శనివారం హైదరాబాద్‌లో జరిగిన సర్పంచుల ఐక్యవేదిక సదస్సులో సంఘీభావం తెలుపుతున్న అఖిలపక్షం నేతలు ఆర్ కృష్ణయ్య, కోదండరాం, ఆందోలు కృష్ణ, సమరసింహారెడ్డి, ఉత్తమ్, చాడ
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలను నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేయాలనే కొత్త పంచాయతీరాజ్ చట్టంపై పెద్దఎత్తున పోరాడాలని అఖిలపక్షం నిర్ణయించింది. సర్పంచుల ఐక్యవేదిక హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (పీసీసీ అధ్యక్షుడు), కోదండరాం(జేఏసీ చైర్మన్), చాడ వెంకటరెడ్డి(సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), ఆర్.కృష్ణయ్య(ఎమ్మెల్యే), డి.కె.సమరసింహారెడ్డి (మాజీమంత్రి), ప్రొఫెసర్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు 29 అధికారాలను బదలాయించాలని, పంచాయతీలకు ప్రత్యక్షంగానే ఎన్నికలను నిర్వహించాలని తీర్మానించారు. పార్టీగుర్తులు లేకుండా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని, సర్పంచుల పదవీకాలం పూర్తయిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు ఓటు హక్కు కల్పించాలని తీర్మానించారు. సర్పంచుల ఐక్య వేదిక చైర్మన్ ఆందోలు కృష్ణ అధ్యక్షత వహించారు.
పెద్ద ఎత్తున ఉద్యమం: ఉత్తమ్
గ్రామ పంచాయతీలకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలను నిర్వహిస్తే పెద్ద ఎత్తున ఉద్యమించాలి. ఈ నెల 28న అన్ని గ్రామ పంచాయతీల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పక్షాన సమావేశాలు పెడుతున్నాం. పంచాయతీలకు ఇప్పుడున్నట్టుగానే ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలను నిర్వహించాలని తీర్మానాలు చేయించి గవర్నరుకు పంపిస్తాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గ్రామ వ్యవస్థను ధ్వంసం చేయాలని టీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నది, స్థానిక సంస్థలకు నిధులు కేటాయిం చాలి. పరోక్ష పద్ధతి వల్ల గ్రామాల్లోని బలహీనవర్గాల నాయకత్వాలకు నష్టం కలుగుతుంది.
కుట్రలను తిప్పికొడదాం: కోదండ
గ్రామాలపై పెత్తనం చేయాలనే కుట్రలను తిప్పికొడదాం. రైతు సమన్వయ సమితుల పేరుతో పెత్తనం చేయాలన్న ప్రభుత్వ కుట్రను తిప్పి కొట్టినం. అప్పుడు పోరాడినట్టుగానే పంచాయతీల విషయంలోనూ పోరాడాలి. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో బలహీన వర్గాల భాగస్వామ్యం పెరగాలి.
ఊరుకునేది లేదు: చాడ (సీపీఐ)
తెలంగాణలో స్థానికసంస్థల మనుగడ ప్రమాదంలో పడింది. పంచాయతీలను నిర్వీర్యం చేయాలని చూస్తే ఊరుకునేదిలేదు. స్థానిక సంస్థల నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే చెందాలి.
శాంతిభద్రతలకు విఘాతం:కృష్ణయ్య
పరోక్ష ఎన్నికలతో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. పరోక్ష పద్ధతి ద్వారా వార్డు మెంబర్లకు డబ్బులు ఇచ్చి కొనుక్కునేవారే సర్పంచ్‌లయ్యే విధంగా కొత్త చట్టం తెస్తున్నారు. పరోక్ష ఎన్నికలతో బలహీన వర్గాలను బలహీనపర్చడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
కొనగలిగినవారే సర్పంచులా? ప్రొఫెసర్ నాగేశ్వర్
పరోక్షంగా ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లో వార్డు మెంబర్లను కొనగలిగినవారే సర్పంచులు అవుతారు. పంచాయతీలను ఇంకా పెంచితే వాటికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయి. అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ల ద్వారా ఎన్నికలు జరిగే పరిస్థితి లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment