సాక్షి, హైదరాబాద్ : ఆగస్టు తర్వాత అసలైన పరిపాలన ఉంటుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ఇన్నాళ్లు చేసింది నకిలీ పరిపాలనా అనుకోవాలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడే ముఖ్యమంత్రి అయినట్లు అసెంబ్లీలో మాట్లాడటం ఆశ్చర్యం కలిగించిందని, మున్సిపల్ చట్టం సవరణ రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచేలా ఉందన్నారు. బిల్లులోని అంశాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని విమర్శించారు. శనివారం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై ధ్వజమెత్తారు.
అవినీతి పెరిగిపోయింది..
‘మున్సిపల్ శాఖతో పాటు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయింది. అన్నిటిపైనా ఉన్నత స్థాయి విచారణ జరుగుతున్న ఎందుకు నోరు విప్పలేదు. గొర్రెల పంపిణీ కోసం రూ.4వేల కోట్లు ఇస్తే అందులోనూ అవినీతి చోటుచేసుకుంది. వాణిజ్య పన్నులు.. ఇసుక రవాణ వంటి శాఖల్లో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం కేసీఆర్ కు ఉందా? ఈ అవినీతిపై ప్రభుత్వానికి అన్ని వివరాలు తెలుసు. లంచం అడిగితే చెప్పుతో కొట్టమని చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాటకు కట్టుబడి ఉన్నారా? తాజా మున్సిపల్ చట్టంతో అధికారం తనగుప్పెట్లో పెట్టుకొని ప్రతిపక్ష సభ్యులపై కక్ష్య సాదింపుకోసం వినియోగించుకునే ప్రమాదం ఉంది. వార్డుల విభజన.. రిజర్వేషన్లలో అక్రమంగా ప్రభుత్వానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. హైకోర్టు మందలించినా కేసీఆర్‌కు పట్టడం లేదు. త సమయం గడిస్తే అంత ఇబ్బంది కలుగుతోందని.. ఎన్నికల నిర్వహణకోసం తొందరపడుతున్నారు.
ఎగిరే పార్టీకాదు నిలదొక్కుకునే పార్టీ..
మున్సిపల్ బిల్లుపై కార్యాచరణ సిద్దం చేసి లోపాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం. కేటీఆర్ వ్యాఖ్యలు అహంకార పూరితంగా ఉన్నాయి. ప్రజాతీర్పును అపహాస్యం చేయడం తగదు. బీజేపీ ఎగిరే పార్టీకాదు లదొక్కుకునే పార్టీ. ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న పార్టీ. బీజేపీ గురించి చాలా చులకనగా మాట్లాడారు. ఇప్పడు బీజేపీ అంటే భయపడుతున్నట్టు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన మార్పును జీర్ణించుకోలేక పోతున్నారు. టీఆర్ఎస్ గాలి బుడగ లాంటి పార్టీ.. పునాదిలేని భవంతిలాంటిది.. తండ్రీ కొడుకుల పార్టీ. బీజేపీకీ మీరు చెప్పాల్సిన పనిలేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. గ్రామాల్లో యువత స్వచ్చందంగా వచ్చి పార్టీలో చేరుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నాం. ఇందుకోసం 17 ఎంపీ స్థానాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి రంగంలోకి దిగుతాం. 25, 26న మున్సిపాలిటీల్లో డబల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తులు తీసుకుంటాం. 30న మున్సిపాలిటీల్లో అవినీతిపై నిరసన కార్యక్రమాలు చేపడతాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయి. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు మరోలా ఉండేవి.’ అని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment