పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం సరైనదికాదు
డీఎస్పీ, గోశాల డైరెక్టర్ సస్పెన్షన్.. జ్యుడీషియల్ విచారణకు ఆదేశం
తిరుపతి ఎస్పీ, సీవీఎస్‌వో, జేఈవోను బదిలీ చేస్తున్నాం
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా
కుటుంబంలో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం
తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి చెరో రూ.5 లక్షలు
క్షతగాత్రులకు రూ.2 లక్షలు: సీఎం చంద్రబాబు
చిత్తూరు అర్బన్/తిరుపతి అర్బన్: ‘తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను వాళ్లే చేశారేమో..! దేవుడి పవిత్రతను దెబ్బతీయడానికి ఇలా చేశారని అనుమానం ఉంది. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకో వడానికి తిరుపతిలో టోకెన్లు ఇస్తారనే విషయం నాకు తెలియదు’ అంటూ సీఎం చంద్రబాబు అన్నారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల క్యూలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు గురువారం పరిశీలించారు.
గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అసలు గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఇలాంటి ఘనటలు జరుగుతున్నాయన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని, అలాకాదంటే మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఏకాదశి దర్శనం ఉంటుందన్నారు.
పది రోజుల పాటు వైకుంఠ దర్శనం కల్పించడం ఎంత వరకు సమంజసమని అన్నారు. దీనికి ఆగమ శాస్త్రాలు ఒప్పుకుంటాయో లేదో తనకు తెలియదని చెప్పారు. ఆలయ పద్ధతులు ఆగమన శాస్త్రం ప్రకారం ఉండాలని చెప్పారు. భవిష్యత్తులో ఏ ఆలయంలోనూ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీలో కొన్ని మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతిలో టోకెన్లు ఇవ్వడం తన జీవితంలో చూడలేదని చెప్పారు. బీఆర్ నాయుడుకు ఇందులో అనుభవంలేదు కదా అని అన్నారు.
బైరాగిపట్టెడ వద్ద పార్కులోని భక్తులను అనుమతించడం సరికాదన్నారు. భక్తుల రద్దీని చూసిన తరువాత అర్ధ గంట ముందే వాళ్లకు టోకెన్లు ఇచ్చి ఉండాల్సిందన్నారు. ఇక్కడ విధుల్లో ఉన్న డీఎస్పీ రమణకుమార్, టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి ఘటన స్థలంలో ఉండి కూడా పర్యవేక్షణలో విఫలమయ్యారని, వారిద్దరిన సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. ఘటనకు బాధ్యులుగా గుర్తించి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్, టీటీడీ జేఈవో గౌతమిని బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.
జరిగిన మొత్తం ఘటనపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వడానికి జ్యుడిషియల్ విచారణకు కూడా ఆదేశిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను టీటీడీ ద్వారా అందిస్తామన్నారు. వారి కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని చెప్పారు.
తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తిమ్మక్క, ఈశ్వర్‌కు చెరో రూ.5 లక్షలు, గాయపడ్డ మరో 33 మందికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామన్నారు. ఈ 35 మందికి ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం కల్పించి, వారి సొంత ఊళ్లల్లో దిగబెడతామని చంద్రబాబు చెప్పారు.
ముగ్గురిపై బదిలీ వేటు
తిరుపతి ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు టీటీడీ జేఈవోను ప్రభుత్వం బదిలీ చేసింది. టీటీడీ జేఈవో(హెల్త్‌అండ్‌ఎడ్యుకేషన్) గౌతమిని ఆ పోస్టు నుంచి తప్పించారు. ఈమెను తక్షణమే జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్.శ్రీధర్, తిరుపతి (అర్బన్) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎల్ సుబ్బరాయుడును కూడా బదిలీ చేశారు. వీరిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment