సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం శాసనసభ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలను ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఉదయం 11 గంటలకు శాసనసభ, 19న మధ్యాహ్నం 2 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174లోని ఒకటో నిబంధన ప్రకారం గవర్నర్ నరసింహన్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు అసెంబ్లీ కార్యదర్శి నరసింహారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఏర్పాటు చేసినట్లు సీఎం కార్యాలయం రెండురోజుల క్రితం స్పష్డం చేసింది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ వంటి ప్రొసీడింగ్‌లతో సంబంధం లేకుండా కేవలం ఎజెండాకు మాత్రమే సమావేశాలు పరిమితం అవుతాయి. మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మున్సిపల్ బిల్లుకు తుదిరూపం ఇచ్చేందుకు అవసరమైన ముసాయిదాను ప్రభుత్వం ఇది వరకే న్యాయశాఖకు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment