Municipal Act
-
కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం!.. కార్పొరేషన్లుగా పెద్ద మున్సిపాలిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1 స్థాయి మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. రెండేళ్లలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నందున.. ఆలోపు పెద్ద మున్సిపాలిటీలను కార్పొ రేషన్లుగా అప్‌గ్రేడ్ చేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాల పాలనా యంత్రాంగాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాయి. కొత్త మున్సిపల్ చట్టం– 2019 ప్రకారం నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు.. బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట–జిల్లెలగూడ, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేటలను ఏర్పాటుచేశారు. ఇవన్నీ హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. మిగతా చోట్ల ఉన్న పెద్ద మున్సిపాలిటీలను అప్‌గ్రేడ్ చేయలేదు. ఈ క్రమంలో మున్సిపాలిటీలుగానే ఉన్న కొ న్ని జిల్లా కేంద్రాలతోపాటు కొత్త జిల్లా కేంద్రాలుగా మారిన పలు పట్టణాల్లో పెరిగిన జన సాంద్రతకు అనుగుణంగా వాటిని కా ర్పొరేషన్లుగా మార్చాలనే డిమాండ్ వస్తోంది. గ్రేడ్–1, స్పెషల్ గ్రేడ్ స్థాయి మున్సిపాలిటీలలో.. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం.. కనీసం మూడు లక్షల జనాభా గల పట్టణాలను కార్పొరేషన్లుగా మార్చుకునే వీలుంది. రాష్ట్రంలో నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సిద్ధిపేట, మంచిర్యాల పట్టణాలు స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1 స్థాయి మున్సిపాలిటీలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని గ్రామాలు, పట్టణాలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్లుగా మార్చుకునే అవకాశముంది. - గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్‌నగర్‌ను కార్పొరేషన్ చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పట్టుదలతో ఉన్నారు. ఆయన సూచనల మేరకు దివిటిపల్లి, ధర్మాపూర్, జైనల్లీపూర్తోపాటు మరో గ్రామాన్ని విలీనం చేసి కార్పొరేషన్‌గా మార్చాలని జిల్లా కలెక్టర్ రవి నాయక్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. - ఇదే తరహాలో జనాభా ప్రాతిపదికన నల్లగొండ, ఆదిలాబాద్ మున్సిపాలిటీలను కూడా విస్తరించి కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేయాలన్న చాలా కాలం నుంచీ డిమాండ్లు ఉన్నాయి. ఈసారి ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కార్పొరేషన్లుగా మారితే ఈ రెండు పట్టణాలు సరికొత్తగా మారుతాయని ప్రజా ప్రతినిధులు చెప్తున్నారు. - కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలలో సిద్ధిపేట, మంచిర్యాల వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే స్పెషల్ గ్రేడ్ స్థాయికి ఎదిగిన ఈ మున్సిపాలిటీల్లో చుట్టుపక్కల గ్రామాలు, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను విలీనం చేస్తే కార్పొరేషన్లుగా రూపొందుతాయి. మంచిర్యాలకు నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీలతోపాటు కొన్ని గ్రామ పంచాయతీలను కలిపితే కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కానుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సిద్ధిపేటకు మరికొన్ని గ్రామాలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్ హోదా పొందే అవకాశం ఉంది. కరీంనగర్లో మరికొన్ని గ్రామాల విలీనం? కరీంనగర్ పట్టణంలో కలసిపోయి/ ఆనుకుని ఉన్న బొమ్మకల్, చింతకుంట, నగునూరు, మల్కాపూర్, తిమ్మాపూర్ గ్రామాలు వివిధ కారణాల వల్ల కార్పొరేషన్లో విలీనం కాలేదు. పట్టణంలోని హౌజింగ్‌బోర్డు, ఖార్కాన గడ్డ, బైపాస్ రోడ్డు, చల్మెడ మెడికల్ కాలేజీ ఉన్న ప్రాంతమంతా బొమ్మకల్ గ్రామం పరిధిలోనే ఉంది. ప్రతిమ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఉన్న నగునూరు కూడా పంచాయతీగానే కొనసాగుతోంది. ఈ గ్రామాల కంటే దూరంగా ఉన్న వాటిని కార్పొరేషన్లో విలీనం చేసి.. వీటిని రాజకీయ కారణాలతో కలపలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వీటిని కార్పొరేషన్లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు సిద్ధమైనట్టు తెలిసింది. పట్టణీకరణతో మెరుగవుతున్న జీవన ప్రమాణాలు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాలను కార్పొరేషన్లుగా మార్చడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మౌలిక వసతులు సమకూరుతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. గతంలో 6 కార్పొరేషన్లు మాత్రమే ఉంటే కొత్తగా మరో ఏడింటిని కొత్త నగరాలుగా తీర్చిదిద్దారు. 69 మున్సిపాలిటీలు 128కి పెరిగాయి. ఇప్పుడు కూడా జనాభాకు అనుగుణంగా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం. – రాజు వెన్‌రెడ్డి, మున్సిపల్ చాంబర్స్ చైర్మన్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్. ఇది కూడా చదవండి: ఉప్పల్ సరే.. మరి లష్కర్? -
పన్ను బకాయిలుంటే నో రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్నులు/ఖాళీ స్థలాలపై విధించే పన్నులు, కులాయి బిల్లులు, విద్యుత్ బిల్లుల బకాయిలు లేవని ధ్రువీకరణ పత్రం లేదా ఇప్పటివరకు వీటిని చెల్లించిన రశీదులను సమర్పిస్తేనే ఇకపై స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌తో పాటు యాజమాన్య హక్కుల బదిలీ(మ్యుటేషన్)ను జరపనున్నారు. అవి లేకుంటే వారసత్వంగా గానీ, అమ్మకం ద్వారా గానీ ఆస్తుల రిజిస్ట్రేషన్ జరగదు. రిజిస్ట్రేషన్ సమయంలోనే తక్షణంగా మ్యుటేషన్ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలికల చట్టం, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చట్టాలను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టింది. అమ్మకం, దానం, తనఖా, విభజన, వినిమయం అవసరాలకు స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే ధరణి పోర్టల్‌లో ఆన్లైన్ ద్వారా మ్యుటేషన్లు చేసే అధికారాన్ని సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం అప్పగించింది. మ్యుటేషన్ చేసేందుకు ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్) లేదా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ నంబర్(వీఎల్టీఎన్) సైతం కొత్త యజమాని పేరుకు బదిలీ కానుంది. మ్యుటేషన్ ఫీజును సబ్ రిజిస్ట్రార్లు వసూలు చేసి ఆస్తి యజమానికి మ్యుటేషన్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఆన్లైన్ ద్వారా పురపాలక శాఖకు మ్యుటేషన్ దరఖాస్తు వెళ్లనుంది. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలతో ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర క్యాబినెట్ రెండు గంటల పాటు కొనసాగింది. కొత్త రెవెన్యూ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలన్న బీసీ కమిషన్ సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. బుధవారం అసెంబ్లీలో రెవెన్యూ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్ట్ -1972కు సంబంధించిన సవరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ కెబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు: -ది తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్,(వీఆర్ఓ) 2020కు ఆమోదం - ది తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020కు ఆమోదం - తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ -2019లోని సవరణ బిల్లుకు ఆమోదం - పంచాయితీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్ట్ – 2018 సవరణ బిల్లుకు ఆమోదం - తెలంగాణ జీ.ఎస్.టీ యాక్ట్ -2017 సవరణ బిల్లుకు ఆమోదం - తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020కు ఆమోదం - ది తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020కు ఆమోదం - ది తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002కు ఆమోదం - ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్ కు ఆమోదం - టీఎస్ ఐపాస్ బిల్‌కు ఆమోదం - తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్ -1956 సవరణ బిల్లుకు ఆమోదం - ది తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్ట్ -1972 సవరణ బిల్లుకు ఆమోదం - కొత్త సెక్రటేరియట్ నిర్మాణం(సచివాలయం), పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదం - కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులకు ఆమోదం -
..కూల్చే అధికారం మీకెక్కడిది?
సాక్షి, హైదరాబాద్: ‘ఉరి తీయబోయేటప్పుడు కూడా చివరి కోరిక అడుగుతారు. అలాంటిది అక్రమ నిర్మాణమని నోటీసు కూడా ఇవ్వకుండానే ఇంటిని కూల్చేస్తారా? నోటీసు జారీ చేయకుండా కూల్చేసే అధికారాన్ని మున్సిపల్ కమిషనర్లకు కట్టబెడతారా? అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా చట్టాలు చేస్తామంటే కుదరదు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకే ప్రభుత్వ చర్యలు ఉండాలి’ అని ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 174 (4), సెక్షన్ 178 (2) రెండింటినీ కలిపి చట్టాన్ని అన్వయించాలే గాని, ఒక సెక్షన్‌కే పరిమిత మై చర్యలు ఉండకూడదని స్పష్టం చేసింది. నోటీ సు జారీ చేయకుండానే అక్రమ నిర్మాణాలను కూ ల్చేసేలా మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 178 (2)ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మా సనం సోమవారం విచారించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. తెల్లారేసరికి ఇంటి ముందు బుల్డోజర్ ఉంటే ఆ ఇంటి యజమాని పరి స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోర్టు పేర్కొంది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది కల్పించుకుని ప్లాన్ ప్రకారం నిర్మాణం చేస్తామని భరోసా ఇచ్చి దాన్ని ఉల్లంఘిస్తే నోటీసు జారీ చేయాల్సిన అవసరం ఏముంటుందన్నారు. కోర్టు స్పందిస్తూ.. ఉరి శిక్ష విధించే కేసులోనైనా నేరస్తుల వాదనలు వినాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని, అలాంటిది అనుమతి పొందిన ప్లాన్‌ను అతిక్రమించి నిర్మిస్తే వాళ్ల వాదన వినేందుకు నోటీసు కూడా ఇవ్వరా అని ప్రశ్నించింది. రోడ్డు పక్కనో, ఫుట్పాత్లపైనో గుడిసెలను తొలగించేటప్పుడు కూడా అందులో నివాసమున్న వారికి నోటీసులివ్వాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పింది. ‘ఒక ప్లాన్ ప్రకారం ఒక అంతస్తుకు అనుమతి తీసుకుని, రెండో అంతస్తు నిర్మించారనుకుందాం. మున్సిపల్ కమిషనర్‌కు తెలియకుండానే రెండో అంతస్తు నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారి అనుమతిచ్చారని అనుకుందాం. బుల్డోజర్లతో కూల్చేసే అధికారం మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వడం ఎంత వరకు చట్టబద్ధత?’అని పేర్కొంది. సాంకేతిక కారణాల సాకుతో అడ్డుకోవద్దు.. మంజూరు చేసిన ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మాణాలు చేసి వాటి విషయంలోనే ఆ విధమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. చట్టాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు రిట్ పిటిషన్ దాఖలు చేయాలని, పిల్‌ను విచారించడానికి వీల్లేదని పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం కల్పించుకుని.. సాంకేతిక కారణాలతో అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని, ఒక ఇంటి నిర్మాణానికి అనుమతి పొందిన ప్లాన్‌లో మార్పు చేసి నిర్మాణం చేస్తే నోటీసు కూడా ఇవ్వకుండా ఏ చట్టం కింద కూల్చేస్తారని, ప్రభుత్వమూ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని చీవాట్లు పెట్టింది. అధికారంలో ఉన్నామని ఏకపక్షంగా అధికారాలను చెలాయిస్తామంటే ఎలాగని ప్రశ్నించింది. అయితే ఇటీవల అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆందోళన వెలిబుచ్చిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ గుర్తు చేయగా.. అది నిజమేనని, అయితే ఏకపక్షంగా నోటీసు కూడా ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలతోపాటు అనుమతి పొంది.. ప్లాన్ డీవియేట్ అయ్యే నిర్మాణాలను కూడా కూల్చేసే అధికారాలను మున్సిపల్ కమిషనర్లకు ఇస్తారా అని ప్రశ్నించింది. ఈ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని, దీన్ని మరో రెండేళ్ల వరకు ఏర్పాటు చేయకపోతే ఇళ్ల నిర్మాణాల వివాదాలను ఎదుర్కొనే వాళ్ల పరిస్థితి ఏం కావాలని నిలదీసింది. -
ఈ చట్టం ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం
సాక్షి, మెదక్: కొత్త మున్సిపల్ చట్టం ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రమని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దీనిపై అందరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఆయన పర్యటించారు. అనంతరం స్థానిక పిల్లల పార్కులో ఏర్పాటు చేసిన సభలో హరీశ్ మాట్లాడారు. ప్రజలకు పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టం తోపాటు పంచాయతీ రాజ్ చట్టాన్ని తెచ్చారన్నారు. ప్రస్తుతం కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. పట్టణాల్లో 75 గజాల లోపు స్థలంలో ఇల్లు నిర్మించేందుకు ఒక రూపాయి చెల్లించి అనుమతి తీసుకోవాలన్నారు. ఇంటికి నల్లా కనెక్షన్ కావాలన్నా ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. 75 గజాల నుంచి 250 గజాల స్థలంలో ఇల్లు నిర్మించే వారు సొంత డిక్లరేషన్ ఇస్తే అనుమతి ఇస్తారన్నారు. ఎవరికీ లంచం ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు. కొత్త చట్టంతో ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీల్లోని వార్డుల్లో హరితహారం కింద నాటిన మొక్కల్లో 85 శాతం బతికే విధంగా కౌన్సిలర్లు కృషి చేయాలని, అలా అయితేనే వారి పదవులు ఉంటాయని లేకపోతే ఊడుతాయని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ అక్షరాస్యత కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘లంచం అడిగితే తాట తీస్తాం..’
సాక్షి, జనగామ: ‘లంచాలను అరికట్టడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చారు.. 600 గజాల లోపు ఇల్లు కట్టుకునే వారు ఆన్లైన్లో సెల్ఫ్ అసెస్మెంట్ ఇస్తే అనుమతి పత్రాలు 21 రోజుల్లో మీ ఇంటికే వస్తాయి. ఎవరినీ అడగక్కరలేదు. ఎవరైనా లంచం అడిగితే తాట తీస్తాం’అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు హెచ్చరించారు. పట్టణ ప్రగతిలో భాగంగా బుధవారం జనగామ మున్సిపాలిటీలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన ‘పట్టణ ప్రగతి’సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. çపట్టణాల్లోని నిరుపేదలకు విడతల వారీగా డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్తామని, ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని, ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేది’కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారంగా పట్టణాల్లో నాటిన మొక్కల్లో 85% బతక్కపోతే కౌన్సిలర్, చైర్మన్ పోస్టులు ఊడుతాయని ఆయన హెచ్చరించారు. ఊరూ రా, పట్టణాల్లో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇళ్లు, కాలనీల్లో మొక్కలు పెంచాలని కోరారు. పుట్టినప్పటి నుంచి కాటికిపోయే వరకు.. పుట్టినప్పటి నుంచి కాటికి పోయే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. పింఛన్లను రెట్టింపు, ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, హాస్టళ్లల్లో చదువుకునే పిల్లలకు సన్న బియ్యం, నాణ్యమైన విద్య అందిస్తున్నామని వివరించారు. ప్రజల మధ్యలో ఉండాలనే కేసీఆర్ మమ్మల్ని జనంలోకి పంపిస్తున్నారని, దళిత కాలనీల్లో పర్యటించాలని చెప్పారన్నారు. పేదల కష్టాలను తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. తడి, పొడి చెత్త సేకరణకు సహకరించాలి తడి, పొడి చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరా రు. తడి చెత్తను కరెంటు ఉత్పత్తి కోసం, పొడి చెత్తతో ఎరువు తయారు చేసి రైతులకు వినియోగిస్తామన్నారు. సిరిసిల్లలో పొడి చెత్తతో మెప్మా మహిళలు నెలకు రూ.2.50 లక్షల ఆదాయం పొందుతున్నారు.. చూడటానికి బస్సు తీసుకొని సిరిసిల్లకు రావాలని కోరారు. కేసీఆర్‌కు మొక్కలంటే మహా ఇష్టమని, జనగామ పక్కనే ఉన్న సిద్ధిపేట నియోజకవర్గంలో 1985–86 ప్రాంతంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్ ఆ కాలంలోనే హరిత సిద్ధిపేట కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ కె.నిఖిలతో కలసి జనగామ మున్సి పాలిటీల్లోని 13, 30 వార్డుల్లోని అంబేడ్కర్ కాలనీల్లో గడపగడపకు వెళ్లారు. నమస్తే అమ్మా.. నీ పేరేంటి తల్లీ.. పింఛన్ వస్తుందా.. అంటూ వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. -
ఇక కలెక్టర్.. ‘పవర్ఫుల్’
సాక్షి, హైదరాబాద్: పురపాలనలో కలెక్టర్లకు సంపూర్ణ అధికారాలు ఇక సంక్రమిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్ చట్టంలో వారి అధికారాలను ప్రభుత్వం స్పష్టం చేయగా, ఏ అంశంలో ఎలాంటి అధికారాలున్నాయనే దానిపై మున్సిపల్ శాఖ చట్టంలోని అంశాలను ఉటంకిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటివరకు మున్సిపల్ వ్యవహారాల్లో కలెక్టర్ల పాత్ర, జోక్యం నామమాత్రంగానే ఉండగా, ఇక నుంచి పట్టణ పాలనలో వారే కీలకం కానున్నారు. వీరి కనుసన్నల్లోనే బడ్జెట్ తయారీ నుంచి ప్రభుత్వ పథకాల అమలు, విధాన నిర్ణయాలు జరగనున్నాయి. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలను తమ నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు పట్టణాభివృద్ధికి చెందిన అన్ని కీలకాంశాల్లోనూ కలెకర్లే సూపర్‌బాస్‌లుగా వ్యవహరించనున్నారు. భవన నిర్మాణ అనుమతుల నుంచి... పట్టణ ప్రాంతాల్లో ముఖ్య సమస్యలైన భవన నిర్మాణం, లేఅవుట్ల ఏర్పాటు, అనధికార భవనాల గుర్తింపు, ట్రాఫిక్ నిర్వహణ లాంటి అంశాల్లో టౌన్‌ప్లానింగ్ విభాగం ఇప్పటివరకు కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక నుంచి వీటన్నింటిలో కలెక్టర్లు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోనున్నారు. భవన నిర్మాణ అనుమతులకు గాను వారే స్వీయ నిర్ధారిత అఫిడవిట్ ద్వారా నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన జరపనున్నారు. గతంలో 500 చదరపు మీటర్ల వైశాల్యం, 10 చదరపు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉండే భవన నిర్మాణాల కోసం మున్సిపాలిటీతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, ఇప్పుడు సింగిల్‌విండో విధానంలో 21 రోజుల్లో అనుమతులిచ్చే అధికారం కలెక్టర్లకు దఖలు పడుతోంది. కలెక్టర్లు చైర్మన్లుగా ఉండే కమిటీ ఈ అనుమతుల విధానాన్ని టీఎస్ఐపాస్ తరహాలో పరిశీలించనుంది. ఇక, అనధికార భవన నిర్మాణాలపై కలెక్టర్లకు గతంలో స్పష్టమైన అధికారాలు లేకపోగా, ఇక నుంచి వాటిని గుర్తించి కూల్చివేయడం, సదరు యజమానికి పెట్టుబడిలో 25 శాతం జరిమానా విధించే అధికారాన్ని సెక్షన్ 180 ద్వారా కలెక్టర్లకు ఇచ్చారు. వారి నేతృత్వంలో ఏర్పాటయ్యే జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ ఈ అంశాలను పర్యవేక్షించనుంది. పుర పౌరుల నుంచి ఫిర్యాదులు వచ్చిన ఏడు రోజుల్లోపు అనధికార భవన నిర్మాణాలపై చర్యలు తీసుకునే అధికారం సెక్షన్ 174(5) ద్వారా కలెక్టర్లకు దఖలు పరిచారు. కమిషనర్ల విధులన్నీ పర్యవేక్షించాల్సిందే పురపాలనకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లు నిర్వహించే విధులన్నింటినీ పర్యవేక్షించడంతో పాటు వాటినీ సంపూర్ణంగా కలెక్టర్లే నియంత్రించనున్నారు. మున్సిపాలిటీలు, ఇతర పట్టణ స్థానిక సంస్థల అన్ని విధులను కూడా పర్యవేక్షించడంతోపాటు ప్రతి పట్టణాన్ని మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దే బాధ్యత కలెక్టర్లదే. పాలకవర్గాలు చేసే ప్రతి తీర్మానాన్ని పరిశీలించడం, పాలకవర్గ సభ్యుల ప్రవర్తనను బట్టి వారిని సస్పెండ్ చేయడం, మున్సిపాలిటీల చైర్పర్సన్లకు సూచనలు, సలహాలివ్వడం, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం, గతంలో పాలకవర్గాలు చేసిన ఏదైనా చర్యను పునఃసమీక్షించడం, చైర్పర్సన్లు, కమిషనర్లను వివరణలు కోరడం, మున్సిపాలిటీలిచ్చిన లైసెన్సులను రద్దు చేయడం. స్క్వాడ్ల ఏర్పాటు లాంటి అన్ని అంశాల్లో కలెక్టర్లకు విశేష అధికారాలిచ్చారు. వీటన్నిటినీ మున్సిపల్ చట్టంలోనే పేర్కొన్నప్పటికీ ప్రస్తుత చట్టం ద్వారా ఎలాంటి అధికారాలు సంక్రమించాయనే దానిపై అంశాల వారీ నివేదికను తాజాగా తయారు చేసింది. ఆ అంశాలనే ఇటీవల పురచట్టం–పట్టణ ప్రగతిపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ కూడా వివరించారు. -
పైసా లంచం తీసుకోవద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజల కోణంలో నుంచి ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్.. పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. శుక్రవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మున్సిపల్ చట్టం, పట్టణ ప్రగతిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల ప్రాంతం జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని ఎప్పుడూ అనుకోలేదని.. చిన్న కార్యాలయం అక్కడ ఏర్పాటు చేయాలన్నా యుద్ధం చేయాల్సివచ్చేందన్నారు. నాలుగేళ్లలో ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గతంలో కలెక్టర్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌తో పెద్దగా సంబంధాలు ఉండేవి కావని.. సీఎం కేసీఆర్ నిర్ణయం పరిస్థితిని సమూలంగా మార్చిందని చెప్పారు. ప్రజలు గొంతెమ్మ కోరికలేమి కోరడం లేదు.. ప్రతిపౌరుడు కోరుకునేలా రోడ్లు, మౌలిక సదుపాయాలు అందించాలన్నారు. సీఎం కేసీఆర్ కోరుకునే విధంగా పచ్చదనాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రజలకు ప్రణాళికబద్ధమైన ప్రగతిని అందించాలన్నారు. ప్రజలు అసాధారణమైన గొంతెమ్మ కోరికలేమి కోరడంలేదని.. వ్యవస్థీకృత పట్టణాలను కోరుకుంటున్నారని తెలిపారు. దీర్ఘకాలిక అభివృద్ధి కనిపించేవిధంగా పట్టణాల రూపురేఖలను మార్చాలన్నారు. ప్రజా ప్రతినిధులను పదవి నుంచి తొలగించే అసాధారణ బాధ్యతను సీఎం కేసీఆర్ మున్సిపల్ చట్టం ద్వారా కల్పించారని వెల్లడించారు. టీఎస్ ఐ పాస్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు.. టౌన్ ప్లానింగ్ విషయంలో సీరియస్ గా ఉండాలని.. అత్యుత్తమ పట్టణాలను రూపొందించాలని సూచించారు. టీఎస్ ఐ పాస్ గురించి ఎక్కడికి వెళ్లినా గొప్పగా మాట్లాడుకుంటున్నారని.. టీఎస్ బీ పాస్‌ను ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. మార్చి నెలలో టీఎస్ బీ పాస్ లో ఉన్న అన్ని లోటు పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. టీఎస్ బీ పాస్ పై అన్ని స్థాయిల అధికారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పైసా లంచం లేకుండా ఇంటి అనుమతులు ఇవ్వాలని..75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. టీఎస్ బీ పాస్, మీ సేవాతో పాటు మరో కొత్త యాప్‌ను తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ మూడు ప్రక్రియల ద్వారా లేదా నేరుగా మున్సిపల్ అధికారులకు కలవడం ద్వారా ఇంటి నిర్మాణ అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు. -
పవర్ఫుల్ సర్పంచ్
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ దిశగా సర్పంచులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పచ్చదనం, పారిశుధ్యాన్ని పెంపొందించే బాధ్యతలను వారికే అప్పగించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా అత్యవసర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కట్టబెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. అత్యవసర సమయాల్లో సర్పంచులు తీసుకున్న నిర్ణయాలను తదుపరి పంచాయతీ సమావేశాల్లో ఆమోదం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారని తెలిపారు. సర్పంచులు ఆయా గ్రామాల్లోనే నివాసం ఉండాలని తీర్మానించారన్నారు. ఇందుకు అనుగుణంగా పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. అవినీతికి పాల్పడితే వేటే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి చర్యలకు పాల్పడినట్లు రుజువైన వారిపై అనర్హత వేటుతోపాటు మూడేళ్లు జైలు శిక్ష విధించేందుకు వీలుగా చట్టంలో సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. అవినీతికి పాల్పడ్డారని గెలిచిన తర్వాత రుజువైతే కూడా అలాంటి వారిపై అనర్హత వేటు పడుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కువ కాలం ఉంటే అధిక ధన వ్యయం, మద్య ప్రవాహానికి ఆస్కారం ఉంటుందని.. కాలపరిమితిని 13 రోజులకు కుదించాలని నిర్ణయించిందన్నారు. గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను పూర్తిగా ఆ వర్గాల వారికే కేటాయిస్తారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఉన్న 24 రోజుల కాలపరిమితిని 15 రోజులకు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మున్సిపల్ చట్ట సవరణకు కేబినెట్ అంగీకరించిందన్నారు. పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకూ వర్తింప చేస్తారన్నారు. మండలి నిర్ణయాలను మంత్రి ఇంకా ఇలా వివరించారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కౌన్సిల్ ఏర్పాటు రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కౌన్సిల్ ఏర్పాటు. వ్యవసాయ, ఉద్యానవన విద్యా సంస్థలను పర్యవేక్షించడంతోపాటు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. నియమ నిబంధనలు పాటించే కళాశాలలకు ఈ సంస్థ గుర్తింపు ఇస్తుంది. నకిలీ సర్టిఫికెట్ల నిరోధంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తుంది. వ్యవసాయ రంగంలో ఉత్తమ పద్ధతులకు మరింత తోడ్పాటు అందిస్తుంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, ఎగుమతుల ప్రోత్సాహం వంటి విధానాలకు ఈ కౌన్సిల్ ఒక రెగ్యులేటర్‌గా పని చేయనుంది. వ్యవసాయ, ఉద్యానవన విద్యపై నియంత్రణ, పర్యవేక్షణ, ఉత్తమ విద్యను అందించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం. ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ సంస్థలకు పబ్లిక్, ప్రవేట్ విభాగాల్లో పనితీరు మెరుగు పరిచేందుకు కృషి చేస్తుంది. పండ్లు, పూల తోటలకు ఇచ్చే పరిహారం పెంపు రాష్ట్రంలో భూ సేకరణతోపాటు, నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో పండ్ల తోటలకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దానివల్ల మామిడి, కొబ్బరి, నిమ్మ తదితర పంటలకు ఇచ్చే పరిహారం పెరుగుతుంది. ఇందులో భాగంగా గతంలో రూ.2,600 మాత్రమే ఉన్న మామిడి పరిహారం రూ.7,283కు పెంపు. కొబ్బరి చెట్టుకు రూ.6,090కి పరిహారం పెంపు. గతంలో ఈ మొత్తం కేవలం రూ.2149గా ఉండేది. నిమ్మ పంటకు పరిహారం రూ.1,444 నుంచి రూ.3,210కి పెంపు. మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు పెరుగుతున్న ఖర్చులతో పాటు నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో పండ్ల తోటలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు రాష్ట్రంలో 10 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సొంతంగా ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఏపీ జెన్కోకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందించడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.10 వేల కోట్ల భారం పడుతోంది. దీనికితోడు ఏటా సుమారు 50 వేల కొత్త వ్యవసాయ పంపుసెట్లు ఏర్పాటు అవుతున్నాయి. ఇందుకోసం ఏటా 45 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతోంది. రానున్న రోజుల్లో నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను, ఆక్వా రైతులకు సబ్సిడీపై నిరంతరం విద్యుత్‌ను అందించించేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా 10 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా దాని ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదించింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మెగావాట్‌కు రూ.20 లక్షల వంతున కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తున్న నేపథ్యంలో ఆ వెసులుబాటును వినియోగించుకోనుంది. ఈ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌కు సీఎండీ సహా మరో 18 పోస్టులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిడెట్ ఏర్పాటు రాష్ట్రంలో వివిధ శాఖల వద్ద ఉన్న మిగులు నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ పేరుతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్లో 1992లో ఇలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అది మంచి ఫలితాలు ఇస్తున్నట్లు అధికారులు మంత్రివర్గానికి వివరించారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
కొత్త మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ తెస్తాం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన 68 మన్సిపాలిటీల్లో లేఔట్ల క్రమబద్ధీకరణకు లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) తీసుకొస్తామని, ఆయా మున్సిపాలిటీల్లో ఆదాయం పెంచుకునేందుకు ఎల్ఆర్ఎస్, ఇతర అంశాలను పరిశీలిస్తున్నట్టు మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆస్తి పన్ను హేతుబద్ధీకరణతో పాటు ‘రూం రెంటల్ విధానాన్ని’ సవరించేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. శాసనమండలిలో ఐదు సవరణలతో ప్రవేశపెట్టిన మున్సిపల్ బిల్లును గురించి సభ్యులకు మంత్రి వివరించారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానమున్నా మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అర్హులేనని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు బిల్లులో సవరణ చేసినట్టు ఆనాటి పద్ధతుల ప్రకారం గతంలో తెచ్చిన నిబంధనను కావాలనే తాము మార్చామని, ఈ నిర్ణయాన్ని అనాలోచితంగా తీసుకురాలేదని స్పష్ట్టం చేశారు. దీనిపై పునరాలోచించి, ఇద్దరు పిల్లల పరిమితిని కొనసాగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. ఈ బిల్లుపై అనుమానాలున్నాయని, కలెక్టర్లకు అధికంగా అధికారాలు కట్టబెట్టడం సరికాదన్నారు. అర్థం చేసుకుని బరిలో దిగాలి కొత్తగా తీసుకొచ్చిన మున్సిపల్ బిల్లులో అనేక కఠిన నిబంధనలు, తొలగింపుతో పాటు ఇతర చర్యలు తీసుకునే అవకాశమున్నందున ఎన్నికల్లో పోటీ చేసే వారు వాటిని జాగ్రత్తగా చదవుకుని బరిలో దిగాలని కేటీఆర్ సూచించారు. తప్పు చేసిన ప్రజాప్రతినిధులను తొలగించే పనిని మొదలుపెట్టేపుడు ముందుగా టీఆర్ఎస్ వారి నుంచే మొదలుపెడతామన్నారు. వాటి తొలగింపునకు సహకరించాలి.. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై ఏర్పాటు చేసిన ప్రార్థనా మందిరాలు, ప్రముఖ నేతల విగ్రహాలను తొలగించే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తే పని సులువవుతుందని కేటీఆర్ చెప్పారు. మతం అనేది సున్నితమైన అంశమైనందున హైదరాబాద్‌లో దీన్ని చేపట్టే విషయంలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్సీ, బీజేపీకి చెందిన హోంశాఖ సహాయ మంత్రి, ఎమ్మెల్సీ ముందుకొస్తే బావుంటుందన్నారు. తాము ఏ మున్సిపల్ కౌన్సిల్‌ను ముందుగా రద్దు చేయడం లేదని స్పష్టంచేశారు. ఈ చర్చలో సభ్యులు అమీనుల్ జాఫ్రీ, భానుప్రసాద్, ఉల్లోళ్ల గంగాధరగౌడ్, ఎన్.రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి.జీవన్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, అటుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ బిల్లుకు కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. -
మున్సిపల్ చట్టం ఆమోదానికి గవర్నర్ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ నూతన మున్సిపల్ చట్టం ఆమోదానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బ్రేక్ వేశారు. చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కొన్ని అంశాలపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా మున్సిపల్ చట్టానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులో కలెక్టర్లకు ప్రజా ప్రతినిధులను తొలగించే అధికారంపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికలు తేదీలను కూడా ప్రభుత్వమే నిర్ణయించడంపై అభ్యంతరం చెబుతూ బిల్లును వెనక్కి పంపారు. గవర్నర్ చేసిన సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేసింది. కాగా కొత్త మున్సిపల్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల ఉమ్మడి భాగస్వామ్యంతో మున్సిపల్‌పాలనను పరుగులు పెట్టించేలా ఈ చట్టాన్ని రూపొందించింది. ఓవైపు బాధ్యతలను గుర్తు చేస్తూనే మరో వైపు సంస్కరణలను ప్రవేశపెడుతూ రూపొందించిన ఈ చట్టంలో జిల్లా కలెక్టర్లను సూపర్‌బాస్‌లను చేసింది. మున్సిపల్‌పగ్గాలన్నీ వారికే అప్పగించి ప్రజాప్రతినిధుల పనితీరుపై ఓ కన్నేసి ఉంచేలా నిబంధనలను తీసుకొచ్చింది. చదవండి: జవాబుదారిలో భారీ మార్పులు తేడా వస్తే చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులను సస్పెండ్ చేసే అధికారాలను కట్టబెట్టింది. హరిత మున్సిపాలిటీల కోసం బడ్జెట్లో 10% నిధులను ప్రత్యేకంగా కేటాయించడంతో పాటు.. నాటిన వాటిలో 85% మొక్కలు బతక్కపోతే సంబంధిత వార్డు మెంబర్, అధికారిపై కొరడా ఝళిపించనుంది. పాలకవర్గాలకు ఎన్నికలు, వాటి పనితీరు సమీక్ష, పాలన పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక నియమ నిబంధనలు, ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్ రూల్స్, నైపుణ్య పెంపుదల కోసం స్వయం ప్రతిపత్తితో కూడిన సంస్థ ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ బోర్డుల ఏర్పాటు వంటి అంశాలతో శాసనసభ, మండలి ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే. మరోవైపు నూతన పురపాలక చట్టంపై విపక్షాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. -
‘కొత్తగా సీఎం అయినట్లు మాట్లాడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ఇప్పుడే కొత్తగా సీఎం అయి నట్లుగా మాట్లాడుతున్నారని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. వచ్చేనెల 15 తర్వాత అసలు పాలన ఉంటుంది అంటే మరి ఐదేళ్ల 6 నెలల పాలన నకిలీ పరిపాలనా? అని ప్రశ్నించారు. మున్సిపల్ చట్టంలో రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా బిల్లులో చాలా అంశాలున్నాయన్నారు. ‘మున్సిపల్ శాఖలో అవినీతి పెరిగి పోయిందని సీఎం అన్నారు. ఒక్క మున్సిపల్ శాఖలో కాదు అన్నింటిలోనూ అవి నీతి ఉంది’ అని శనివారం విలేకరులతో మాట్లాడు తూ స్పష్టంచేశారు. ఈఎస్ఐలోనూ అవినీతి జరిగిం దని మండిపడ్డారు. వీటన్నింటిపైన సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని, ఏసీబీకి పూర్తి అధికారాలు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించా రు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం సీఎంకి ఉందా అని సవాలు విసిరారు. -
ఎగిరే పార్టీకాదు.. నిలదొక్కుకునే పార్టీ..
సాక్షి, హైదరాబాద్ : ఆగస్టు తర్వాత అసలైన పరిపాలన ఉంటుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ఇన్నాళ్లు చేసింది నకిలీ పరిపాలనా అనుకోవాలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడే ముఖ్యమంత్రి అయినట్లు అసెంబ్లీలో మాట్లాడటం ఆశ్చర్యం కలిగించిందని, మున్సిపల్ చట్టం సవరణ రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచేలా ఉందన్నారు. బిల్లులోని అంశాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని విమర్శించారు. శనివారం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై ధ్వజమెత్తారు. అవినీతి పెరిగిపోయింది.. ‘మున్సిపల్ శాఖతో పాటు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయింది. అన్నిటిపైనా ఉన్నత స్థాయి విచారణ జరుగుతున్న ఎందుకు నోరు విప్పలేదు. గొర్రెల పంపిణీ కోసం రూ.4వేల కోట్లు ఇస్తే అందులోనూ అవినీతి చోటుచేసుకుంది. వాణిజ్య పన్నులు.. ఇసుక రవాణ వంటి శాఖల్లో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం కేసీఆర్ కు ఉందా? ఈ అవినీతిపై ప్రభుత్వానికి అన్ని వివరాలు తెలుసు. లంచం అడిగితే చెప్పుతో కొట్టమని చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాటకు కట్టుబడి ఉన్నారా? తాజా మున్సిపల్ చట్టంతో అధికారం తనగుప్పెట్లో పెట్టుకొని ప్రతిపక్ష సభ్యులపై కక్ష్య సాదింపుకోసం వినియోగించుకునే ప్రమాదం ఉంది. వార్డుల విభజన.. రిజర్వేషన్లలో అక్రమంగా ప్రభుత్వానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. హైకోర్టు మందలించినా కేసీఆర్‌కు పట్టడం లేదు. త సమయం గడిస్తే అంత ఇబ్బంది కలుగుతోందని.. ఎన్నికల నిర్వహణకోసం తొందరపడుతున్నారు. ఎగిరే పార్టీకాదు నిలదొక్కుకునే పార్టీ.. మున్సిపల్ బిల్లుపై కార్యాచరణ సిద్దం చేసి లోపాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం. కేటీఆర్ వ్యాఖ్యలు అహంకార పూరితంగా ఉన్నాయి. ప్రజాతీర్పును అపహాస్యం చేయడం తగదు. బీజేపీ ఎగిరే పార్టీకాదు లదొక్కుకునే పార్టీ. ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న పార్టీ. బీజేపీ గురించి చాలా చులకనగా మాట్లాడారు. ఇప్పడు బీజేపీ అంటే భయపడుతున్నట్టు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన మార్పును జీర్ణించుకోలేక పోతున్నారు. టీఆర్ఎస్ గాలి బుడగ లాంటి పార్టీ.. పునాదిలేని భవంతిలాంటిది.. తండ్రీ కొడుకుల పార్టీ. బీజేపీకీ మీరు చెప్పాల్సిన పనిలేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. గ్రామాల్లో యువత స్వచ్చందంగా వచ్చి పార్టీలో చేరుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నాం. ఇందుకోసం 17 ఎంపీ స్థానాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి రంగంలోకి దిగుతాం. 25, 26న మున్సిపాలిటీల్లో డబల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తులు తీసుకుంటాం. 30న మున్సిపాలిటీల్లో అవినీతిపై నిరసన కార్యక్రమాలు చేపడతాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయి. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు మరోలా ఉండేవి.’ అని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. -
మున్సిపల్ చట్టం.. బీసీలకు నష్టం
సాక్షి, హైదరాబాద్: కొత్త మున్సిపల్ చట్టంపై విపక్ష పార్టీల సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చట్టం వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని, బీసీల రాజకీయ భవిష్యత్తు మరింత ఆందోళనకరంగా మారుతుందని మండిపడ్డారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం మండలిలో మున్సిపల్ చట్టం–2019ను మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం ఈ చట్టంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడారు. పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను భారీగా కుదించారని, దీంతో స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం బాగా తగ్గిందన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటూ నూతన చట్టంపైనే మాట్లాడాలన్నారు. ఈ క్రమంలో జీవన్‌రెడ్డి మండలి నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ నూతన చట్టంలో కొన్ని సవరణలు చేయాలని బీజేపీ తరఫున ప్రభుత్వానికి సూచించినా స్పందన లేదన్నారు. పాలనా సౌలభ్యం కోసం రాజధాని చుట్టూ కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన మున్సిపల్ చట్టం ఆమోదం తర్వాత మండలి చైర్మన్ సభను నిరవదికంగా వాయిదా వేశారు. -
అశాస్త్రీయంగా మున్సిపల్ చట్టం
సాక్షి, హైదరాబాద్: అశాస్త్రీయంగా రూపొందించిన మున్సిపల్ చట్టాన్ని ఆమోదించవద్దని, దానిని వెనక్కి తిప్పి పంపాలని బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ, నేతలు డీకే అరుణ, టి.చంద్రశేఖర్‌రావు, విజయరామారావు, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తదితరులు గవర్నర్‌ను కలిశారు. చట్టంలో లోపాలను పేర్కొంటూ నివేదికను అందజేశారు. ఈ చట్టం ఎన్ని కల సంఘం అధికారాలను హరించేలా ఉందని, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగించారని, అది సరికాదని, చట్టానికి సవరణలు అవసరమని పేర్కొన్నారు. ఏడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంలో శాస్త్రీయత, సరైన ప్రాతిపదిక, విధానం లేదని తెలియజేశారు. ప్రజల జీవన విధానానికి విఘాతం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన అన్ని మున్సిపాలిటీలు నిన్నటి వరకు గ్రామ పంచాయితీలుగానే ఉన్నాయని, అక్కడి రైతులు, కార్మికులు, కూలీలు, కుల వృత్తులు, గ్రామీణ జీవన విధానం ఆయా గ్రామాలలో ఇంకా సజీవంగా ఉన్నాయని బీజేపీ నేతలు తెలిపారు. ఆర్థిక వనరులు, పన్నుల విధానం ఇంకా కుదుటపడలేదని, మున్సిపల్ జీవనవిధానానికి ప్రజలు ఇంకా అలవాటు పడలేదని, అప్పుడే మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. ఆయా గ్రామాలలో ప్రజలు ఇళ్లు నిర్మించుకోవాలంటే ఇక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగాల్సి వస్తుందని, ఆస్తి పన్ను, వృత్తిపన్ను, తాగునీటి పన్ను, గృహనిర్మాణ అనుమతి చార్జీలు పెరిగి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని వివరించారు. మున్సిపాలిటీల ఏర్పాటులోనూ శాస్త్రీయత లోపించిదని పేర్కొన్నారు. పాలకవర్గాల కాలపరిమితి ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో రిట్ వేసిందని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కౌంటర్ అఫిడవిట్లో ఎన్నికల ముందు ప్రక్రియకు 141 రోజులు అవసరం ఉంటుందని రాసిందని వివరించింది. అయితే ఎన్నికల ముందు ప్రక్రియను 119 రోజులకు కుదిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ ఆ ప్రక్రియను హడావిడిగా మూడు వారాలోపే పూర్తి చేస్తూ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ఎన్నికల సంఘంపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని వివరించారు. దీనివల్ల వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ ఓటర్ల గుర్తింపు , వార్డుల వారి ఓటర్ల లిస్టుల తయారీ, రిజర్వేషన్లు అన్నింటి విషయాలలో అవకతవకలు, అక్రమాలు, తప్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. -
సర్జరీ జరూర్.. తప్పు చేస్తే తప్పదు దండన
ఈ రోజున్న పరిస్థితుల్లో అక్రమాలను అరికట్టాలంటే ట్యాబ్లెట్‌తోనో, టానిక్‌తోనో సాధ్యమయ్యేలా లేదు. శస్త్రచికిత్స అవసరముంది. అందుకే కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా తెస్తున్నం. ఇందులో ప్రతి వాక్యం నేను రాయించిందే. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించాల్సిందే. లేకుంటే వారి ఉద్యోగాలు పోతాయ్. ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సిందే. నియంత్రణ కోసమే.. ఇంట్లో తల్లి పిల్లలను అనురాగంతో గారాబంగా పెంచుతది. అదే తల్లి చికాకు కలిగిస్తే చెంప మీద చెల్లుమని కొడ్తది. పద్దతి ప్రకారం ఉండాలని కొడ్తది. ప్రభుత్వం కూడా అట్లనే. ఉద్యోగం ఊడుద్ది.. వార్డులో మొక్కలను సంరక్షించే బాధ్యత ఆ వార్డు కౌన్సిలర్‌ది. ప్రతివార్డుకు ఒక మున్సిపల్ ఆఫీసర్‌ను నియమిస్తారు. 85 శాతం మొక్కలు బతకపోతే కౌన్సిలర్ పదవి, ఇన్చార్జీ అధికారి ఉద్యోగం పోతది. రియల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్నెల్ల నుంచి వరుసగా ఎన్నికలొచ్చాయి. ఆగస్టు ఐదో పదో 15 తారీఖుకు మునిసిపల్ ఎన్నికలు అయిపోతయి. 15 నుంచి రియల్ టైం అడ్మినిస్ట్రేషన్ చూపిస్తం. అద్భుతమైన పరిపాలన సంస్కరణలు తీసుకొస్తం. ఒక్కరితో కాదు.. ఒక కేసీఆరో ఒక మున్సిపల్ మంత్రో ఎమ్మెల్యేనో పనిచేస్తే కాదు. ఏ ఊరి సర్పంచ్ ఆ ఊర్లో పనిచేయాలి. బహుముఖంగా పనిచేయాలి. కాని ఏకముఖంగా ఒక వ్యక్తి పనిచేస్తే జరిగే పనికాదు. 25 రెట్లు జరిమానా.. స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆస్తి పన్నుల మదింపు విధానం పెట్టినం. మున్సిపల్ సిబ్బంది ఏ ఇంటి కొలతలు స్వీకరించరు. ఏ ఇంటి యజమాని స్వయంగా తన ఇళ్లు ఇన్ని చదరపు గజాలుందని స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటది. తప్పుడు ధ్రువీకరణ ఇస్తే 25 రేట్లు జరిమానా వేస్తం. సాక్షి, హైదరాబాద్ : ‘ఈ రోజున్న పరిస్థితుల్లో అక్రమాలను అరికట్టాలంటే ట్యాబ్లెట్‌తోనో, టానిక్‌తోనో సాధ్యమయ్యేలా లేదు. శస్త్రచికిత్స అవసరముంది. అందుకే కొత్త మున్సిపల్ చట్టంలో కఠినమైన నిబంధనలు తెస్తున్నాం. కొంత కాఠిన్యం ఉంటేకాని పనులు జరగవు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి అవగాహనతో పూర్తి స్పష్టతతో లక్ష్యాలు నిర్దేశిం చుకుని స్పష్టమైన గమ్యాన్ని ఆశించి ఈ చట్టాన్ని పెడుతున్నా. ఇందులో ప్రతి వాక్యం నేను రాయిం చిందే. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించాల్సిందే. లేకుంటే వారి ఉద్యోగాలు పోతాయ్. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సిందే’అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ‘పారదర్శకత తేవడం, మున్సిపల్ వ్యవస్థను అనినీతి రహితం చేయడమే కొత్త మున్సిపల్ చట్టం పరమార్థం. ఈ రోజు మున్సిపాలిటీల్లో ఎలాంటి పరిస్థితి నెలకొని ఉందో, ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటో మనందరికీ తెలుసు’అని ఆయన అన్నారు. కొత్త మున్సిపల్ చట్టం ఉద్దేశ్యాలు, లక్ష్యాలను వివరిస్తూ శుక్రవారం రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. పదవులు, ఉద్యోగాలు గల్లంతే! ‘పట్టణాల్లో, గ్రామాల్లో పచ్చదనం పెరిగి తీరాలి. మొక్కలు పెంచమని ఇప్పటి వరకు గడ్డాలు పట్టి బతిమాలినం. ఇక బతిమాలం. పంచాయతీరాజ్ చట్టంలో బలమైన నిబంధనలు పెట్టినం. కొత్త పంచాయతీ కార్యదర్శులకు మొత్తం జీతం కాకుండా రూ.15 వేలే జీతం పెట్టినం. మూడేళ్లు ఆయన గ్రామంలో బాగా చేసి, 85% పచ్చదనం తీసుకొస్తే ఆయన పర్మినెంట్ అవుతడు. లేకుండా ఇంటికిపోతడు. పచ్చదనం, పారిశుద్ధ్యం సర్పంచ్ బాధ్యత కూడా. విస్మరిస్తే ప్రభుత్వం ఒప్పుకోదు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌గారి పదవి పోతది. ఇప్పుడు చెట్లు ఎలా పెరగవో మేమూ చూస్తం. ఇక చెట్లు పెరుగుతయి. లేకుంటే ఆయన (పంచాయతీ సెక్రటరీ) ఉద్యోగం పోతది. ఈయన (సర్పంచ్) పదవి పోతది’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సర్పంచ్‌ను కలెక్టర్లు సస్పెండ్ చేస్తే మంత్రి స్టే ఇచ్చే విధానాన్ని తొలగించామన్నారు. పాలనలో సాంకేతిక పరిజ్ఞానం వీలైనంత ఎక్కువగా వినియోగించడం, సేవలకు నిర్ణీత గడువు పెట్టుకోవడం, తప్పుడు ధ్రువీకరణ ఇచ్చినవారి మీద భారీగా జరిమానాలు విధించడం వంటివి కొత్త చట్టంతో జరుగుతాయన్నారు. ‘మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరూ ఈ చట్టాన్ని చదువుకోవాలి. ఇష్టం లేకుంటే పోటీ చేయొద్దు’అని సీఎం సూచించారు. ‘ఇంట్లో తల్లి పిల్లలను అనురాగంతో గారాబంగా పెంచుతది. తినకపోతే చందమామను చూపించి ఇంకో ముద్ద తినిపిస్తది. అదే తల్లి ఎక్కువ చికాకు కలిగిస్తే చెంప మీద చెల్లుమని కొడ్తది. ఆ పిల్లగాడికి దెబ్బతగలాలని కొట్టదు. నియంత్రణలో, పద్దతిప్రకారం ఉండాలని కొడ్తది. ప్రభుత్వం కూడా అట్లనే’అని కేసీఆర్ ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ శాఖలు, కొన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్ఓడీ కార్యాలయాలు కరెంట్ బిల్లులు కట్టట్లేదని, ఇకపై కరెంటు బిల్లు, నీటి బిల్లులను నెలనెలా కట్టాలన్నారు. లేదంటే సంబంధిత మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఊడడం ఖాయమన్నారు. కౌన్సిలర్దే బాధ్యత! ‘జిల్లా కలెక్టర్ చైర్మెన్‌గా పచ్చదనం కమిటీలు ఏర్పాటు చేస్తున్నం డీఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్లతో ఉండే ఈ కమిటీ ఏ వార్డులో ఎన్ని మొక్కలు పెట్టాలో నిర్ణయిస్తది. ఆ వార్డులో మొక్కలను సంరక్షించే బాధ్యత ఆ వార్డు కౌన్సిలర్‌ది. ప్రతివార్డుకు ఒక మున్సిపల్ ఆఫీసర్‌ను నియమిస్తారు. 85% మొక్కలు బతక్కపోతే కౌన్సిలర్ పదవి, ఇన్చార్జీ అధికారి ఉద్యోగం పోవడం ఖాయం. సస్పెన్షన్ కాదు.. సర్వీస్ నుంచి తొలగిస్తాం. 60ఏళ్ల అనుభవం ఏం చెబుతోంది. అడవులు ఎందుకు తరిగిపోయాయి? మనమందరం చూస్తుండగానే అడవులు మాయమవుతున్నాయి. మూడేళ్లలో తెలంగాణలో అద్భుతం జరిగిపోతది. అందుకే ఈ కఠిన నిబంధనలు తెచ్చినం. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్పర్సన్ కూడా దీనికి అతీతం కాదు. ఎవరికి వారు స్వయ నియంత్రణపెట్టుకుని నా వార్డు కోసం, నా పట్టణం కోసం నా ప్రజల కోసం పనిచేయాలనుకుని పని చేయకపోతే ఈ దేశం బాగుపడదు. ఓ కేసీఆరో, ఓ మున్సిపల్ మంత్రో, ఓ ఎమ్మెల్యేనో పనిచేస్తే కాదు. ఏ ఊరి సర్పంచ్ ఆ ఊర్లో పనిచేయాలి. ఏ వార్డు కౌన్సిలర్ ఆ వార్డులో పనిచేయాలి’అని కేసీఆర్ తెలిపారు. పేదల ఇళ్లకు అనుమతి అవసరం లేదు పట్టణ నిరుపేదలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. 75 చదరపు గజాల వరకు నిర్మిత స్థలంలో జీ+1 (గ్రౌండ్ ఫ్లోర్+ఒకటో అంతస్తు) ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదని ప్రకటించారు. దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.. ఒక్క రూపాయి రుసుం చెల్లించి మున్సిపాలిటీలో ఇంటిని నమోదు చేసుకోవాలని, దీంతో గ్యాస్ కనెక్షన్, రేషన్‌కార్డు, ఇంటి నంబర్, నల్లా కనెక్షన్ వంటి సదుపాయాలు సులువుగా పొందవచ్చునన్నారు. మున్సిపల్ రికార్డుల్లో ఇల్లు నమోదై ఉంటే వీరికి లబ్ధి చేకూర్చడంæ.. ప్రభుత్వ యంత్రాంగానికి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సులువవుతుందన్నారు. వీరి నుంచి ఏడాదికి రూ.100 ఆస్తి పన్ను మాత్రమే వసూలు చేస్తామన్నారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సీహెచ్ మల్లారెడ్డిల సూచన మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. స్థానిక సంస్థలకు నిధుల వరద పంచాయతీరాజ్ సంస్థలకు తరహాలోనే పురపాలికలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించనున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు మేరకు కేంద్రం నుంచి గ్రామాలకు రూ.1,600 కోట్ల నిధులు వస్తుండగా, సమాన మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు సైతం రూ.1,600 కోట్లు కేటాయించాలని పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలు పొందుపర్చామన్నారు. అదే తరహాలో జీహెచ్ఎంసీతో కలిసి రాష్ట్రంలోని పురపాలికలకు కేంద్రం నుంచి రూ.1,030 కోట్లు నిధులు వస్తుండగా, అంతే మొత్తంలో రూ.1,030 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేలా మున్సిపాలిటీ చట్టంలో నిబంధనలు పొందుపరిచామన్నారు. ఒక ఏడాది పూర్తి స్థాయిలో నిధులు కేటాయించని పక్షంలో వచ్చే ఏడాది బకాయిల రూపంలో చెల్లించేలా పకడ్బందీగా కొత్త చట్టం రూపొందించామన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులు కలిపి ఏటా గ్రామాలకు రూ.3,200 కోట్లు, పట్టణాలకు రూ.2,060 కోట్లు వస్తాయన్నారు. ఈ నిధుల ఖర్చుపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. 500 జనాభా ఉండే చిన్న గ్రామ పంచాయతీకి రూ.5లక్షలకు తగ్గకుండా నిధులొస్తాయని, పెద్ద గ్రామ పంచాయతీలకు కోట్లలో వస్తాయని సీఎం వెల్లడించారు. ఏటా రూ.3వేల కోట్ల జాతీయ ఉపాధి హమీ పథకం నిధులు ఖర్చు చేసే అధికారం పంచాయతీరాజ్ సంస్థల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఇచ్చామన్నారు. నిరంతరం ఉత్తమస్థితి కోసం తపన ‘అత్యుత్తమ స్థితి కోసం తపన (క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్సీ), సంస్కరణలు నిరంతర ప్రక్రియలు. సమస్యలు అనంతమైనవి. మానవజాతి భూగోళంపై ఉన్నంత కాలం మానవ సంబంధ సమస్యలుంటాయి. అత్యుత్తమ స్థితి కోసం తపన కొనసాగుతుంది. తపనతో అత్యుత్తమ స్థితిని చేరుకుంటాం. ఆ తర్వాత మరో తపన ఉంటది. మరో అత్యుత్తమ స్థితి ఉంటది. తపనకు అంతు ఉండదు. అత్యుత్తమ స్థితి ఓ చోట ఆగదు. అమెరికా లాంటి దేశంలో, అభివృద్ధి బాగా జరిగిన యూరోప్ దేశాల్లో కూడా సమస్యలున్నయి. 30 ఏళ్ల కిందటి చట్టం ఇప్పుడు సరిపోకపోవచ్చు. సమకాలిన పరిస్థితికి అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరముంటది. ఆ సోయితోనే – క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్– దిశగా పురపాలికలు పనిచేయాలని కోరుతూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది’అని సీఎం స్పష్టం చేశారు. స్థానిక సంస్థలకు అధికారిలిస్తే ఏం జరిగింది? ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించాం. కొందరికి అభ్యంతరాలుండవచ్చు. కచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్లో కఠినంగా ఉండాల్సిన అవసరముంది. ప్రభుత్వం జిల్లాకు వెళ్లినప్పుడు కేంద్ర బిందువు జిల్లా కలెక్టరేట్. కలెక్టరేట్ పవర్‌ఫుల్‌గా ఉండాల్సిందే. స్థానిక సంస్థల అధికారాలను హరించడమేనని కొందరు కొత్త భాష్యాలు చెబుతున్నరు. ఇప్పటివరకు అధికారాలిచ్చినం. ఏం జరిగింది అధ్యక్షా?’అని సీఎం కేసీఆర్ ప్రశ్నంచారు. నగర శివార్లలోని నిజాంపేట్ గ్రామ పంచాయతీలో అరాచకాలు జరిగాయని, ఇప్పుడు కనీసం ఫైర్ ఇంజన్లు కూడా తిరిగే పరిస్థితి అక్కడ లేదని ఉదాహరణగా చెప్పారు. వరదలొస్తే నిజాంపేటలో సహాయక చర్యలు చేపట్టలేని భయంకర పరిస్థితి ఉందన్నారు. అక్కడున్న ప్రజలకు భద్రత లేదన్నారు. గతంలో దీన్ని మున్సిపాలిటీగా మారిస్తే వెంటనే స్టే తెచ్చుకునేవారన్నారు. శాసనసభలో చట్టం ద్వారా ఇప్పుడు నిజాంపేట్‌ను మున్సిపాలిటీ చేశామన్నారు. హైదరాబాద్ వంటి భారీ పట్టణం చుట్టూ పక్కల విచ్చలవిడిగా అభివృద్ధి జరగకూడదని, నియంత్రణతో జరగాలన్నారు. కఠినంగా ఉంటేనే నియంత్రణ సాధ్యమన్నారు. అన్ని మున్సిపాలిటీలకు సమాన హోదా కొత్త చట్టం రాకతో రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లుంటాయని కేసీఆర్ తెలిపారు. నగర పంచాయతీలు ఉండవన్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ సంస్థలు మాత్రమే ఉంటాయన్నారు. అన్నీ మున్సిపాలిటీలకు సమాన హోదా, నిధులు ఇవ్వడం జరుగుతుందని, అన్నింటికీ ఒకటే చట్టం ఉంటుందన్నారు. కలెక్టర్లకు బాధ్యతతోపాటు విశేషాధికారాలు కల్పించామన్నారు. కలెక్టర్లకు నిధులతో పాటు శక్తివంతమైన అధికారాలిచ్చామన్నారు. ఎన్నికల కమిషన్ అధికారాల్లో జోక్యం చేసుకోం ‘ఎన్నికల తేదీని నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం దగ్గర పెట్టుకుంది. ఎన్నికల సంఘానికి స్వయంప్రతిపత్తి ఉంది. దీన్ని గౌరవించి ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకోం. కేవలం తేదీ వరకు మాత్రమే కలగజేసుకుంటం. ప్రభుత్వం పరిపాలన యంత్రాంగం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వరదలు, కరువులు, ప్రకృతి వైపరీత్యాలు, పండగలు, పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తేదీల వరకు మాత్రమే ప్రభుత్వం చెప్తది. మిగతా విషయాల్లో సర్కారు జోక్యం ఉండదు’అని సీఎం కేసీఆర్ తెలిపారు. జాప్యమైతే అనుమతి వచ్చినట్లే ‘పౌరులకు స్నేహపూర్వక పట్టణ విధానమిది. పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. అనుమతుల కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరముండదు. 500 చదరపు మీటర్ల çస్థలం, 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే కట్టడాల అనుమతి కోసం మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వేధింపులుండవు, మానవ ప్రమేయముండదు. పూర్తిగా ఆన్లైన్లో అనుమతులిస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లయితే ఆన్లైన్లో అనుమతి ఆయన ఇంటికే వెళ్తుంది. దీనికి నిర్ణీత కాలపరితి పెడుతున్నాం. ఆలోగా అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లే భావించి నిర్మాణం ప్రారంభించుకోవచ్చు’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అక్రమ కట్టడాలు ప్రారంభిస్తే కూల్చివేతే! ‘తప్పు చేయకూడదన్న భయం తేవడం కోసం అక్రమ కట్టడాలకు భారీ జరిమానాలు పెట్టాం. అక్రమ కట్టడం నిర్మించడం ప్రారంభిస్తే నోటిసులు ఇవ్వకుండా తక్షణమే కూల్చివేస్తామని చట్టంలో పెట్టాం. ఎంత ఖర్చు పెట్టారో చూడం. అక్రమ కట్టడాలపై చాలా సందర్భాల్లో హైకోర్టు చేసిన వాఖ్యాలతో ప్రభుత్వం తప్పు లేకపోయినా తలదించుకోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్పై హైకోర్టు చేసిన వాఖ్యాలతో తలకొట్టేసుకున్నంత పనైంది. అక్రమ కట్టడాలను రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలో అనుమతించం. తప్పు చేస్తే లాభపడతాం అనే ఉద్దేశం నుంచి తప్పు చేస్తే ఇబ్బందులు తప్పవనే భయం ప్రజల్లో రావాలి’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. స్వీయ ధ్రువీకరణతో ఆస్తి పన్నుల మదింపు ‘స్వీయ ధ్రువీకరణ ద్వారా ఆస్తి పన్నుల మధింపు విధానం తీసుకొచ్చాం. మున్సిపల్ సిబ్బంది ఏ ఇంటి కొలతలూ స్వీకరించరు. ఏ ఇంటి యజమాని స్వయంగా తన ఇళ్లు ఇన్ని చదరపు గజాలుందని స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటది. అయితే ఎప్పుడైనా కలెక్టర్ నేతృత్వంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పరిశీలించినపుడు.. తప్పుడు ధ్రువీకరణ ఇచ్చినట్లు తేలితే 25 రెట్లు జరిమానా వేస్తాం. ప్రజలను నమ్మి విశ్వసించి ఈ నిబంధన పెడుతున్నం. లంచాలకు, వేధింపులకు గురికావద్దని ప్రజలకే అధికారాలిస్తున్నాం. అలాంటప్పుడు అధికార దుర్వినియోగం చేయకూడదు. స్వీయ ధ్రువీకరణను ఓ భగవద్గీత పవిత్ర గ్రంథం అనుకోవాలి. పౌర బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కలెక్టర్లు సులువుగా పర్యవేక్షించగలరు పరిపాలన సంస్కరణలో భాగంగా 33 జిల్లాలు చేసుకున్నం. నా లెక్క ప్రకారం ఇంకొక జిల్లా కూడా ఏర్పడాల్సిఉంది. జనాభా తగ్గాలని హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలు కావాలని నాకుంది. కానీ హైదరాబాద్‌కున్న గొప్పఖ్యాతి, మహత్తును దృష్టిలో ఉంచుకుని నగరాన్ని విడదీయవద్దని అందరూ అనడంతో హైదరాబాద్‌ను అలానే ఉంచాం. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో రెండు, మూడు, నాలుగు మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నాయి. కలెక్టర్లు సులువుగా పర్యవేక్షణ చేయగలరు’అని సీఎం తెలిపారు. ఆగస్టు 15 నుంచి అద్భుత పాలన ‘ఆర్నెల్ల నుంచి వరుసగా ఎన్నికలొస్తున్నాయి. ఆగస్టు ఐదో, పదో, 15 తారీఖునో మున్సిపల్ ఎన్నికలు అయిపోతాయి. ఆగస్టు 15 నుంచి రియల్ టైం అడ్మినిస్ట్రేషన్ చూపిస్తాం. అద్భుతమైన పరిపాలన సంస్కరణలు తీసుకొస్తాం. జిల్లాల్లో పరిపాలన ఎలాగుండాలి? సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చూడాలి? ఉన్న ఐఏఎస్ అధికారులను ఎలా వాడుకోవాలి అన్న అంశాలపై పరిపాలన సంస్కరణల కమిటీ పనిచేస్తోంది. దేశమంతా మన దగ్గర నేర్చుకునేలా అద్భుతమైన పరిపాలన సంస్కరణలు తీసుకొస్తాం’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. -
‘నోటీసులుండవు; అక్రమమైతే కూల్చేస్తాం’
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ చట్టంపై రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ‘పంచవర్ష ప్రణాళికలను ప్రజాప్రతినిధులు అధ్యయనం చేయాలి. మనది బలమైన పునాదులున్న ప్రజాస్వామ్యం. మున్సిపల్ చట్టాన్ని పారదర్శకంగా రూపొందించాం. నిధులు, అధికారాలు మున్సిపాలిటీలకే. కొన్ని అధికారాలను కలెక్టర్లకు కేటాయించాం. ప్రతి మున్సిపల్ వార్డులో ప్రజాదర్బారు ఉంటుంది. అర్బన్ లోకల్ బాడీస్ కూడా పద్ధతిగా ఉండాలి. ప్రతియేడు రూ.3,200 కోట్ల నిధులు గ్రామాలకు వెళ్తాయి. 500 జనాభా ఉండే పంచాయతీకి కనీసం రూ.5 లక్షలు అందిస్తాం. పట్టణాలకు రూ.2,060 కోట్లు వెళ్తాయి. 500 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు మున్సిపల్ ఆఫీసుల చట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఇకపై 128 మున్సిపాలిలు ఉంటాయి. నగర పంచాయతీలు ఉండవు. మున్పిపాలిటీల్లో ఆస్తిపన్ను కట్టకుండా అబద్ధాలు చెబితే 25 రెట్ల జరిమానా విధిస్తాం. ఎన్నికల నిర్వహణలో ఈసీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కేవలం ఎన్నికల తేదీలను మాత్రమే ప్రభుత్వం ప్రకటిస్తుంది. మున్సిపల్ వ్యవస్థను అవినీతి రహితం చేయడమే లక్ష్యం. 75 చదరపు గజాల్లోపు ఉన్న ఇల్లుకు ఏడాదికి రూ.100 పన్ను చెల్లించాలి. 75 చదరపు గజాల్లోపు జీ+1 కడితే అనుమతి అవసరం లేదు. ఒక్క రూపాయితోనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. అక్రమ కట్టడాలను రాష్ట్రంలో ఎక్కడా అనుమంతించం. అక్రమ నిర్మాణమని తెలిస్తే వెంటనే కూల్చేస్తాం. ఎలాంటి నోటీసులు ఇవ్వం’అన్నారు. -
జవాబుదారిలో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్ : కొత్త మున్సిపల్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా తెరపైకి తెచ్చింది. పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల ఉమ్మడి భాగస్వామ్యంతో మున్సిపల్‌పాలనను పరుగులు పెట్టించేలా ఈ చట్టాన్ని రూపొందించింది. ఓవైపు బాధ్యతలను గుర్తుచేస్తూనే మరో వైపు సంస్కరణలను ప్రవేశపెడుతూ రూపొందించిన ఈ చట్టంలో జిల్లా కలెక్టర్లను సూపర్‌బాస్‌లను చేసింది. మున్సిపల్‌పగ్గాలన్నీ వారికే అప్పగించి ప్రజాప్రతినిధుల పనితీరుపై ఓ కన్నేసి ఉంచేలా నిబంధనలను తీసుకొచ్చింది. తేడా వస్తే చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులను సస్పెండ్ చేసే అధికారాలను కట్టబెట్టింది. హరిత మున్సిపాలిటీల కోసం బడ్జెట్లో 10% నిధులను ప్రత్యేకంగా కేటాయించడంతో పాటు.. నాటిన వాటిలో 85% మొక్కలు బతక్కపోతే సంబంధిత వార్డు మెంబర్, అధికారిపై కొరడా ఝళిపించనుంది. పాలకవర్గాలకు ఎన్నికలు, వాటి పనితీరు సమీక్ష, పాలన పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక నియమ నిబంధనలు, ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్ రూల్స్, నైపుణ్య పెంపుదల కోసం స్వయంప్రతిపత్తితో కూడిన సంస్థ ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ బోర్డుల ఏర్పాటు వంటి అంశాలతో రూపొందించిన చట్టంపై శుక్రవారం సభలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. పదేళ్లు ఒకే రిజర్వేషన్ మున్సిపల్, నగర పాలక సంస్థలకు ప్రస్తుతం ఖరారు చేసే రిజర్వేషన్ రెండుసార్లకు (పదేళ్లు) వర్తించనుంది. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, అవినీతికి అవకాశం కల్పిస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రొటేషన్ పద్ధతికి స్వస్తి పలికింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ విధానాన్ని అమలు చేసిన సర్కారు.. తాజాగా మున్సిపల్పాలికల్లోనే ఇదే పద్ధతిని అనుసరించనుంది. ఈ మేరకు కొత్త చట్టంలో పొందుపరిచింది. కౌన్సిలర్/కార్పొరేటర్, చైర్పర్సన్/మేయర్ పదవులకు ఈ ఏడాది ఖరారు చేసే రిజర్వేషనే వచ్చేసారీ అమలు కానుంది. 50% మించకుండా.. 50% స్థానాలను ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కేటాయిస్తారు. ఇందులో అన్ని కేటగిరీల్లోను సగం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు. చైర్మన్, మేయర్ స్థానాల రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. గ్రేటర్ హైదరాబాద్ సహా మేయర్ స్థానాల్లో సగం సీట్లను వివిధ కేటగిరీలకు రిజర్వ్ చేస్తారు. పాలకవర్గంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే మూడేళ్లు ఆగాల్సిందే. ఇప్పటివరకు నాలుగేళ్లు ఉన్న ఈ వ్యవధిలో ఏడాదిని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టంలో పొందుపరిచింది. లేఔట్ అనుమతులకు కమిటీ లేఔట్లను అనుమతించే అధికారం జిల్లా స్థాయి కమిటీకి దఖలు పరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల ఎస్ఈ, ఈఈలతో కూడిన కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీ లేఔట్ల అనుమతి దరఖాస్తులను పరిశీలించి.. అనుమతులు జారీ చేయనుంది. భవన నిర్మాణానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సమర్పించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత 21 రోజుల్లోగా అనుమతి ఇచ్చేదీ లేనిది తేల్చేయాలి. ఒకవేళ దరఖాస్తును తిరస్కరించాలనుకుంటే ఎందుకు తిరస్కరించారో సహేతుక కారణం చూపాలి. లిఖితపూర్వకంగా దరఖాస్తుదారునికి ఈ వివరాలు తెలియజేయాలి. లేనిపక్షంలో అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణించనున్నారు. 200 చదరపు మీటర్లలోపు స్థలంలో భవనం నిర్మించాలనుకుంటే గతంలోలాగా అనుమతులు అవసరం లేదు. సకాలంలో ఇవ్వకపోతే? లేఔట్ అనుమతులను నిర్దేశిత సమయంలో ఇవ్వలేకపోయిన పక్షంలో బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అనుమతి పొందిన లేఔట్లలో రెండేళ్లలో డెవలపర్ లేదా బిల్డర్ కనీస సౌకర్యాలు కల్పించి ఆన్లైన్లో పొందుపరచాల్సిందే. లేదంటే ఆ డెవలపర్ లేదా బిల్డర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి లేఔట్లు చేపట్టకుండా అనర్హులుగా ప్రకటిస్తారు. లే అవుట్లో పార్కు, గ్రీన్‌బెల్ట్, ఆటస్థలం కోసం కేటాయించిన ఖాళీ స్థలాలను ఉచితంగా మునిసిపాలిటీలకు బదిలీచేయాల్సి ఉంటుంది. భవన నిర్మాణాలకు ఇలా! 200 చదరపు మీటర్లలోపు స్థలంలో భవన నిర్మాణానికిగాను ఆన్లైన్లో సదరు యజమాని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. దీంతోపాటు అన్ని డాక్యుమెంట్లు ఆన్లైన్లో సమర్పించిన వెంటనే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే ఎందుకు నిరాకరించాల్సి వచ్చిందో రాతపూర్వకంగా తెలియజేయాలి. అలా చేయకుండా సదరు దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోతే అనుమతి ఇచ్చినట్లే పరిగణించాల్సి ఉంటుంది. అందుకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారు. 200 చదరపు మీటర్లలోపు స్థలాల్లో భవన నిర్మాణానికి ఇచ్చే సెల్ఫ్ డిక్లరేషన్‌కు సదరు యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అవసరం ఉండదు. భవన నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు. అయితే నిర్ణీత సమయంలోపు నిర్మాణం పూర్తిచేయాల్సిందే. సమీకృత టౌన్‌షిప్‌లు సమీకృత పట్టణాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం డెవలపర్లకు అవసరమైన ప్రోత్సాహాకాలను కల్పిస్తోంది. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధించేందుకు ఈ టౌన్‌షిప్‌లు దోహదపడతాయని భావిస్తోంది. పనిచేసే ప్రదేశం నివాసం మధ్యగల దూరం తగ్గించడం, రహదారులపై ఒత్తిడి తగ్గించడంతో ఎక్కువ ఉత్పాదక సమయం లభిస్తుంది. తద్వారా నివాస, కార్యాలయ, వాణిజ్య, వినోద, సేవలు, మౌలిక సదుపాయాల హబ్‌లుగా మారనున్నాయి. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు నిర్మించే డెవలపర్లు/బిల్డర్లకు ప్రోత్సాహకాలను కూడా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నిర్ణీత విస్తీర్ణంలో.. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేవాటికి ఈ రాయితీలు వర్తింపజేయనుంది. కౌన్సిలర్, చైర్మన్‌ను సస్పెండ్ చేసే అధికారం మున్సిపల్పాలన కలెక్టర్ల కనుసన్నల్లో జరుగనుంది. విధిగా మున్సిపాలిటీలను తనిఖీ చేయడమేగాకుండా.. ప్రతి నిర్ణయంలోను కలెక్టర్లదే పైచేయి కానుంది. ఈ మేరకు చట్టంలో కలెక్టర్లకు విస్తృతాధికారాలను కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ రూపకల్పన, రికార్డుల పరిశీలన, తీర్మానాలను సమీక్ష/రద్దు చేసే అధికారం అప్పగించారు. మున్సిపాలిటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని విచారణలో తేలితే కౌన్సిలర్, వైస్ చైర్మన్, చైర్మన్‌ను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకుంది. 30 రోజుల్లో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. డైరెక్ట్ చేస్తారు కూడా పాలన సక్రమంగా సాగే విధంగా చైర్‌పర్సన్‌కు సూచనలు చేసే అధికారం కూడా ఈ చట్టంతో కలెక్టర్లకు దఖలు పడనుంది. మున్సిపాలిటీల పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను ఏ క్షణంలోనైనా తనిఖీ చేసే అధికారం కూడా కలెక్టర్లకు ఇచ్చారు. అదే విధంగా ఆ మునిసిపాలిటీ పరిధిలోని ఏ స్థిరాస్తినైనా తనిఖీ చేయవచ్చు. ఏకీకృత సర్వీసు ఇక మున్సిపల్ ఉద్యోగులంతా ఒకే గొడుగు కిందకు రానున్నారు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి సంస్థలు, జీహెచ్ఎంసీ, నగర పాలక సంస్థల్లో పనిచేస్తున్న అన్ని కేడర్ల అధికారులు, ఉద్యోగులను మున్సిపాలిటీలకు బదిలీ చేసే అధికారం ఉండేది కాదు. ఇలా విడివిడిగా ఉన్న ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌ను ‘కామన్ మున్సిపల్ సర్వీస్’గా పేర్కొంది. తద్వారా చట్టంలో ప్రతిపాదిస్తున్న మార్పుల ప్రకారం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలైనా, జీహెచ్ఎంసీ అయినా, కార్పొరేషన్లయినా, పట్టణాభివృద్ధి సంస్థలు ఏవైనా ఒకటే సర్వీసు రూల్స్ ద్వారా ఏ ఉద్యోగి ఎక్కడికయినా బదిలీపై వెళ్లే వెసులుబాటు కలుగనుంది. పారిశుద్ధ్యానికి కార్యాచరణ ప్రణాళిక పారిశుద్ధ్య నిర్వహణకు వార్డుల వారీగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించనున్నారు. చెత్త సేకరణ, డంపింగ్ కోసం ఎన్ని వాహనాలు అమలవుతాయనే దానిపై మ్యాపింగ్ చేయనున్నారు. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)కు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తారు. డంపింగ్ యార్డులను శాస్త్రీయంగా నిర్వహించాల్సివుంటుంది. పర్యావరణ సమస్యలు తలెత్తకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సివుంటుంది. హరితనిధి పట్టణ సంస్థల్లో పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇందులోభాగంగా గ్రీన్సెల్ను ఏర్పాటు చేసి బడ్జెట్లో 10% నిధులను కేటాయించింది. అంతేకాకుండా.. నాటిన మొక్కల్లో 85% సంరక్షించకపోతే బాధ్యులపై చర్యలు తీసుకోనుంది. మొక్కలను కాపాడడంలో ఉదాసీనంగా ఉన్న వార్డు మెంబర్ (కౌన్సిలర్)ను, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలిన ప్రత్యేకాధికారిని సర్వీసు నుంచి తొలగించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆస్తిపన్ను బోర్డు ఆస్తిపన్ను మదింపునకు ‘తెలంగాణ ఆస్తిపన్ను బోర్డు’ఏర్పాటు చేయనున్నారు. భవనాలు, భూములపై పన్ను నిర్ధారణపై మున్సిపాలిటీలకు సాంకేతిక మార్గదర్శకాల జారీకి ఈ బోర్డు సహాయకారిగా ఉండనుంది. అక్రమార్కులపై మున్సిపల్ శాఖ కొరడా ఝళిపించనుంది. అక్రమంగా నిర్మాణం గుర్తించి.. దాన్ని కూల్చివేస్తే దాని ఖర్చును భవన యజమాని నుంచి వసూలు చేయనుంది. అలాగే అతడిపై జరిమానాలను విధించనుంది. ఇప్పటివరకు కేవలం రెవెన్యూ అధికారులకే ఉన్న రెవెన్యూ రికవరీ అధికారం మున్సిపల్ కమిషనర్లకు కూడా సంక్రమించనుంది. టౌన్‌ప్లానింగ్ ట్రిబ్యునల్ లేఔట్ల అభివృద్ధి, భవన నిర్మాణాల్లో చోటుచేసుకునే అభ్యంతరాలను అప్పీల్ చేసుకునేందుకు టౌన్‌ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కానుంది. నిబంధనల ఉల్లంఘన, పెనాల్టీల విధింపు తదితర న్యాయ నిర్ణయాలను వెలువరించే అధికారం ఈ ట్రిబ్యునల్‌కు దఖలు పరిచారు. ఐదుగురు సభ్యులతో కూడిన ట్రిబ్యునల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. చైర్‌పర్సన్‌గా జిల్లా జడ్జీ ఉంటారు. పాలకవర్గాలను సంప్రదించిన తర్వాత ఏ మున్సిపాలిటీలోనైనా అవసరం అనుకుంటే ప్రభుత్వం.. పట్టణ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఈ కమిటీలు ప్రణాళికలు తయారు చేస్తాయి. ఇందుకయ్యే ఖర్చును మున్సిపల్ నిధి నుంచే భరిస్తారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు నిరంతర శిక్షణ ఇచ్చేందుకు స్వయంప్రతిపత్తి కలిగిన ఓ సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ‘స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎక్సలెన్స్’పేరుతో స్థాపించనున్న ఈ సంస్థలో పట్టణాభివృద్ధి, నిర్వహణ, పాలన, ఆర్థికాంశాలు, పేదరిక నిర్మూలన, విధి విధానాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కొన్ని స్థానాలు లేదా ఒక మున్సిపాలిటీ లేదా కొన్ని మున్సిపాలిటీలకు కలిపి ఎన్నికల వ్యయ పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నియమించవచ్చని కొత్త మున్సిపల్ చట్టంలో పొందుపరిచారు. మున్సిపల్ చట్టంలోని మరికొన్ని ముఖ్యాంశాలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని ఏదో ఒక మున్సిపాలిటీలో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా కొనసాగు తారు. ఆయా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన 30 రోజుల్లోపు ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా ఎక్కడ కొనసాగాలో తేల్చుకోవాల్సివుంటుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఎన్నికైనవారు 30 రోజుల్లోపు ప్రమాణస్వీకారం చేయాల్సివుంటుంది. లేదంటే మరో 3 నెలలపాటు పాలకవర్గం అనుమతి మేరకు సదరు సభ్యుల ప్రమాణస్వీకారానికి గడువు లభించనుంది. ఏదైనా కారణంతో సభ్యులు అనర్హతకు గురైతే 30 రోజుల్లోగా జిల్లా కోర్టులో సవాల్ చేయాల్సివుంటుంది. ఈ పిటిషన్‌ను సదరు కోర్టు మూడు నెలల్లోగా పరిష్కరించాల్సివుంటుంది. లేనిపక్షంలో సభ్యుడు ఆ పదవిలో కొనసాగుతారు. ఎవరైనా సభ్యులు రాజీనామా చేసినా, చనిపోయినా, అనర్హతకు గురైనా విషయాన్ని 15 రోజు ల్లో ఈసీకి కమిషనర్ నివేదిక అందజేయాల్సివుంటుంది. ఆ ఖాళీని 4 నెలల్లోగా భర్తీ చేయాలి. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వార్డు కమిటీల్లో మహిళలు, యువత, వయోధికులు, ఇతర ప్రముఖులు కలిపి 15 మందికి మించరాదు. పాలకవర్గాలు ప్రతి నెల విధిగా సమావేశం కావాల్సివుంటుంది. ఈ సమావేశాలకు కనీసం సగం మంది హాజరుకావాల్సివుంటుంది. కామన్ సర్వీసెస్‌కు సంబంధించిన పోస్టుల వర్గీకరణ, భర్తీ ప్రక్రియ, అర్హతల నిర్ధారణ, వేతనాలు, శిక్షణ తదితర నిబంధనలు ఖరారు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పడుతుంది. ఈ–గవర్నెన్స్, సిటిజన్ చార్టర్‌ను పకడ్బందీగా అమలు చేసే మున్సిపాలిటీలను మోడల్ టౌన్లుగా పరిగణించనున్నారు. మున్సిపాలిటీలకు సంబంధించి ఏటా ప్రభుత్వానికి పాలనా నివేదికను సమర్పించాల్సివుంటుంది. వచ్చే ఏడాదికిగాను కార్యాచరణ ప్రణాళికను కూడా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నెలరోజుల్లోపు పంపాల్సివుంటుంది. మున్సిపాలిటీల పరిధిలో నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, పార్కింగ్‌లకు యూజర్ చార్జీలను వసూలు చేయనున్నారు. ప్లంబర్, సర్వేయర్ లైసెన్సులు, మాంస విక్రయదారులు, కబేళాల నిర్వహణకు నిర్దేశిత రుసుం చెల్లించి లైసెన్స్ తీసుకోవాల్సివుంటుంది. 75 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇంటికి ఏడాదికి రూ.100 ఆస్తిపన్ను మాత్రమే వసూలు చేయనున్నారు. గ్రౌండ్, గ్రౌండ్ ప్లస్ భవనాలకు ఈ మినహాయింపు వర్తించనుంది. స్వీయ ఆస్తిపన్ను మదింపులో తప్పు లెక్కలు చూపినట్లు తేలితే వాస్తవ పన్ను సహా 25 రెట్ల అపరాధ రుసుం వసూలు చేస్తారు. ఏడు కొత్త నగరపాలికలు కొత్తగా ఏడు నగర పాలక సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నగరీకరణ నేపథ్యంలో రాజధాని శివార్లలోని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ మున్సిపల్ చట్టంలో పొందుపరిచింది. మేడ్చల్ జిల్లా పరిధిలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట, రంగారెడ్డి జిల్లా పరిధిలో బండ్లగూడ జాగీర్, బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపాలిటీలను నగర పాలక సంస్థలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిరాకతో రాష్ట్రంలో నగరపాలికల సంఖ్య పదకొండుకు చేరింది. కాగా, జిల్లెలగూడ మున్సిపాల్టీని మీర్‌పేట కార్పొరేషన్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలావుండగా, రాష్ట్రవ్యాప్తంగా 128 మున్సిపాలిటీలు, వరంగల్ మహానగరపాలక సంస్థ, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లకు కొత్త చట్టాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీకి సంబంధించి ఈ చట్టాన్ని మినహాయిస్తున్నట్లు తెలిపింది. నగరపాలక సంస్థ- వార్డులు గ్రేటర్ వరంగల్- 66 కరీంనగర్- 60 రామగుండం- 50 నిజామాబాద్- 60 ఖమ్మం- 60 బడంగ్‌పేట- 32 బండ్లగూడ జాగీర్- 22 మీర్‌పేట- 25 బోడుప్పల్- 28 పీర్జాదిగూడ- 26 జవహర్‌నగర్- 28 నిజాంపేట- 33 -
7 కొత్త కార్పొరేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, కొత్త మున్సిపల్ చట్టం ద్వారా మరో ఏడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని కార్పొరేషన్ల సంఖ్య 13కు చేరనుంది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో శివారు గ్రామాలు చేరడంతో జనాభా పెరిగిందని, ఆ మేరకు వార్డుల సంఖ్య సైతం పెంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ చట్టాలకు సవరణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దీంతో అత్యవసర ఆదేశాల(ఆర్డినెన్స్) రూపంలో మున్సిపల్ చట్టాలకు సవరణ చేసి వార్డుల సంఖ్యను పెంచామన్నారు. మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్ బిల్లును ఆయన గురువారం సభలో ప్రవేశపెట్టి మాట్లాడారు. రాష్ట్రం లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రజల సౌకర్యం, సౌలభ్యం, సంక్షేమం కాంక్షించి చాలా మార్పులు తీసుకొచ్చామన్నారు. మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్ బిల్లును కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఆమోదించినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. -
నిలబెట్టుకోలేక నిందలా!
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనంపై కాంగ్రెస్ పార్టీ వారే సమాధానపర్చుకోవాలని, వారికి వారే జవాబు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఆ విలీనం రాజ్యాంగ నిబంధనలకు లోబడే జరిగిందని స్పష్టంచేశారు. ఈ మధ్యే మూడింట రెండో వంతు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమయ్యారని, వారు ప్రధానిని సైతం కలిశారని కేసీఆర్ గుర్తు చేశారు. గోవాలో కాంగ్రెస్‌పార్టీ వారే బీజేపీలో విలీనమైపోయారని పేర్కొన్నారు. ‘‘దేశవ్యాప్తంగా మీ పార్టీవారి మీద మీ ఆకర్షణ తగ్గిపోయి, మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వెళ్తే మమ్మల్ని నిందిస్తే ఎలా? మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీద పడి ఏడ్వడం కరెక్ట్ కాదు. మీరే కాపాడుకోవాలి. మీకు ఆకర్షణ ఉంటే, మీకు నాయకత్వ పటిమ ఉంటే ఎవరెందుకు పార్టీని వీడతారు’’అని ప్రశ్నించారు. ఏదో క్రైం జరిగినట్టు.. ఏదో రాజ్యాంగ వ్యతిరేక చర్య జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ గోల చేస్తోందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నించగా.. సీఎం కేసీఆర్ ఘాటుగా బదులిచ్చారు. భట్టి విక్రమార్క తన ఆక్రోశం చెప్పుకుంటున్నారని, దానికి తాము బాధ్యులం కామని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి, షెడ్యూల్ 10 ప్రకారం కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనమైందని స్పష్టంచేశారు. మేం ఎవరినీ చేర్చుకోలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతామని వచ్చినా చేర్చుకోలేదని సీఎం తెలిపారు. ఏ పార్టీ సభ్యుడూ తమ పార్టీలో చేరలేదని వివరించారు. తామే 88 మంది గెలిచామని, ఇద్దరు స్వతంత్రులు వచ్చి చేరారని, నాలుగింట మూడో వంతుకు మించిన మెజార్టీ తమకు అవసరం లేదని, ఆ విషయమే ఆ ఎమ్మెల్యేలకు చెప్పామని వెల్లడించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చీలిక వస్తే తానేం చేయగలనని ప్రశ్నించారు. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని, అయినా కాంగ్రెస్‌వారు పదేపదే ప్రస్తావిస్తున్నారు కాబట్టి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనకు ఉన్నందున స్పందించానని చెప్పారు. ‘‘మీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమండి.. మేమేం చేయాలి? కాపాడుకునే శక్తి లేకపోతే.. మీ సభ్యులే వికర్షణకు గురైతే దానికి మేమేం చేయాలి’’అని ప్రశ్నించారు. ఈ దేశంలో ఎవరైనా మూడింట రెండో వంతు పార్టీ చీలిపోయి వస్తే చేర్చుకోరా? విలీనం చేసుకోరా? దాని ప్రకారమే తమరు ఉత్తర్వులిచ్చారు.. బులెటిన్ జారీ చేశారు అని స్పీకర్‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీనికి తమ మీద పడి ఏడ్వడం ఎందుకుని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా ఉంటుందని, ఇందులో ఎవరికీ సందేహం అవసరంలేదని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా ఉండాలని, పార్టీ ఫిరాయింపులు సరికాదని భట్టి విక్రమార్క పేర్కొనగా సీఎం ఈ మేరకు బదులిచ్చారు. బ్యాలెట్‌తో కూడా మేమే గెలిచాం.. ‘‘శాసనసభ ఎన్నికలకు ముందు వీళ్లు ఎన్ని చెప్పాలో అన్ని చెప్పారు.. ఇదే శాసనసభలో మాట్లాడారు.. సస్పెండ్ చేయించుకున్నరు.. బాయ్‌కాట్ చేయించుకున్నరు.. గవర్నర్ గారి మీద దాడులు జరిగినయి.. ప్రజల ముందుకు వెళ్లి 3/4 మెజారిటీతో గెలిచి వచ్చినం. ఆ తర్వాత నెల రోజులు ఈవీఎంల గోల్మాల్ అని గోలపెట్టారు. బ్యాలెట్‌తో సర్పంచులను గెలిచినం. 32 జిల్లా పరిషత్‌లను బ్యాలెట్‌తో గెలుచుకున్నం. దానికి ఏం చెబుతారు’’అని కాంగ్రెస్ పార్టీని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. 83 శాతం గ్రామ పంచాయతీలు, 92 శాతం మండలాలను గెలిచామని గుర్తుచేశారు. కాంగ్రెస్ తలోదారి.. టీఆర్ఎస్లో 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల విలీనానికి నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమంలో ఆ పార్టీ నేతల అనైక్యత బయటపడింది. అందరూ ఏకతాటిపై ఉండకుండా తలోతీరుగా వ్యవహరించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సభ్యులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొడెం వీరయ్య నల్ల కండువాలు ధరించి సభకు హాజరయ్యారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలో సేవ్ డెమోక్రసీ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిలబడి నిరసన తెలిపారు. వీరితో కలిసే సభలో ప్రవేశించిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చివరి వరుసలోఒంటరిగా కూర్చొని నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. వివిధ బిల్లులపై చర్చ జరుగుతున్న సందర్భంగా టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనంపై మాట్లాడేందుకు భట్టి విక్రమార్క విఫలయత్నం చేశారు. టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం అంశం కోర్టు పరిధిలో ఉండడంతో సభలో చర్చించడం సరికాదని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బదులిచ్చారు. సభా నిబంధనల ప్రకారం అజెండాలోని అంశాలపై మాత్రమే మాట్లాడాలని పేర్కొంటూ.. భట్టి విక్రమార్క మట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతిసారి మైక్ కట్ చేశారు. ఎవరు ఏ పార్టీలో గెలిచినా చివరకు టీఆర్ఎస్లోనే చేరతారని ఈ సందర్భంగా భట్టి విమర్శలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, సీఎల్పీ లీడర్‌గా తాము లేవనెత్తిన అంశాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, మైక్ ఇవ్వకుండా అణగదొక్కే ప్రయత్పం చేశారని మండిపడ్డారు. న్యాయస్థానం పరిధిలో అంశం ఉందని పేర్కొన్న స్పీకరే విలీనం ఉత్తర్వులు ఎలా జారీచేశారని ప్రశ్నించారు. సభలో తాము గుడ్డిగా కూర్చోలేమన్నారు. సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించడం లేదని, అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారని, సభను మీరే నడుపుకోవాలని పేర్కొంటూ ముగ్గురు సహచరులతో కలిసి భట్టి వాకౌట్ చేశారు. ఆ సమయంలో సభలోనే ఉన్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం వాకౌట్ చేయకుండా అక్కడే ఉండిపోయారు. ఉన్నోళ్లను కాపాడుకోండి: ఎర్రబెల్లి ‘‘ఉన్నోళ్లు కూడా పోయేటట్టున్నరు. ఒకరు బయట ఉన్నరు.. ఇంకొకరు దూరంగా కూర్చున్నరు. ఆ ఆరుగురినైనా కాపాడుకొండ్రి’’అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. సభలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండో సవరణ బిల్లును ప్రవేశపెట్టి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలుపుతుండడంతో ఎర్రబెల్లిపై ఈ విధంగా స్పందించారు. కాగా, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలకు అడ్డుగా ఉన్న నిబంధనలను మారుస్తూ పంచాయతీరాజ్ చట్టానికి సవరించడానికి జారీ చేసిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లుకు ఈ సందర్భంగా సభ ఆమోదం తెలిపింది. కొత్త మున్సిపల్ చట్టాల బిల్లును ప్రవేశపెట్టిన కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టాల బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు లక్ష్యాలు, ఉద్దేశాల గురించి ఆయన శుక్రవారం శాసనసభ, శాసనమండలిలో ప్రసంగించనున్నారు. అనంతరం చర్చ నిర్వహించి బిల్లుకు ఆమోదముద్ర వేయనున్నారు. -
ఎక్కడికైనా బదిలీ!
సాక్షి, హైదరాబాద్ : కొత్త మున్సిపల్ చట్టంలో కీలక ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఉద్యోగుల సర్వీసు రూల్స్‌కు సంబంధించి ప్రస్తుతం విడివిడిగా ఉన్న నిబంధనలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తోంది. ఇప్పటివరకు అర్బన్ అథారిటీలు, జీహెచ్ఎంసీ, నగరపాలక సంస్థల్లోకి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీపై వచ్చే అవకాశం ఉండేది కాదు. కానీ ప్రతిపాదిత చట్టం ప్రకారం రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ, పట్టణాభివృద్ధి సంస్థలు... ఏవైనా ఒకటే సర్వీసు రూల్స్ ద్వారా ఏ ఉద్యోగి ఎక్కడికైనా బదిలీపై వెళ్లే సౌలభ్యాన్ని కల్పించనుంది. ఈ క్రమంలో జోనల్, మల్టీజోనల్ మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. దీన్ని ‘తెలంగాణ మున్సిపల్ సర్వీసెస్’గా నిర్వచిస్తూ కొత్త చట్టంలో పొందుపర్చనుంది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా మున్సిపల్ చట్టం–2019 బుధవారం కేబినెట్ ముందుకు రానుంది. రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన అనంతరం ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి ఆమోదముద్ర పడనుంది. అభివృద్ధి కోసం సలహాలు... పౌరసేవల్లో పారదర్శకత..అధికారుల్లో జవాబుదారితనం.. ప్రజాప్రతినిధుల్లో అంకితభావం.. స్థూలంగా ఇదీ కొత్త పురపాలకచట్ట నిర్వచనం. ఇల్లు కట్టినా.. కూల్చినా, పుట్టినా.. గిట్టినా అమ్యామ్యాలు సమర్పించుకుంటే తప్ప ధ్రువపత్రాలు చేతికందని పరిస్థితి నగర/పురపాలికల్లో నెలకొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి, పురపాలనను గాడిలో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పురచట్టాన్ని తేవాలని నిర్ణయించడం తెలిసిందే. పురపాలనలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పిస్తున్న ఈ చట్టంలో మరో ముఖ్య సంస్కరణను కూడా ప్రవేశపెట్టనున్నారు. మున్సిపాలిటీల అభివృద్ధిలో ఆయా పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలనూ భాగస్వామ్యులను చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతి మున్సిపాలిటీకి ఓ అభివృద్ధి సలహా కమిటీని ఏర్పాటు చేయాలని చట్టంలో ప్రతిపాదిస్తున్నారు. ఈ కమిటీలో పట్టణాల్లోని ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఔత్సాహికులకు అవకాశం కల్పించి వారి సలహాలను కూడా స్వీకరించనున్నారు. అయితే ఈ కమిటీలు కేవలం సలహాలే ఇస్తాయని, వాటి అమలు నిర్ణయం మాత్రం మున్సిపల్ పాలకవర్గమే తీసుకుంటుందని, తద్వారా రెండు పవర్సెంటర్లు ఏర్పడకుండా చట్టంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. సుపరిపాలనకు పెద్దపీట... కొత్త చట్టంలో సుపరిపాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. సిటిజన్ చార్టర్‌కు ప్రాధాన్యతనిస్తూ ఆన్లైన్లోనే ప్రజల దరికి సేవలను చేర్చాలని నిర్ణయించింది. మ్యాన్యువల్ సేవలకు చరమగీతం పాడి అన్నింటినీ ఆన్లైన్లో పొందేలా చర్యలు తీసుకుంటోంది. బిల్డింగ్ పర్మిషన్ల జారీలో ఏమాత్రం జాప్యం జరిగినా సదరు అధికారిపై చర్యలు చేపట్టేలా కొత్త నిబంధనను తీసుకురానుంది. అన్నీ సవ్యంగా ఉన్నా నిర్ణీత వ్యవధిలో అనుమతులు జారీ చేయకపోతే దాన్ని అనుమతి ఇచ్చినట్లుగా పరిగణించనుంది. అలాగే అనుమతి ఇవ్వకుండా సతాయించిన అధికారికి జరిమానా విధించనుంది. మరోవైపు పౌరుల్లోనూ జవాబుదారీతనం పెంపొందించేందుకు పకడ్బందీగా వ్యవహరించనుంది. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తే కొరడా ఝళిపించనుంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే భారీగా ఫైన్లు వేయనుంది. అలాగే అనధికారికంగా వ్యాపారాలు చేసినా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా పెనాల్టీలు బాదనుంది. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేకంగా వార్డులవారీగా ప్రణాళికలు రూపొందించనుంది. చెత్త సేకరణ, డంపింగ్ ముఖ్యంగా ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ చట్టంలో నిబంధనలు తయారు చేసింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, స్వచ్ఛభారత్‌లో భాగంగా కార్పొరేషన్లు, మేజర్ మున్సిపాలిటీలు బోర్డులు ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నాయి. చిన్న మున్సిపాలిటీలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి వాటిలోనూ ఇదే తరహా బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. పాలనాధికారులకే పగ్గాలు! ఇక నుంచి మున్సిపాలిటీలపై జిల్లా కలెక్టర్లు శీతకన్ను వేస్తే కుదరదు. విధిగా తమ పరిధిలోని పురపాలికలను పక్షం రోజులకోసారి సందర్శించాల్సిందే. పాలకవర్గాలకు గౌరవం ఇస్తునే.. వారి నిర్ణయాలను మదింపు చేసే బాధ్యత కలెక్టర్లకు కొత్త చట్టం కట్టబెడుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లోనూ అభివృద్ధి అసమానతలకు తావివ్వకుండా అన్ని వార్డులను సమదృష్టితో చూడాల్సి ఉంటుంది. బడ్జెట్లో 30 శాతం నిధులను పట్టణ ప్రధానావసరాలకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రతి మున్సిపాలిటీలో వైకుంఠ ధామాలు, కబేళాల నిర్మాణాన్ని తప్పనిసరి చేయనుంది. ప్రస్తుత చట్టాలను సవరిస్తూ కొత్త చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపునిచ్చింది. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలను అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ.. ముఖ్యమైన చాప్టర్లను కొత్త చట్టంలో పొందుపరిచింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ), నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు వేర్వేరుగా చట్టాలను తేనుంది. కాగా, కొత్తగా అర్బన్ పాలసీపై కసరత్తు చేస్తున్న సర్కారు.. పట్టణాల్లో టౌన్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక టౌన్షిప్ పాలసీని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
18న శాసనసభ..19న మండలి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం శాసనసభ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలను ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఉదయం 11 గంటలకు శాసనసభ, 19న మధ్యాహ్నం 2 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174లోని ఒకటో నిబంధన ప్రకారం గవర్నర్ నరసింహన్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు అసెంబ్లీ కార్యదర్శి నరసింహారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఏర్పాటు చేసినట్లు సీఎం కార్యాలయం రెండురోజుల క్రితం స్పష్డం చేసింది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ వంటి ప్రొసీడింగ్‌లతో సంబంధం లేకుండా కేవలం ఎజెండాకు మాత్రమే సమావేశాలు పరిమితం అవుతాయి. మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మున్సిపల్ బిల్లుకు తుదిరూపం ఇచ్చేందుకు అవసరమైన ముసాయిదాను ప్రభుత్వం ఇది వరకే న్యాయశాఖకు పంపింది. -
జీరో అవినీతి!
అవినీతిని అరికట్టే దిశగా తెలంగాణ నూతన మునిసిపల్ చట్టం రావాలి. గ్రామీణ తెలంగాణలో ఎన్నికల్లో పోరాడి గెలిచాం. శాసనసభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి దీవించారు. అన్ని రకాల సంక్షేమం చేపట్టాం. ఇంకా ప్రజల ఋణం తీర్చుకోవడానికి గుణాత్మకమైన మార్పు తేవాలని సంకల్పించాం. చేతనైనంత మార్పు తెస్తాం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుణాత్మక పాలన సాధించేందుకు త్రివిధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. తెలంగాణ రూరల్ పాలసీ, తెలంగాణ అర్బన్ పాలసీ, తెలంగాణ రెవెన్యూ పాలసీ అనే మూడు పాలసీలను పటిష్టంగా అమలుపరచడం ద్వారా రాష్ట్రంలో గుణాత్మక పాలన అందించగలమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల నుంచి ఉపశమనం లభించే రీతిలో రూరల్ (గ్రామీణ) విధానం, లంచాలు ఇచ్చే అవసరం ఎంత మాత్రం రాకుండా ఉండే విధంగా రెవెన్యూ విధానం, జీరో స్థాయికి అవినీతి చేరుకునే విధంగా అర్బన్ (పట్టణ) విధానం ఉండాలన్నారు. నూతన మునిసిపల్ చట్టం పురోగతి మీద, అందులో చేర్చాల్సిన అంశాల మీద, చట్టంలో ప్రజాప్రతినిధుల బాధ్యతలు ఎలా ఉండాలో అన్న విషయాల మీద ముఖ్యమంత్రి బుధవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘‘రాష్ట్ర సాధనలో స్థిరమైన ప్రయాణం చేశాం. అనుకున్నది సాధించాం. అలాగే అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అమలు చేశాం. అన్నింటికన్నా పెద్ద సమస్యలైన మంచినీటి, సాగునీటి సమస్యలను, కరెంట్ సమస్యను అధిగమించాం. ఓట్లే పరమావధిగా కాకుండా అభివృద్ధి, సంక్షేమం పట్ల దృష్టి సారించాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామాల పరిస్థితి బాగుపడాలి అనుకున్నాం. పటిష్టమైన చట్టం తెచ్చాం. గ్రామాల అభివృద్ధి సాగుతోంది. గ్రామాల్లో మూడు నెలల్లో మార్పు చూడబోతున్నాం’’అని అన్నారు. అవినీతిని అరికట్టేలా చట్టం... ‘‘గ్రామీణ తెలంగాణాలో ఎన్నికల్లో పోరాడి గెలిచాం. శాసన సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి ప్రజలు దీవించారు. అన్ని రకాల సంక్షేమం చేపట్టాం. ఇంకా వాళ్ల ఋణం తీర్చుకోవడానికి గుణాత్మకమైన మార్పు తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. చేతనైనంత మార్పు తెస్తాం. ప్రతి పనికీ ఎవరో ఒకరు పూనుకోవాలి కాబట్టి ఆ పనికి మేం శ్రీకారం చుడుతున్నాం. అవినీతిని అరికట్టే దిశగా తెలంగాణ నూతన మునిసిపల్ చట్టం రావాలి. ఈ సారి ప్రజలు ప్రభుత్వం నుంచి ఆశించేది ఉత్తమ విధానాలు, అభ్యాసాలు. ఉత్తమ విధానాలతో ప్రజలు బాగుపడాలి. ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే , ఆ స్ఫూర్తితోనే నూతన మునిసిపల్ చట్టం ఉండాలి. ప్రజల అవసరాలను తీర్చేలా, వారి బాగోగులు చూసుకునే రీతిలో, పట్టణాల అభివృద్ధి చక్కగా జరిగే పద్ధతిలో కఠినమైన చట్టం రావాలి. చట్టం రూపకల్పన ఆషామాషీగా జరగకూడదు’’అని సీఎం కేసీఆర్ అన్నారు. నూతన మునిసిపల్ చట్టం మీద అవగాహన కలిగించడానికి మునిసిపల్ కమిషనర్లకు ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగరావు, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, కామారెడ్డి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు, మునిసిపల్ శాఖ కమిషనర్ శ్రీదేవి, సీఎంఓ కార్యదర్శి స్మిత సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, మాజీ మునిసిపల్ అధికారి డీవీ రావు తదితరులు పాల్గొన్నారు. -
పటిష్ట చట్టాలతోనే మెరుగైన సేవలు
సాక్షి, హైదరాబాద్: పటిష్టమైన చట్టాలను రూపొందించి వాటిని పారదర్శకంగా అమలు చేయడం ద్వారానే ప్రభుత్వం పౌరులకు మెరుగైన సేవలందించగలుగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాలానుగుణంగా పాత చట్టాల్లో మార్పులు చేసుకున్నప్పుడే గుణాత్మక పాలన అందించగలమన్నారు. శనివారం ప్రగతి భవన్లో నూతన మున్సిపల్ చట్టం రూపకల్పన, నూతన సచివాలయ నిర్మాణం తదితర అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. పౌర సేవలను మెరుగుపరిచేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టే దిశగా రూపొందించనున్న నూతన మున్సిపల్ చట్టంలో చేర్చబోయే అంశాలపై సీఎం చర్చించారు. ఈ దిశగా మరిన్ని అంశాల్లో మార్పుచేర్పుల గురించి కూలంకషంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని పాత భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించేందుకు ఎంత సమయం పడుతుందని అధికారులను అడిగారు. నూతన సచివాలయాన్ని అన్ని హంగుల తో ఆదర్శవంతమైన సెక్రటేరియట్‌గా నిర్మించడంపై పలు సూచనలు చేశారు. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె. జోషి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సిం గ్రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, అధర్ సిన్షా, సునీల్ శర్మ, గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీమాలో రైతులు నమోదయ్యేలా చూడాలి వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి పత్తి పంట బీమా గడువు జూలై 15 న, మిగతా పంటల గడువు జూలై 31 న ముగుస్తున్నందున రైతులు పంట బీమాలో నమోదు చేసుకునేలా చూడాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్య దర్శి సి. పార్థసారథి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో పార్థసారథి అధ్యక్షతన ఉద్యానవన శాఖలపై జిల్లా, మండల, గ్రామ స్ధాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ రుతుపవనాల ఆలస్యంతో పంటలసాగు కూడా జాప్యమైనందున వ్యవసాయ విస్తరణాధికారులు రైతులకు అందుబాటులో ఉండి వారికి తగు సూచనలు చేయాలని ఆదేశించారు. రైతుబంధు పథకం కింద 60% మంది రైతులకు వారి ఖాతాలకు డబ్బును జమచేశామని, మిగతా వారికి త్వరలోనే జమచేయనున్నట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాలను ప్రభుత్వ పోర్టల్ లో నమోదు చేయించుకోని రైతులు తమ గ్రామ వ్యవసాయ విస్తీర్ణాధికారులను సంప్రదించి నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు బీమా పథకం కింద 30.65 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారని, వివిధ కారణాలతో 12,820 మంది మరణించగా వారి కుటుంబీకులకు బీమా వర్తింపజేసి రూ.641 కోట్లు అందజేశామన్నారు. పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి మూడు విడతల్లో రూ.6000 రైతు ఖాతాకు జమ అవుతుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా విత్తన, ఎరువుల సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని, సరిపడా ఎరువులను పీఏసీఎస్ కేంద్రాలలో నిల్వ చేయాలని, పీఓస్ మిషన్ల ద్వారా అమ్మకాలు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జా, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బార్గా మారిన మున్సిపల్ ఆఫీస్