న్యూఢిల్లీ: తిరుపతి తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన వార్త తెలిసి ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తొక్కిసలాట ఘటన నన్నెంతో బాధించింది. ఆప్తులను కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.
బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోంది’ అని ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందేశాన్ని ప్రధాని కార్యాలయం ‘ఎక్స్’ ఖాతాలో బుధవారం అర్ధరాత్రి పోస్ట్ చేసింది.
తీవ్ర బాధాకరం: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు బుధవారం డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్షించారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని చంద్రబాబు అన్నారు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తీవ్ర బాధ కలిగించిందని అన్నారు.
ముందు జాగ్రత్త చర్యల్లో వైఫల్యంపై అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ టోకెన్ల కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునస్సమీక్షించాలన్నారు. గురువారం ఉదయం తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచి్చన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పెనువిషాదం: రాహుల్
తిరుపతిలో తొక్కిసలాట ఘటన నిజంగా పెనువిషాదకరం. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. ఈ కష్టకాలంలో అక్కడి భక్తులను శాయశక్తులా ఆదుకోవాలని, సహాయ సహకారాలు అందించాలని అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులకు సూచిస్తున్నా.
బాధాకరం: కేజ్రీవాల్
తిరుపతిలో దుర్ఘటన చాలా బాధాకరం. ఘటన నన్నెంతగానో కలచివేసింది. మృతుల ఆత్మలు దేవుని పాద పద్మములను చేరాలి. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని వేడుకుంటున్నా. దర్శనం తర్వాత భక్తులంతా క్షేమంగా తమతమ ఇళ్లకు చేరాలి.
తీవ్ర ఆవేదన కలిగించింది: పవన్‌కళ్యాణ్
తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యా. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను కోరాను.
భక్తుల మృతి బాధాకరం
టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడం ఆవేదన కలిగిస్తోంది. గాయపడ్డ వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో ఎప్పుడూ జరగలేదు.
ఈ ఘటన అత్యంత విచారకరం. అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. మా హయాంలో వారం ముందే టోకెన్లు జారీ చేసేవాళ్లం. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై 10 రోజుల నుంచి నిద్రాహారాలు మాని శ్రమపడే వాళ్లం.
హృదయాన్ని కలచివేసింది: పురందేశ్వరి
తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలి. బాధిత కుటుంబాలకు అన్నివిధాలా న్యాయం చేయాలి.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే: ఎంపీ మాణిక్కం ఠాకూర్
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తిరుపతి ఘటన జరిగింది. ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బాధ్యతాయుతమైన నిర్వహణ ఎంతటి అత్యావశ్యకమో ఈ ఘటన నిరూపిస్తోంది. డ్రామా గురువు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ నాటకీయతపై కంటే పరిపాలనపై దృష్టి పెడితే చాలా బాగుంటుంది.
ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమే: వెలంపల్లి
ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది శ్రీవారి దర్శనానికి వస్తారని తెలిసినా ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. తిరుమలను రాజకీయ కేంద్రంగా టీటీడీ చైర్మన్ మార్చేశారు.
బీఆర్ నాయుడు తక్షణం రాజీనామా చేయాలి
తొక్కిసలాట ఘటనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నైతిక బాధ్యత వహించి తక్షణం రాజీనామా చేయాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment