పవర్‌ఫుల్‌ సర్పంచ్‌  | AP Cabinet approval for amendment in Municipal And Panchayati Raj Acts | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ సర్పంచ్‌ 

Published Thu, Feb 13 2020 2:16 AM | Last Updated on Thu, Feb 13 2020 4:31 AM

AP Cabinet approval for amendment in Municipal And Panchayati Raj Acts - Sakshi

సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ దిశగా సర్పంచులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పచ్చదనం, పారిశుధ్యాన్ని పెంపొందించే బాధ్యతలను వారికే అప్పగించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా అత్యవసర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కట్టబెట్టడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. అత్యవసర సమయాల్లో సర్పంచులు తీసుకున్న నిర్ణయాలను తదుపరి పంచాయతీ సమావేశాల్లో ఆమోదం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారని తెలిపారు. సర్పంచులు ఆయా గ్రామాల్లోనే నివాసం ఉండాలని తీర్మానించారన్నారు. ఇందుకు అనుగుణంగా పంచాయతీ రాజ్‌ చట్టంలో సవరణలకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు.  
 
అవినీతికి పాల్పడితే వేటే 

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అవినీతి చర్యలకు పాల్పడినట్లు రుజువైన వారిపై అనర్హత వేటుతోపాటు మూడేళ్లు జైలు శిక్ష విధించేందుకు వీలుగా చట్టంలో సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. అవినీతికి పాల్పడ్డారని గెలిచిన తర్వాత రుజువైతే కూడా అలాంటి వారిపై అనర్హత వేటు పడుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కువ కాలం ఉంటే అధిక ధన వ్యయం, మద్య ప్రవాహానికి ఆస్కారం ఉంటుందని.. కాలపరిమితిని 13 రోజులకు కుదించాలని నిర్ణయించిందన్నారు. గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ పదవులను పూర్తిగా ఆ వర్గాల వారికే కేటాయిస్తారని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికలకు గతంలో ఉన్న 24 రోజుల కాలపరిమితిని 15 రోజులకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మున్సిపల్‌ చట్ట సవరణకు కేబినెట్‌ అంగీకరించిందన్నారు. పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలన్నీ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకూ వర్తింప చేస్తారన్నారు. మండలి నిర్ణయాలను మంత్రి ఇంకా ఇలా వివరించారు. 
బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 
 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ కౌన్సిల్‌ ఏర్పాటు 
రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ కౌన్సిల్‌ ఏర్పాటు. వ్యవసాయ, ఉద్యానవన విద్యా సంస్థలను పర్యవేక్షించడంతోపాటు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. నియమ నిబంధనలు పాటించే కళాశాలలకు ఈ సంస్థ గుర్తింపు ఇస్తుంది. నకిలీ సర్టిఫికెట్ల నిరోధంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తుంది. వ్యవసాయ రంగంలో ఉత్తమ పద్ధతులకు మరింత తోడ్పాటు అందిస్తుంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, ఎగుమతుల ప్రోత్సాహం వంటి విధానాలకు ఈ కౌన్సిల్‌ ఒక రెగ్యులేటర్‌గా పని చేయనుంది.  వ్యవసాయ, ఉద్యానవన విద్యపై నియంత్రణ, పర్యవేక్షణ, ఉత్తమ విద్యను అందించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం. ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ సంస్థలకు పబ్లిక్, ప్రవేట్‌ విభాగాల్లో పనితీరు మెరుగు పరిచేందుకు కృషి చేస్తుంది.   

పండ్లు, పూల తోటలకు ఇచ్చే పరిహారం పెంపు 
రాష్ట్రంలో భూ సేకరణతోపాటు, నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో పండ్ల తోటలకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దానివల్ల మామిడి, కొబ్బరి, నిమ్మ తదితర పంటలకు ఇచ్చే పరిహారం పెరుగుతుంది. ఇందులో భాగంగా గతంలో రూ.2,600 మాత్రమే ఉన్న మామిడి పరిహారం రూ.7,283కు పెంపు. కొబ్బరి చెట్టుకు రూ.6,090కి పరిహారం పెంపు. గతంలో ఈ మొత్తం కేవలం రూ.2149గా ఉండేది. నిమ్మ పంటకు పరిహారం రూ.1,444 నుంచి రూ.3,210కి పెంపు. మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు పెరుగుతున్న ఖర్చులతో పాటు నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో పండ్ల తోటలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.  
 
ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటు 
రాష్ట్రంలో 10 వేల మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను సొంతంగా ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఏపీ జెన్‌కోకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందించడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.10 వేల కోట్ల భారం పడుతోంది. దీనికితోడు ఏటా సుమారు 50 వేల కొత్త వ్యవసాయ పంపుసెట్లు ఏర్పాటు అవుతున్నాయి. ఇందుకోసం ఏటా 45 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరమవుతోంది. రానున్న రోజుల్లో నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను, ఆక్వా రైతులకు సబ్సిడీపై నిరంతరం విద్యుత్‌ను అందించించేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా 10 వేల మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టును నెలకొల్పేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా దాని ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదించింది. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో మెగావాట్‌కు రూ.20 లక్షల వంతున కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తున్న నేపథ్యంలో ఆ వెసులుబాటును వినియోగించుకోనుంది. ఈ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు సీఎండీ సహా మరో 18 పోస్టులు మంజూరు చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిడెట్‌ ఏర్పాటు 
రాష్ట్రంలో వివిధ శాఖల వద్ద ఉన్న మిగులు నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పేరుతో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్‌లో 1992లో ఇలాంటి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని అది మంచి ఫలితాలు ఇస్తున్నట్లు అధికారులు మంత్రివర్గానికి వివరించారు. వైఎస్సార్‌ జిల్లా వేంపల్లెలో కొత్త ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement