ఆరుగురు భక్తుల దుర్మరణం దుర్ఘటన కాదు... సర్కారీ హత్యలే
ప్రధాన ముద్దాయి చంద్రబాబే భక్తుల తాకిడిపై అవగాహనా రాహిత్యం
విస్తృత వ్యవస్థ ఉన్న తిరుమలలో టికెట్ల జారీకి అనుమతించని ప్రభుత్వం
తిరుపతిలో అరకొర ఏర్పాట్లతో తీవ్ర అవస్థలు పడ్డ భక్తులు
సాక్షి, అమరావతి: కలియుగ వైకుంఠం తిరుమల–తిరుపతిని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలే అమాయక భక్తుల పాలిట యమపాశాలుగా మారాయి! కక్ష సాధింపు చర్యలతో తిరుమల పవిత్రతకు కళంకం తేవాలన్న కుట్రతో సమర్థ టీటీడీ వ్యవస్థను దిగజార్చారు. ఇక తిరుమల–తిరుపతిని వేదికగా చేసుకుని ఉప ముఖ్యమంత్రి సాగించిన సనాతన డ్రామా శ్రీవారి దివ్యక్షేత్రం పవిత్రతకు భంగం కలిగించి పటిష్ట వ్యవస్థను దెబ్బతీసింది.
తన వందిమాగదులను రాజ్యాంగేతర శక్తులుగా మార్చి తిరుమల–తిరుపతిలో తిష్ట వేయించిన సీఎం చంద్రబాబు నిర్వాకాలే అమాయకుల అకాల మరణానికి కారణ భూతమ య్యా యి. లక్షలాది మంది తరలి వస్తారని తెలిసినా సరే కనీస ఏర్పాట్లలో తీవ్ర అల సత్వమే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారి తొక్కిసలాటకు దారితీసి పెను విషాదాన్ని మిగిల్చింది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. తిరుపతిలో ఆరుగురు భక్తుల దుర్మరణం పూర్తిగా చంద్రబాబు సర్కారు చేసిన హత్యలేనన్నది స్పష్టం! దీన్ని దురదృష్టకర ఘటనగా ముద్ర వేసి తన వైఫల్యాలను కప్పిపుచ్చుతూ పక్కదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఈ ఉదంతంలో ప్రధాన ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబేనన్నది యావత్ భక్త కోటి ఏకాభిప్రాయం.
ఓ ప్రణాళిక లేదు.. సమీక్షలూ లేవు
తిరుమలకు రోజూ 80 వేల మంది భక్తులు వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఏటా 7 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకుంటారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి టీటీడీ ఏటా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తుంది. తిరుమల జేఈవో నేతృత్వంలో టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ, తిరుపతి పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. క్యూలైన్లలో భద్రత, ఇతర సౌకర్యాలను ఈవో, జేఈవో, ఎస్పీ, కలెక్టర్ పర్యవేక్షిస్తారు.
అదనపు ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీలు, తహశీల్దార్లు, భారీ సంఖ్యలో టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు 24 గంటలూ అక్కడే ఉంటూ ప్రణాళిక కచ్చితంగా అమలయ్యేలా చూస్తారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుత పాలక మండలి వీటిపై దృష్టి పెట్టలేదు. టికెట్ల జారీకి కనీస మార్గదర్శకాలను పాటించలేదు. టికెట్ల జారీ ప్రణాళిక, ఏర్పాట్లను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించ లేదు. కనీసం అధికారులను ఆరా కూడా తీయలేదు.
సర్కారు వైఫల్యాలకు రుజువులివిగో..
వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లను జనవరి 9వ తేదీ తెల్లవారుజాము నుంచి జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. టోకెన్ల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుపతి చేరుకుని ముందు రోజు మధ్యాహ్నం నుంచే క్యూ లైన్లలో వేచి చూస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు చేయలేదు. శ్రీనివాసం, బైరాగిపట్టెడలోని ఎంజీవో పాఠశాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకోగా టీటీడీ వారిని క్యూ లైన్లలోకి అనుమతించకుండా రోడ్లపైనే నిలబెట్టేసింది.
వచ్చినవారిని వచ్చినట్టుగా క్యూలైన్లలోకి పంపించి టికెట్లు జారీ చేసి ఉంటే భక్తులు సులభంగా ముందుకు కదులుతూ టికెట్లు తీసుకుని బయటకు వచ్చేవారు. కానీ క్యూ లైన్లలోకి అనుమతించకుండా ప్రవేశ ద్వారం వద్దే గంటల తరబడి పడిగాపులు కాసేలా చేశారు. మరోవైపు ఎముకలు కొరికే చలిలో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు.
భోజనం, ఇతరత్రా అవసరాలకు బయటకు వెళితే మళ్లీ రద్దీలో రాలేమన్న ఆందోళనతో గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. టీటీడీ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంతమంది వచ్చారనే అంచనా కూడా వేయలేదు. ఆహారం, తాగు నీటి పంపిణీ గురించి పట్టించుకోలేదు. పోలీసు అధికారులు పత్తా లేకుండా పోయారు. ఉన్న కొద్ది మంది భక్తులతో అత్యంత దురుసుగా ప్రవర్తించారు.
లక్షలాది మంది భక్తులు గంటల తరబడి రోడ్ల మీద నిరీక్షించిన తరువాత.. తాపీగా బుధవారం రాత్రి 8 గంటల సమయంలో క్యూలైన్లలోకి అనుమతిస్తామని ప్రకటించి గేట్లు తెరిచారు. అప్పటికే గంటల తరబడి నిరీక్షించిన భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లలోకి ప్రవేశించడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఉపద్రవాన్ని గుర్తించిన తరువాత కూడా టీటీడీ, పోలీసు అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించ లేదు. అసలు అక్కడ తగినంత మంది పోలీసు, టీటీడీ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది అందుబాటులో లేరు. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో (తిరుమల) వెంకయ్య చౌదరి నుంచి తక్షణ స్పందన కొరవడి విషాదం చోటు చేసుకుంది.
తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయమే ఇంతటి పెను విషాదానికి ప్రధాన కారణం. లక్ష మందికిపైగా భక్తులు వచ్చినా టికెట్ల జారీ కోసం పటిష్ట క్యూలైన్లు, ఇతర వ్యవస్థలు తిరుమలలో మాత్రమే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా తిరుపతిలోనే టికెట్లు జారీ చేస్తామని ప్రకటించాయి.
వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్నవారినే తిరుమల వెళ్లేందుకు అలిపిరి వద్ద అనుమతిస్తామని ప్రభుత్వం, టీటీడీ ప్రకటించాయి. తిరుపతిలోని కౌంటర్లలో టోకెన్లు పొందితే కానీ అలిపిరి దాటి వెళ్లలేరు. దాంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన భక్తులు తిరుపతిలోనే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఎంతమంది భక్తులు వస్తారనే అంశాన్ని ప్రభుత్వం, టీటీడీ కనీసం అంచనా వేయలేదు. పది రోజులపాటు దర్శనం ఏర్పాటు చేశామని చెబుతూ అతి ధీమాతో కళ్లు మూసుకుపోయి వ్యవహరించాయి. ఎన్ని రోజులు ఉత్తర ద్వార దర్శనం కల్పించినా వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనానికే లక్షలాది భక్తులు మొదటి ప్రాధాన్యమిస్తారనే విషయాన్ని పట్టించుకోలేదు.
బాబు విధేయుడు బదిలీతో సరి
సాక్షి, అమరావతి: తిరుపతిలో చోటు చేసుకున్న విషాదానికి బాధ్యుడైన తన అస్మదీయ అధికారిని కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యమివ్వడం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఓ డీఎస్పీ, గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జేఈవో గౌతమిని బదిలీ చేశారు. ఆశ్చర్యకరమేమిటంటే.. భక్తుల భద్రతకు ఎస్పీ ప్రధాన బాధ్యత వహించాలి.
కానీ ఎస్పీ సుబ్బారాయుడు చంద్రబాబుకు వీర విధేయుడు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన్ను వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించేందుకే డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చి తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే కొద్ది నెలలుగా ఆయన అక్రమ కేసులతో అరాచకానికి పాల్పడుతున్నారు.
ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు అయినప్పటికీ సుబ్బారాయుడిని సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టారు. కొద్ది రోజుల్లో ఆయనకు మరో ప్రధాన పోస్టింగు ఇవ్వాలనే ఉద్దేశంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment