వారంలో నాచారానికి ఈఎస్‌ఐ ఆస్పత్రి
♦ సనత్‌నగర్ మెడికల్ కాలేజీకి లైన్ క్లియర్
♦ దత్తాత్రేయ, నాయిని సమక్షంలో ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల్లోగా ఈఎస్‌ఐ సనత్‌నగర్ ఆస్పత్రిని నాచారం తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈఎస్‌ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెడికల్ కాలేజీ కోసం రాష్ట్ర కార్మికశాఖ నిర్వహిస్తున్న ఈఎస్‌ఐ ఆస్పత్రిని కేటాయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిని నాచారానికి, అక్కడున్న కార్పొరేషన్ ఆస్పత్రిని సనత్‌నగర్‌కు మార్చుతూ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో అధికారులు శనివారం ఎంవోయూ కుదుర్చుకున్నారు.
నాచారం మెడికల్ సూపరింటెండెంట్ దేశ్‌పాండే, రాష్ట్ర ఈఎస్‌ఐ డెరైక్టర్ సీహెచ్, దేవికారాణి సంతకం చేసిన ఫైళ్లను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... సనత్‌నగర్ మెడికల్ కాలేజీ నిర్వహణకు లైన్‌క్లియర్ అవడం సంతోషంగా ఉందన్నారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐని నాచారానికి తరలిస్తే ప్రస్తుతం 200 బెడ్స్ తగ్గిపోతాయన్నారు. ఈ నష్టం పూడ్చుకునేందుకు త్వరలో కేంద్రం తమ నిధులతో నాచారంలో అదనంగా 250 పడకల ఆస్పత్రిని విస్తరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అలాగే కార్మికులు అధికంగా ఉన్న ప్రాంతంలో స్థలం చూపిస్తే 500 పడకల ఆస్పత్రిని కూడా నిర్మిస్తామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారన్నారు.
అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఈ మెడికల్ కాలేజీ నిర్వహణ వల్ల కార్మికుల పిల్లలకు 40శాతం సీట్లు లభిస్తాయన్నారు. గోషామహల్‌లో పశుసంవర్ధ్దకశాఖ స్థలాన్ని కేటాయిస్తే 100 పడకల ఆస్పత్రిని నిర్మించి ఇస్తామన్నారు. ఏప్రిల్ 1నుంచి ఆటో రిక్షా కార్మికులకు ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామన్నారు. అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, మధ్యాహ్నం భోజన నిర్వాహకులకు కూడా ఈఎస్‌ఐ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు.
దేశవ్యాప్తంగా 4.70 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు ఈపీఎఫ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్మికుల సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకొని 10మంది పనిచేసే సంస్థలను పీఎఫ్ కిందకు తీసుకొచ్చేందుకు పార్లమెంటులో చట్టసవరణ చేయనున్నట్లు వివరించారు. కార్మికుల కనీస వేతన సవరణను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.