పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు?
టీడీపీ ఇలా అడగ్గానే అలా ఆగమేఘాలపై ఎలా నిబంధనలు మారుస్తారు?
అటెస్టేషన్ అధికారి సీల్ వేయక పోయినా, హోదా వివరాలు రాయకపోయినా చెల్లుబాటట!
ఈ సవరణ ఎవరి కోసం.. ఎందుకోసం? దొంగ ఓట్లకు అవకాశం ఇచ్చినట్లు కాదా?
సంతకం ఉంటే చాలట.. ఓట్ల లెక్కింపు సమయంలో సందేహాలు రావా?
అలాంటప్పుడు వందలాదిగా ఉండే స్పెసిమెన్ సంతకాలతో సరిపోల్చడం కుదిరే పనా?
ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై ప్రజాస్వామ్యవాదుల ఆందోళన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందంటున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఓటరు తన వివరాలు, బ్యాలెట్ నంబర్‌తో డిక్లరేషన్ ఫాం13ఏ సమర్పించాలని, ఈ ఓటరు తనకు తెలుసని ఒక గెజిటెడ్ అధికారి ధృవీకరించి సంతకం చేస్తూ.. పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు, హోదా వివరాలు, చిరునామాతో పాటు సీల్ వేయాలని స్పష్టంగా ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటెడ్ అధికారి సంతకం ఉండి, అధికారి హోదా వివరాలు లేదా సీల్.. ఏదో ఒకటి ఉన్నా.. ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా టీడీపీ అడిగిన వెంటనే మోమో జారీ చేయడం తెలిసిందే.
దాన్ని ఎండార్స్ చేయడంతో పాటు మరికొంత సడలింపు ఇస్తూ గెజిటెడ్ అధికారి హోదా వివరాలు, సీల్ లేకపోయినా.. కేవలం సంతకం ఉంటే చాలు ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ రాయడం వెంట వెంటనే జరిగిపోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానంలో ఉపసంహరించుకోవడం అంటే.. ఆ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా అంగీకరించినట్లే. ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్ పిటీషన్ వేయడం ద్వారా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారాన్ని మరింత గందరగోళ పరచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
సంతకంలో వ్యత్యాసాలుంటే..
టీడీపీ వినతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి దొంగ ఓట్ల బెడదను సృష్టించిన సీఈవో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం తందానా అనడం అనుమానాలకు తావిస్తోందని ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం లెక్కింపు సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని మాజీ ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేవలం సంతకంతో అతను అటెస్టేషన్ అధికారే అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు.
ఈ నిర్ణయం దొంగ ఓట్లను ప్రోత్సహించే విధంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాదారునిగా వ్యవహరించిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు లేకుండా కేవలం సంతకంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా ఆమోదం తెలుపుతారని, అధికారుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటం అత్యంత సహజమని వివరించారు. ఈ నేపథ్యంలో స్పెసిమెన్ సంతకంతో సరిపోల్చి చూడటం ఎలా సాధ్యమని రిటైర్డ్ ఆర్డీవో ఒకరు ప్రశ్నిస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన గెజిటెడ్ అధికారుల సంతకాలు అన్నీ కౌంటింగ్ సెంటర్లలోని ఆర్వోలకు పంపిస్తామని, సంతకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటితో సరిపోల్చి చూసుకొని నిర్ణయం తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇన్ని స్పెసిమెన్ అధికారుల సంతకాలతో వాటిని ఆ సమయంలో సరిపోల్చి చూడటం సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లబ్ధి కోసం ఆగమేఘాల మీద ఇటువంటి నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలకు మరింత బలం
పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంత మంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఇలా విజ్ఞాపనలు రాగానే ఎన్నికల సంఘం వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియనే పూర్తి గందరగోళంగా మార్చింది. టీడీపీ ఫిర్యాదు చేయగానే ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలని.. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఉంది.
ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాజాగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం మీనాకు రాసిన లేఖలో మరో ముందడుగు వేసి అటెస్టింగ్ ఆఫీసర్ సీల్ వేయకపోయినా, అతని హోదా వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చాలు అని పేర్కొంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే సడలింపునిస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేయడమే విడ్డూరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ మరో అడుగు ముందుకేసి వివరాలు రాయకపోయినా, సీల్ వేయకపోయినా పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనడం తొలి నుంచి ఈసీ నిష్పాక్షికతపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment