సాక్షి, హైదరాబాద్: కార్మిక సంక్షేమ కార్యక్రమాలను కార్మిక శాఖ మరింత సరళీకృతం చేసింది. ప్రతి లబ్ధిదారుకు సంక్షేమ ఫలాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత కార్మికుల కోసం భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి, కార్మిక సంక్షేమ మండలి, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా మండలి ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కార్మికులనుద్దేశించిన పథకాల ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి.
♦భవన, ఇతర నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ మండలి అన్ని నిర్మాణసంస్థల నుంచి ఒక శాతం సెస్ వసూలు చేయగా వచ్చిన నిధులతో ఆ కార్మికుల ప్రయోజనం కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం బోర్డులో 19.68 లక్షల మంది కార్మికులు పేర్లను నమోదు చేసుకున్నారు. కార్మికులకు వివాహ బహుమతి కింద రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే, సహా యం కింద రూ.6 లక్షలు, ఆసుపత్రుల్లో చేరితే నెలకు రూ.4,500 చొప్పున 3 నెలలు సాయం చేస్తారు. ప్రసూతి ప్రయోజనం కోసం రూ.30 వేలు, సహజ మరణమైతే రూ.లక్ష, శాశ్వత వైకల్యమైతే రూ.4 లక్షలు ఇస్తారు. పేర్లు నమోదు చేసుకోనివారికి రూ.50 వేలు, మరణించినవారి అంత్యక్రియలకు రూ.30 వేలు ఇస్తారు.
♦ఫ్యాక్టరీలు, దుకాణాలు, సంస్థలు, మోటారు రవాణాసంస్థల కార్మికుల పిల్లలకు తెలంగాణ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ రూ.1,000 నుంచి రూ.2,,000 వరకు స్కాలర్‌షిప్‌లు ఇస్తోంది.
♦రాష్ట్ర అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా మండలిని ఇటీవలే ఏర్పాటు చేశారు. ఈ–శ్రమ్ పోర్టల్‌లో ఇప్పటివరకు 35.41 లక్షల మంది కార్మికులు పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.
♦రవాణా, రవాణేతర ఆటోడ్రైవర్లు, వర్కింగ్ జర్నలిస్టులు, హోంగార్డుల కోసం ప్రమాద మరణ బీమా పథకాన్ని కార్మిక శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం కింద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment