ఆరుగురు మృతి చెందినట్టు అధికారుల ధ్రువీకరణ
రుయాలో నలుగురు.. స్విమ్స్‌లో ఇద్దరు మృతి
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
తిరుపతి కల్చరల్/తిరుపతి అర్బన్: తిరుపతి రుయా ఆస్పత్రి, స్విమ్స్ ఆస్పత్రి మృతుల బంధువుల రోదనలు, క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల కౌంటర్ల వద్ద తోపులాటల కారణంగా ఆరుగురు భక్తులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. వారిలో నలుగురు రుయా ఆస్పత్రిలోను, మరో ఇద్దరు స్విమ్స్ ఆస్పత్రిలోను మరణించారని చెప్పారు. తమిళనాడులోని సేలం జిల్లా మేచారి గ్రామానికి చెందిన 10 మంది భక్తులు విష్ణునివాసం వద్దకు చేరుకున్నారు.
ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తోపులాట చోటుచేసుకుంది. జనాల మధ్య ఇరుక్కుపోయిన కృష్ణన్ భార్య ఆర్.మల్లిగ (50) ఊపిరాడక మృతి చెందింది. మల్లిగ కాలు విరిగి, తీవ్ర అస్వస్థతకు గురవడంతో కాపాడాలని ఆమె భర్త పోలీసులను వేడుకున్నారు. వారు స్పందించకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సకు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో వెంటనే అదే ఆటోలో రుయాకు బయలుదేరగా ఆమె మార్గంమధ్యలో మృతి చెందారు.
తన భార్య దుస్థితిని పోలీసులకు చెప్పినా కనీసం స్పందించకపోవడంపై ఆమె భర్త కృష్ణన్ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా.. వైకుంఠ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఇంతమంది చనిపోవడం బాధాకరమని కలెక్టర్ వెంకటేశ్వర్ వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు ఆరుగురు మరణించారని, 40 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించామని, దుర్ఘటనలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రకటించారు.
కాలి నడకన వచ్చి..
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన 360 మంది భక్తులు గోవిందమాల వేసుకుని వైకుంఠ ఏకాదశి నాడు వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి విచ్చేశారు. నాలుగు రోజుల కిందట గ్రామం నుంచి కాలినడకన బయలుదేరిన వారంతా 135 కిలోమీటర్లు నడుచుకుంటూ బుధవారం సాయంత్రం 6 గంటలకు తిరుపతి చేరుకున్నారు.
బైరాగిపట్టెడిలోని రామానాయుడు స్కూల్‌లో టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్‌లో టోకెన్లు తీసుకోవడానికి వెళ్లారు. అయితే ఒక్కసారిగా పోలీసులు వదిలిపెట్టడంతో 38 మంది కుప్పకూలి పడిపోయారు. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారంతా రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పలువురికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. దీంతో వారి బంధువులు రామానాయుడు స్కూళ్ల వద్ద పద్మావతి పార్క్‌లో రాత్రంతా కూర్చుని రోదిస్తున్నారు. మరికొందరు రుయా, స్విమ్స్ ఆస్పత్రి వద్ద రోదిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా నరసాపురం గ్రామానికి చెందిన క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడినవారు : నరసమ్మ, గణేష్, లక్ష్మిదేవి, గంగిరెడ్డి, మణిరెడ్డి, తిమ్మక్క, వసంతమ్మ
సర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదం
సర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. ముక్కోటి ఏకాదశి నాడు పెద్దఎత్తున భక్తులు వస్తారని తెలిసినా.. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్‌లు, పోలీసులతో హంగామా చేస్తున్నారు. కాళ్లు, చేతులు విరిగిపోయి అనేక మంది వికలాంగులయ్యారు. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. అందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే న్యాయం కోసం పోరాటం చేస్తాం. – సీబీ రమణ, నరసాపురం, అన్నమయ్య జిల్లా
ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదం
టీటీడీకి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. వచ్చిన వాళ్లను వచ్చినట్టు క్యూలైన్‌లో వదలకుండా పెద్దఎత్తున జనం గుమికూడిన తర్వాత వదిలిపెట్టడం దారుణం. దీంతో ప్రమాదం జరిగింది. టీటీడీ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎన్నోసార్లు వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇలా జరగడం ఇదే ప్రథమం. టీడీపీ నైతిక బాధ్యత వహించి అందరినీ ఆదుకోవాల్సి ఉంది. – సీపీ మునివెంకయ్య, నరసాపురం, అన్నమయ్య జిల్లా
పోలీసుల బాధ్యతారాహిత్యం వల్లే..
పోలీసుల బాధ్యతారాహిత్యం కారణంగానే ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భక్తులను వదిలిపెట్టడంతో పెద్దప్రమాదం చోటుచేసుకుంది. మా గ్రామం నుంచే 360 మంది వచ్చాం. ఎవరు ఎక్కడ పడిపోయారో తెలియడం లేదు. భక్తుల సంఖ్యకు సరిపడా విధంగా పోలీసులు భద్రత కల్పించలేదు. అందువల్లే ప్రమాదం జరిగింది. తొక్కిసలాట జరుగుతున్నా.. పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోయారు. – జే.వెంకట రమణ, నరసాపురం గ్రామం, అన్నమయ్య జిల్లా
ఎప్పుడూ జరగలేదు
ఇలాంటి దారుణం ఎప్పుడు జరగలేదు. గత ప్రభుత్వంలో కూడా పెద్దఎత్తున టోకెన్లు ఇచ్చారు. అయితే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. తోపులాటలకు తావులేకుండా చర్యలు చేపట్టారు. కానీ.. ఈసారి రామానాయుడు స్కూల్ వద్దకు అత్యధికంగా భక్తులు వచ్చారు.
వారిని సర్దుబాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం దారుణం. ఎంతో భక్తిభావంతో 140 కిలోమీటర్లు నడుచుకుంటా తిరుపతి వచ్చాం. కనీస ఏర్పాట్లు చేపట్టకపోవడంతోనే ఈ ఘోరం జరిగింది. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోండి. – పి.అంజప్ప, నరసాపురం, అన్నమయ్య జిల్లా
చాలా దారుణం
భక్తుల ప్రాణాలతో టీటీడీ అధికారులు ఆటలాడుకున్నారు. దూరప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చాం. ఇక్కడ కనీస ఏర్పాట్లు చేయలేదు. క్యూ నిర్వహణ అస్సలు బాగాలేదు.
ఎలా పడితే అలా తోసేశారు. భోజనం లేదు. తాగునీరు లేదు. చిన్నపిల్లలతో వచ్చిన వారి పరిస్థితి వర్ణనాతీతం. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా అందరినీ ఒకే క్యూలోకి నెట్టేశారు. పోలీసులు అత్యుత్సాహంతోనే ఇబ్బందులు వచ్చాయి. భక్తులతో వారు వ్యవహరించిన తీరు చాలా దారుణం. – లక్ష్మి, భక్తురాలు, విశాఖపట్నం
బాధ్యత ఎవరు వహిస్తారు
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంతమంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ తొక్కిసలాటకు ఎవరిది బాధ్యత. ఇన్ని కుటుంబాల్లో విషాదం నిండేందుకు ఎవరు కారణం. ఎంతో ఆశగా శ్రీవారి దర్శనానికి వస్తే ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసీ ఇంత అన్యాయంగా ఏర్పాట్లు చేస్తారా. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. – కందన్, భక్తుడు, తిరువణ్ణామలై, తమిళనాడు
ఘోరానికి కారకుల్ని వదిలిపెట్టకూడదు
ఇంత దారుణమైన ఘటనను ఇప్పటివరకు చూడలేదు. శ్రీవారిని దర్శించుకుందామని వస్తే భక్తుల ప్రాణాలతోనే టీటీడీ అధికారులు ఆడుకున్నారు. కళ్ల ముందే మనుషులు కూలిపోతుంటే చూడలేకపోయాం. పోలీసులు మాత్రం అందరినీ తోసేసి వేడుక చూశారు. ఆస్పత్రికి కూడా సకాలంలో తీసుకెళ్లలేదు. ఇంకా ఎంతమంది చనిపోతారో ఆలోచిస్తేనే తట్టుకోలేకపోతున్నాం. ఇంతటి ఘోరానికి కారణమైన వారిని వదలిపెట్టకూడదు. – వైతీశ్వరి, భక్తురాలు, తిరుచ్చి, తమిళనాడు
అడుగడుగునా నిర్లక్ష్యం
» వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్‌లోకి అనుమతించాల్సిందన్న భక్తులు
»ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతోనే ఉపద్రవం
తిరుపతి తుడా : వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీచేసే కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. లక్షా యాభైవేల టోకెన్లు జారీచేస్తామని చెప్పి.. కనీస రక్షణ చర్యలు, మౌలిక ఏర్పాట్లుచేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్‌లోకి అనుమతించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
అలా కాకుండా ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతో అప్పటికే గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. దీంతో వీరిని అదుపుచేయడం అటు పోలీసులకు, ఇటు టీటీడీ సిబ్బందికి సవాలుగా మారింది.
మరోవైపు.. ఈ తొక్కిసలాటలో చిక్కుకున్న క్షతగాత్రులను తరలించడంలో భద్రతా సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని భక్తులు మండిపడ్డారు. మరోవైపు.. శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ ప్రాంతాల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది.
ఆదుకోని అంబులెన్స్‌లు..
ఇక గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సకాలంలో అంబులెన్స్‌లు రాలేదు. కొన్నిచోట్ల వచ్చినా.. సరైన సమయంలో స్పందించలేదని బాధితులు వాపోయారు. అలాగే, అవసరమైన మేర అంబులెన్స్‌లను రప్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
ఇక గాయపడిన వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టకపోవడం.. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించకపోవడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని భక్తులు ఆరోపించారు.
పోలీసుల నిర్లక్ష్యం..
టోకెన్ల జారీ కేంద్రం వద్ద పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తొక్కిసలాటలో ఒక అమ్మాయి కళ్లు తిరిగి పడిపోయింది. ఆ తర్వాత నేనూ పడిపోయాను. నన్ను ఒక అమ్మాయి తీసుకెళ్లింది. ఆ సమయంలో పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు. తొక్కిసలాటలో గాయపడ్డ వారిని అందరినీ త్వరగా ఆస్పత్రికి చేర్చలేదు. అంబులెన్సులు కూడా వెంటనే రాలేదు. ఆ తర్వాత చాలామందిని ఒకేసారి తీసుకొచ్చి స్విమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. – ఆస్పత్రి వద్ద ఓ బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment