గ్రామసభ నిర్వహించకుంటే సర్పంచి పదవి పోయినట్లే! | Cabinet approves the amendments to the Panchayati Raj Act | Sakshi
Sakshi News home page

గ్రామసభ నిర్వహించకుంటే సర్పంచి పదవి పోయినట్లే!

Published Thu, Feb 13 2020 4:30 AM | Last Updated on Thu, Feb 13 2020 4:30 AM

Cabinet approves the amendments to the Panchayati Raj Act - Sakshi

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల పాలనలో ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ పాలనలో ప్రధానమైన గ్రామ సభలను క్రమం తప్పకుండా నిర్వహించకుంటే సంబంధిత సర్పంచి పదవి ఆటోమేటిక్‌గా రద్దు అయ్యేలా పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు చేయాలని బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. గ్రామ సభలంటే ఊరి అభివృద్ధి, నిధుల ఖర్చు తదితర వ్యవహారాలపై స్థానిక ప్రజలంతా ఒకచోట కూర్చొని చర్చించి నిర్ణయాలు తీసుకోవడం.

73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామసభల నిర్వహణ అంశాన్ని ప్రస్తావించారు. పంచాయతీరాజ్‌ చట్టంలోనూ గ్రామసభలు నిర్వహించాలన్న నిబంధనలున్నాయి. ఏటా నాలుగు విడతల పాటు వీటిని నిర్వహించాల్సి ఉన్నా తూతూ మంత్రంగా లేదంటే అసలు సమావేశాలే పెట్టకపోవడమో జరుగుతోంది. పంచాయతీలకు సంబంధించి క్యాబినెట్‌ తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇవీ..  
- అమలులో ఉన్న రిజర్వేషన్ల ప్రకారం సర్పంచి పదవులకు ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మహిళలు ఎక్కువ సంఖ్యలో ఎన్నికయ్యే అవకాశం ఉన్నందున ఎక్కడైనా వారి నిరక్షరాస్యతను అడ్డు పెట్టుకుని ఉద్యోగులు తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు.
- గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణలో సర్పంచికి మరిన్ని అధికారాలు అప్పగించేలా పంచాయతీరాజ్‌ చట్ట సవరణకు ఆమోదం.
- సర్పంచ్‌ సంబంధిత గ్రామంలోనే నివాసం ఉండాలి. గ్రామ పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరు కావాలనే నిబంధనకు ఆమోదం.
క్యాబినెట్‌ తాజా నిర్ణయం మేరకు షెడ్యూల్‌ ఏరియాలోని 24 మండలాల్లో జడ్పీటీసీ పదవులన్నీ గిరిజనులకే రిజర్వ్‌ కానున్నాయి.
- నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలో 100% గిరిజన జనాభా ఉన్న గిరిజన పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులన్నీ వారికే రిజర్వు.
పంచాయతీ ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీ లాంటి అనైతిక చర్యలకు పాల్పడితే సదరు వ్యక్తులు గెలిచినా ఆయా పదవుల్లో కొనసాగేందుకు అనర్హులుగా పరిగణిస్తారు.
- ప్రస్తుతం సుదీర్ఘంగా అనుసరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను కుదిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి 18 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ 13 రోజుల్లో పూర్తి చేస్తారు.
ఓటర్లను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభాలకు గురి చేయడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధింపు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement