ప్రభుత్వ నిర్లక్ష్యానికి శ్రీవారి భక్తుల దుర్మరణం
విషాదంలో మృతుల కుటుంబాలు
పిల్లలకు దూరమైన ఓ తల్లి.. కుమారుడికి ఉద్యోగం వచ్చే వేళ మరో తల్లి మృతి
పెద్ద దిక్కును కోల్పోయిన ఓ కుటుంబం
వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారం గుండా వెళ్లి దేవదేవుని దర్శనం చేసుకుంటే జీవిత కాలం ఆ తదాత్మ్యంలో, భగవంతుడు మోక్ష ప్రాప్తి కలిగిస్తాడన్న ఆనందంలో గడిపేయొచ్చు. ఇదే విశ్వాసంతో లక్షలాది భక్తులు వైకుంఠ ఏకాదశికి తిరుమలేశుని దర్శించుకోవాలని తలంచారు. కానీ, ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్య ధోరణి వల్ల దేవదేవుని దర్శనం కాకుండానే, ఆ ఆనందాన్ని పొందకుండానే ఆరుగురు ప్రాణాలొదిలారు.
దేవుడిని దర్శించుకొని వస్తామని ఇంటి నుండి వెళ్లిన వారు విగతజీవులై వస్తున్నారన్న వార్త వారి కుటుంబాలకు శరాఘాతంలా తగిలింది. ఓ కుటుంబంలో పిల్లలకు తల్లి దూరమైంది. మరో కుటుంబంలో లక్ష్మీ కళ తప్పింది. మరో ఇంట్లో కుమారుడి క్షేమం కోసం నిత్యం పూజలు చేసే తల్లే దూరమైంది. ఇంకొక ఇంటి పెద్ద కానరాని దూరాలకు వెళ్లిపోయిడు.. – సీతంపేట, మద్దిలపాలెం, కంచరపాలెం (విశాఖపట్నం), నర్సీపట్నం
అమ్మ చనిపోయిందని పిల్లలకు ఎలా చెప్పాలి?
‘తిరుపతి వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనం ఒక్కసారైనా చేసుకుంటానని అనడంతో కాదనలేకపోయాను. కానీ, ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందని కలలో కూడా ఊహించలేదు. మా అక్క, మరో ముగ్గురు బంధువులతో కలిసి ఈ నెల 5న తిరుపతికి బయల్దేరింది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో క్యూలో ఉండగా ఫోన్ చేసింది. భోజనం చేశారా? పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగింది.
ఫోన్‌లో గోలగా వినిపించడంతో, జనాలు ఎక్కువగా ఉన్నట్టున్నారు జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పింది. మళ్లీ ఫోన్ చేయలేదు. గంట తర్వాత ఫోన్ చేస్తే కలవలేదు. రాత్రి 11 గంటల సమయంలో మా అక్క ఫోన్ చేసి తొక్కిసలాటలో అందరం తలో దిక్కు అయిపోయామని, అందరం కలిశాం.. కానీ లావణ్య కనిపించడంలేదని చెప్పింది. ఆస్పత్రికి వెళ్లి చూడగా లావణ్య చనిపోయి ఉందని రాత్రి 12.30 సమయంలో నాకు ఫోన్ చేసి చెప్పారు.
దర్శనానికి వెళ్లిన అమ్మ తిరిగి వస్తుందని నా పిల్లలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తల్లిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని పిల్లలకు మీ అమ్మ చనిపోయిందని, దేవుడి దగ్గరికి వెళ్లిపోయిందని నా నోటితో ఎలా చెప్పను’ అంటూ లావణ్య భర్త సతీష్ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే విశాఖపట్నం వెంకటేశ్వర కాలనీ ప్రజలహృదయాలు బరువెక్కాయి.
విశాఖలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన సూరిశెట్టి లావణ్య తన ఆడపడుచు, మరో ముగ్గురు మహిళలతో కలిసి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ నెల 5న తిరుమల వెళ్లారు. టోకెన్ల కోసం క్యూలో ఉండగా జరిగిన తొక్కిసలాటలో లావణ్య ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త సతీష్ సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద పాప శ్రీలాస్య 9వ తరగతి, చిన్న పాప కీర్తి 6వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ తల్లి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. తల్లి మరణవార్తను పిల్లలకు ఎలా చెప్పాలో తెలియక సతీష్ వారిని బాజీ జంక్షన్‌లోని తన అక్క ఇంటికి పంపించేశాడు.
‘శాంతి’ దూరమై విలపిస్తున్న కుటుంబం
విశాఖపట్నం కంచరపాలెం సమీపంలోని గాంధీనగర్‌లో కండిపిల్లి శాంతి కుటుంబం వేంకటేశ్వర స్వామి భక్తులు. ఆమె భర్త వెంకటేష్ ఆటో డ్రైవర్. కుమారుడు మహేంద్ర వరప్రసాద్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముగ్గురూ గోవింద మాల దీక్ష చేపట్టారు. తొమ్మిది రోజుల పాటు గోవింద నామస్మరణతో కఠిన నియమాలు పాటిస్తూ దీక్ష చేశారు. 11వ రోజున దీక్ష విరమణ కోసం ఆ కుటుంబం తిరుపతికి వెళ్లింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో శాంతి దుర్మరణం పాలయ్యారు.
తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి వెంకటేష్, వరప్రసాద్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి కన్నీరుమున్నీరయ్యారు. దీంతో ఇందిరానగర్‌లోని శాంతి తల్లి, అన్నదమ్ములు, బంధువులు, గాంధీనగర్‌లోని అత్తమామలు విషాదంలో కూరుకుపోయారు. శాంతి అందరితో మంచిగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, తిరుమల వెళ్లాలంటేనే భయంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముందు ఉన్న అమ్మ చనిపోయింది
‘టోకెన్ల కోసం క్యూలో ఉండగా గేట్లు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగింది. నేను, నాన్న వెనుక ఉన్నాం. ముందు ఉన్న అమ్మ తొక్కిసలాటలో మిగతావారి కాళ్ల కింద నలిగిపోయింది’ అని ఆమె కుమారుడు కండిపిల్లి వరప్రసాద్ రోదిస్తూ జరిగిన సంఘటనను వివరించాడు.
నా కూతురిని పొట్టన పెట్టుకున్నారు
తిరుపతి దర్శనానికి వెళ్లిన నా కూతురు శాంతిని ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది. వైకుంఠ ఏకాదశికి లచ్చల్లో భక్తులు వస్తారని తెలిసినా, దేవస్థానం అధికారులు, ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా భక్తుల మరణానికి కారణమయ్యారు. నా కడుపు కోత నాయకులకు శాపంగా మారాలి. – కిల్లాడి అప్పలనరసమ్మ, శాంతి తల్లి
మా కుటుంబాన్ని బాగా నడిపించేది
మా కోడలు శాంతి మరణవార్త వినగానే మా ప్రాణాలు పోయినట్టు అయ్యింది. ఆమె అందరినీ కలుపుకొంటూ కుటుంబాన్ని నడిపేది. గ్రామంలో, చుట్టుపక్కల ఇళ్లలో, బంధువులతో కలుపుగోలుగా ఉండేది. మమ్మల్ని బాగా చూసుకునేది. – కండిపిల్లి అప్పారావు, శాంతి మామయ్య
కుమారుడి ఉన్నతి కోసం పరితపించి..
విశాఖపట్నం మద్దిలపాలెం రామాలయం సమీపంలో నివసించే ఆటో డ్రైవర్ గుడ్ల లక్ష్మారెడ్డి, రజనీ (47) దంపతులకు ఒక్కడే కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి. ఎంతో కష్టపడి అతన్ని బాగా చదివించారు. రెండేళ్ల క్రితం ఎంఎస్ చదువు కోసం అమెరికా పంపించారు. ఇందుకోసం ఇంట్లో సగభాగాన్ని విక్రయించారు. కుమారుడి భవిష్యత్తు బాగుండాలని రజని నిత్యం శ్రీ వేంకటేశ్వర స్వామికి పూజలు చేసేదని సమీప బంధువులు తెలిపారు.
ప్రతి శనివారం ఆమె స్వామిని ప్రత్యేకంగా ఆరాధించేది. కుమారుడికి మంచి ఉద్యోగం రావాలని కోరుకునేది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిత్యం ఆరాధించే వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లక్ష్మారెడ్డి దంపతులు, బంధువులు పది మంది తిరుపతి వెళ్లారు. వారంతా ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల కోసం క్యూలో నిలబడ్డారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో రజనీ ప్రాణాలు కోల్పోయింది.
కుమారుడి చదువు పూర్తయి, ఉద్యోగం వచ్చే సమయంలోనే రజని మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పైసా పైసా కూడబెట్టి తనను అమెరికా పంపిన తల్లి ఇక లేదన్న వార్త విని హర్షవర్ధన్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. అతను శుక్రవారం అమెరికా నుంచి విశాఖపట్నం చేరుకుంటాడని రజని బంధువులు తెలిపారు.
ఆ ఇల్లే దేవాలయం
గుడ్ల రజని పరమ భక్తురాలు. నిత్యం భగవత్ ఆరాధనలో గడిపేది. ఆమె ఇంట్లో ఎక్కడ చూసినా దేవుని చిత్రపటాలే కనిపిస్తాయి. ఆమె ఇల్లే ఓ దేవాలయం. కుమారుడి భవిష్యత్తు కోసం వేంకటేశ్వరస్వామికి నిత్యం పూజలు చేసేది. సాయిబాబాని ఆరాధించేది. అంతటి భక్తురాలు ఇలా అర్ధంతరంగా మరణించడంతో మేమందరం జీర్ణించుకోలేకపోతున్నాం. – ఎం.లక్ష్మి, మద్దిలపాలెం
వెళ్లిపోయిన పెద్ద దిక్కు..
తిరుపతి తొక్కిసలాట మృతుల్లో ఒకరైన బొడ్డేటి నాయుడుబాబు నర్సీపట్నం పట్టణంలోని పెదబొడ్డేపల్లి నివాసి. బోరుబావుల నిర్మాణ కార్మికుడు. భార్య మణికుమారి, కుమార్తె సునీత ఉన్నారు. ఈ నెల 6న నాయుడుబాబు, మణికుమారి, నర్సీపట్నం మండలం చెట్టుపల్లికి చెందిన కుటుంబ స్నేహితులైన కరణం సత్యనారాయణ, అతని భార్య సంతోషి కలిసి తిరుపతి వైకుంఠ దర్శనానికి వెళ్ళారు. క్యూలో జరిగిన తొక్కిసలాటలో భార్య, భర్త తలోదారి అయ్యారు. మణికుమారిని పోలీసులు రక్షించారు. నాయుడుబాబు మరణించారు. ఆయన ఫోన్ నుంచే పోలీసులు మణికుమారికి ఈ విషయం చెప్పారు.
ఏటా తిరిగి వచ్చే నాన్న ఈసారి రాలేదు
నాన్నకు వేంకటేశ్వరస్వామి అంటే ఎనలేని భక్తి. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్తుంటాడు. అప్పుడు కాకుండా మరో మూడు నాలుగుసార్లు దర్శనానికి వెళ్తాడు. ఈ సారి రద్దీ దృష్ట్యా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లవద్దని చెప్పాం. ఏటా దర్శనం చేసుకొని ఆనందంగా తిరిగి వచ్చే నాన్న ఈసారి రాలేదు. మాకు నాన్నే పెద్ద దిక్కు. మా కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలి’ అంటూ కుమార్తె సునీత రోదిస్తోంది. – సునీత, నాయుడుబాబు కుమార్తె
నా కుడి భుజం పోయింది...
నా కుడి భుజం పోయింది. నాకు అన్ని విషయాల్లో నా సోదరుడు అండగా ఉండేవాడు. స్వామి సన్నిధిలో ఇలా జరగటం బాధాకరం. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయాం. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – బి.వి.రమణ, నాయుడుబాబు సోదరుడు
Comments
Please login to add a commentAdd a comment