వర్చువల్ విధానంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
తిరుపతి అర్బన్/తిరుపతి కల్చరల్: కార్మికుల సదస్సుకు పవిత్ర స్థలాన్ని వేదిక చేసుకోవడం అభినందనీయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తిరుపతి నగరంలోని తాజ్ హోటల్‌లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, కార్మిక, ఉపాధి కల్పన, పెట్రోలియం, సహజవాయు శాఖల సహాయ మంత్రి రామేశ్వర్ నేతృత్వంలో నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని గురువారం వర్చువల్ పద్ధతిలో ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశాన్ని తెలియజేశారు. భారతదేశం శ్రామికుల శక్తిగా అభివర్ణించారు.
శ్రామికశక్తిని సామాజిక పరిధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్రం శ్రామికుల సంక్షేమం, భద్రత కోసం ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన, సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి బీమా యోజన తదితర పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కోట్లాది మంది కార్మికులు దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా ఏడాదికి 28కోట్ల మందికి 400 ప్రాంతాల్లో నమోదు చేయడం జరుగుతుందని వివరించారు. దేశాన్ని ఒక్కటి చేయడంలో కార్మికుల పాత్ర అభినందనీయమన్నారు.
గత 8 ఏళ్లుగా బానిసత్వం, పూర్వకాలపు చట్టాల రద్దుతోపాటు ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్టు చెప్పారు. ప్రధానంగా 29కార్మిక చట్టాలు, 4 సాధారణ చట్టాలుఘౠ మార్పు చేసినట్లు ఆయన వివరించారు. లేబర్ కోడ్స్ ద్వారా కార్మికుల సాధికారత, కనీస వేతనం, సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. విజన్ 2047 నాటికి కార్మికశాఖ ప్రత్యేక ముందుచూపుతో నడుస్తుందని, ఎన్నో మార్పులతో కార్మికుడికి మంచి జరుగుతుందన్నారు. దేశాన్ని గ్లోబల్ లీడర్‌గా మార్పు చేయడానికి దోహదపడుతుందన్నారు.
మహిళా కార్మికశక్తిని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవన కార్మికుల సెస్ వినియోగంపై మాట్లాడుతూ.. దేశంలో పలు రాష్ట్రాలు రూ.38 వేల కోట్లు ఉపయోగించలేదన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మిక శాఖ మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
కార్మిక సంఘాల నేతల అరెస్ట్
కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు తిరుపతిలో నిర్వహిస్తున్న కార్మిక మంత్రుల జాతీయ సదస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ పి.మధు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ సహా పలువురు నేతలు అరెస్టయిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment