నిర్లక్ష్యమే చంపేసింది | Devotees flocked due to TTD global campaign | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమే చంపేసింది

Published Fri, Jan 10 2025 5:47 AM | Last Updated on Fri, Jan 10 2025 5:47 AM

Devotees flocked due to TTD global campaign

టీటీడీ గ్లోబల్‌ ప్రచారం కారణంగా పోటెత్తిన భక్తులు

భక్తుల రద్దీని అంచనా వేయడంలో సర్కారు వైఫల్యం

ఆ స్థాయిలో ఏర్పాట్లు లేక కౌంటర్ల వద్ద గందరగోళం 

నెల రోజుల ముందు నుంచి సమీక్షల్లో ఏం చేశారు? 

నీళ్లు, ఆహారం, భద్రతా సిబ్బంది లేకుండా ఏర్పాట్లా? 

దైవ దర్శనానికి వస్తే ప్రాణాలు తీశారని భక్తుల ఆగ్రహం 

తిరుపతి తుడా/తిరుపతి సిటీ/చంద్రగిరి: మితిమీ­రిన ప్రచారం, అవగాహన రాహిత్యం, భద్రత ఏర్పా­ట్ల వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతి కేంద్రంగా భక్తులకు టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్, అధికారులు నెల రోజుల నుంచి సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. 

తరచూ కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలిస్తూ, సామాన్య భక్తులకు దర్శనం కల్పించడమే ముఖ్య ఉద్దేశమంటూ ఊదరగొట్టారు. అతి ప్రచారం కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి పోటెత్తారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో కౌంటర్ల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం 5 గంటల నుంచి మూడు రోజులకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను జారీ చేస్తామని  ముందుగానే ప్రకటించడంతో సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తిరుపతి చేరుకున్నారు. 

బుధవారం తెల్లవారుజాము 5 గంటల నుంచే కౌంటర్ల వద్ద బారులు తీరారు. సాయంత్రానికి మరింత మంది తోడవ్వడంతో క్యూలైన్ల వద్ద రద్దీ పోటెత్తింది. సరిగ్గా ఇదే సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. దీంతో వేలాదిగా భక్తులు కౌంటర్ల వద్దకు పరుగులు పెట్టడం.. తోపులాట చోటుచేసుకోవడం.. ఆరుగురు మృతి చెందడం.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం తెలిసిందే. 

అరుపులు, కేకలు.. నరకయాతన 
శ్రీనివాసం సముదాయం వద్ద టోకెన్లు తీసుకునేందుకు వేచి ఉన్న భక్తుల్లో సేలంకు చెందిన మల్లిక తీవ్ర అస్వస్థతకు గురైంది. భక్తుల రద్దీతో తోపులాటలో భాగంగా ఆమెకు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో క్యూలైన్‌ నుంచి బయటకు తీసుకొచ్చినట్లు భర్త కృష్ణన్‌ తెలిపారు. తొలుత అంబులెన్స్‌లో స్థానిక డీబీఆర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో రుయాకు తరలించే క్రమంలో ఆమె మార్గం మధ్యలో మృతి చెందింది. ఈ ఘటన చోటు చేసుకున్న నిమిషాల వ్యవధిలోనే సత్యనారాయణపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ తోపులాట చోటు చేసుకుంది. 

అయితే ఇక్కడ పరిస్థితి కొంత సేపటికి అదుపులోకి రావడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రాత్రి 8.25 గంటల ప్రాంతంలో బైరాగిపట్టెడలోని రామానాయుడు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్ల వద్ద భారీ తోపులాట చోటు చేసుకుంది. దీనికి తోడు అదే సమయంలో తొక్కిసలాటలో కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిన లావణ్య స్వాతిని బయటకు తీసుకొచ్చే క్రమంలో వెలుపలదారి గేట్లను పోలీసులు తెరవడం మరింతగా తొక్కిసలాటకు కారణమైంది. 

అక్కడ పోలీసు బందోబస్తు లేకపోవడంతో వందలాది మంది భక్తులు అక్కడి నుంచి తోసుకొచ్చారు. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగింది. ముందు వరుసలోని భక్తులు కిందపడి పోవడంతో.. వెనుక ఉన్న వారు వారిని తొక్కుకుంటూ వెళ్లడంతో ఒక్కసారిగా అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. 

అక్కడ ఏం జరుగుతోందో తెలియక వెనుక, ముందు ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమను తాము రక్షించుకోవడానికి వెలుపలకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కింద పడిన వారిని సైతం తొక్కుకుంటూ తమ కుటుంబ సభ్యులను కాపాడేయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

నీళ్లు లేవు.. టాయ్‌లెట్లు లేవు.. ఇవేం ఏర్పాట్లు?
కౌంటర్ల వద్ద తాగునీరు, పాలు, అల్పాహారం అందించాలన్న కనీస ఆలోచన కూడా టీటీడీకి రాక­పోవడం దుర్మార్గం అని భక్తులు మండిపడ్డారు. చాలా మంది భక్తులు ఆకలితో అలమటించి, నీరసించిపోయారు. క్యూలోంచి పక్కకు వెళితే వెనుకబడిపోతామనే భయంతో చాలా మంది అక్కడి నుంచి కదల్లేదు. చంటి పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు గంటల తరబడి వేచి ఉండటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 

మహిళలకు కనీసం మొబైల్‌ టాయ్‌లెట్లను సైతం ఏర్పాటు చేయకపోవడంతో వారు నరకయాతన అనుభవించారు. ఇన్ని ఇబ్బందులు ప్రత్యక్షంగా కళ్లకు కనిపిస్తుంటే.. ఏర్పాట్లు ఘనంగా చేశామని టీటీడీ చైర్మన్‌ మీడియాకు పదే పదే ఎందుకు చెప్పారని భక్తులు నిలదీశారు. దైవ దర్శనానికి వస్తే ప్రాణాలు తీశారని మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement