Department of Labor
-
India-US Relations: అంకురాలకు దన్ను
న్యూఢిల్లీ: అంకుర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించే దిశగా భారత్, అమెరికా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నవకల్పనలకు ఊతమిచ్చేందుకు, నిధుల సమీకరణలో ఎంట్రప్రెన్యూర్లు పాటించే విధానాలను పరస్పరం పంచుకునేందుకు, నియంత్రణపరమైన సమస్యల పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇది తోడ్పడనుంది. ఇరు దేశాల పరిశ్రమవర్గాల రౌండ్‌టేబుల్ సమావేశం సందర్భంగా ఎంవోయూ కుదిరినట్లు కేంద్ర వాణిజ్య, పరిశమ్రల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనపై ఇది సానుకూల ప్రభావం చూపగలదని వివరించింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో నేతృత్వం వహించిన ఈ సమావేశంలో పలువురు భారతీయ వ్యాపారవేత్తలు, టెక్నాలజీ దిగ్గజాల సీఈవోలు, వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులు, స్టార్టప్‌ల వ్యవస్థాపకులు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భారత్–అమెరికా వాణిజ్య చర్చల కింద రూపొందించిన ఇండియా–యూఎస్ ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ కాన్సెప్టును ఈ సందర్భంగా గోయల్, రైమండో ఆవిష్కరించారు. డీప్ టెక్నాలజీ, క్రిటికల్ టెక్నాలజీ వంటి విభాగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు రెండు దేశాల నిబద్ధతకు ఎంవోయూ నిదర్శనంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. దీని కింద వచ్చే ఏడాది తొలినాళ్లలో భారత్, అమెరికాలో ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ ఈవెంట్లను నిర్వహించనున్నారు. -
భారతదేశం శ్రామికుడి శక్తి : ప్రధాని
తిరుపతి అర్బన్/తిరుపతి కల్చరల్: కార్మికుల సదస్సుకు పవిత్ర స్థలాన్ని వేదిక చేసుకోవడం అభినందనీయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తిరుపతి నగరంలోని తాజ్ హోటల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, కార్మిక, ఉపాధి కల్పన, పెట్రోలియం, సహజవాయు శాఖల సహాయ మంత్రి రామేశ్వర్ నేతృత్వంలో నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని గురువారం వర్చువల్ పద్ధతిలో ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశాన్ని తెలియజేశారు. భారతదేశం శ్రామికుల శక్తిగా అభివర్ణించారు. శ్రామికశక్తిని సామాజిక పరిధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రం శ్రామికుల సంక్షేమం, భద్రత కోసం ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన, సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి బీమా యోజన తదితర పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కోట్లాది మంది కార్మికులు దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా ఏడాదికి 28కోట్ల మందికి 400 ప్రాంతాల్లో నమోదు చేయడం జరుగుతుందని వివరించారు. దేశాన్ని ఒక్కటి చేయడంలో కార్మికుల పాత్ర అభినందనీయమన్నారు. గత 8 ఏళ్లుగా బానిసత్వం, పూర్వకాలపు చట్టాల రద్దుతోపాటు ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్టు చెప్పారు. ప్రధానంగా 29కార్మిక చట్టాలు, 4 సాధారణ చట్టాలుఘౠ మార్పు చేసినట్లు ఆయన వివరించారు. లేబర్ కోడ్స్ ద్వారా కార్మికుల సాధికారత, కనీస వేతనం, సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. విజన్ 2047 నాటికి కార్మికశాఖ ప్రత్యేక ముందుచూపుతో నడుస్తుందని, ఎన్నో మార్పులతో కార్మికుడికి మంచి జరుగుతుందన్నారు. దేశాన్ని గ్లోబల్ లీడర్‌గా మార్పు చేయడానికి దోహదపడుతుందన్నారు. మహిళా కార్మికశక్తిని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవన కార్మికుల సెస్ వినియోగంపై మాట్లాడుతూ.. దేశంలో పలు రాష్ట్రాలు రూ.38 వేల కోట్లు ఉపయోగించలేదన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మిక శాఖ మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల నేతల అరెస్ట్ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు తిరుపతిలో నిర్వహిస్తున్న కార్మిక మంత్రుల జాతీయ సదస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ పి.మధు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ సహా పలువురు నేతలు అరెస్టయిన వారిలో ఉన్నారు. -
ఈపీఎఫ్‌వోలోకి 18.36 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే సామాజిక భద్రతా పథకంలోకి జూన్ నెలలో కొత్తగా 18.36 లక్షల మంది సభ్యులు చేరారు. అంతక్రితం ఏడాది జూన్ నెలలో కొత్త సభ్యులు 12.83 లక్షలతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. ఇందుకు సంబంధించి పేరోల్ గణాంకాలను కార్మిక శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది మేనెలలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా జూన్‌లో 9.21 శాతం వృద్ధి కనిపిస్తోంది. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ఇక జూన్‌లో నికర కొత్త సభ్యులు 18.36 లక్షల మందిలో 10.54 లక్షల మంది ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్, 1952 కింద మొదటసారి చేరిన వారు కావడం గమనించాలి. 7.82 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం వల్ల కొత్త సభ్యుల్లో భాగంగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచీ ప్రతి నెలా కొత్త సభ్యుల్లో వృద్ధి కనిపిస్తోంది. 22–25 వయసు నుంచి 4.72 లక్షల మంది కొత్తగా చేరిన వారున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల నుంచే 12.61 లక్షల మంది కొత్తగా చేరారు. మొత్తం కొత్త సభ్యుల్లో మహిళలు 4.06 లక్షల మంది ఉన్నారు. ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల్లో మహిళల శాతం మే చివరికి 20.37 శాతంగా ఉంటే, జూన్ చివరికి 22.09 శాతానికి తగ్గింది. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) -
కార్మిక సంక్షేమం... మరింత సరళీకృతం
సాక్షి, హైదరాబాద్: కార్మిక సంక్షేమ కార్యక్రమాలను కార్మిక శాఖ మరింత సరళీకృతం చేసింది. ప్రతి లబ్ధిదారుకు సంక్షేమ ఫలాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత కార్మికుల కోసం భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి, కార్మిక సంక్షేమ మండలి, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా మండలి ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కార్మికులనుద్దేశించిన పథకాల ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి. ♦భవన, ఇతర నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ మండలి అన్ని నిర్మాణసంస్థల నుంచి ఒక శాతం సెస్ వసూలు చేయగా వచ్చిన నిధులతో ఆ కార్మికుల ప్రయోజనం కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం బోర్డులో 19.68 లక్షల మంది కార్మికులు పేర్లను నమోదు చేసుకున్నారు. కార్మికులకు వివాహ బహుమతి కింద రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే, సహా యం కింద రూ.6 లక్షలు, ఆసుపత్రుల్లో చేరితే నెలకు రూ.4,500 చొప్పున 3 నెలలు సాయం చేస్తారు. ప్రసూతి ప్రయోజనం కోసం రూ.30 వేలు, సహజ మరణమైతే రూ.లక్ష, శాశ్వత వైకల్యమైతే రూ.4 లక్షలు ఇస్తారు. పేర్లు నమోదు చేసుకోనివారికి రూ.50 వేలు, మరణించినవారి అంత్యక్రియలకు రూ.30 వేలు ఇస్తారు. ♦ఫ్యాక్టరీలు, దుకాణాలు, సంస్థలు, మోటారు రవాణాసంస్థల కార్మికుల పిల్లలకు తెలంగాణ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ రూ.1,000 నుంచి రూ.2,,000 వరకు స్కాలర్షిప్లు ఇస్తోంది. ♦రాష్ట్ర అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా మండలిని ఇటీవలే ఏర్పాటు చేశారు. ఈ–శ్రమ్ పోర్టల్‌లో ఇప్పటివరకు 35.41 లక్షల మంది కార్మికులు పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. ♦రవాణా, రవాణేతర ఆటోడ్రైవర్లు, వర్కింగ్ జర్నలిస్టులు, హోంగార్డుల కోసం ప్రమాద మరణ బీమా పథకాన్ని కార్మిక శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం కింద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తారు. -
1982 తర్వాత అమెరికాలో మళ్లీ మొదలైన ‘సెగ’
వాషింగ్టన్: అమెరికా ద్రవ్యోల్బణం సెగ చూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ఫెడ్ పెద్ద చేత్తో మార్కెట్లోకి నిధులు కుమ్మరించింది. దీంతో గడిచిన ఏడాది కాలంలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ నాలుగు దశాబ్దాల్లోనే గరిష్ట స్థాయి అయిన 7.5 శాతాన్ని తాకింది. 2022 జనవరి నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం 7.5 శాతానికి చేరినట్టు అమెరికా కార్మిక శాఖ గురువారం ప్రకటించింది. ఇలా ద్రవ్యోల్బణం ఏడాది కాలంలో కట్టలు తెంచుకోవడం అమెరికా చరిత్రలో చివరిగా 1982లో చోటు చేసుకుంది. ఆహారం, ఇంధనం, అపార్ట్మెంట్ అద్దెలు, విద్యుత్ చార్జీలు పెరగడం ద్రవ్యోల్బణం సెగలకు కారణాలు. 2021 డిసెంబర్ చివరి నుంచి చూస్తే ఒక నెలలో ద్రవ్యోల్బణం 0.6% పెరిగింది. గత సెప్టెంబర్ నుంచి అక్టోబర్‌కు 0.9%, అక్టోబర్ నుంచి నవంబర్‌కు 0.7% చొప్పున ధరలు పెరిగాయి. ఫెడ్ పెద్ద ఎత్తున నిధులు జొప్పించడం, వడ్డీ రేట్లు అత్యంత కనిష్ట స్థాయిలో ఉండడం, బలమైన వినియోగ డిమాండ్ ద్రవ్యోల్బణం రెక్కలు విప్పుకోవడానికి తోడ్పడ్డాయి. -
తొమ్మిది కీలక రంగాల్లో ఉద్యోగులు 3.10 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ తొమ్మిది కీలక రంగాల్లో 2021–22 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.10 కోట్లకు చేరిందని కార్మిక శాఖ త్రైమాసిక సర్వే గణాంకాలు వెల్లడించాయి. త్రైమాసికంగా చూస్తే, (ఏప్రిల్–జూన్) ఈ సంఖ్య రెండు లక్షలు పెరిగిందని పేర్కొంది. ఏప్రిల్–జూన్ మధ్య ఈ ఉద్యోగుల సంఖ్య 3.08 కోట్లు. 2013–14లో తొమ్మిది రంగాల్లో ఉద్యోగుల సంఖ్య 2.37 కోట్లు. ఆర్థిక రికవరీకి తాజా గణాంకాలు సంకేతమని వివరించింది. గణాంకాల్లోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2021 ఏప్రిల్‌లో మొదలైన కోవిడ్–19 సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రాలు విధించిన పరిమితులను ఎత్తివేసిన తర్వాత అధిక ఉపాధి సంఖ్య నమోదయ్యింది. ఇది ఆర్థిక కార్యకలాపాలలో మెరుగుదలను ప్రతిబింబిస్తోంది. ► 10 మంది లేదా అంతకుమించి ఉద్యోగులు ఉన్న సంస్థలను మాత్రమే సర్వేలో పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. సర్వేకు మొత్తం 12,038 సంస్థలను ఎంపికచేయగా, వాటిలో 11,503 సంస్థలను స్వయంగా ఫీల్డ్ ఆఫీసర్లు సందర్శించారు. ► ఉద్యోగుల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 32.1 శాతంకాగా, ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇది 29.3 శాతంగా ఉంది. ► సర్వే రంగాల్లో ఉద్యోగుల శాతాన్ని పరిశీలిస్తే తయారీ రంగం వాటా 30 శాతంగా ఉంది. విద్య రంగానికి 20 శాతంకాగా, ఆరోగ్యం, అలాగే ఐటీ–బీపీఓ రంగాల వాటా 10 శాతం చొప్పున ఉన్నాయి. వాణిజ్య, రవాణా రంగాల వాటా వరుసగా 5.3 శాతం, 4.6 శాతంగా ఉన్నాయి. ► మొత్తం సర్వేలోని సంస్థల్లో 90 శాతం 100 మంది కన్నా తక్కువ పనిచేస్తున్నారు. ఐటీ–బీపీఓ సంస్థల్లో 30 శాతం కనీసం 100 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, 12 శాతం సంస్థల్లో 500 ఆపైన ఉద్యోగులు ఉన్నారు. ఆరోగ్య రంగంలో 19 శాతం సంస్థల్లో 100 ఆపైన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. రవాణా రంగం విషయంలో 14 శాతం సంస్థల్లో 100 ఆపైన ఉద్యోగులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ► మొత్తం ఉద్యోగుల్లో రెగ్యులర్ వర్కర్లు దాదాపు 87 శాతం మంది ఉన్నారు. క్యాజువల్ వర్కర్ల శాతం 2 శాతంగా ఉంది. నిర్మాణ రంగంలో 20 శాతం మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఉండగా, 6.4 శాతం మంది క్యాజువల్ వర్కర్లు ఉన్నారు. ► సంస్థల్లో 53.9% గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్, 2017 కింద కార్యకాలాపాలు నిర్వహిస్తున్నాయి. 27.8 శాతం షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1958 పనిచేస్తున్నాయి. ► విద్య, ఆరోగ్య రంగాలను మినహాయిస్తే, మిగిలిన ఏడు రంగాల్లో ఉద్యోగుల విద్యార్హతలను సర్వే పరిశీలిసింది. వీటిల్లో 28.4 శాతం మంది ఇంటర్మీడియట్, 10వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదివారు. 37 శాతం మంది గ్యాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ విద్యాభ్యాసం చేశారు. ఐటీ–బీపీఓ రంగాల్లో గ్యాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ విద్యాభ్యాసం చేసిన వారి సంఖ్య అత్యధికంగా 91.6 శాతం ఉంటే, ఫైనాన్షియల్ సేవల విభాగంలో ఇది 59.8 శాతంగా ఉంది. ఆరోగ్య రంగంలో ఇంటర్మీడియట్, 10వ తరగతి ఆలోపు చదివినవారి సంఖ్య 18 శాతం. విద్యా రంగంలో ఈ తరహా విద్యార్హత నాన్ టిచింగ్ స్టాఫ్‌లో 26.4 శాతం మంది ఉన్నారు. ఈ రెండు రంగాల్లో (ఆరోగ్యం, విద్య) కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారి సంఖ్య 40 శాతంగా ఉంది. ► 16.8 శాతం సంస్థలు తమ స్వంత ఉద్యోగుల కోసం అధికారిక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల ను అందిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన అ ం శా ల్లో ఇది ఒకటని కార్మికశాఖ ప్రకటన తెలిపింది. తొమ్మిది రంగాలు ఇవి... సర్వే జరిపిన తొమ్మిది కీలక రంగాల్లో తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, ఆతిథ్యం, ఐటీ–బీపీఓ, ఫైనాన్షియల్ సేవలు ఉన్నాయి. వ్యవసాయేతర సంస్థలకు సంబంధించి మెజారిటీ ఉపాధి కల్పనా అవకాశాలను ఈ రంగాలు అందిస్తున్నాయి. -
ఖాళీ ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయండని చెప్పా..
సాక్షి, అమరావతి: పోలీసులు రైతులకు చెందిన ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయండని చెప్పిన మాట వాస్తవమని, తాను చెప్పిన దాంట్లో ఎక్కడైనా దౌర్జన్యంగా, తప్పుగా మాట్లాడింది లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధిలోను, సంక్షేమంలోను దూసుకెళుతుండటంతో ఎల్లో మీడియాకు వార్తలు కరువై తనలాంటి వారిపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డా రు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన లోకేశ్‌కు తన గురించి మాట్లాడే యోగ్యతే లేదన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. లోకేశ్ అడ్డదారుల్లో రాజకీయాల్లోకి వచ్చి పదవులు వెలగబెట్టిన నేత అని దుయ్యబట్టారు. మాటకొస్తే టీడీపీ నేతలు దందాలు దందాలు అంటారని, దందాగిరీ చేసేందుకు తానేమీ అంతర్రాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్ని కాదని చెప్పారు. నిజంగా పోలీసులతో దౌర్జన్యంగా మాట్లాడితే అది తప్పవుతుందన్నారు. రైతులపై అభిమానంతో వారి ఖాళీ ట్రాక్టర్లు వదలండి అని మాత్రమే చెప్పానన్నారు. ఖాకీ యూనిఫాం నిఖార్సుగా పనిచేస్తున్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనేనని పేర్కొన్నారు. రామరాజ్యం స్థాపన కోసం ప్రయత్నించే సీఎం జగన్ ఇలాంటివి ప్రోత్సహించరని చెప్పారు. తనపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకోవద్దని టీడీపీ నేతలను కోరుతున్నానన్నారు. బుధవారం సీఎం జగన్‌ను కలుసుకున్నానని, నియోజకవర్గ సమస్యలపైన మాత్రమే మాట్లాడానని చెప్పారు. సీఎంతో సమావేశంలో ఇతర అంశాలు ప్రస్తావనకు రాలేదన్నారు. ఆవగింజ అంత సిగ్గు కూడా లోకేశ్‌కు లేదని విమర్శించారు. తన నియోజకవర్గం కర్ణాటక సరిహద్దున ఉంటుందని చెప్పారు. అర కిలోమీటరు దూరంలోనే పక్క రాష్ట్రంలో మద్యం దొరుకుతుంటే కొందరు వెళ్లి తాగి వస్తుంటారని, ఇది తన దురదృష్టమని పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా అవాకులు చెవాకులు మాట్లాడుతున్న లోకేశ్.. బహిరంగంగా వస్తే తాను మాట్లాడతానని చెప్పారు. అక్కడ తాగి ఇక్కడికి వచ్చేవారిని చూసి మద్యం ఏరులై పారుతోందంటే తానేం చేయగలనన్నారు. తనపై ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎంగా జగన్ ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. రాజ్యాంగం చెప్పినదానికి మించి రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతోందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఇక టీడీపీకి భవిష్యత్తు ఉండదని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్‌లకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ’జామాత దశమ గ్రహం’ అని ఎన్టీఆర్ ఆనాడే సర్టిఫికెట్ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. -
కార్మికులకు మెరుగైన వైద్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. కార్మికులకు ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గుణదల మోడల్ డిస్పెన్సరీలో ఆన్లైన్ విధానాన్ని సోమవారం కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మితో కలిసి మంత్రి జయరాం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కార్మికుల సొమ్మును కూడా దోచుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సొమ్మును వారి వైద్యం, సంక్షేమం కోసమే ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా కార్మికులు వారి సమయాన్ని ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే.. రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందనే నమ్మకంతో సీఎం వైఎస్ జగన్.. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందే అవకాశాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్ ఇప్పుడు ప్రతి ఒక్క జబ్బును ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమంతో పాటు విద్య, ఆరోగ్యానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్లైన్ సేవల విధానాన్ని 78 డిస్పెన్సరీలు, 4 ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అమలు చేస్తామన్నారు. ఈఎస్ఐ డైరెక్టర్ ఎల్‌ఎస్‌బీఆర్ కుమార్, కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, ప్రాంతీయ సంచాలకులు కాశీనాథన్ పాల్గొన్నారు. -
ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ యథాతథం
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీరేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) యథాతథంగా 8.5 శాతంగా కొనసాగనుంది. రిటైర్మెంట్ ఫండ్ వ్యవహారాలను నిర్వహించే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్స్ (ఈపీఎఫ్ఓ) అత్యున్నత నిర్ణాయక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ కీలక నిర్ణయం తీసుకుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2019–20లో కూడా ఈపీఎఫ్ఓ 8.5 శాతం వడ్డీని తన చందాదారులకు అందించింది. ప్రకటన ప్రకారం జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో గురువారం కార్మిక, ఉపాధి శాఖల సహాయంత్రి (ఇండిపెండెంట్ చార్జ్) సంతోష్ కుమార్ నేతృత్వంలో సీబీటీ సమావేశం జరిగింది. వడ్డీరేటుపై తన నిర్ణయాన్ని సీబీటీ ఆర్థిక శాఖ ఆమోదం కోసం నివేదిస్తుంది. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. అనంతరం తన క్రియాశీల చందాదారుల అకౌంట్లలో 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ జమ చేస్తుంది. ఐదు కోట్లకుపైగా చందాదారులు ప్రకటన ప్రకారం, ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఐదు కోట్లకుపైగా చందాదారులను కలిగిఉంది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని సీబీటీ తాజా నిర్ణయం తీసుకుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీ అసెట్స్‌లో తన మొత్తం నిధుల్లో 5%తో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు ప్రస్తుతం 15%కి చేరాయి. 2018–19లో ఈపీఎఫ్ఓ చందాదారులకు లభించిన వడ్డీ 8.65%. దీన్ని 8.5%కి తగ్గిస్తూ, గతేడాది మార్చిలో నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం, భారీ ఉపసంహరణల నేపథ్యంలో వడ్డీరేటు మరింత తగ్గుతుందన్న అంచనాలకు భిన్నం గా ట్రస్టీల బోర్డ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
హెచ్ 1బీ వీసా లాటరీ విధానానికి చెల్లు చీటీ
వాషింగ్టన్: హెచ్1 బీ వీసా ఎంపికకు ఇప్పటివరకు వాడుతున్న లాటరీ విధానాన్ని తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అధిక వేతనాలు, అత్యున్నత నైపుణ్యాల ఆధారంగా ఇక హెచ్ 1 బీ వీసాలను జారీ చేయనున్నట్లు మంగళవారం అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ (డీఓఎల్) ప్రకటించింది. తాజా మార్పులతో హెచ్ 1 బీ వీసాతో, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్‌తో యూఎస్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారి వేతనాలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది. విదేశాల నుంచి చవకగా లభించే ఉద్యోగుల వల్ల అమెరికన్ ఉద్యోగులు ఎదుర్కొనే ముప్పును తొలగించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. తాజా నిబంధనలు ఈ సంవత్సరం మార్చి 9 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయం ప్రధానంగా భారతీయ టెక్కీలపై, అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. తాజా నిబంధనల ప్రకారం.. సంబంధిత రంగంలో ఉద్యోగికి లభిస్తున్న సగటు వేతనం కన్నా ఎక్కువ వేతనం అందించేందుకు సిద్ధమైన కంపెనీల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తారు. అమెరికా ఏటా జారీ చేసే 85 వేల హెచ్1బీ వీసాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఆక్యుపేషనల్ ఎంప్లాయిమెంట్ స్టాటిస్టిక్స్ (ఓఈఎస్) డేటా ఆధారంగా వివిధ ఉద్యోగ విభాగాల్లో వేతనాలను, నాలుగు స్థాయిలుగా (4 లెవెల్స్) విభజించి, డీఓఎల్ నియంత్రిస్తుంది. తాజా మార్పుల ప్రకారం.. ఈ స్థాయుల్లో కనీస వేతన స్థాయి భారీగా పెరగనుంది. అలాగే, భారత్ సహా విదేశీ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్1బీ వీసా పొందేందుకు భారీగా వేతనాలను ఇవ్వాల్సి ఉంటుంది. రెండేళ్ల అనుభవం ఉన్నవారిపైనా ప్రభావం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విదేశీ విద్యార్థులపై, అలాగే, కాలేజీ అనంతరం ఒకటి, రెండేళ్ల అనుభవం ఉన్నవారిపై కూడా ఈ మార్పులు భారీగా ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. వేతనాల ఆధారంగా హెచ్1బీ వీసాలను జారీ చేసే విధానంలో.. అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, సీనియర్లకు ప్రాధాన్యత లభించడం వల్ల విద్యార్థులు, తక్కువ అనుభవం ఉన్నవారు ఆ మేరకు నష్టపోనున్నారు. విదేశీ విద్యార్థులు ప్రధానంగా లెవెల్ 1 పరిధిలోకి వస్తారు. అయితే, తాజా నిబంధనలు విద్యార్థులపై ప్రభావం చూపబోవని యూఎస్సీఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) పేర్కొంది. వారి ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) సమయాన్ని అధిక వేతనం పొందగల స్థాయికి వెళ్లేలా అనుభవం పొందేందుకు వినియోగించుకునే అవకాశముందని వివరించింది. అయితే, కేవలం ‘స్టెమ్’ విద్యార్థులకు మాత్రమే మూడేళ్ల ఓపీటీ ఉంటుంది. మిగతా విభాగాల విదేశీ విద్యార్థులు కేవలం ఒక సంవత్సరం ఓపీటీకే అర్హులు. మరోవైపు, మాస్టర్స్ డిగ్రీ ఉన్న, ఓపీటీ ద్వారా కొంత అనుభవం పొందిన విద్యార్థులు లెవెల్ 2 ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. కానీ, ఈ లెవెల్ హెచ్1బీ వీసా దరఖాస్తుల్లో పోటీ అత్యంత తీవ్రంగా ఉండటంతో వారికి వీసా లభించడం దాదాపు అసాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు 50% పైగా దరఖాస్తులు ఈ లెవెల్ నుంచే వస్తాయన్నారు. ఈ ప్రతిపాదనలపై గతంలో జరిపిన అభిప్రాయ సేకరణలో పలు విశ్వవిద్యాలయాలు ఈ మార్పులపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. విద్యాభ్యాసం అనంతరం ఉద్యోగం లభించే విషయంలో నెలకొనే అనిశ్చితి వల్ల విదేశీ విద్యార్థులు అమెరికాను ఉన్నత విద్యకు ఎంపిక చేసుకోకపోవచ్చని పేర్కొన్నాయి. -
శ్యామల ఎవరో నాకు తెలియదు: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తనపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూమిని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని ఆయన అన్నారు. మంత్రి మల్లారెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆ శ్యామలదేవి ఎవరో కూడా తెలియదు. నా భూమి పక్క భూమి ఆమెది అని తెలుస్తుంది. ఇప్పటికే నాకు చాలా భూమి ఉంది. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. ఒక మహిళకు మంత్రిగా సహాయం చేయడానికి సిద్ధం. శ్యామల అనే మహిళ ... నన్ను ఇప్పటివరకూ కలవలేదు. నేను ఎవరినీ బెదిరించలేదు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే’ అని స్పష్టం చేశారు. (మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు) కాగా భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్ ఠాణాలో ఈ నెల 6వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంత్రితో పాటు ఆయన కుమారుడిపై కూడా కేసు నమోదు అయింది. -
మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
దుండిగల్: ఓ భూవివాదంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్ ఠాణాలో ఆరో తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తల్లి పద్మావతి పేరుపై ఉన్న భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, మంత్రితో పాటు ఆయన కుమారుడు, వారి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పద్మావతి కుమార్తె శ్యామలాదేవి హైకోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. బాధితురాలు శ్యామలాదేవి ఫిర్యాదు ప్రకారం... తల్లి పొన్నబోయిన పద్మావతి పేరుపై సూరారం సర్వే నంబర్ 115, 116, 117లలో 2.13 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని విక్రయించాలంటూ మంత్రి తన అనుచరులతో బెదిరించారు. దీనిపై 2017లో పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. దీంతో తల్లి పద్మావతితో కలిసి కోర్టులో మల్లారెడ్డిపై భూవివాదానికి సంబంధించిన పిటిషన్ వేసేందుకు న్యాయవాది లక్ష్మీనారాయణను ఆశ్రయించారు. అయితే మంత్రితో చేతులు కలిపిన న్యాయవాది లక్ష్మీనారాయణ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకని బాధితులనుంచి స్టాంప్ పేపర్‌పై సంతకాలు తీసుకున్నాడు. వాటి ఆధారంగా మల్లారెడ్డి అనుచరుడు గూడూరు మస్తాన్‌కు ఆ భూమిని అమ్మేందుకు రూ.ఎనిమిది లక్షలతో అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా నకిలీ అగ్రిమెంట్ పేపర్లను తయారు చేశారు. దీన్ని అడ్డుపెట్టుకొని పద్మావతి, శ్యామలాదేవిలను ఆ భూమిలోకి రానివ్వలేదు. ఈ ఒత్తిడులు ఇలా ఉన్న సమయంలోనే కొన్ని నెలల క్రితం శ్యామలాదేవి తల్లి పద్మావతి, సోదరి మరణించారు. దీంతో ఒంటరిగా ఉన్న తనకు ప్రాణహాని ఉందంటూ, మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్యామలాదేవి దుండిగల్ పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయలేదు. దీంతో కోర్టులో శ్యామలాదేవి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. -
హెచ్1బీ శిక్షణకు 1,105 కోట్లు
వాషింగ్టన్: హెచ్1బీ వీసాలపై వివిధ రకాల ఉద్యోగాలు చేయడానికి వచ్చే మధ్యస్త, ఉన్నత స్థాయి నైపుణ్యాలు గల వారికి శిక్షణ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం రూ.1,105 కోట్లు ఖర్చు చేయనుంది. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, రవాణా తదితర రంగాల్లో హెచ్–1బీ వీసా హోల్డర్లు ఎక్కువగా ఉంటారు. వీరిలో నైపుణ్యం పెంచేందుకు తాజా పెట్టుబడులు ఉపయోగపడతాయని కార్మిక శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంతో భారతీయ నిపుణులు ఎక్కువగా లాభం పొందనున్నారు. విద్యార్థులు, పరిశోధకుల వీసాలకు నిర్ణీత గడువు విదేశీ పరిశోధకులు, విద్యార్థులు, జర్నలిస్టులకు ఇచ్చే వీసాలకు నిర్ణీత గడువు విధించాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న సులువైన వీసా విధానం దుర్వినియోగం అవుతోందనీ, దీనివల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. పైన పేర్కొన్న మూడు రకాల వీసాలతో చైనీయులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. అయితే, నూతన విధానం ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకున్నది కాదని ప్రభుత్వం అంటోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. నాన్ ఇమిగ్రాంట్ విభాగంలోని ఎఫ్, జే (విద్యార్థులు, పరిశోధకుల) వీసాల కాలపరిమితి నాలుగేళ్లు మాత్రమే ఉంటుంది. -
మాజీమంత్రి పితాని పాత్రపైనా ఆరా
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన ఈఎస్ఐ భారీ స్కామ్‌లో అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర ఎంత అనే దానిపైనా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆరా తీస్తోంది. కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు తర్వాత పితాని ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ పాలనలో ఈఎస్ఐలో 988.77కోట్ల నిధులు ఖర్చుపెట్టారు. వీటిలో టెలీ హెల్త్ సర్వీసెస్, మందులు, ఫర్నీచర్, వైద్య సామాగ్రి కొనుగోళ్లతోపాటు అనేక లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. వీటిలో రూ.150 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి.. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసింది. పితాని హయాంలోనూ అవే అక్రమాలు ► పితాని మంత్రిగా వ్యవహరించిన కాలంలోనూ అవే అక్రమాలు, అవకతవకలు కొనసాగినట్టు ఏసీబీ గుర్తించింది. ► పితానికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన మురళీమోహన్, పితాని కుమారుడు వెంకట సురేష్లను నిందితులుగా చేర్చింది. ► హైదరాబాద్‌కు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని ఈఎస్ఐ అధికారులకు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అయినా తన హయాంలో లావాదేవీలు జరగలేదని, ఆ తర్వాతే జరిగాయని ఏసీబీ విచారణలో స్పష్టం చేసిన అచ్చెన్నాయుడు తన తర్వాత పితాని ప్రమేయాన్ని చెప్పకనే చెప్పినట్టయ్యింది. ► తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్ కాంట్రాక్టర్లతో లావాదేవీలు జరిపారని, బిల్లులు చెల్లింపులు వంటి అంశాలపై సురేష్ నేరుగా అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడేవారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ► ఇందుకు సంబంధించి పితాని కుమారుడి ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నట్టు సమాచారం. ► పితాని వ్యక్తిగత కార్యదర్శిని ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ► పితాని కుమారుడు, అతడి మాజీ పీఎస్ ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించగా.. హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో పితాని కుమారుడిని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ బృందాలు పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కాల, భీమవరం, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో గాలింపు ముమ్మరం చేశాయి. అచ్చెన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది. మంగళవారం అచ్చెన్నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. ఏసీబీ అధికారులు చట్టం నిర్దేశించిన విధి విధానాలను పాటించకుండానే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని చెప్పారు. ఇలాంటప్పుడు బెయిల్ మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందన్నారు. ఆ తీర్పు కాపీలు న్యాయమూర్తి ముందు లేకపోవడంతో విచారణ గురువారానికి వాయిదా వేస్తూ జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
లేఖతో.. లెక్కలేనన్ని అక్రమాలు
సాక్షి, అమరావతి: ‘కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో అచ్చెన్నాయుడు అధికార దర్పంతో ఇచ్చిన లేఖలు లెక్కలేనన్ని అక్రమాలకు బీజం వేశాయి. అధికారులపై ఆయన ఒత్తిడి తెచ్చి, గుర్తింపులేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేలా చేశారు. ఆయన ఇచ్చిన మూడు లేఖలే ఏకంగా రూ.150 కోట్ల అవినీతికి ఊతమిచ్చాయి’ అని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై ఏసీబీ అధికారులు ఐపీసీ 409, 420, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగానికి పాల్పడేలా మందులు, పరికరాల కొనుగోళ్లు, టెలీ హెల్త్ సర్వీసెస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేలా ఈఎస్ఐ అధికారులపై వత్తిడి తెస్తూ అచ్చెన్నాయుడు రాసిన మూడు లేఖలతోపాటు పలు ఆధారాలను ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టుకు జత చేశారు. రిమాండ్ రిపోర్టులో అంశాలు ఇలా ఉన్నాయి. – టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కాంట్రాక్టులు ఇవ్వాలని కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు మూడుసార్లు ఒత్తిడి చేశారు. 2016 అక్టోబర్ నుంచి నవంబర్‌లోగా అప్పటి డైరెక్టర్ రమేష్‌కుమార్‌కు మూడుసార్లు లేఖలు ఇచ్చారు. – ఎటువంటి టెండర్లు పిలవకుండా, నిబంధనలు పాటించకుండా టెలీ హెల్త్ సర్వీసెస్‌కు నామినేషన్ పద్ధతిలో కేటాయించడం వెనుక అచ్చెన్నాయుడు ఒత్తిడే కారణం. – అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకే రూ.4.15 కోట్లను విడుదల చేశామని అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు. – నిబంధనలను పాటించకుండానే టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్టులు ఇచ్చారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోలేదు. బడ్జెట్ ఆమోదం కూడా లేదు. కాంట్రాక్టు పొందిన సంస్థకు గత అనుభవం కూడా లేదు. – మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు చాలా పలుకుబడి ఉంది. ఈ కేసులో చాలా మందిని విచారించాల్సి ఉంది. సాక్ష్యాలను, డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉంది. అయితే అచ్చెన్నాయుడి పలుకుబడి ఈ కేసుపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. – ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసులో మొదటి నిందితుడు డాక్టర్ రమేశ్‌కుమార్, రెండవ నిందితుడు అచ్చెన్నాయుడులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలి. -
అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్
సాక్షి, అమరావతి/గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన కార్మిక శాఖ మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడుకు ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. శుక్రవారం ఆయనను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసి శనివారం తెల్లవారుజామున ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స చేయించుకున్న విషయాన్ని ఏసీబీ అధికారులు, ఆయన తరఫు న్యాయవాది ప్రస్తావించడంతో రిమాండ్ విధించిన న్యాయమూర్తి.. వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. దీంతో ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించి రిమాండ్ ఖైదీగా నమోదు చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ 1573 కేటాయించారు. గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు – జైలులో రిమాండ్ నమోదు ప్రక్రియ పూర్తయిన అనంతరం శనివారం ఉదయం అచ్చెన్నాయుడిని గుంటూరులోని ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి(జీజీహెచ్)కి వైద్య సేవల నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. – ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉందని తెలిపారు. – ఇన్ఫెక్షన్ పెద్దదైతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావొచ్చని చెప్పారు. 90 శాతం ఆయనకు మళ్లీ ఆపరేషన్ అవసరం ఉండదని స్పష్టం చేశారు. షుగర్ నార్మల్‌గానే ఉందని, బీపీకి మందులు కొనసాగిస్తున్నామని వివరించారు. – ఇదిలావుంటే.. అచ్చెన్నాయుడు సోమవారం నాటికి కోలుకుని సబ్‌జైలుకు తరలించే అవకాశం ఉంటే.. విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. – అరెస్ట్ చేసిన వెంటనే అచ్చెన్నాయుడిని కోర్టుకు తరలించినందున ఈఎస్ఐ కుంభకోణంలో మరింత లోతైన విచారణ చేసే అవకాశం లేకపోయిందని, అందువల్ల మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని ఏసీబీని కోరనున్నట్టు సమాచారం. చంద్రబాబుకు అనుమతి నిరాకరణ అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుంటూరు వచ్చారు. అచ్చెన్నాయుడిని కలిసేందుకు మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని పోలీసులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. జైళ్ల శాఖ సైతం అనుమతి నిరాకరించింది. దీంతో చంద్రబాబు బయటి నుంచే అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆ కుటుంబంపై బురద చల్లేందుకే.. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కుటుంబం అచ్చెన్నదని, ఆ కుటుంబంపై బురద చల్లేందుకే ఆయనను అరెస్ట్ చేశారని విమర్శించారు. పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని 24 గంటల్లో 500 కిలోమీటర్లు తిప్పడం వల్ల రక్తస్రావం అయ్యిందన్నారు. 300 మంది పోలీసులు అచ్చెన్నాయుడి ఇంటిని చుట్టుముట్టి ఉన్నపళంగా అరెస్ట్ చేసి తీసుకువచ్చారన్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు, విజిలెన్స్ రిపోర్టులతో అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రలోభాలకు గురిచేసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వశపర్చుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర, కొల్లు రవీంద్ర, ఇతర నాయకులు ఉన్నారు. భౌతిక దూరం మరిచి... అచ్చెన్నాయుడి పరామర్శ పేరుతో జీజీహెచ్‌కు వచ్చిన టీడీపీ నాయకులు భౌతిక దూరాన్ని మరిచారు. గుంపులు గుంపులుగా చంద్రబాబు చుట్టూ చేరారు. భౌతిక దూరం పాటించాలని పోలీసులు చెబుతున్నా పట్టించుకోకుండా గుమిగూడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో రోగులు, వ్యాధిగ్రస్తులు ఉండే జీజీహెచ్‌లోకి టీడీపీ నాయకులు గుంపులుగా రావడం, భౌతిక దూరం పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
విధుల్లోకి చేర్చుకోకపోతే మీకు జైలు తప్పదు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 అధికారి అయిన ఏఎం ప్రసాదరాజును కార్మిక శాఖ సహాయ కమిషనర్‌గా కొనసాగించాలని, లేదంటే కార్మిక శాఖ కమిషనర్ నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని, రూ.2 వేలు జరిమా నా కూడా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ప్రసాదరాజుకు 2019 ఫిబ్రవరి నుంచి వేతనాన్ని 7 శాతం వడ్డీతో 6 వారాల్లోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కోర్టు తీర్పుచెప్పింది. ఏఎం ప్రసాదరాజు ఉమ్మడి ఏపీలోని ఏపీపీఎస్సీ–2005 గ్రూప్–2 కేడర్ అధికారి. 2018లో వరంగల్‌లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. అయితే 2005 నాటి గ్రూప్–2 అధికారుల లిస్ట్‌ను సవరించేసరికి ప్రసాదరాజు పేరు జాబితాలో గల్లంతయ్యింది. జోన్ 4లో ఏపీలోని కర్నూలుకు డిప్యూటీ కేడర్ లిస్ట్‌లో ఆయన పేరు చేరింది. దీంతో ప్రసాదరాజును 2018 జూన్ 29న తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ రిలీవ్ చేశారు. గ్రూప్–2 అధికారులు సుప్రీంను ఆశ్రయించడంతో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులిచ్చింది. దీం తో ప్రసాదరాజును కర్నూలులో విధుల్లో చేర్చుకునేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. ఈ నేప థ్యంలో ప్రసాదరాజు హైకోర్టును ఆశ్రయించారు. ప్రసాదరాజును అసిస్టెం ట్ లేబర్ ఆఫీసర్‌గా కొనసాగించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడిందని తిరిగి ప్రసాదరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఒకసారి తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేశాక తమకు సంబంధం లేదని తెలంగాణ సర్కార్ వాదించింది. ఈ వాదనల తర్వాత తామిచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసే వరకూ ప్రసాదరాజును విధుల్లోకి తీసుకోవాలని, ఉపాధి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శులు కోర్టు ఖర్చుల నిమిత్తం పిటిషనర్‌కు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, పి. కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. -
కాలితో తొక్కితే చాలు.. చేతిలోకి శానిటైజర్ చుక్కలు..
సాక్షి, హైదరాబాద్: ఇకపై శానిటైజర్ బాటిల్‌ను చేతితో నొక్కాల్సిన పనిలేదు. కాలితో తొక్కితే చాలు...మీ చేతిలో శానిటైజర్ చుక్కలు పడతాయి. ఇందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రత్యేకంగా మెషిన్ రూపొందించింది. ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ) విద్యార్థుల సాయంతో దీన్ని తయారు చేసింది. చేతితో శానిటైజర్ బాటిల్‌ను పట్టుకోవడంతో వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందనే వాదన ఉంది. ఈ క్రమంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో కొందరు ఐటీఐ విద్యార్థులు ఈ పరికరానికి రూపకల్పన చేశారు. దీన్ని ఇటీవల మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు ఉచితంగా అందించారు. త్వరలో వంద మిషన్లు తయారు చేసి డిమాండ్ ఉన్న సంస్థలకు అందించనున్నట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కె.వై.నాయక్ తెలిపారు. 40వేల మాస్కుల ఉచిత పంపిణీ ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో కుట్టుమిషన్ ట్రేడ్ ఉన్న వాటిల్లో మాస్కుల తయారీకి కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఆదేశించింది.ప్రస్తుతం 15 ప్రభుత్వ ఐటీఐలు, 5 ప్రైవేటు ఐటీఐలలో మాస్కులను తయారు చేస్తున్నారు. ఐసీఎంఆర్, వైద్య,ఆరోగ్య శాఖ సూచనల ఆధారంగా వీటిని రూపొందిస్తున్నారు. మాస్కులు కొనుగోలు చేయలేని కూలీలు, పేదలకు వీటిని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించి.. ఇప్పటివరకు తయారు చేసిన 40వేల మాస్కులను ఉచితంగా పంపిణీ చేసినట్టు ఆ శాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్ తెలిపారు. ఆన్లైన్లో ఐటీఐ శిక్షణ: ఐటీఐల్లోనూ ఆన్లైన్ బోధన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న చైన్నైలోని నేషనల్ ఇన్స్ట్రక్షన్ మీడియా ఇన్స్టిట్యూట్ టీచింగ్ ఫ్యాకల్టీ సాయంతో ప్రస్తుతం 63 ప్రభుత్వ ఐటీఐలు, 13 ప్రైవేటు ఐటీఐలలోని విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుండగా... ఈ వారాంతంలోగా అన్ని ప్రైవేటు ఐటీఐలలోని విద్యార్థులకు ఆన్లైన్ బోధన అందుబాటులోకి రానుంది. -
నిర్మాణ రంగ కార్మికులకు...ఆర్థిక భరోసా..!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈమేరకు కార్మిక శాఖ రూపొందించిన ఆర్థిక సాయం ప్రతిపాదనలను సమీక్షిస్తోంది. రాష్ట్రంలో నెల రోజులుగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఫలితంగా భవన, ఇతర నిర్మాణ రంగంలో పనులన్నీ నిలిచిపోయాయి. కొత్త ప్రాజెక్టుల సంగతి అటుంచితే ఇప్పటివరకు కొనసాగుతున్న పనులు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్రంలో మే 7వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్–19 ప్రభావం దృష్ట్యా ఇది పొడిగించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్లో సడలింపులు ఇచ్చినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కఠినంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో నిర్మాణ పనులకు ఇప్పట్లో మోక్షం కలిగే పరిస్థితి లేదు. ఫలితంగా ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈక్రమంలో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలి(టీఎస్‌బీఓసీడబ్ల్యూడబ్ల్యూబీ) ద్వారా ఆర్థిక సాయం అందించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ బోర్డు ద్వారా కార్మికులకు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ప్రమాదవశాత్తు గాయపడ్డ కార్మికుల కుటుంబాలను ఆదుకోవడం, అదేవిధంగా కార్మికుల పిల్లలకు చదువుకుంటున్న కోర్సుకు తగినట్లు ఉపకారవేతనాలు అందించడం వంటి కార్యక్రమాలను బోర్డు అమలు చేస్తోంది.ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ సమయంలో కార్మికులకు ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్త ఊరట ఇవ్వాలని భావించిన బోర్డు ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. రిజిస్టర్డ్ లేబర్ 15.45 లక్షల మంది.. రాష్ట్రంలో భవన, ఇతర నిర్మాణ రంగంలో దాదాపు 54 రకాల విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు 20 లక్షల మంది ఉన్నారు. అయితే బోర్డులో వివరాలను నమోదు చేసుకుని పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు 15.45 లక్షల మంది. వీరిలో పురుషులు 9.22 లక్షలు, మహిళలు 6.23 లక్షల మంది ఉన్నారు. వీరు తమ వివరాలను బోర్డులో ఏటా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెన్యువల్ చేసుకున్న వారు 8.28 లక్షలు. అయితే బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న వారికి రూ.1,000 లేదా రూ.1,500 వంతున ఆర్థిక సాయం ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.బోర్డు వద్ద ఉన్న నిధులకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. వీటిని ప్రభుత్వం ఆమోదిస్తే ఆర్థిక సాయం చేసే అంశానికి మార్గం సుగమమవుతోంది. కుటుంబానికా... ఒక్కొక్కరికా... బోర్డులో పేరు నమోదు చేసుకున్న వారు 15.45 లక్షలు మంది ఉన్నారు. వీరిలో ఒక కుటుంబం నుంచి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. చాలావరకు భార్య, భర్త ఇరువురి పేర్లున్నాయి. వీరికి ఆర్థిక సాయం ఎలా చేయాలనే దానిపై అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా సాయం అందిస్తే ఎక్కువ మొత్తంలో నిధులు అవసరమవుతాయని భావించిన అధికారులు... కుటుంబంలో ఒకరికి సాయం చేసే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదేవిధంగా ఒక్కో సభ్యుడికి విడిగా సాయం అందిస్తే ఖర్చయ్యే మొత్తాన్ని కూడా మరో ప్రతిపాదనగా తయారు చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం కోసం చూస్తున్నారు. -
వేతనాలిచ్చిన సంస్థలకే రాయితీ!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం అమలుపై కార్మిక శాఖ దృష్టి సారించింది. గత నెల 24 నుంచి కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. వచ్చే నెల 3 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో వందలోపు కార్మికులున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందా ను ప్రభుత్వం భరించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కార్మిక శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఉద్యోగులకు నెలవారీ వేతనం చెల్లించిన సంస్థలే ఈపీఎఫ్ రాయితీలను పొందే వీలుంటుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఈసీఆర్ జనరేట్ చేయాల్సిందే.. వందలోపు ఉద్యోగులుండి అందులో 90 శాతం మంది వేతనాలు 15 వేల లోపు ఉన్న సంస్థలకే ఈపీఎఫ్ రాయితీ వర్తిస్తుంది. ఇలాంటి కంపెనీలోని ఉద్యోగుల వేతనం ప్రకారం.. కంపెనీ వాటా12%తో పాటు ప్రభుత్వం చెల్లించే వాటా 12% కలుపుకుని మొత్తం 24% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉద్యోగులకు నెలవారీ వేతనం చెల్లించిన తర్వాత ఈపీఎఫ్ చందాను ఆన్లైన్ పద్ధతిలో చెల్లించిన తర్వాత ఈసీఆర్ (ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్)ను కార్మిక శాఖకు, ఈపీఎఫ్ఓకు సమర్పిస్తుం ది. తాజాగా రాయితీ పొందే సంస్థలు వేతనాల ను చెల్లించి ఆ వివరాలను కార్మిక శాఖకు సమర్పించాలి. అలా ఈసీఆర్లను సమర్పించిన తర్వా త కార్మిక శాఖ అధికారులు వాటిని పరిశీలించి ఉద్యోగుల ఈపీఎఫ్ చందాను వారి యూఏఎన్ నంబర్‌కు బదిలీ చేస్తారు. ఈ క్రమంలో రాయితీ పొందే ప్రతి కంపెనీ ఉద్యోగి పూర్తి వేతనాలను సక్రమంగా చెల్లించాల్సిందే. వేతనంతో కూడిన సెలవులు.. లాక్డౌన్ కాలంలో ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేసింది. ఈ సమయంలో ఉద్యోగులు విధులకు హాజరు కానప్పటికీ వేతనాలు చెల్లించాలి. కొన్ని కంపెనీలు పనిచేసిన కాలానికే వేతనాలు ఇస్తున్నట్లు కార్మిక శాఖ దృష్టికి వచ్చింది. వీటిపై కార్మికులు లేదా ఉద్యోగులు కార్మిక శాఖను సంప్రదించి ఫిర్యాదు చేస్తే కార్మిక చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు చీఫ్ లేబర్ కమిషనర్ స్పష్టం చేశారు. -
ఏ ఒక్కరినీ తొలగించొద్దు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఒక్క కార్మికుడిని కూడా ఉద్యోగం నుంచి తొలగించరాదని, మే నెలలో కూడా కార్మికులు, ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని రాష్ట్రంలోని పరిశ్రమల యాజమాన్యాలకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. పరిశ్రమలు మూతపడటంతో కార్మికుల్లో ఆందోళన నెలకొందని,∙విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పరిశ్రమల యాజమాన్యంపై ఉందని కోరారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలసి సోమ వారం జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూం నుంచి అన్నిజిల్లాల కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల చెల్లింపు విషయంలో పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం పలు వెసులుబాట్లు కల్పించిందని గుర్తు చేశారు. వారి బాధ్యత మనమీదే... శాశ్వత ఉద్యోగులతో పాటు వలస కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మానవీయకోణంలో వలస కార్మికులకు కూడా 12 కిలోల బియ్యాన్ని, రూ.500 నగదును ప్రభుత్వం ఇస్తుందన్నారు. పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. ఫ్యాక్టరీల వద్దే ఉండిపోయిన కార్మికులకు నిత్యావసరాలు అందించాల్సిన బాధ్యత తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్‌కార్డులేని వారికి బియ్యం, నగదు మంజూరు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కల్పించామన్నారు. పని ప్రదేశాల్లో ఉన్న కార్మికులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వలస కార్మికులు రోడ్డు మీదకు వస్తే ఇప్పటి వరకు అమలు చేసిన లాక్డౌన్ వృథా అవుతుందని, అందుకే ఎక్కడి కార్మికులను అక్కడే ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్లలోనే రంజాన్ పవిత్ర రంజాన్ నెల ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకుంటూ కరోనా వైరస్ నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా సహకరిం చనున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వీడియో కాన్ఫరెన్స్ కోసం వచ్చిన మంత్రి కేటీఆర్ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిలను ముస్లిం మత పెద్దలు ఖుబుల్ పాషా సత్తారి, ముఫ్తీ ఖలీల్ అహ్మద్, మహ్మద్ పాషా, ఇఫ్తెకారి పాషాల బృందం స్వచ్ఛందంగా కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటించడానికి తమ ఇళ్ల వద్దనే అన్ని ప్రార్థనలు నిర్వహించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. -
కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కార్మికుల సొమ్మును కాజేసిన పచ్చ నేతల అవినీతి బండారం బట్టబయలైంది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు పనులను నామినేషన్‌పై అప్పగించాలని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సిఫారసు లేఖ ఇచ్చినట్లు ఇప్పటికే విజిలెన్స్ విచారణలో వెలుగులోకి రావడం తెలిసిందే. అనంతరం కార్మిక శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి మంత్రి పితాని సత్యనారాయణకు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు తాజా లేఖలు వెల్లడిస్తున్నాయి. కార్మిక రాజ్య బీమా సంస్థ పరిధిలోని దాదాపు 12.5 లక్షల మంది కార్మికులు, 38 లక్షల మంది కుటుంబ సభ్యులు గత సర్కారు అవినీతి వ్యవహారాల వల్ల సరైన వైద్యం పొందలేకపోయారు. ఆ ఇద్దరూ.. ఇష్టారాజ్యం నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నామినేషన్‌పై పనులు కట్టబెట్టాలని లేఖలో సూచించగా అనంతరం ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన పితాని ఇష్టారాజ్యంగా చెల్లింపులు జరిపారు. ఈఎస్ఐ నిబంధనల ప్రకారం ముందు సరఫరా చేసిన వారికి ముందస్తు చెల్లింపులు చేయాలి. ఈమేరకు ఓ ఉన్నతాధికారి మెమో కూడా జారీ చేశారు. అయితే పితాని సత్యనారాయణ కార్మికశాఖ బాధ్యతలు చేపట్టగానే మరో మెమో ఇచ్చారు. 2017 నవంబర్ 28న అధికారులు ఇచ్చిన మెమోను అభయెన్స్‌లో పెడుతూ 2018 ఫిబ్రవరిలో మరో మెమో జారీ అయింది. ఈఎస్ఐ ఉన్నతాధికారులకు అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు రాసిన లేఖ పితాని తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపి కమీషన్లు అందుకున్నారని పేర్కొంటున్నారు. ఆయన కుమారుడు చిన్న కాగితం రాసిచ్చినా ఆర్డర్లు ఇచ్చారు. 2019లో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు జరిగిన చివరి కేబినెట్ సమావేశంలో 500కిపైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ఫైలు పెట్టారు. దీనిపై ‘సాక్షి’లో కథనం వెలువడటంతో అప్పటి సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా ఈ ప్రతిపాదనను రద్దు చేశారు. ఐదేళ్లలో ఇద్దరు మంత్రులూ కార్మికుల కడుపుకొట్టారని, ఏ ఒక్కరికీ మెరుగైన వైద్యం అందలేదని ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న వైద్యులు పేర్కొంటున్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో పలువురు అధికారులు, సరఫరాదారులు, కాంట్రాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా అదే తరహా చర్యలు తప్పవనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. 2017లో ముందు సరఫరా చేసిన వారికి ముందస్తు చెల్లింపులు చేయాలని ఇచ్చిన మెమోను నిలుపుదల చేస్తూ ఇష్టారాజ్యంగా చెల్లింపులు చేసుకోవచ్చంటూ అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని ఇచ్చిన మరో మెమో. అచ్చెన్నకు కొత్త కాదు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో నీరు– చెట్టు పనులనూ తన అనుయాయులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, డిజైన్ లేకుండా చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. నీరు చెట్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన గట్టు కాలువ పొడవున రక్షణ గోడలు నిర్మించి నిధులు దుర్వినియోగం చేశారు. నాసిరకంగా కాంక్రీటు పనులు చేపట్టారు. కలెక్టర్‌తో నిమిత్తం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండానే అచ్చెన్నాయుడు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని నియమించేవారు. ఈఎస్ఐలో ప్రధాని మోదీ చెప్పినట్టే చేశా: అచ్చెన్నాయుడు ఈఎస్ఐలో నామినేషన్ కింద వర్క్ ఆర్డర్లు ఇచ్చే విషయంలో ప్రధాని మోదీ చెప్పినట్లే చేశామని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తన హయాంలో ఈఎస్ఐలో జరిగిన కుంభకోణంపై శుక్రవారం ఆయన వివరణ ఇచ్చారు. టెలి హెల్త్ సర్వీసెస్‌కి సంబంధించిన పనులను త్వరితగతిన చేపట్టాలన్న ప్రధాని సూచన మేరకు వ్యవహరించామని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. తొలుత తెలంగాణలో దీన్ని ప్రారంభించారని, అక్కడ మాదిరిగానే ఏపీలోనూ చేయాలని నోట్ పంపానన్నారు. నామినేషన్‌పై ఇవ్వడంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. కావాలంటే రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. అప్పటి రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయన్నారు. సగటున 132 శాతం అధిక ధరకు కొనుగోలు వైద్య పరికరాలు, ఔషధాలను బేరమాడి తక్కువకు కొనాల్సింది పోయి సగటున 132 శాతం అధికంగా చెల్లించి కొన్నారంటే నాటి మంత్రులు, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య ఎంత భారీ స్థాయిలో లావాదేవీలు నడిచాయో బోధపడుతోంది. 2017–18 మధ్య ఏకంగా 198.66 శాతం అధికంగా చెల్లించారు. ఆ ఏడాది కొన్ని మందుల వాస్తవ విలువ రూ.10.82 కోట్లు కాగా ఏకంగా రూ.32.31 కోట్లు వెచ్చించి కొన్నారు. విజిలెన్స్ నివేదికలో ముఖ్యాంశాలు - రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు రూ.293.51 కోట్ల విలువైన మందులకు రూ.698.36 కోట్లు చెల్లించారు. - టెండర్లు లేకుండా నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వడంతో రూ.కోట్లలో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం. - ల్యాబొరేటరీ పరికరాలను ఎలాంటి టెండరు లేకుండా లెజెండ్ అనే సంస్థకు ఇచ్చారు. - శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా 129.32 శాతం అధిక రేట్లకు తమకు నచ్చిన కంపెనీకి ఇచ్చారు. - ఫర్నీచర్ కొనుగోళ్లకు టెండర్లు లేకుండా రూ.6.62 కోట్లు చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70 శాతం అధికం. - ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్స్ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో ఇ.రమేష్‌బాబు, కె.ధనలక్ష్మి తదితరులున్నారు - రాశి ఫార్మా, వీరేష్ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ.15.93 కోట్లు చెల్లించారు. - రూ.కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించుకోకుండా మూలన పడేశారు. - జెర్సన్ ఎంటర్ప్రైజెస్ అనే బినామీ సంస్థకు ఈఎస్ఐ డైరెక్టర్ డా.సీకే రమేష్‌కుమార్ రూ.9.50 కోట్లు చెల్లించారు. - రూ.16,992 విలువైన బయోమెట్రిక్ యంత్రాలను రూ.70,760 చొప్పున కొనుగోలు చేశారు. అవి ఎక్కడా పనిచేయడం లేదు. -
కార్మిక న్యాయస్థానానికే బాధ్యతలు..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు సూచనలు చేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కార్మిక శాఖ చర్యలకు ఉపక్రమించింది. కార్మికుల డిమాండ్లు పరిశీలించి 2 వారాల్లో పరిష్కరించాలని, లేకుంటే కార్మిక న్యాయస్థానానికి నివేదిక ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారం కార్మిక శాఖ పరిధిలో పరిష్కారమవుతాయా? లేక కార్మిక న్యాయస్థానానికి బాధ్యతలు అప్పగించాలా అనేదానిపై ఆ శాఖ తర్జనభర్జన పడుతోంది. కార్మిక శాఖ పరిధిలో సమస్య పరిష్కారమవ్వని పక్షంలో కార్మిక న్యాయస్థానానికి బాధ్యతలు ఇవ్వాల్సి వస్తే.. అందుకుగల కార ణాలను స్పష్టం చేయాలి. దీంతో కార్మిక శాఖ కమిషనరేట్ యంత్రాంగం కార్మిక చట్టాలు, నిబంధనలు తదితరాలను పరిశీలిస్తోంది. తీర్పు ప్రతి రాగానే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కార్మిక శాఖ కమిషనరేట్ పరిధిలో సాధ్యమయ్యే అవకాశాలు లేవని ఆ శాఖ భావిస్తోంది. కార్మికుల డిమాండ్లన్నీ ఆర్టీసీ యాజమాన్యం పరిధిలోనివి. ఇందులో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి. దీంతో వీటి పరిష్కారానికి కార్మిక శాఖ కంటే కార్మిక న్యాయస్థానమే సరైందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం కార్మిక న్యాయస్థానాన్ని కోరేందుకు కార్మిక శాఖ కార్యాచరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు ఇచ్చి 3 రోజులవుతున్నా.. కోర్టు నుంచి అధికారికంగా తీర్పు ప్రతి రాలేదు. క్రమపద్ధతిలో తీర్పు ప్రతి అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ముందు నోటీసులు ఇచ్చిన క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య కార్మిక శాఖ సంప్రదింపులు మొదలుపెట్టింది. వాస్తవానికి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్ణీత గడువు ముగిసినప్పుడే కార్మికులు సమ్మె చేపట్టాలి. కానీ సంప్రదింపుల సమయంలోనే కార్మికులు సమ్మెకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమా లేదా అనేది కార్మిక న్యాయస్థానం తేల్చాలి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం 2 వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన క్రమంలో గడువులోగా కార్మిక న్యాయస్థానానికి పూర్తి వివరాలు, ఆధారాలతో నివేదికను సమర్పించేందుకు కార్మిక శాఖ చర్యలు వేగిరం చేసింది. హైకోర్టు తీర్పు ప్రతి అందిన గంటల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా కార్మిక శాఖ భావిస్తోంది. 6 నెలల్లో పరిష్కారం కష్టమే.. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కార అంశం కార్మిక న్యాయస్థానానికి అప్పగించేందుకు సిద్ధమవుతున్న కార్మిక శాఖ.. కార్మిక చట్టాల్లోని క్లాజ్‌ల ప్రకారం 6 నెలల వ్యవధి లో పరిష్కరించేలా సూచన చేయనుంది. వాస్తవానికి చట్టంలో పొందుపర్చిన విధంగా 6 నెలల్లో సమస్యను పరిష్కరించాల్సి ఉన్న ప్పటికీ.. ఆధారాల సమర్పణ, విచారణ అంశం అంత సులువైన ప్రక్రియ కాదని నిపుణులు చెబుతున్నారు. కార్మికుల వాదనలన్నీ కార్మిక న్యాయస్థానం ప్రత్యక్షంగా వినాల్సి ఉంటుంది. ప్రస్తుతం సమ్మెలో 48 వేలకుపైగా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క కార్మికుడి వాదన వినాల్సి ఉండటంతో ఈ వ్యవధి చాలదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో కేసు విచారణకు మరింత సమయం పట్టే అవకాశం లేకపోలేదు. -
ఉద్యోగం కావాలంటే ఈ యాప్ ఉండాలి గురూ..!
సాక్షి, హైదరాబాద్ : ఇకపై ఉద్యోగ ప్రయత్నం మరింత సులభతరం కానుంది. ఇందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ సరికొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఓ ప్రైవేటు సంస్థ సహకారంతో ప్రత్యేకంగా మొబైల్ యాప్, వెబ్‌పేజీ తెరిచింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులు ఈ యాప్ లేదా వెబ్‌పేజీలో వివరాలు నమోదు చేసుకుంటే చాలు.. వారి అర్హతకు తగ్గ ఉద్యోగాల జాబితా ప్రత్యక్షమవుతుంది. ఇంతకుముందు కొన్ని ప్రైవేటు సంస్థలు ఇలాంటి సేవలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ... అవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. ఉద్యోగం వచ్చిన తర్వాత.. లేదా ఉద్యోగాల జాబితా ప్రచురణకు వెబ్సైట్ నిర్వహణ సంస్థకు రుసుము చెల్లించాల్సి వచ్చేది. తాజాగా కార్మిక ఉపాధి కల్పన శాఖ తీసుకొచ్చిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్చంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ మాత్రం పూర్తిగా ఉచితం. కంపెనీలల్లో ఖాళీల నమోదుకు ఎలాంటి చెల్లింపులుండవు. ఉద్యోగ ప్రయత్నం చేసే అభ్యర్థికి సైతం పూర్తిగా ఉచిత సేవలందిస్తారు. గుర్తింపు ఉన్న కంపెనీల్లోనే.. డీట్ యాప్, వెబ్పేజీల్లో గుర్తింపు ఉన్న కంపెనీల్లో ఖాళీల ప్రదర్శనకు కచ్చితమైన నిబంధనలు పాటిస్తుంది. ఉద్యోగ ఖాళీలున్నట్లు వచ్చే నోటిఫికేషన్ల తాలూకు కంపెనీ పూర్వాపరాలు ముందుగా యాప్ నిర్వాహకులు పరిశీలిస్తారు. మొబైల్ ఫోన్ వెరిఫికేషన్, ఈ–మెయిల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత క్షేత్ర పరిశీలన చేసి నిర్ధారిస్తారు. అలా మూడు దశల్లో ఆమోదం పొందిన తర్వాతే సదరు నోటిఫికేషన్లను యాప్, వెబ్పేజీల్లో ప్రదర్శిస్తారు. ప్రభుత్వం అనుమతి తీసుకుని నిర్వహించే కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు రంగ కంపెనీలైనా.. సంబంధిత శాఖల సలహాలు, సూచనలు సైతం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. యాప్ డౌన్లోడ్ ఇలా.. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో డీట్ (deet) అని టైప్ చేసి సెర్చ్ చేస్తే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సే్చంజ్ ఆఫ్ తెలంగాణ పేరుతో యాప్ ప్రత్యక్షమవుతుంది. ఇన్స్టాల్ చేసుకుని.. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఉద్యోగావకాశాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఎంపిక చేసుకున్న తర్వాత అవకాశాలను బట్టి ఉద్యోగం ఇచ్చే కంపెనీతో చాట్ చేసే వీలుంటుంది. ఆ కంపెనీ ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకుని ఉద్యోగ పరిస్థితి, ఇంటర్వూ్య తదితర ప్రక్రియల కోసం ముందుకెళ్లొచ్చు. అలాగే https://tsdeet.com వెబ్సైట్ ద్వారా కూడా ఉద్యోగాల శోధన చేయొచ్చు. డీట్ యాప్, వెబ్‌పేజీలను ఆవిష్కరించిన మంత్రి మల్లారెడ్డి డీట్ యాప్, డీట్ వెబ్‌పేజీలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలను సులభంగా తెలుసుకునేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ యాప్ ద్వారా ఉచితంగా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ యాప్, వెబ్‌పేజీ నిర్వహణ కోసం ఏటా రూ.10 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కార్మిక ఉపాధి కల్పన డైరెక్టర్ కేవై నాయక్, మోహిత్‌కుమార్ పాల్గొన్నారు. ఓకే చోట పరిశీలన ఉద్యోగావకాశాల కోసం కంపెనీల చుట్టూ తిరిగితే సమయం వృథా అవుతుంది. అక్కడ ఉద్యోగాలున్నా అవి అభ్యర్థి అర్హతలకు సరిపోతాయో లేదోనన్న సందేహం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే కంపెనీలు వెబ్‌పేజీల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నా.. ఆయా కంపెనీల పేజీలను ఒక్కొక్కటిగా వీక్షించడంతో సమయం ఎక్కువ పడుతుంది. వీటిన్నింటిని అధిగమించి సులభంగా ఒకే వేదికగా ఉద్యోగాలను చూసుకునే వీలు కల్పిస్తున్నాం. ప్రస్తుతం ఈ యాప్/వెబ్‌పేజీలు ప్రారంభదశలో ఉన్నాయి. ఇప్పటికే 45 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సమాచారం ఉంది. – చల్లా మణికాంత్, సీఈవో స్టోరీటెక్ -
జిల్లాకో ఈఎస్ఐ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. ఇప్పటికే 400 జిల్లాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. వచ్చే నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులను తెరిచి కార్మిక కుటుంబాలకు అత్యాధునిక వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించతలపెట్టిన ఓపీడీ భవనానికి బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఈఎస్ఐ ఆస్పత్రిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కొత్తగా నిర్మించనున్న ఓపీడీ భవనాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.124 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్లాకులో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. కారి్మకుల సంఖ్య తక్కువ ఉన్న చోట్ల ఈఎస్ఐ లబ్ధిదారులు కాని వారికి కూడా సేవలు అందించనున్నట్లు వివరించారు. దేశంలోని 40 కోట్ల మంది అసంఘటిత రంగ కారి్మకులకు నెలవారీగా రూ.3,000 పింఛను అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించాలి సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. వైద్య సేవల రంగంలో కేంద్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈఎస్ఐకి సంబంధించిన పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈఎస్ఐ ఆసుపత్రుల పనితీరు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల కంటే మెరుగ్గా ఉందని కితాబిచ్చారు. రాష్ట్రంలో 18 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐ పరిధిలో ఉన్నారని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తెలిపారు.