కూటమి కాలకేయుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ | TDP Coalition govt Anarchy reigns in municipal by elections | Sakshi
Sakshi News home page

కూటమి కాలకేయుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ

Published Tue, Feb 4 2025 2:28 AM | Last Updated on Tue, Feb 4 2025 2:28 AM

TDP Coalition govt Anarchy reigns in municipal by elections

వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల బస్సు అద్దాలను పగలగొడుతున్న కూటమి గూండా , తిరుపతిలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళుతున్న కూటమి గూండాలు

మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో అధికార మదంతో అరాచక పర్వం 

బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పాగాకు కుయుక్తులు

తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో తాలిబన్ల తరహాలో కూటమి గూండాల విధ్వంసకాండ 

ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు స్వైర విహారం.. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకున్న రౌడీ మూకలు 

అద్దాలు ధ్వంసం చేసి.. బస్సులోకి చొరబడి కార్పొరేటర్ల కిడ్నాప్‌.. అడ్డుకున్న వారిపై దాడి 

సాక్షి ప్రతినిధి, కెమెరామెన్‌పైనా దాడి.. కెమెరా ధ్వంసం 

కోరం లేనందున ముగ్గురికి మాస్క్‌లు వేసి లోపలకు పంపేందుకు కూటమి నేతల కుట్ర 

వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్సీ సమావేశ మందిరం వద్ద బైఠాయించడంతో బెడిసికొట్టిన పథకం.. ఉప ఎన్నిక వాయిదా.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ఖాతాలో హిందూపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి 

నూజివీడులో కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరించిన మంత్రి పార్థసారథి.. మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ 

ప్రలోభాలు, బెదిరింపులతో ఐదు చోట్ల ఆగిపోయిన ప్రక్రియ.. నేడు ఎన్నికల నిర్వహణకు సిద్ధం  

సాక్షి ప్రతినిధి, తిరుపతి, సాక్షి, అమరావతి, నెట్‌వర్క్‌: ఆదిమ తెగల్లోనూ కానరాని అకృత్యాలు టీడీపీ కూటమి సర్కారు పాలనలో ఆవిష్కృతమ­య్యా­యి! పట్టపగలు.. తిరుపతి నడి రోడ్డుపై పోలీసులు, జనం సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. తాలిబన్లు.. ఐసిస్‌.. హమాస్‌ ఉగ్రమూకలను తలదన్నే రీతిలో మునిసిపల్‌ ఉప ఎన్నికల్లో పచ్చ ముఠాలు దాడులకు తెగబడి విధ్వంసం, భయో­త్పాతం సృష్టించాయి! పలు మున్సిపల్‌ కార్పొ­రేషన్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్‌లు, డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్‌ పదవులకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. 

అసలు ఒక్క సీటు కూడా గెలవని చోట్ల.. తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేని చోట్ల భయపెట్టి నెగ్గేందుకు కూటమి పార్టీలు కుతంత్రాలకు దిగాయి. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి బరి తెగిం­చాయి. బల ప్రయోగం, అక్రమాలు, అరాచ­కాలు, ప్రలోభాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెచ్చేలా వ్యవహరించాయి. మునిసిపల్‌ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ గుర్తులతో జరిగాయి. అలాంటిది.. ఒక పార్టీ గుర్తుపై నెగ్గిన వారిని భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి ఇంత దారుణంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంటే.. అసలు ఇక ఎన్నికలు ఎందుకు? పార్టీ గుర్తులు ఎందుకు? అని ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

నాగరికత, ఆధునిక పోకడలు ఏమాత్రం ఎరుగని ఆటవిక జాతులు.. ప్రజాస్వా­మ్యం అంటే పరిచయం లేని దేశాల్లో మాత్రమే కనిపించే ఘటనలు ఏడుకొండలవాడి సాక్షిగా చోటు చేసుకోవడం నివ్వెరపరుస్తోందని పేర్కొంటున్నా­రు. తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నికలో నెగ్గేందుకు కూటమి పార్టీల గూండాలు అరాచకం సృష్టించారు. ఉప ఎన్నికలో పాల్గొనేందుకు వాహనంలో వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల బస్సు ఆపి రాడ్లతో అద్దాలు పగలగొట్టి లోపలకు చొరబడి దాడులకు తెగబడ్డారు. బస్సులో ఉన్న కార్పొరేట­ర్లపై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. మహిళా కార్పొరేటర్ల ఆర్తనాదాలు ఖాకీల చెవికెక్క­లేదు. 

కార్పొరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న కూటమి గూండాల వాహనాలకు పోలీసులు దగ్గరుండి దారిచ్చి సాగనంపడం నివ్వెరపరుస్తోంది. పోలీసుల సాక్షిగా కూటమి గూండాలు చిత్తూరు, తిరుపతిలో సృష్టించిన అరాచకం ఇదీ!! రాష్ట్రంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేదని అధికార మదంతో టీడీపీ నేతలు సవాల్‌ విసరడంపై ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు నగర కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులతో ఐదు చోట్ల ఎన్నికలు వాయిదా పడటం గమనార్హం.

వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకుంటున్న టీడీపీ నాయకుడు అన్నా రామచంద్రయ్య, గూండాలు 

అర్ధరాత్రి నుంచి అరాచకం..
మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్‌లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్‌ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు. 

గత ఐదు రోజులుగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్‌ హాలులో సోమవా­రం డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్స్‌లో చొరబడ్డారు. 

మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు, అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు. గదుల్లో ఉన్న మహిళలు, చిన్నారులు ఆందోళనతో భూమన అభినయరెడ్డికి సమాచారం ఇవ్వడంతో పార్టీ శ్రేణులతో కలసి అక్కడకు చేరుకున్నారు. టీడీపీ మూకలు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్పొరేటర్లంతా సోమవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో తిరుపతిలోని భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. 


బస్సుని అడ్డుకుని.. అద్దాలు ధ్వంసం చేసి
డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక కోసం సోమవారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లంతా భూమన నివాసం నుంచి ప్రత్యేక బస్సులో ఎస్వీ యూనివర్సిటీలోని సెనెట్‌ హాలు వద్దకు బయలు దేరారు. దాదాపు 25 మంది కార్పొరేటర్లు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం అందులో ఉండగా వర్సిటీ సమీపంలో వారి బస్సును కూటమి గూండాలు అడ్డుకున్నారు. సుమారు 500 మంది ఒకేసారి బస్సుపైకి దూసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే రాడ్లతో అద్దాలను పగులగొట్టారు. 

లోపలకు చొరబడి బస్సు తలుపు తెరిచారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లు అమరనాథరెడ్డి, అనీష్‌రాయల్, మోహన్‌కృష్ణ యాదవ్, బోగం అనిల్, వెంకటేష్‌పై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో కార్పొ­రేటర్లను బలవంతంగా ఎక్కించారు. బస్సులో ముందు వైపు కూర్చున్న మహిళా కార్పొరే­ట­ర్లను నెట్టుకుంటూ లోపలకు చొరబడడంతో భయ­భ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. కార్పొరేటర్లను కాపాడ­క­పోగా మిగిలిన వారిపై దౌర్జన్యానికి దిగారు.

ఎంపీ, సాక్షి ప్రతినిధులపై దాడి
కార్పొరేటర్లతో పాటు బస్సులో ఉన్న ఎంపీ గురుమూర్తిపై కూడా కూటమి గూండాలు దాడికి యత్నించారు. ఈ అరాచకాలను చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధి, ఫోటోగ్రాఫర్‌పై దాడి చేశారు. ఎమ్మెల్యే కుమారుడు మదన్, సునీల్‌ చక్రవర్తి ఫోటోగ్రాఫర్‌ చేతిలోని రూ.రెండు లక్షలు విలువచేసే కెమెరాను ధ్వంసం చేశారు. సెల్‌ఫోన్లో చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతి­నిధిపై కూడా దాడికి తెగబడ్డారు. ఉదయం 10.15 గంటల నుంచి 10.45 వరకు యధేచ్ఛగా సాగిన విధ్వంసంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.  

కోరం లేదని డూప్లికేట్‌ కార్పొరేటర్లతో..
నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్‌ చేస్తే గెలుపు తమదేనని ధీమాతో ఉన్న కూటమి నేతలకు వైఎస్సార్‌సీపీ షాక్‌ ఇచ్చింది. కిడ్నాప్‌నకు గురైన కార్పొరేటర్లను ప్రవేశపెట్టే వరకు తాము ఉప ఎన్నికలో పాల్గొనబోమని మిగతావారు వర్సిటీ సెనెట్‌ హాలు బయటే ఆగిపోయారు. ఉప ఎన్నిక జరగాలంటే కోరం ఉండాలి. అంటే.. 50 మంది కార్పొరేటర్లలో సగం మందైనా ఉంటేగానీ ఉప ఎన్నిక ప్రారంభం కాదు. దీంతో కూటమి నేతలు మరో ఎత్తుగడ వేశారు. 

నలుగురు జనసేన మహిళలకు మాస్క్‌లు అమర్చి సెనెట్‌ హాలు లోపలకు పంపేందుకు యత్నించారు. ఈ కుట్రలను పసిగట్టిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం హాలు వద్దకు చేరుకోవడంతో ఆ యత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఉప ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి శుభం బన్సల్‌ ప్రకటించారు. 

నలుగురితో బలవంతంగా వీడియో...
డిప్యూటీ మేయర్‌ పదవిని కైవశం చేసుకునేందుకు టీడీపీ మూకలు కిడ్నాప్‌ చేసిన నలుగురు కార్పొరేటర్ల చేత బలవంతంగా మాట్లాడించి ఓ వీడియోను విడుదల చేశారు. గొడవల కారణంగా తాము సురక్షిత ప్రాంతానికి చేరుకున్నామంటూ ఒకే డైలాగ్‌ నలుగురితో చెప్పించి వీడియో తీశారు. అది ఒకే ప్రాంతంలో చేసినట్లు తెలుస్తోంది. పక్కన ఎవరో బలవంతంగా చెప్పిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నలుగురి వీడియోలను టీడీపీ మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌వర్మ తన ఫోన్‌ నుంచి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటం గమనార్హం. కాగా భూమన అభినయ్‌పై అక్రమ కేసు బనాయించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

అడ్డదారిలో స్టాండింగ్‌ కమిటీ కైవశం
గుంటూరు స్టాండింగ్‌ కమిటీని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. 56 మంది సభ్యులకుగానూ కేవలం 11 మంది బలం మాత్రమే ఉన్న కూటమి వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి తమవైపు తిప్పుకుంది. స్వయంగా ఎమ్మెల్యేలను కార్పొరేటర్ల ఇళ్లకు పంపి పచ్చ కండువా కప్పారు. సోమవారం స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక సందర్భంగా బ్యాలెట్‌ పేపర్‌పై సీరియల్‌ నంబర్లు వేసి బెదిరింపులకు దిగి గెలుపొందారు. కాగా కార్యాలయం బయట కూటమి సభ్యులు డబ్బులు పంచుకుంటూ మీడియాకు చిక్కారు.

సగం చోట్ల వాయిదా...
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో మున్సిపల్‌ చైర్మన్‌ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్‌ చైర్మన్‌ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్‌ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్‌ కార్యాలయ అధికారులు తెలిపారు. 

టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్‌ చైర్మన్, నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్‌ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్‌లో రెండు డిప్యూటీ మేయర్‌ పదవు­లను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్‌ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్‌ చైర్మన్‌ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది. 

⇒ కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగ­దీసు­కుని వైస్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు.  

⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్‌సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్‌ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.

⇒ నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 54 కార్పొ­రే­టర్లకు 54 సీట్లను వైఎస్సార్‌సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్‌ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు. 

⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచా­యతీలో రెండు వైస్‌ ౖచైర్మన్‌ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదా­రులకు కట్ట­బెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పు­కున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. 

⇒ ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్‌ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్‌ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు.  

⇒ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవిని ఒక్క కౌన్సిలర్‌ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫల­యత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీకి చెందిన వారే. వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్‌ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సా­ర్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ వేయకుండా అడ్డుకు­న్నారు. దీంతో కమిషనర్‌ ఎన్నికను వాయిదా చేశారు. 

⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్‌ వైస్‌  చైర్మన్‌ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్‌ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్‌ ఎన్నికను వాయిదా వేశారు.

డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిష్పాక్షికంగా జరిగేలా చూడండి 
సాక్షి, అమరావతి: తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక విషయంలో జిల్లా ఎస్పీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక నిష్పాక్షికంగా, ప్రశా­ంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నిక జరిగే ఎస్‌వీ యూనివర్సిటీ, సెనె­ట్‌ హాల్‌ బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు పోలీస్‌ ఎస్కార్ట్‌ ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

నందిగామ, పాలకొండపై 
కాగా ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని భర్తీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నాదెండ్ల హారిక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ ఎన్నిక నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఖాళీగా ఉన్న 19 వార్డుకు ముందు ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎం.స్వర్ణకుమారి దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement