ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ దేశానికే ఆదర్శం
- కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
- తెలంగాణలోని కార్మికుల పిల్లలకు 40 శాతం సీట్లు
- వృద్ధులు, వికలాంగులకు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ప్రత్యేక సేవలు
- ఇంటి నిర్మాణానికి ఈపీఎఫ్ నిధులు వినియోగించే అవకాశం
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ దేశంలోని అన్ని కాలేజీలకు ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఫ్యాకల్టీ, సిబ్బంది వివరాలు, హాజరు శాతం తదితర వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ అనుసరిస్తున్న విధానాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) మెచ్చుకుని.. అన్ని కాలేజీలూ ఇదే విధానాన్ని అనుసరించాలని ఆదేశాలిచ్చిందని చెప్పారు. ఈఎస్‌ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు.
ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీలోని వంద సీట్లలో 40 శాతం తెలంగాణలోని కార్మికుల పిల్లలకే కేటాయించినట్లు తెలిపారు. కార్మిక శాఖ సంస్కరణల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రెండు కోట్ల ఐపీ కార్డుదారులను ఆన్‌లైన్ చేశామని, దీని ద్వారా కార్మికులకు సకాలంలో వైద్య సేవలు అందుతాయన్నారు. అలాగే 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. సీనియర్ సిటిజన్స్, వికలాంగులకు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.
ఇంటి నిర్మాణానికి ఈపీఎఫ్ నిధులు
ఇంటి నిర్మాణం, కొనుగోలుకు ఈపీఎఫ్ నిధులు పూర్తిస్థాయిలో వాడుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. దేశంలో ఎక్కడ కొనుగోలు చేస్తామన్నా పీఎఫ్ నిధులు అందజేస్తామన్నారు. అవసరమైతే పీఎఫ్ నిధులతో హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈపీఎఫ్‌వో జోనల్ కార్యాలయాలను పది నుంచి 21కు పెంచుతున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులు రూ.18 వేల కోట్లు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కరువు ఛాయలు అలముకున్నాయని.. వేసిన పంటలు ఎండిపోయి రైతాంగం ఆందోళన చెందుతోందని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. పుష్కర స్నానానికి వెళ్లిన తనను.. రైతులు కలసి తమ ఆవేదన వెలిబుచ్చారన్నారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు రాకపోతే జొన్న, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు ఎండిపోయే ప్రమాదముందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని కోరారు.