సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్‌ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌పై 15 ఏళ్లుగా ఎల్లో మీడియా విషం చిమ్మనిరోజు లేదన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిని జగన్ పటాపంచలు చేస్తున్నారని పేర్ని నాని అన్నారు.
‘‘రెండు పేపర్లు, పది టీవీ ఛానళ్లతో నిత్యం వైఎస్ జగన్‌పై విషం చిమ్ముతూనే ఉన్నారు. గతంలో కూడా ఇలాగే అమెరికాలో కేసులు అంటూ విషం చిమ్మారు. అయినా సరే జనం జగన్‌ను సీఎం చేశారు. ఇప్పుడు మళ్లీ విషం చిమ్మటం మొదలయింది. జగన్‌కు రూ.1750 కోట్ల లంచాలు అంటూ ఈనాడు రాసింది. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అవినీతా?. పైగా ఇంటర్నేషనల్‌గా జగన్ పేరు అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ జైలుకు వెళ్లినప్పుడే చంద్రబాబు పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. మార్గదర్శి పాపాలను ఈనాడులో ఏనాడైనా రాశారా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.
‘‘అదానీ చంద్రబాబును కలిస్తే ఆహాఓహో అంటూ ఈనాడు రాసింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయంటూ పేజీల నిండా రాసింది. అదే అదానీ జగన్‌ను కలిస్తే పోర్టులు, మైనింగ్ అంతా అదానీకే దోచిపెడుతున్నారంటూ తప్పుడు వార్తలు రాసింది. ఇలా రాస్తే జనం నవ్వుతారని కూడా లేకుండా నిస్సిగ్గుగా వార్తలు రాసింది. కేంద్ర రంగ సంస్థ సెకీతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. రూ.2.49లకే 25 సంవత్సరాలపాటు విద్యుత్ ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. ఇందులో తప్పేముంది?’’ అని పేర్ని నాని చెప్పారు.
‘‘రూ.4.50ల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే తప్పు కాదా?. అదే రూ.2.49లకే జగన్ కొనుగోలు చేస్తే అవినీతా?. అడ్డగోలు ఒప్పందాలతో చంద్రబాబు జనం మీద భారం వేస్తే అది ఈనాడుకు కనపడదా?. రామోజీరావు సంతాప సభ కోసం ప్రజల సొమ్ము రూ.25 కోట్లు ఖర్చు చేశారు. అందుకని చంద్రబాబు రుణం తీర్చుకోవటానికి ఈనాడు పచ్చి అబద్దాలను అచ్చోసింది. చంద్రబాబు దిగేనాటికి కరెంటు కంపెనీలకు రూ.22 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్నది కేంద్ర రంగ సంస్థ కంపెనీ సెకీతోనే.. అదానీతో ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదు’’ పేర్ని నాని స్పష్టం చేశారు.
‘‘కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తుందో మాకు అనవసరం. జగన్ కంటే సంవత్సరంన్నర ముందు అదే సెకీతో చంద్రబాబు రకరకాల అధిక ధరలతో కొనుగోలు చేశారు. మిగతా రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు జరిగితే చంద్రబాబు ఎందుకు అధిక ధరకు కొనుగోలు చేశారు?. జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు తప్పు అయితే దాన్ని రద్దు చేయాలి. గతంలో జగన్ పై పెట్టిన కేసుల్లో నిజం లేదని సుప్రీంకోర్టు తేల్చేసింది. సంతకాలు పెట్టిన అధికారుల తప్పు లేదని తేల్చింది. అలాంటప్పుడు ఇక జగన్ పేరు ఎందుకు ప్రస్తావన ఉంటుంది?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: సెకీతోనే ఒప్పందం.. ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం?
Comments
Please login to add a commentAdd a comment