టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి చంద్రబాబు అండ
వారిద్దరిపై మంత్రుల ఫిర్యాదును పట్టించుకోని సీఎం
తన ఘోర వైఫల్యాలను దాచిపెట్టి కపట నాటకం
తిరుపతి ఈస్ట్ డీఎస్పీ, టీటీడీ విజిలెన్స్ డీఎస్పీలపై చర్యలు శూన్యం
త్వరలో టీటీడీ ఈవో శ్యామలరావు బదిలీకి రంగం సిద్ధం
తమ రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులకు సహకరించని సీవీఎస్‌వో శ్రీధర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు
ముందే అనుకున్న వ్యూహం ప్రకారం పవన్ కల్యాణ్ గప్‌చుప్.. బీఆర్ నాయుడు ద్వారా డిప్యూటీ సీఎంకు బాబు బ్రేకులు
‘సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు...! అయితేనేం..! మనోళ్లు సేఫ్ కదా...! ఇక కేస్ క్లోజ్ చేద్దాం..’... సీఎం చంద్రబాబు తేల్చి చెప్పేశారు!!
‘ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆడిన ఆగ్రహం డ్రామా అవసరం లేదు.. ఇక చాల్లే.. తగ్గు..!’... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సంకేతం ఇచ్చారు!!
‘అయితే ఓకే అంటూ ముందస్తు వ్యూహం ప్రకారం పవన్ గప్‌చుప్...!’’
‘అయినాకానీ పవన్ జోరుకు బ్రేకులు వేయమని బీఆర్ నాయుడుకు ఆదేశం..!’‘ఎవరో చెబితే మేం చేస్తామా?.. క్షమాపణలు చెప్పాలనడంపై బీఆర్ నాయుడు ప్రతి స్పందన!!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యంతోనే తిరుపతిలో ఎన్నడూలేని విధంగా తొక్కిసలాట సంభవించి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబే ప్రధాన ముద్దాయి అని యావత్ భక్త కోటి మండిపడుతుండటంతో సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో రంగంలోకి దిగారు. ఈ దుర్ఘటన తమను కలచి వేసిందని మొసలి కన్నీళ్లు కారుస్తూ తిరుపతిలో హై డ్రామాకు తెర తీశారు.
సీఎం చంద్రబాబు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు... చిందులు తొక్కినట్టు వీడియో కెమెరాల ఎదుట కపట నాటకాన్ని రక్తి కట్టించారు. కానీ చంద్రబాబు కుయుక్తులు బెడిసి కొట్టాయి. ఇవి కచ్చితంగా సర్కారీ హత్యలేనని యావత్ ప్రజానీకం తేల్చి చెప్పింది. దీంతో కొందరు అధికారులపై చర్యలు తీసుకుని విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అదే సమయంలో గతంలో తాము చెప్పినట్లుగా రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేయని టీటీడీ అధికారులపై చర్యలకు ఉపక్రమించడం చంద్రబాబు కుట్రలకు నిదర్శనం. వైఫల్యానికి కారకులైన తన అస్మదీయ అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా వారిని కాపాడుతుండటం గమనార్హం. ఈ పరిణామాలన్నీ ఒక్కటే స్పష్టం చేస్తున్నాయి.. తిరుపతి దుర్ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని నిగ్గు తేలుస్తున్నాయి.
మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పి ఈ డ్రామాలో తన వంతు పాత్రను రక్తి కట్టించారు. పనిలో పనిగా టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ససేమిరా అనడం గమనార్హం. సీఎం ఆదేశాల మేరకే ఆయన ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఆయన మాట మార్చినా పవన్ కళ్యాణ్ సూచనను మొదట తిరస్కరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక సీఎం చంద్రబాబు సమక్షంలోనే టీటీడీ చైర్మన్, ఈవో పరస్పర ఆరోపణలతో అసలు విషయాన్ని బయట పెట్టారు. తిరుమల ఆలయ వ్యవహారాల్లో టీటీడీ, ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లో ఏమాత్రం సమన్వయం లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్వాకాలు, వైఫల్యాల కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుని అమాయక భక్తులు మృత్యువాత పడినట్లు చంద్రబాబు సమీక్ష సాక్షిగా నిర్ధారణ అయింది.
చైర్మన్, అదనపు ఈవో సేఫ్
తిరుపతిలో భక్తుల దుర్మరణం దుర్ఘటనకు బాధ్యులైన అస్మదీయ అధికారులను టీడీపీ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా వెనకేసుకొచ్చింది. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకి పారేస్తున్నారు.
టీటీడీ చరిత్రలో కనీవిని ఎరుగని విషాదానికి బాధ్యత వహించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి. ఆయన సమ్మతించకపోయినా ప్రభుత్వమే ఆయనతో రాజీనామా చేయించాలి. కానీ ఆయన్ను చంద్రబాబు పల్లెత్తు మాట అనలేదు. ఎన్నికల్లో టీడీపీకి బాకాగా పని చేసిన టీవీ5 చానల్‌కు బీఆర్ నాయుడు అధినేత కావడం దీనికి ప్రధాన కారణం.
ఇక శ్రీవారి ఆలయం దర్శనాలు, సౌకర్యాల కల్పనకు ప్రధాన బాధ్యత వహించాల్సింది తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరే! తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లు కూడా శ్రీవారి ఆలయ దర్శనం టికెట్ల కోసమే. అయినా వెంకయ్య చౌదరిని ప్రభుత్వం కనీసం బదిలీ చేయలేదు.
అస్మదీయ అధికారులకు రక్షణ
వైకుంఠ ఏకాదశి క్యూలైన్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత టీటీడీ విజిలెన్స్ డీఎస్పీ ఎన్‌టీ రామ్కుమార్దే. అయినా సరే ఆయనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. టీటీడీ విజిలెన్స్ విభాగంలో ఆయన ప్రధాన రింగ్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తొక్కిసలాట సంభవించిన ప్రాంతాలు తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తాయి. ఆ ప్రాంత డీఎస్పీ వెంకటనారాయణపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
ఇదే అదనుగా సహకరించని అధికారులపై వేటు
తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధ్యులైన అనుకూల అధికారులను కాపాడుతున్న సీఎం చంద్రబాబు మరోవైపు నిబంధనల ప్రకారం నడుచుకుంటూ తమకు సహకరించని అధికారులకు పొగబెడుతున్నారు. ఇదే అదనుగా గతంలో అక్రమ కేసుల నమోదుకు తమకు సహకరించని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు.
టీటీడీ విజిలెన్స్ ప్రధాన అధికారి (సీవీఎస్‌ఓ) శ్రీధర్‌ను ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయాలంటూ శ్రీధర్‌పై కూటమి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోంది. అయితే ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసుల నమోదుకు ఆయన తిరస్కరించడంతో తిరుపతి దుర్ఘటనను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం శ్రీధర్‌ను బదిలీ చేసింది.
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాలతో ఏమాత్రం సంబంధంలేని తిరుపతి జేఈవో గౌతమిని ప్రభుత్వం బదిలీ చేసింది. అదే రీతిలో డీఎస్పీ రమణకుమార్, క్యూలైన్ల నిర్వహణతో సంబంధం లేని టీటీడీ గోశాల డైరెక్టర్ హర్‌నాథ్‌రెడ్డిని సస్పెండ్ చేసింది.
బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరిపై మంత్రుల ఫిర్యాదు.. వారించిన బాబు
మంత్రులు అనగాని సత్య ప్రసాద్, ఆనం రాంనారాయణరెడ్డి గురువారం సీఎం చంద్రబాబు తిరుపతిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీరుపై ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు ఆ విషయాలు తరువాత మాట్లాడదామంటూ దాటవేశారు. బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరి ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోబోనని సంకేతాలిచ్చారు.
ఈవో బదిలీకి రంగం సిద్ధం..
టీటీడీ ఈవో శ్యామలరావును బదిలీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే వెంటనే బదిలీ చేస్తే ఆయనతోపాటు తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కూడా బదిలీ చేయాల్సి ఉంటుంది. అందుకే కొద్ది రోజుల తరువాత శ్యామలరావుని బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈవోకు అవమానం...!
టీటీడీ ఈవో శ్యామలరావును సాగనంపేందుకు సిద్ధమైన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయనకు పొగబెడుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవోను అందరి ఎదుట ఏక వచనంతో సంబోదిస్తూ తీవ్రంగా అవమానించారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ఆలయానికి వచ్చిన ఈవో శ్యామలరావును చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉద్దేశపూర్వకంగానే అగౌరవపరిచేలా వ్యవహరించడం గమనార్హం.
ఆలయంలో ఆయనతో ఎవరూ మాట్లాడకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు దన్నుతోనే ఆయన సామాజికవర్గానికి చెందిన టీటీడీ చైర్మన్, అదనపు ఈవో ఇలా వ్యవహరిస్తున్నట్లు టీటీడీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment