్యవహారంలో ఈపీ దాఖలు చేసుకోవాలన్న వాదన సరైందేనని, అయితే పిటిషనర్‌ తన వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలు పూర్తిగా వేరని వ్యాఖ్యానించింది. ఇదేమీ వ్యక్తిగత కేసు కాదని స్పష్టం చేసింది. అనంతరం వైఎస్సార్‌సీపీ వ్యాజ్యంలో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. 

ఈ సందర్భంగా వారు ఎన్నికల నిర్వహణ నిబంధనలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు సబబేనన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు తెలిపింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయాన్ని వెలువరిస్తామంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement