4 విభాగాలుగా కార్మిక చట్టాలు: దత్తాత్రేయ
12న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమల్లో ఉన్న 44 కార్మిక చట్టాలను 4 విభాగాలుగా విభజించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కార్మికులకు ఉద్యోగ, ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేలా వేతనబోర్డు, ఇండస్ట్రియల్ రిలేషన్స్(ఐఆర్), సామాజిక భద్రత, హెల్త్ అండ్ వర్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ మేరకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిజిటల్ ఇండియాలో భాగంగా చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం చట్టాలను సరళీకరిస్తున్నట్లు తెలిపారు.
అయితే కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏదైనా పరిశ్రమ మూతపడితే కార్మికునికి 3 నెలల వేతనం లభించేలా చట్టం రూపొందించినట్లు చెప్పా రు. అక్టోబర్ 12న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు దత్తాత్రేయ వెల్లడించారు. ఇదివరకే సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించానని, సోమవారం లేక్‌వ్యూ అథితిగృహంలో ఏపీ సీఎం చంద్రబాబును కలసి ఆహ్వానించినట్లు చెప్పారు. అమరావతిలో కార్మికశాఖ తరఫున సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని చంద్రబాబు కోరినట్లు తెలిపారు.