మైనార్టీ సంక్షేమానికి రూ.100 కోట్లు
నిధుల మంజూరుకు కేంద్రంతో మాట్లాడతా: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి రూ.100 కోట్లు నిధులిచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. సోమవారం మంజీర అతిథి గృహంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిలతో దత్తాత్రేయ సమావేశమై మైనార్టీల సంక్షేమం, కార్మిక శాఖ చర్యలపై సమీక్షించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. మైనార్టీ మహిళలను చిన్న, కుటీర పరిశ్రమల స్థాపన వైపు ప్రోత్సహించాలని సూచించారు. ముస్లిం కుటుంబాల్లో పేదరికాన్ని తరిమేయాలని.. మహిళలు, పిల్లల ఆరోగ్య స్థితిని మెరుగుపర్చాలని, విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యేక గ్రాంటు వచ్చేలా కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో మాట్లాడతానని చెప్పారు. కార్మిక శాఖ కార్యక్రమాలపై సమీక్షిస్తూ, గోషామహల్‌లో 100 పడకలు.. ఎర్రగడ్డ, బోరబండలో 300 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని, అవసరమైన భూ కేటాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించగా, సీఎం దృష్టికి తీసుకెళ్తానని హోం మంత్రి చెప్పారు. ఈఎస్‌ఐ పరిధిని రూ.21 వేల వేతనం వచ్చే కార్మికులకు కూడా వర్తింప జేస్తున్నామని, దీని ద్వారా 35 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని దత్తాత్రేయ పేర్కొన్నారు. కార్మికులందరికీ బ్యాంకు ఖాతాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, వారిని నగదు రహిత చెల్లింపుల వైపు మళ్లించాలని సూచించారు. వర్దా తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ నష్టం సంభవించిందని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తానన్నారు.
పీవీ రాజేశ్వరరావు మృతి పట్ల సంతాపం
మాజీ పార్లమెంటు సభ్యులు పీవీ రాజేశ్వరరావు మృతి పట్ల కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సంతాపం తెలియజేశారు. రాజేశ్వరరావుతో తనకున్న మైత్రిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.