సాక్షి, హైదరాబాద్: దేశంలో కాషాయ ఎజెండాను అమలుచేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదే సమయంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తోందని చెప్పుకొచ్చారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో జాతీయ పతాకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ హనుమంతరావు, చైర్మన్లు శివసేనారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. బీజేపీ దేశంలో కాషాయ ఎజెండాను అమలు చేయాలని చూస్తోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లోనే అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమాన పరిచారు. ఇక్కడ కేంద్రమంత్రి బండి సంజయ్ ఇందిరమ్మ పేరు పెట్టవద్దని అంటున్నాడు. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్లు నియంత పాలన చేసింది. ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ భరోసా కింద 12 వేల రూపాయలు, రైతు భరోసా కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రాజ్యాంగబద్దంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాము. హైదరాబాద్ మెట్రో విస్తరణ ఒక పెద్ద ముందడుగు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎల్లప్పుడు ఉంటుంది. అందుకే జై గాంధీ, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రజలంతా మద్దతు ప్రకటించాలి అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment