సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల గోసను పట్టించుకోకుండా తమ అధికారాన్ని కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. శనివారం ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్.. వరి ధాన్యం కొనుగోలు అంశంపై ప్రధానమంత్రిని, సంబంధిత మంత్రులను కలవరని, కొనుగోలుకుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురారని దుయ్యబట్టారు. కానీ రాష్ట్రంలో మాత్రం ధర్నాలంటూ రహదారులను దిగ్బందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యాన్ని కొనకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బతుకులను బజారు పాలు చేస్తున్నాయన్నారు.
‘‘వరి ధాన్యం ఇప్పటికే కల్లాల్లోకి వచ్చింది. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని ఎమ్మెస్పీ రూ.1900 ఉంటే, రూ.400 నుంచి రూ. 500 తక్కువగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కేంద్రం కొనకపోతే నేను కొంటానని కేసీఆర్ అంటాడు. కానీ అప్పటికే ధాన్యం మొత్తం రైస్ మిల్లర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. రైస్ మిల్లర్ల దగ్గర నుంచి గత రబీలో చేసినట్లే తెలంగాణ ప్రభుత్వం మిల్లర్ల దగ్గర ఎమ్మెస్పీ ధరకు కొంటుంది. తెలంగాణలో ధాన్యం కొనుగోలు పేరుతో సీఎం కేసీఆర్ పెద్ద కుంభకోణం చేస్తున్నాడు. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల కుటుంబంపైనా, ముఖ్యమంత్రిపైనా సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై చేస్తున్న అవినీతిని నిగ్గు తేల్చాలన్నారు.
‘రైస్ మిల్లర్లు.. రైతులకు క్వింటాల్‌కు మద్దతు ధర కన్నా రూ. 400 నుంచి రూ. 500 తక్కువగా ఇస్తున్నప్పటికీ విజిలెన్స్ ఎందుకు దాడులు చేయడం లేదు? క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదని’’ మధుయాష్కీ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment