సాక్షి, తిరుపతి: ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో ఆయన తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఉదయం నైవేద్య విరామ సమయంలో మహా ద్వారం ద్వారా ఆలయంలోకి వెళ్ళారు. మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫల్ స్వాగతం పలికారు.
టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రధానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభానికి మొక్కుకుని స్వామివారి దర్శనానికి వెళ్లారు. మూలవిరాట్టు దర్శనం చేసుకున్నారు. అనంతరం హుండీ లో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు.
టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. టీటీడీ డైరీ, క్యాలండర్‌లను ప్రధానికి అందించారు. ఆయన సుమారు 50 నిముషాల పాటు ఆలయంలో గడిపారు. అనంతరం రచన అతిథి గృహానికి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రధానికి పర్యటన సందర్భంగా తిరుమలలో ఆంక్షలు విధించారు. ప్రధాని వెళ్లే మార్గాలలో ఉన్న దుకాణాలు మూసివేశారు. వాహన రాకపోకలు నిషేధించారు. ప్రధాని పర్యటనకు మీడియాని కూడా అనుమతించలేదు.
కాగా, ఆదివారం రాత్రి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు.
చదవండి: జనం మెచ్చిన 'జగన్'
Comments
Please login to add a commentAdd a comment