సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం కోర్టులో నిలబడదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ చట్టంపై చర్చించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరినీ సభ నుంచి సస్పెండ్ చేయడంతో పంచాయతీరాజ్ చట్టంపై చర్చ జరగలేదన్నారు.
ఈ చట్టాన్ని చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్నైనా ఏర్పాటు చేసి, అందులో వచ్చిన అభిప్రాయాల మేర కు చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. తమ ఎమ్మెల్యేల బహిష్కరణ విషయంలో గతంలోనే హైకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా తీర్పు ఇచ్చిందన్న ఆయన తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను కొట్టివేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును అమలు చేసేలా అసెంబ్లీ కార్యదర్శి చొరవ తీసుకోవాలని, లేదంటే కోర్టు ధిక్కారం కింద మళ్లీ కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.
మళ్లీ అధికారంలోకి వస్తాం...
కాంగ్రెస్ పార్టీ పదులసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, నాలుగేండ్లు అధికారంలో లేనంత మాత్రా న తమకేమీ ఆదుర్దా లేదని, తాము మళ్లీ అధికారంలోకి వస్తామని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో విభేదాలు సహజమని, చిన్న, చిన్న అభిప్రాయభేదాలున్నా అందరం కలసికట్టుగా పనిచేస్తా మని చెప్పారు. సీఎం అయ్యే అర్హత ఉన్నవారిలో తాను ముందుంటానని చెప్పానే తప్ప తానే సీఎం అవుతానని ఎప్పుడూ చెప్పలేదని, ఎవరు సీఎం అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment